Thursday, March 26, 2020

అవధూత అంటే

అవధూత అంటే:

బట్టలు విప్పుకు తిరిగే పిచ్చివాడా? భగవదన్వేషణలో ఉన్మత్త ప్రలాపాలు చేస్తూ తిరిగే దేశదిమ్మరా?

కాదు! కానే కాదు!
ఆత్మజ్ఞానం ఎలా అనిర్వచానీయమో ‘అవధూత’ కూడ నిర్వచనానికి నిబద్ధుడు కాని ఆత్మజ్ఞాని. ఎవరిలో ఏ విధమైన సంకల్పాలు ఉత్పన్నం కావో, ఎవరు అన్నీ తెలిసి ఏమీ తెలియని అమాయకుల్లా, పిచ్చివారిలా ప్రవర్తిస్తారో, ఎవరు కర్తృత్వ, భోక్తృత్వ అభిమానాలకు అతీతులై, త్యాగశీలురై ఉంటారో, ఎవరు సమదర్శన వీక్షణాలతో, పరిపూర్ణ శాంతితో ఉంటారో, ఎవరు వైరాగ్య పరిమళంతో ప్రకాశిస్తుంటారో, ఎవరు సర్వమూ త్యజించి బికారిలా పరిభ్రమిస్తూ దగ్గర చేరినవారికి జ్ఞానబోధ చేస్తుంటారో వారే అవధూతలు.

అట్టి అవధూత స్థితిని తెలియజెప్పే గ్రంథరాజమే అవధూత గీత. వేదాంతవాజ్గ్మయంలో ఇది అతి ప్రశస్తమయినది. ఇది అష్టాధ్యాయాల్లో 289 గీతలతో విరాజిల్లుతున్నది. తీవ్ర వైరాగ్యవంతులై, మొక్షాపేక్షగలవారికి మాత్రమే ఈ గీత ఉపయుక్తం. ఇంతటి ఆత్మతత్వాన్ని ప్రతిబోధించే ఈ అవధూత గీతను ఎవరు, ఎవరికీ బోధించేరు?

త్రిమూర్తుల అంశగా ఆవిర్భవించిన దత్తాత్రేయుల వారు సుబ్రహ్మణ్యస్వామికి దీనిని బోధించేరు. ఇది అత్యుత్తమ అద్వైత బోధ.
ఇంతకీ ఎవరా దత్తాత్రేయులు? ఏమా కథ?

కలహాప్రియుడు నారదుడు తన ‘ఆకలి’ తీర్చుకోవడానికి ఇనుపగుగ్గిళ్ళు తీసుకెళ్ళి వండి పెట్టమని పార్వతి, లక్ష్మి, సరస్వతులను ఒకరి తర్వాతనే ఒకర్ని అర్థిస్తాడు. ఇనుపగుగ్గిళ్ళును వండటం తమవల్ల సాధ్యంకాదని వారు అ అశక్తతను వ్యక్తం చేయడమేగాక అవి అసలు పచనమయ్యే ఖాద్యములే కావని, ఎవరూ వందలేరని వాదనలకు దిగుతారు. అప్పుడు నారదుడు భూలోకానికి వచ్చి, అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళి అతని అర్థాంగి అనసూయా దేవిని అర్థిస్తాడు గుగ్గిళ్ళు వండి పెట్టమని.
ఆమె “సరే!” అంటుంది. తన భర్త అత్రి మహాముని చరభక్తితో కడిగి, ఆ పాదోదకాన్ని ఇనుప గుగ్గిళ్ళ పైన చల్లుతుంది. గుగ్గిళ్ళు పక్వమైపోతాయి! ఆ గుగ్గిళ్ళను తీసుకెళ్ళి నారదుడు ‘ముగ్గురమ్మ’ లకు చూపిస్తాడు. చాకితులైన దేవిత్రయం సిగ్గుపడి తల దించుకుంటారు. పరాభవం, ఈర్ష్య, అసూయలు వారిని దహించి వేయగా మాతృత్రయం అనసూయ శక్తి సామర్థ్యాల్ని పరీక్షించమని తమ తమ భర్తలు త్రిమూర్తులను ఉసిగొల్పుతారు.
అనసూయ పాతివ్రత్యమహిమ తెలిసిన త్రిమూర్తులు భార్యల కోరికకు అడ్డుచెప్పక అనసూయను పరీక్షించడానికి సన్యాసుల వేషంలో అత్రిమహాముని ఆశ్రమానికి వస్తారు. అనసూయాదేవిని ‘నిర్వాణభిక్ష’ కోరుతారు. అనసూయ మారు చెప్పక తన భర్త పాదాల్ని కడిగి ఆ చరణామృతాన్ని కపట సన్యాసులపై చల్లుతుంది. త్రిమూర్తులు ముగ్గురు పసిపిల్లలుగా మారిపోతారు! అనసూయ, అప్పటి కప్పుడు తన చనుదోయి చేపుకి రాగా, పాలను ఆపిల్లలకు కుడుపుతుంది. ఈ విషయం తెలిసిన అత్రి మహాముని తన దివ్యదృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అనసూయ త్రిమూర్తులవంటి బిడ్డ కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నది. ఆ కోరిక ఈ విధంగా తీరిందని సంతోషిస్తాడు. భార్య త్రిమూర్తుల అంశతో బిడ్డ కావాలన్నది గనుక, అత్రిమహాముని ఆ ముగ్గురు పసిపాపలను కౌగలించుకోగానే, వారు ముగ్గురూ అదృశ్యమై మూడు శిరస్సులు, ఆరు చేతులుగల ఒకే పిల్లవాడిగా మారిపోతారు. అత్రిమహాముని ఆ పిల్లవానికి ‘దత్తాత్రేయుడు’ అని నామకరణం చేస్తాడు.
త్రిమూర్తులు అదృశ్యమయ్యారని తెలిసిన ముగ్గురమ్మలు లబోదిబోమంటూ అత్రిమహామునీశ్వరుని పతిభిక్ష పెట్టమని ప్రార్థిస్తారు. మహాముని వారి అభ్యర్థన మేరకు త్రిమూర్తులను తిరిగి ప్రసాదిస్తాడు. త్రిమూర్తుల అంశతో జన్మించిన ఈ దత్తత్రేయుడే నిత్యవైరాగ్యంతో అవధూతలా అడవిలో సంచరిస్తున్నపుడు ఎదురుపడ్డ సుబ్రహ్మణ్యస్వామికి ఆయన అభ్యర్థనమేరకు అవధూత గీతను బోధిస్తాడు.

ఇంతకీ అవధూత లక్షణాలేమిటి?
అవధూత గీతయే అష్టమాధ్యాయంలో ‘అవధూత’ పదంలోని నాలుగు అక్షరాలలో ఒక్కొక్క అక్షరం శ్లోక ఆరంభ అక్షరంగా, నాలుగు అక్షరాలకు నాలుగు శ్లోకాలలో అవధూత లక్షణాలను వ్యక్తం చేసింది:

ఆశాపాశ వినిర్ముక్తః ఆదిమధ్యాన్త నిర్మలః
ఆనందే వర్తతే నిత్యం
ఆకారం తస్య లక్షణమ్


ఆశాపాశాళ నుంచి విడువబడినవాడు, ఆదిమధ్యాంతరములందు నిర్మలుడు, నిత్యానందస్వరూపుడు అయిన అట్టివానికి ‘అ’ కారం అతని లక్షణం.

వాసవా వర్జితా యేవ
వ్యక్తవ్యం చ నిరామయమ్
వర్తమానేషు వర్తేత
వకారం తస్య లక్షణమ్


ఎవని చేత వాసనలు విడువబడినవో, ఎవడు నిరామయుడై ఉన్నాడో, ఎవడు వర్తమాన పదార్థాలలో ఉనికి కలిగివున్నాడో అట్టివానికి ‘వ’ కారం లక్షణమై ఉన్నది.

ధూర్ది ధూసర గాత్రాణి
ధూత చిత్తో నిరామయః
ధారణ ధ్యాన నిర్ముక్తో
ధూకార స్తస్య లక్షణమ్


ఎవని శరీరం ధూళిధూసరితమై ఉందో, ఎవని చిత్తం నియమింపబడి ఉన్నదో, ఎవడు ధ్యాన ధారణల విముక్తుడై ఉన్నాడో వానికి ‘ధూ’కారం లక్షణమై ఉన్నది.

తత్త్వ చిన్తా ధృతా యేవ
చిన్తా చేష్టా వివర్జితః
తమోహంకార నిర్ముక్తః
తకార స్తస్య లక్షణమ్


తత్త్వచింత కలిగియున్నవాడు, చింతాచేష్టాలు వీడినవాడు, అహంకార మాంద్యములను విడిచినవాడు ఎవడో వానికి ‘త’కారం లక్షణం.
అవధూత గీత అద్వయ సత్తా స్వరూపమై భాసిల్లే ఆత్మస్థితిని ప్రతిబోధించే జ్ఞాన బోధయేకాక ఈ గీత రచన చక్కని పదజాలంతో సంగీతపరంగా శ్రవణానందంగా ఉంటుంది. మచ్చుకు,

తత్త్వమస్యా ది వాక్యేన
హ్యాత్మాహి ప్రతిపాదితః
నేతి నేతి శ్రుతిర్భూయా
దనృతం పజ్ఞ్చాభౌతికమ్


‘తత్త్వమసి’ ఆది వాక్యాల చేత ఆత్మ ప్రతిపాదించబడినది. అసత్యమై పాంచభౌతికమైన అనాత్మ పరమాత్మ కానేరాదని వేదం చెబుతోంది.

అనంత రూపం నహి వస్తు కిజ్ఞ్చత్
తత్త్వ స్వరూపం నహి వస్తు కిజ్ఞ్చత్
ఆత్మైక రూపం పరమార్థ తత్త్వం
న హింస కొ వాపి న చాస్య హింసా


ఆత్మ తప్ప వేరైన వస్తువేదీ నాశనము లేనిది కాదు. ఆత్మైక రూపమైన పరమాత్మతత్త్వం ఒక్కటే నాశనం లేనిది. ఇది దేనిని హింసించేది కాదు. ఇది దేని చేతను హింసింపబడేది కాదు.

నషండో న పుమాన్ న స్త్రీ న బోధో నైవ కల్పనా
సానందో వా నిరానందం ఆత్మానం మన్యసేకథమ్


నువ్వు నపుంసకుడవు కావు. పురుషుడవూ కావు. స్త్రీవి కావు. జ్ఞానమూ కావు. కల్పనవూ కావు. నువ్వు ఆనందమూ కావు. నిరానందమూ కావు. అలాంటి ఆత్మనైన నిన్ను నువ్వు ఎలా తెలుసుకోగలవు?

న తేచ మాతాచ పితాచ బందుః
న తేచ పత్నీ సుతాశ్చ మిత్రమ్
న పక్షపాతో న విపక్ష పాతః
కథం హి సంతాప పరోసి చేతః


ఓ చిత్తమా! నీకు తల్లీ, తండ్రి, బంధువు, భార్య, బిడ్డ, మిత్రుడు ఎవరూ లేరు. పక్షపాతం ఉండుట, లేక పోవుట రెండూ లేవు. అలాంటి నీకు సంతాపం ఎలా కలుగుతుంది?

విన్దతి విన్దతి నహినహి యత్ర
ఛందో లక్షణం నహి నహి యత్ర
సమరస మగ్నో భావిత పూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః


అవధూత ఎక్కడా దేనిని పొందడు. ఛందో లక్షణాలను ఎరుగడు. సమరసంలో మునిగినవాడై, భావం చేత పవిత్రుడై పరమాత్మ తత్త్వాన్ని చక్కగా చెబుతాడు.

ననురూప విరూప విహీన ఇతి
నను భిన్న విభిన్న విహీన ఇతి
నను సర్వ విసర్వ విహీన ఇతి
కిము రొదిషు మానసి సర్వసమమ్


నువ్వు రూపారూపాల లేనివాడివి, భేదాభేదాలు లేనివాడివి. సర్వాసర్వములు లేనివాడివి. సర్వసముడవైన నీకు దుఃఖం ఎందుకు?

తైలొక్య జననీ ధాత్రీ,
సా భగీ నరకో ధృవం
తస్యాం జాతో రతస్తత్ర,
హాహా సంసార సంస్థితిః


స్త్రీ ముల్లోకాలకీ కన్నతల్లి. ధరించేది. ఆమె భగసౌఖ్యం ఇస్తున్నపుడు నరకమే అవుతున్నది. ఇదినిజం. ప్రాణుల పుట్టుకస్థానమే రతిస్థానం. అవడము కడు శోచనీయం. అయ్యయ్యో! ఇదీ సంసారం.

మద్యపానం మహాపాపం,
నారీసంగ స్తథైవచ
తస్మాద్ద్వయం పరిత్యజ్య,
తత్త్వ విష్ఠో భవెన్మునిః


మద్యపానం మహాపాపం. స్త్రీ సంగమం కూడ అలాంటిదే. ఈ రెండిటినీ వదలి తత్త్వనిష్ఠలో ఉన్నవాడు మౌని అనబడతాడు.

No comments:

Post a Comment