Sunday, October 16, 2022

 ఇల్లు మారితే యజమాని మారుతాడు.
కానీ శరీరం మారితే యజమాని(భగవంతుడు) మారడు.

సకలసృష్టికీ యజమాని ఆయనే.
సృష్టి యావత్తు భగవంతునికి ఓ సంకల్పం అంతే.

ఆయన ఒకేసారి మొత్తాన్ని ఖాళీ(లయం) చేసేస్తాడు.
అనగా సంకల్పరాహిత్యంగా ఉంటాడు.
నీవు నిద్రలో ఉన్నట్టు.

దేవుని సంకల్పరాహిత్యమే 
జీవునికి జన్మరాహిత్యము.

కాబట్టి బంధమైనా, మోక్షమైనా భగవంతుని సంకల్పమే.

అందుకే అన్నమయ్య ఓ సంకీర్తనలో ఇలా అన్నారు-
"మదిలో చింతలు, మైలలు మణుగులు, వదలవు నీవవి వద్దనక."

భగవంతుడు "వద్దు" అనుకుంటే ఉండవు.
అంతేగానీ మనం వద్దు అనుకుంటే పోవు.

నా సంకల్పం కూడా భగవంతుని సంకల్పంలో అంతర్భాగమే కదా అంటావేమో!

ఇక బాధేముంది?

నీ శరీరం భగవంతుని శరీరంలో(సృష్టిలో) అంతర్భాగం.
నీ మనస్సు భగవంతుని మనస్సులో(మాయలో) అంతర్భాగం.

జీవుని బంధమోక్షములు దేవుని లీలావిలాసములు.

శరీరం ఉంటే ఉండనీ... ఊడితే ఊడనీ... 
బంధం ఉంటే ఉండనీ... మోక్షం వస్తే రానీ...

ఏదైనా సరే ఉంటే ఏమి? లేకుంటే ఏమి?
అని ఉండటం జ్ఞానిలక్షణం.

* * *

మెలకువ - అనేకం
గాఢనిద్ర - ఏకం
* * *
మెలకువ - ప్రపంచం
గాఢనిద్ర - పరబ్రహ్మం
* * *
మెలకువ - ద్వైతం
గాఢనిద్ర - అద్వైతం
* * *
మెలకువ - జననం
గాఢనిద్ర - మరణం
* * *
మెలకువ - సాకారం
గాఢనిద్ర - నిరాకారం
* * *
మెలకువ - సృష్టి
గాఢనిద్ర - లయం
* * *
మెలకువ - బంధం
గాఢనిద్ర - మోక్షం
* * *
మెలకువ - భాషణం
గాఢనిద్ర - మౌనం
* * *
మెలకువ - శిష్యుడు
గాఢనిద్ర - గురువు
* * *
మెలకువ - ప్రకృతి
గాఢనిద్ర - పురుషుడు
* * *
మెలకువ - కర్మయోగం
గాఢనిద్ర - జ్ఞానయోగం
* * *
మెలకువ - జీవత్వం
గాఢనిద్ర - దైవత్వం
* * *
మెలకువ - మార్గం
గాఢనిద్ర - గమ్యం
* * *
మెలకువ - ధర్మం
గాఢనిద్ర - సత్యం
* * *
మెలకువ - సాధన
గాఢనిద్ర - సిద్ధి
* * *
మెలకువ - లీల
గాఢనిద్ర - నిత్యం
* * *
మెలకువ - కల
గాఢనిద్ర - మెలకువ

* * *

మరణమనేది 
ఓ విసర్జన క్రియ.
అంతే.

* * *

సురేంద్ర: చిత్తాన్ని  శుద్ధి చేసుకోవడానికి మార్గాలు  చెప్పండి బాబుగారు...

బాబు: శుద్ధి చేయడానికి చేసే ప్రయత్నమే మరింత అశుద్ధం అవడానికి కారణం అవుతుంది. మసిగుడ్డతో అద్దాన్ని శుభ్రం చేయాలనుకోవడం లాంటిదే ఇది. అసంకల్పితంగా ఉండండి చాలు... శుద్ధమవడానికి అదే మంచి మార్గం. అసంకల్పితంగా ఉండటానికి మళ్లీ ఇంకో ప్రయత్నం అవసరం లేదు. 'నేను కర్తను కాను' అని స్పష్టంగా ఎరిగి ఉండడమే అసంకల్పితంగా ఉండడం అంటే.

* * *

నీవుంటే అది ఉండదు.
అది ఉంటే నీవుండవు.
ఇక సాధనెందుకు?

* * *
నీకసలు ఉనికి లేదని తెలుసుకోవడమే మోక్షం.

* * *

దేవుణ్ణి వదిలేయ్...
నీవే దేవుడైపోతావ్...

* * *

ప్రస్తుతమున్న స్థితి భగవత్ప్రసాదం.
అని ఉండగలగడం సంపూర్ణ శరణాగతి.

* * *

నా తలంపు - సుబ్రహ్మణ్యుడు.
నా తనువు - విఘ్నేశ్వరుడు.
నా శ్వాస - శ్రీకాళహస్తీశ్వరుడు.
నా మాట - జ్ఞానప్రసూనాంబిక.

* * *

నేను దేనిలో నుండి వచ్చానో దానికి నేను సమానం కాలేను.
ఏది నాలో నుండి వచ్చిందో అది నాకు సమానం కాలేదు.

* * *

బాధలు బంధాలు అంటూ ఏడుస్తూనే ఉంటారు...
పరిష్కారం అడుగుతూనే ఉంటారు...
ఆ బాధకు శ్రీరామకృష్ణులు సరియైన బోధ చేశారు...
దీనిని ప్రతిరోజూ స్మరించుకుంటూ ఉంటే చాలు...
బాధలు, బంధాలు మాయం అవడం ఖాయం.
చదవండి-
* * *
మనకు ఈ బంధనం సహింపరానిదైతే
జగన్మాతను ఇలా ప్రార్థించు-
అమ్మా! సృష్టిరూపమైన నీ క్రీడ ఎలాంటిదైతేనేం?
మాకు మాత్రం నువ్వు దీని నుండి ముక్తిని అనుగ్రహించు.
* * *
మన ప్రార్థనను తప్పక ఆలకిస్తుంది.
కానీ ఈ విధంగా "ఎందుకు" సృష్టించావని ఆమెను నిలదీయలేం.
అంతా ఆమె ఇష్టం.
ఆమె ఇచ్ఛామయి.
తనకు ఏది ఇష్టమైతే అప్పుడు అది చేస్తుంది.
మన అభిప్రాయం కోసం ఆమె వేచి ఉండదు.
* * *
తల్లి పిల్లవానికి ఆటబొమ్మనిచ్చి ఇంటిపనులు చూసుకుంటున్నది.
పిల్లవాడు ఆ బొమ్మను తీసుకొని ఆడుతున్నంతసేపు తల్లి అక్కడకు రాదు.
బాగా ఆకలివేసినప్పుడు వాడు ఇంక ఆట మానివేసి బొమ్మను దూరంగా విసిరివేసి తల్లికోసం ఏడుస్తాడు.
అప్పుడు ఆమె రాకుండా ఉండగలదా?
* * *
అదే రకంగా జగన్మాత మనకోసం ఈ సంసారాన్ని, బంధుమిత్రులనే ఆటవస్తువులను ఇచ్చి ఆడుకోమని వదిలివేసింది.
మనం వాటితోనే తృప్తిపడి ముగ్దులమై అమ్మను మరచి ఆటలో మునిగి ఉన్నాం.
అమ్మదర్శనం కోసం ఉండవలసిన తీవ్రమైన వ్యాకులత అనే ఆకలి మనకింకా కలుగలేదు.
ఒకరకంగా ఈ సంసారం పట్ల విరక్తి ఇంత దాకా కలుగలేదు.
ఆటవస్తువుల మీద అనురక్తి కూడా తగ్గలేదు.
విషయాల మీద అనురక్తి కూడా తగ్గలేదు. 
విషయాలు మనకు చేదుగా అనిపించడం లేదు.
అసహ్యంగా కనబడడం లేదు.  
మన ఇంద్రియాలు వెలుపలి విషయాల మీదకే పరుగిడుపోతున్నాయి.
ఆటబొమ్మలను పారవేసి తల్లికోసం ఏడుస్తున్న పసిపాపలా 
తీవ్రమైన వ్యాకులతతో ఎవరైనా అమ్మఒడిలోకి పోవగోరితే అమ్మ వారివైపు తన చేతులు చాపుతుంది కదా!!
🪷🪷🪷🪷🪷

No comments:

Post a Comment