Saturday, October 29, 2022

అగ్ని వాయువు

 🕉అగ్ని వాయువు:


కౌశికుడు అయ్యా ! ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది. వాయువులు శశరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి అని అడిగాడు. ధర్మవ్యాధుడు మహాత్మా! మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శరీరం అంతా నాభి ఆధారంగా వ్యాపించి ఉంటుంది. నాభి నుండి తల వరకు వ్యాపించి ఉన్న ఈ అగ్నిలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. ఆ ప్రాణవాయువే సకల జీవులకు ఆధారం. ప్రాణవాయువు, ఆపానవాయువు కలిసి ప్రాణాగ్నిని జ్వలింప చేస్తుంటాయి. మానవుడిలో ఆపానము, పొత్తికడుపు, బ్రహ్మరంధ్రం మధ్యలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆపానము మలమూత్రముల విసర్జనా స్థానం. కంఠంలో ఉండే ఉదానము అనే వాయువు కర్మలను నియంత్రిస్తుంటుంది. వ్యానము అనే వాయువు శరీరావయవాల కలయికలో సంచరిస్తూ ఉంటుంది. ప్రాణ ఆపాన వాయువులను ఆధారం చేసుకుని సమాన వాయువు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంలో కలుపుతుంది. నాభి వద్ద ఉండే ఆ వాయువు శరీరంలోని సకల ధాతువులను పోషిస్తుంది. పంచప్రాణములను, ఆత్మాగ్నిని గురించి తెలుసుకున్న యోగులు నిరంతర అభ్యాసము వలన ఆత్మను మూర్ధత్వ స్థానమున నిలుపుకుంటారు. ఆపాన సమాన వాయువులలో సంచరిస్తున్న అగ్ని శరీరమందు జీవాత్మగా వెలుగుతున్నాడు. ఆ జీవాత్మ తామరాకు మీద నీటి బొట్టులా శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉంటాడు. శరీరాన్ని విడిచిన జీవాత్మయే పరమాత్మ. అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని పరమాత్మ జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. పరమాత్మ ఈలోకాలను సృష్టించే సృష్టికర్త. బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలతతో జీవాత్మను పరమాత్మగా తెలుసుకుంటారు. 

🕉🙏

No comments:

Post a Comment