Wednesday, October 5, 2022

విజయదశమి కథ ...

 విజయదశమి కథ ...

🌷🌷🌷🌷

ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష పాడ్యమి మొదలు నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాం. శక్తి స్వరూపిణి అయిన దేవీ ఆరాధన చేసే రోజులు కనుక దేవీ నవ రాత్రులు అనీ, శరత్కాలంలో వచ్చే రాత్రులు కాబట్టి శరన్నవరాత్రులు అని పిలుస్తారు. దేవీ నవరాత్రుల అనంతరం వచ్చే రోజును దసరా పండుగగా పిలుస్తారు. దేవీ నవరాత్రులతో పాటు దశమిని కలిపితే దసరా.. పది రోజుల పండుగ అయిన 

దసరా అనేది దశహరా అనే పదం నుంచి వచ్చింది. దశహరా అంటే దశ విధ పాపహరం అని అర్థం... అంటే పది రకాలైన పాపాలను హరించేది.

నవరాత్రురాల తరువాత చివరిదైన పదో రోజు విజయదశమి. ఆశ్వయుజ శుద్ధ దశమి నాటి సాయంత్రం శ్రవణ నక్షత్ర సమయానికి విజయ అనే పేరు. ఈ సమయంలో ప్రారంభించే పనులు ఏవైనా సరే విజయవంతంగా పూర్తవుతాయని నమ్మకం. అంటే దశమి విజయ ముహూర్తం ఉన్న రోజు కనుక ఈ రోజుకి విజయదశమి అని పేరు వచ్చింది. విజయదశమికి అపరాజిత దశమి అని పేరు. అపరాజిత అంటే పరాజయం లేనిదని అర్థం. అటువంటి పుణ్య ప్రదమైన విజయదశమి నాడు దేవీనవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన కలశానికి ఉద్వాసన పలకడం, ఆయుధ పూజ, శమీ దర్శనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు అపరాజితాదేవి, శమీ వృక్షాన్ని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 

ప్రాచీన కాలంలో దేవీనవర్రాతులు క్షత్రియులకు చాలా ముఖ్యమైన రోజులు నాలుగు నెలల వర్షాకాలం ముగిసి శత్రువులపై యుద్ధాలకు బయలు దేరడానికి ముందు విజయం కోసం దుర్గా దేవిని ఆరాధించేవారు. ఈ సందర్భంగా ఆయుధ పూజ వాడుకలోకి వచ్చింది. 

*ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించి అజ్ఞాత వాసం ముగించుకున్న అర్జునుడు జమ్మి చెట్టుపై దాచిన తన గాండీవం మొదలైన ఆయుధాలను ఉత్తరుడి ద్వారా దింపించి కళ్లకు అద్దుకున్నట్లు భారతం చెబుతోంది. రాముడు రావణుడిపై యుద్దం చేసినప్పుడు కూడా దేవిలోని నవాంశలను తొమ్మిది రోజుల పాటు పూజించి పదో రోజు రావణుడిని సంహరించాడని రామాయణ గ్రంఽథంలో ఉంది.

అప్పటి నుంచి దసరా సమయంలో దుర్గా పూజకు ప్రాముఖ్యం పెరిగిందని విశ్వస్తారు. ప్రస్తుతం ఆయుధాలకు బదులుగా ప్రతీ వారు తమ తమ వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన వస్తువుల్ని, యంత్రాల్ని పూజిస్తున్నారు. వాటితోపాటు వాహన పూజలు జరిపిస్తారు. కొత్త వ్యాపారాలు, పనులు, దుకాణాలు మొదలైన వాటిని విజయదశమి నాడు ప్రారంభిస్తే మంచిదని భావిస్తారు.
 
 *శమీ పూజ..*

విజయదశమి సాయంత్రం శమీ దర్శనం, శమీ పూజ చేయాలని శాస్త్ర వచనం. అంటే ఊరి పొలిమేరలను దాటి వెళ్లడమన్న మాట. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. విజయదశమి రోజు పూజలందుకునే శమీ వృక్షానికి సంబంధించిన పురాణ గాఽథ ఒకటి ఉంది. 

*పూర్వం ప్రజాపతి ఒక్కొక్క దానినే సృష్టిస్తూ అగ్నిని కూడా సృష్టించాడు. అది తన ప్రభావాన్ని చూపించి ప్రజాప్రతినే కాల్చి వేయ సాగింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజాపతి అగ్నిని శమింప చేసేందుకు పచ్చని చెట్టును ఒక దానిని సృష్టించి దాని కొమ్మలతో కొట్టి అగ్నిని ఆర్పివేశాడు. అలా అగ్నిని శమింప చేయడానికి ఉపయోగించిన వృక్షమే శమీ వృక్షం.*

అటువంటి శమీ వృక్షం వద్దకు విజయదశమి నాటి సాయంత్రం చేరుకుని ప్రదక్షిణలు చేసి ఆకుని తీసుకు వచ్చి పెద్ద వారికి ఇచ్చి వారికి పాదాభినందనం చేసి ఆశ్వీరాదం పొందడం ఆచారం. ఇలా శమీ వృక్షాన్ని దర్శించి పూజించడం వల్ల అన్నింటా విజయాలు లభిస్తాయని, పూర్వం శ్రీరామ చంద్రమూర్తి లంకపై దండెత్తేందుకు ముందు విజయదశమి రోజు శమీ వృక్షాన్ని పూజించి రావణుడిని ఓడించి విజయం సాధించినట్లు, రాజులు శత్రు దేశాలపై దండయాత్ర చేసే ముందు కూడా శమి పూజ చేసేవారని తెలుస్తుంది.


🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment