మంచిమాట 5
ఇంతమంది మనుషుల్లో మహాత్ములు జ్ఞానులు మనకు ఎదురైతే ఎలా గుర్తించవచ్చో ఈరోజు తెలుసుకుందాం.
ఆ దారిలో అరుగుమీద ఇద్దరు కుర్రాళ్ళు కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఓ పెద్దాయనని చూసి, ఆ ఇద్దరిలో ఒకతను, "చూడరా ఎలా ఉన్నాడో, ఆ వాలకం చూస్తుంటే మనిషి పిచ్చోడిలా ఉన్నాడు" అని అన్నాడు. దానికి ఆ రెండో అతను, "అలా అనకురా, ఆయన గొప్ప శాస్త్రవేత్త, మంచి మనిషి, అధ్యయనంలో ఆయన దిట్ట. ఆయన నడుస్తుంటే ఆ సబ్జెక్టే నడిచిపోతున్నట్టుంటుంది." అని బదులిచ్చాడు. ఈ ఇద్దరు వ్యక్తులకి కనిపించింది ఒకే వ్యక్తి. ఒకతను పిచ్చోడంటే, మరొకతను పిచ్చిలా కనిపించే వాలకం దాటి, దాని వెనుకనున్న ప్రతిభ, ఆ వ్యక్తి గొప్పతనాన్ని పసిగట్టాడు. అలా గుర్తెరిగాడంటే, ఆ కుర్రాడికి కూడా ఆ ప్రతిభ విలువ, దాని పట్ల అవగాహన, అనుభవం, శ్రద్ధ ఎంతోకొంత ఉంది కాబట్టే గుర్తుపట్టాడు.
ఒక జ్ఞానిని ఇంకో జ్ఞాని మాత్రమే గుర్తించగలరు. లేదా పై ఉదాహరణలో కుర్రాడిలా మనకు కూడా లోపల కొంత అవగాహన, పరిణతి ఉండాలి.
ఫలానా వ్యక్తి జ్ఞాని అని చెప్పే వీలు నిజానికి లేదు. మీకొక సమీకరణం అర్థమైతే, అది అర్థమైందని మీకు తెలుస్తుంది. మీరు చెప్పేంతవరకు, మీకు తెలుసని ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అందుకే అహంకారం పూర్తిగా లయమైన మహాత్ములు, బయటనుండి చూస్తే వీరికి అసలేమైనా తెలుసా అన్నట్లు ఉంటారు. ఇతను పండితుడు అని చూడగానే చెప్పటం లౌకికంగానే సాధ్యం కాదు. ఇంక జ్ఞానిని ఎలా గుర్తుపట్టగలం? ఒక వ్యక్తి బయట చేసే పనుల బట్టే అంచనా వేయటం మనకు సాధ్యపడుతుంది. ఆంతరమునందు ఆత్మానుభవము వలన కలిగిన జ్ఞానం, అది తెచ్చిపెట్టిన బంధవిముక్తి ద్వారా వెలుగులో, ఆ వ్యక్తి తన బతుకును సాగించే నడవడిక కూడా మారుతుంది. అటువంటి నడవడిక ఎలా ఉంటుందనేదానికి కొన్ని సూచనలు అందించబడ్డాయి -
జ్ఞాని ధర్మాధర్మముల బంధాలలో చిక్కుకున్నవారు కాదు. కానీ సాధారణంగా జ్ఞానులు ధర్మపరాయణులై (నైతిక నడవడితో . భూతదయ, మౌనం, ద్వంద్వాల నడుమ చెక్కుచెదరకపోవటం, పూర్ణ వైరాగ్యం, దేహాత్మభావం లేకుండా నిత్య ఆనందం వారి లక్షణాలు. జ్ఞానులు లేదా ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వారి సమక్షంలో, వారు మాట్లాడకనే మన మనసు శాంతి పొందుతుంది. జాతివైరం ఉండే ప్రాణులు కూడా, వారి సమక్షంలో స్నేహంతో మెలగుతాయి. బాగా అలసటతో ఉన్నప్పుడు చక్కటి స్నానం చేస్తే ఎలాంటి ప్రశాంతత, ఉత్తేజం అబ్బుతాయో, అంతకన్నా లోతైన (మన పరిణతకు తగిన) శాంతి, ఆనందం, ఈశ్వరానుభవం, ధైర్యం వారి సమక్షంలో మనకే కాదు సమస్త ప్రాణులకు అనుభవానికొస్తుంది. వారి సన్నిధి మనల్ని మరింత ఆధ్యాత్మికంగా మారుస్తుంది. వారి ఒక్క మాట మన భయాన్ని, శోకాన్ని, అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. భగవాన్ రమణులు, శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద, ఆనందమయి లాంటి ఎందరో మహాత్ములలో ఈ లక్షణాలు గమనించవచ్చు.
ఆ మహాత్ములు అన్ని వేళల్లో ఇతరుల సుఖముకొరకు పాటుపడతారు.
నిర్వికారమైన మనస్సు, శాంతము కలవారై, అపరిచ్ఛిన్న బ్రహ్మమును సాక్షాత్కరింపచేసుకున్న మహాత్ములు, తాము సంసారరహితులు ఆప్తకాములు కావటం వలన, ఏ స్వప్రయోజనము లేకుండగనే, ఇతరులను తరింపజేయుటయే వారి స్వభావంగా కలిగి వసంతఋతువు వలె లోకానికి సుఖకారకులై చరిస్తుంటారు.
ఎదుటివారు అటువంటి లక్షణాలు కలవారని చూడగానే చెప్పలేం. వారితో కలిసి ఉంటే, వారి నడవడిలో ఈ లక్షణాలు గమనించేందుకు అవకాశం దొరుకుతుంది. అందుకే ఎన్నున్నా, మహాత్ముల దర్శనానికి, సాంగత్యానికి, మనలో పరిణతి, ఈశ్వరానుగ్రహం రెండూ కలిసి రావాలి.
సేకరణ. మానస సరోవరం
No comments:
Post a Comment