🌺 *అమృతం గమయ* 🌺
*గురుకృపా మహత్యం*
*సర్వమంత్రాల కంటే గురు వాక్యమే శక్తివంతమైన ప్రేరకం. గురువు పట్ల నిజమైన భక్తి కలిగిన వారికి సర్వ సత్యములూ తమంత తామే విదితమవుతాయి. ఎవరు గురుభక్తి కలిగి, నిష్ఠ కలిగి ఉంటారో అట్టి వారు ధన్యులవుతారు. వారి జన్మ సార్థకం అవుతుంది.*
*గురు ప్రసాదతః స్వాత్మనాత్మారామ నిరీక్షణాత్*
*సమతాముక్తి మార్గేణ స్మాత్మజ్ఞానం ప్రవర్తతే.*
*గురువు అనుగ్రహం లేనివాడు ఆత్మతత్వాన్ని ఎరుగలేడు. తనలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను గురు ప్రసాదముచే నిరీక్షించు సమత్వపరునికే ఆత్మజ్ఞానము కలుగునని పరమ శివుడు ప్రబోధించాడు. చదువురాని శిష్యుడైన తోటకాచార్యులను, ఆదిశంకరులు తన సంకల్పశక్తిచేత విద్యావంతునిగా మార్చారు. గురువును దైవంగా భావించి గురుసేవ చేసినందువల్ల తోటకాచార్యులకు గురు అనుగహ్రం లభించింది.*
*బోధనలు, శ్రవణం, ధ్యానాదుల కన్నా ఎక్కువగా గురువు అనుగ్రహం ఫలితాన్ని ఇస్తుందని భగవాన్ రమణ మహర్షి అన్నారు. తత్వజ్ఞాని అయిన గురువు యొక్క తన చూపుచే కొందరిని, తన తలంపుతో కొందరిని, తన స్పర్శచే కొందరిని ముక్తులను చేస్తారు గురువులు.*
*భిషజే భవరోగిణామ్*
*అనగా ఎవరిది పరిపక్వమైన మనసో, అపరిపక్వమైన మనసో అని తెలుసుకొను భవరోగ వైద్యుడు గురువు. కనుక అన్ని ధ్యానములకంటే గురు ధ్యానమే శ్రేష్ఠం. అన్ని పూజలకంటే శ్రీ గురుపాదపూజయే అధికఫలాన్ని ఇస్తుంది.*
*శ్రీ గురుకృపయే ముక్తికి మూలం. శ్రీరాముడు కూడా గురువైన వశిష్ఠుని శ్రద్ధా భక్తితో, ఆత్మ విశ్వాసంతో సేవించిన ఫలితంగానే గురు వశిష్ఠుల వారు యోగ వాశిష్ఠాన్ని బోధించాడు.*
*గురుతత్వం ఆత్మతత్వంగా విశ్వమంతా వ్యాపించి ఉంది. కనుక ఆత్మానుభవం సాధించాలంటే అనుభవజ్ఞుడైన గురువును ఆశ్రయించాలి. అలాంటి పరిపూర్ణమైన గురువు మాత్రమే శిష్యజీవునిలో, అతనికి తెలియకుండా, అంతరంగంలో వున్న ఆత్మతత్వాన్ని అతడికి ఎరుకపరచి, జ్ణానామృతాన్ని, జ్ఞానధనాన్ని అందించి, ఆత్మజ్యోతిని వెలిగించే వాడే అసలైన గురువు.*
*కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకమ్*
*గురుర్విశ్వేశ్వరః సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చయమ్.*
*గురువు నివసించు స్థానమే శిష్యులకు కాశీ క్షేత్రము. గురువు చరణోదకమే పవిత్ర గంగ. ఆయనే సాక్షాత్ విశ్వేశ్వరుడు. గురు మహాత్ముడు తన పాదం మోపి అడుగులిడిన ప్రాంతాలే శిష్యులకు పుణ్యక్షేత్రములు. ఆయన తాకిన వస్తువులే పరమ పవిత్రములు. గురుకృపా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారముతోనే శిష్యుల అజ్ఞానాంధకారం భగ్నమై, వారి మదిలో ప్రకాశవంతమైన అఖండ జ్ణానజ్యోతులు వెలుగొందుతాయి. అటువంటి గురువు లభించడం ఆ శిష్యుల పూర్వజన్మ సుకృతం పైన ఆధారపడి ఉంటుంది.*
*శుభం*
No comments:
Post a Comment