_[-సత్యం శంకరమంచి గారి *"అమరావతి కథలు"* అనే వందకథల పుస్తకం నుండి ఇవాళ సరదాసరదాగా ఉండే... *"ఆరేసిన చీర"* అనే కథను చదువుదాం... కథ జరిగే స్థలం చాకిరేవు. ఇందులో ఓ ముసలి జంట, కొత్తగా పెళ్ళైన ఓ కుర్ర జంట ముఖ్యమైన పాత్రలు.... ముసలి దంపతుల సరసాలతో మొదలవుతుంది కథ... అయితే కొత్తగా పెళ్ళైన జంట... లచ్చికి, సాంబడికి ఇష్టం లేకుండానే పెద్దలు పెళ్ళి చేశారు... ఒకరంటే ఒకరికి పడదు... ఎప్పుడూ ఎడమొకం పెడమొకంగా ఉంటారు.. మాటకు మాట అనుకుంటూ రెచ్చిపోతారు. ఇదంతా మనకు కొంచెం చిరాకుగా ఉంటుంది. చివరికి ఈ ఇద్దరి కథ ఏమయిందో... తెలియాలంటే, గబగబ కథ చదవాల్సిందే... *—వెలిశెట్టి నారాయణరావు 🙏*]_
*#################*
*_కథపేరు:-- ... "ఆరేసిన చీర"...._*
*#################*
*🔵చట్టుమీద చాకలోళ్ళు బట్టలుతుకుతున్నారు.*
*"అహోస్... అహోస్..."*
*"అష్షూ.... అష్షూ..."*
*ధోవతుల్ని, చీరల్ని, దుప్పట్లని, జంబుఖానాల్ని తిరగేసి తిరగేసి బండలకేసి బాదుతున్నారు.*
*ఓ పక్క ముసలి వెంకాయి పెద్ద బానలో నీలిమందు కలుపుతూ "ఓర్నీయమ్మ! పోరగాళ్ళెవరో దీనికి బొక్క కొట్టారేవ్" అన్నాడు పెళ్ళాం పోలేరమ్మతో.*
*"ఇంకెవరు? ఆ పూజారీది పోరగాళ్ళే రాళ్ళు కొట్టుంటారు. అయినా జన్మంతా ఆ చిల్లి బానేనా? కుమ్మరాయనకి చెప్పి కొత్తది చేయించరాదూ?" అంది పోలేరమ్మ గుడ్డలు పిడుస్తూ.*
*"ఓసి పోలీ! జన్మంతా నీతోనే కాపరం చేశానుగదా! నువ్వూ వోటి బానవు అయిపోయావుగదే...! ఇంకోత్తిని కట్టుకోనేంటి?" అన్నాడు బోసినోటి వెంకాయి.*
*"ఓలబ్బ సంబడం...." అని మూతి విరిచింది పోలేరమ్మ.*
*"ఏటే! ఈ బాన మా అయ్యకాలం నాటిదే. వొట్టినే పోనిస్తానేటి?" అంటూ వెంకాయి చిల్లికి గుడ్డ పేలికలు పెడుతున్నాడు.*
*చాకళ్ళు ఎవరి బండల దగ్గరికివాళ్ళు మూటల్తో చేరుతున్నారు. అవతలపక్క కొత్తగా పెళ్ళయిన లచ్చి, సాంబడు మూటల్తో దిగారు. వాళ్ళిద్దరికీ క్షణం పడదు. ఎప్పుడూ కీచులాటే.*
*"తిరిగి తిరిగి ఇంతేళ కొచ్చావ్! పొద్దు కన్పిస్తుందా?" అన్నాడు సాంబడు.*
*"నువ్వూ ఇప్పుడే వచ్చి నన్ను దెప్పుతావే? వాళ్ళు బట్టలెయ్యాలిగా?" తిప్పికొట్టింది లచ్చి.*
*"సికార్లేగాదు. మాటలుకూడా నేర్చావుగదే!" పళ్ళు కొరికాడు సాంబడు.*
*"నా కెందుకు సికార్లు? మీసవున్న సోగ్గాడివిగదా... నీగ్గావాలి సికార్లు."*
*"ఏటే! నన్నే ఎక్కిరిస్తున్నావ్! దర్బీస్ మొకందానా?"*
*"ఓలబ్బ! పెనం మీద అట్లకాడల్లే ఏం ఎగిరిపడ్తున్నాడు!"*
*"మక్కె లిరగదంతా భాంఛోత్..." అంటూ లచ్చి జుట్టు పట్టుకున్నాడు సాంబడు.*
*"ఓలమ్మో!" గొల్లుమంది లచ్చి.*
*వెంకాయి పోలేరమ్మ పరుగెత్తుకొచ్చి "ఓరి మీరు పడిసావ! బట్టలు తడపకుండానే దెబ్బలాట లేంట్రా?" అని ఇద్దర్నీ విడదీసి పనికి పురమాయించారు.*
*లచ్చి, సాంబడు మాట్లాడకుండా బట్టలుతుకుతున్నారు. మనసుల్లో ఒకళ్ళమీద ఒకళ్ళకి ఎందుకో కసి, ఈ పెళ్ళి యిద్దరికీ ఇష్టం లేదు. పెద్దలు పట్టుబట్టి ఇద్దరికీ ముడేశారు. లచ్చి సన్నగా వుంటుంది. సాంబడికి బొద్దుగా వున్న ఆడపిల్లంటే ఇష్టం. లచ్చి జడ చిన్నది. సాంబడికి పొడుగాటి జడలున్న పిల్లంటే మనసు. ఆడపిల్ల గజ్జెల పట్టీలు బెట్టుకు నడుస్తుంటే సాంబడి గుండెలో మువ్వలు మోగుతాయి. సాంబడు కొనిచ్చినా లచ్చి గజ్జెల పట్టీలు అవతల పారేసి కడియాలు పెట్టుకు తిరుగుతుంది "టంగు టంగున." లచ్చికున్న ముక్కు బేసరీ, దుద్దులు సాంబడికి బావుండవు. అందుకే లచ్చి అంటే చికాకు కోపం..... అసహ్యం .... దానిమాట, పలుకు, నవ్వు, అదిచేసిన పచ్చడి ఛీఛీ... సాంబడు కోపంగా చీర ఉతుకుతున్నాడు. ఆ చీర సీతాలు కట్టింది, సీతాలు కళ్ళముందు కదిలింది. అది నెమిలి కంఠంచీర. సీతాలు నెమిలి కంఠం చీరకట్టుకుని ముద్దబంతి పువ్వులా కదుల్తుంటే సాంబడికి కళ్ళూ వొళ్ళూ తెలిసేది కాదు. ఆడదంటే సీతాలే! దాని నవ్వు, దాని మాట, దాని నడక... అబ్బ ప్రాణాలు తోడేస్తూంది కదా... అనుకుంటూ చీరలో సీతాల్ని ఊహించుకుంటూ హుషారుగా ఉతుకుతున్నాడు సాంబడు.*
*లచ్చి అత్తకోడలంచు పంచె ఉతుకుతోంది. ఆ పంచె కోటేశుది. మొగాడంటే కోటేశుగాడే! అనుకుంది. "ఎందుకు ఈడూ ఉన్నాడు మోటుమనిషి" కోటేశు ఎంత నాజూగ్గా ఉంటాడు! వారగా ఒక్క చూపు చూస్తే గుండె జల్లుమంటది.*
*మొన్న పండగరోజు ఈ అత్త కోడలంచు పంచె కట్టుకుని, తలపాగా చుట్టుకుని బజార్లో ఎల్తా ఉంటే కార్యవర్థిరాజులా ఉండాడు. అందరి కళ్ళూ ఆడి మీదే... అనుకుంటూ సంబరంగా ఉతుకుతోంది.*
*సాంబడికి సీతాలు దొరకలేదు.*
*లచ్చికి కోటేశు మొగుడవలేదు.*
*మధ్యాహ్నానికి బట్టలన్నీ ఉతికి, ఇంటినుంచి తెచ్చుకొన్న అన్నంలోకి పూజారివీధి నించి అడిగి తెచ్చుకున్న కూరలతో... అసలు మాట్లాడకుండా లచ్చి, సాంబడు ఎదురెదురుగా కూర్చుని తిన్నారు. ఆ పైన బట్టలన్నీ చట్టుమీద ఆరేశారు. ఒకళ్ళొకపక్క, ఇంకొకళ్ళు ఇంకొకపక్క పట్టుకుని ఆ బట్టల్ని చట్టుమీద పరుస్తున్నారే కానీ ఇద్దరి మనసులూ ఎక్కడో ఉన్నాయి. నెమిలి కంఠం చీర ఆరేస్తున్నప్పుడు సాంబడి వొంట్లో నెత్తురు 'జిల్' మని పొంగింది. అత్తకోడలంచు పంచె పరిచి ఎగిరిపోకుండా రాళ్ళుపెడ్తుంటే లచ్చికి వొళ్ళు పొంగింది.*
*సాయంకాలానికి ఆరిన బట్టలన్నీ మడతేశారు లచ్చీ, సాంబడు. సూర్యుడు అస్తమించబోతున్న వేళ ఇద్దరూ ఉతికిన బట్టల్లో నచ్చినవి తీసి కట్టుకొన్నారు.*
*ఆశ్చర్యం.........!!!!*
*సీతాలు నెమిలి కంఠం చీరలో లచ్చి అందంగా కన్పించింది సాంబడికి. కోటేశు అత్త కోడలంచు పంచెకట్టుకున్న సాంబడివైపు ఆశగా చూసింది లచ్చి.*
*“మూటెత్తు” అంది లచ్చి.*
*సాంబడు మూటెత్తి ముందుకొచ్చి లచ్చిని ముద్దు పెట్టుకున్నాడు. లచ్చి తోసెయ్యలేదు. తనూ ఓ ముద్దిచ్చి తృప్తిగా నవ్వింది.*✳️
*£££££££££££££££££££*
*_{హమ్మయ్య...! చిరు జల్లులతో మొదలైన కథ... ఉఱుములు... మెఱుపులతో హోరెత్తించి, పిడుగులు పడతాయేమోనని హడలు పుట్టించింది. కానీ, పెద్ద జడివాన హఠాత్తుగా వెలిసిపోయి ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు కథ ముగిసింది. లచ్చి సాంబడు ఒక్కటయ్యారు. అలా... కథ సుఖాంతమైంది. చాలా సంతోషం. : --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
No comments:
Post a Comment