Monday, June 15, 2026

 *యోగి వేమన -12*
రచన : మాలయశ్రీ 
👐

*దేశ సంచారం*

వేమన ఎన్నో ఊళ్ళు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ తన కవిత ప్రవహిస్తూనే ఉండేది. ఆది జీవనదీధార. ఆరదు ఆగదు. నిరంతరం త్రోసుకువెళ్ళడమే దాని స్వభావం. సమాజం దానికి ప్రేరణ. సత్యం గమ్యం. నీతి బోధ ప్రధానం.

వెళ్ళినచోటనల్లా ఈయనకి వెక్కిరింతలు తప్పవు. కొందరికి ఉలుకు పాటు ఉద్రేకం తప్పవు. మాటలతో చేతలతో ఆయనను హింసింప జూసేవారు, కాని వేమన గుండెబలం కండబలం కలవాడు. ఆయన చూపు చాలు శత్రువులను ఆమడదూరంలో నిలిపి ఉంచడానికి. పైగా ఆయన సత్యాన్వేషి.

“యదార్ధవాది నశ్శత్రుః లోకధర్మస్సనాతనః' -మానవగీత.

(నిజం పలికేవారికి శత్రువులుండడం పూర్వం నుంచీ వుంది.)

అయినా వేమన భయమేమిటో ఎరుగడు. సమాజంలోని కుళ్ళును, మోసగాళ్ళను వేలెత్తి చూపాడు. తస్మాత్ జాగ్రత్త అని గొంతెత్తి జనాన్ని హెచ్చరించాడు. సంసారం లేదు. స్వార్థం లేదు. సంభావన లాశించలేదు. పూజల కంగీకరించ లేదు. మంత్ర గోపనమూ లేదు. శిష్య బలగమూ లేదు. యెవరెవరో వారి దర్శనార్ధం వచ్చేవారు. పండ్లో తిండ్లో తొచింది తెచ్చి ఇచ్చేవారు-డబ్బు మాత్రం కాదులెండి. ఆయన పుచ్చుకోడు. దాని అవసరము లేదు-ఆశాలేదు.

ఆయన సందర్భాన్నిబట్టి చెప్పిన పద్యాలు, లేదా శిష్యులు చదివినవి విని తనివిజెంది నమస్కరించి తృప్తితో వెళ్ళేవారు- చూడవచ్చినవారు.

శిష్యులంటూ యెవరినీ ప్రత్యేకంగా వేమన చేరదీయకున్నా కొందరు అభిమానంతో ఆయన వెంటవుండేవారు. నచ్చినంతకాలం వుండీ ఇంటి ధ్యాస మళ్ళినప్పుడు వెళ్ళిపోయేవారు. అందుకు వేమన అభ్యంతరం చెప్పేవాడుకాదు.
అభిరామయ్య వేమనకు ప్రధాన శిష్యుడని చెప్పుకుంటారు, ఆయన యెప్పుడు వచ్చిచేరిందీ యెంతకాలం గురువుతో ఉన్నదీ సరిగా తెలియదు.

వేమన నిందకు ప్రధానకారణం కులమతాల నింద. పైగా విగ్రహారాధనను నిరసించడం.
వైదికాన్ని చార్వాకం, జైనం, బౌద్ధం, వీరశైవం వంటి భారత మతాలు కాదన్నా జనంలో దాని ఆదరణా వుంది. పురాణ ధర్మాల–దేవతలపై 
భక్తివిశ్వాసాలే కాక వాటినే జీవనోపాధిగా చేసుకొని బ్రతికే వర్గముంది. వారికి వేమనపై కోపం జాస్తి, అది తప్పదు కూడా. ఎక్కడ కొట్టినా భరిస్తారేమోకాని పొట్టమీదకొడితే ఎవరు సహిస్తారు. అందుకే వేమనను గట్టిగా ఎదిరించారనుకోవచ్చు. అందుకే కాబోలు ఆ ప్రజాకవి అగ్రజన్ముల ఆభిజాత్యాన్ని సవాలు చేస్తూ ఇలా పద్యాలు చెప్పాడు.

కులము చేతబట్టి గుంఫించనేటికి 
పాదు ఉన్నచోట ప్రబలు విత్తు 
ఏటికులమదింక ఎక్కడి ద్విజుడయా? విశ్వదాభిరామ వినురవేమ.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
గుడులు దేవతలని గుర్తులు కావింత్రు ముష్టిదాపలనుచు మూల్గనేల?
మొప్పెలకును దారి చెప్పగా ప్రాజ్ఞత -
ఆలిరంకు దెలుప నఖిల యజ్ఞంబులు
తల్లి రంకు దెలుప తద్దినాలు
కాని తెరువు కర్మకాండ కల్పితమాయె-

తల్లి గన్న తల్లి తన తల్లి పినతల్లి 
తండ్రి గన్నతల్లి తాత తల్లి 
యెల్ల శూద్రులైరి యేటి బాపడుతాను విశ్వదాభిరామ వినురవేమ.

స్త్రీలకు ఉపనయనం లేదుకాబట్టి శూద్రులనుట, ఆయనది కేవలం కుల ద్వేషమా అంటే కాదనడానికి ఈ క్రింది పద్యం సాక్షి.

బ్రాహ్మణులకు సర్వధనముల 
నీవచ్చు గౌరవింపవచ్చు 
కోరి వారు జ్ఞానమొసగి జనుల కడదేర్చుచుండిన, 
విశ్వదాభిరామ వినురవేమ.

వేమన గుణ పక్షపాతిః
📖

*వేమన బలపరచిన ధర్మాలు*

తనకంటే ముందు వెనుక ప్రముఖ వ్యాప్తిలో వున్న యెన్నో ధర్మాలు వేమన కవితలో కానవస్తాయి.

సత్యమేవ జయతే...

మాటలెల్ల కల్ల మననెల్ల కల్లయై
ఏటి ప్రాణమింక నేటి బ్రతుకు 
మాట సత్యమైన మరి శతాయుశ్యంబు 
విశ్వదాభిరామ వినురవేమ.

జాతస్య మరణం ధృవం----

మరణమన్న వెరచి మది గలంగగనేల
నిరుడు ముందటేడు నిన్న మొన్న 
తనువు వీడినతడు తనకన్న తక్కువా?
విశ్వదాభిరామ వినురవేమ.

నీచప్రవృత్తి —

హీనుడెన్ని విద్య లిల నభ్యసించిన 
ఘనుడు కాడు హీన జనుడె కాని 
పరిమళముల గార్దభముమోయ ఘనమౌనె-
విశ్వదాభిరామ వినురవేమ.

అజ్ఞాని-

ఎరుకమాలి వాడు ఏమేమి చదివిన 
చదివినంతసేపు సద్గుణియగు 
కదిసి తామరందు కప్పగూర్చున్నట్లు-
విశ్వదాభిరామ వినురవేమ.

ఆరిషడ్వర్గాలనింద—

మోహలోభములను మొనయుట కడు కీడు మోహముడిగెనేని ముక్తుడగును 
లోభముడిగె నేని లోకంబు నెరుగును-
విశ్వదాభిరామ వినురవేమ.

లోభి నింద —

లోభి వాని జంప లోకంబు లోపల 
మందు వలదు వేరు మతము వలదు 
పైక మడిగినంత భగ్గున పడిచచ్చు-
విశ్వదాభిరామ వినురవేమ.

రుణము కూడదనుట —
పరుల మోసపుచ్చి పర ధన మాశించి 
కడుపు నింపుకొనుట కాని పద్దు 
రుణము చేయు మనుజు డెక్కువ కెక్కునా ? అప్పు తీయరోత హరి హరాదులకైన 
మొప్పెతోడ మైత్రి మొదలె రోత 
తప్పు బలుకరోత తాకట్టు కడురోత-
విశ్వదాభిరామ వినురవేమ.

వినా ధనం నశోభంతే—

తల్లిబిడ్డలకును తగవులు బుట్టించు 
ధనము సుఖము గూర్చదని వచింత్రు 
కాని గడవలేక గడుచుట యెట్లురా-
విశ్వదాభిరామ వినురవేమ.

ఆకలిబాధ......

పులి యదెట్టి దన్న భూలోక మృగరాజు 
కలి యదెట్టి దన్న కానరాదు.
పులియు కలియు కన్న భువి నాకలియె హెచ్చు-
విశ్వదాభిరామ వినురవేమ.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఐకమత్యమే మహాబలం—

ఐకమత్య మొక్కటావశ్యకంబెపుడు 
దాని బలిమి నెంత యేని కూడు 
గడ్డి వెంటిబెట్టి కట్టదా ఏనుంగు-
విశ్వదాభిరామ వినురవేమ.

సహజీవనం ___

ఇచ్చి పుచ్చుకొన్న హితులును మనుమలు
తగ్గులేక ఇల్లు తామరవలె 
కాచి పూచి పండి కడు రమ్యమైయుండు-
విశ్వదాభిరామ వినురవేమ.

పనివిలువ-

భూమిలోన బుట్టు భూసార మెల్లను 
తనువులోన బుట్టు తత్త్వమెల్ల 
శ్రమములోన బుట్టు సర్వంబు తానౌను-
విశ్వదాభిరామ వినురవేమ.

వ్యభిచార నింద—

ఇంటి యాలి విడిచి ఇలజార కాంతల 
వెంట దిరుగువాడు వెర్రివాడు 
పంటచేను విడిచి పరిగె లేరిన యట్లు-
విశ్వదాభిరామ వినురవేమ.

కన్యాదానం...—

కలిమి జూచి యివ్వ క్రయమిచ్చినట్లుండు సమునకివ్వ మంచి సరస గుణము 
పేద కివ్వ మనువు పెనవేసి నట్లుండు-
విశ్వదాభిరామ వినురవేమ.

గృహస్థు ధర్మం -

పోల్కి జూచి తెలివి పూర్వావరంబులు 
తడుపు గుడుపు నడుపు తత్త్వమెరిగి 
నడవ నేర్చినట్టి నరుడు గృహస్తుండు విశ్వదాభిరామ వినురవేమ.
🤟
*సశేషం* 
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం* 

https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe

*తెలుగు భాషా రక్షతి రక్షితః* 

*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment