*చిటారుకొమ్మన చీకటి* *పొట్లం* ?
-------వేణుమరీదు
( ఖమ్మం)
_బుద్ధయ్య అలా తోటలోకి అడుగుపెట్టాడో లేదో ఆ మామిడిచెట్టు అమాంతం అతణ్ణి కౌగిలించుకుంది.
“అబ్బ నా పిల్లగాడా....ఎన్నేళ్ళయింది నిన్ను చూడక” అంటూ రెండు లేత క్రిందికొమ్మల్ని వంచి ఏనాడో జాతరలో తప్పిపోయి తిరిగొచ్చిన బిడ్డను హత్తుకున్నట్లుగా దగ్గరకు తీసుకుంది.
“అబ్బా నీ ఉబ్బు... నీ ఇష్టం పాడుగాను! వదలవే తల్లీ... అబ్బా... నాకు ఊపిరాడట్లేదూ...”
చెట్టు తన పట్టును విడిచింది. బుద్ధయ్య ఊపిరితిత్తుల్నిండా గాలి గుంజుకున్నాడు.
“సరేగానీ చెట్టమ్మా... నిన్నెందుకిలా ఇనుప తీగెలో బంధించారు?”
“ఖైదు బుద్ధయ్యా ఖైదు! నేలకే గాదు... చెట్టుకూ పుట్టకూ ఖైదు! మనూళ్లో పెదనర్సయ్యగాడు తెలుసుగా. వాడు ఈ ప్లాటు ముక్కను కొన్నాడంట. నేనేమో ప్లాటు నడుమన వున్నాను. చుట్టూ రాళ్లుపాతి ఇనుపకంచె వేస్తుంటే “అరే నర్సీ... భూమి కొంటే కొన్నావు. నన్నెందుకురా ఖైదు చేస్తున్నావ్?” అని నిలదీసా.
“-ఎక్కువ తక్కువ మాట్లాడితే నిట్టనిలువునా నరికిపడేస్తా నీ యవ్వా ముసలిచెట్టా- అని వాడు బూతులాడాడు. బుద్ధయ్యా... నువు చెప్పు. చెట్టును తిట్టొచ్చా? పుడమి కానుపులం మేము. తరువేగా నరుని ఆదరవు. నర్సయ్యను వెనక్కు పిల్చిమరీ తిట్టాలే! ‘అరే నర్సీ! నీ యింట్లో వాళ్ళైతే ఎట్లాబడితే అట్లా పైలా పచ్చీసుగా తిరగొచ్చు! నేనేమో ఈ ముళ్లఫెన్సింగులో ఖైదీని కావాలా?’ అంటూ ఇంకా ఏవేవో తిట్టాలే. వినపడనట్లు నటిస్తూ పోయాడు నాయాలు!” అంటూ ఒళ్ళంతా ఊపుతూ ఇకిలించింది ఆ వృద్ధవృక్షం. ఆ ఊగుడుకు నాలుగు గిడసబారిపోయిన కాయలు రాలాయి.
బుద్ధయ్య కాళ్ల ముంగిటపడ్డ ఒక కాయనందుకుని కొరికాడు.
“అబ్బా... రొడ్డ... రొడ్డ... ఏంటేతల్లీ? నీ చెట్టుకాయ చక్కెరలా తియ్యగా ఉండేది. యిప్పుడేంటి ఇలా పుల్లగా?”
“వయసై ముదిరిపోతూవుంటే రుచులైనా, అభిరుచులైనా మారిపోవలసిందేగా నాయనా!”
“సరే ఓకేలేగానీ... మరి మనవాళ్లంతాయేరి? ఆ ముంతమామిడి, జొన్నలరాశి చెట్టు, కొబ్బరిమామిడి, కోతిపిర్ర చెట్టు, ఇమాం పసంద్ కోసుకొని తింటుంటే జున్నుముక్కల్లా కమ్మగా ఉండే ఆ మధురఫలాల దశేరి మామిడి.... ఏవి ఆ చెట్లన్నీ కనపడట్లేదు?”
నీకు పక్కనే పొరుగింటోళ్లలా ఉండే నీలం, రసాలు, జలాలు ... ఏమైపోయాయి? నీ వెనుక ఆ తోతాపురి చెట్లేవి? పాతిక బంగినపల్లి చెట్లకు బదులు నువ్వోక్కదానివే మిగిలావే?”
బుద్ధయ్య కనుమరుగైన రక్తసంబంధీకుల కోసం ఆరా తీసినట్లుగా ఆందోళనగా అడిగాడు.
ఆ ప్రశ్నలు వింటూనే చెట్టు పొగిలి పొగిలి ఏడవసాగింది. తన చిటారు కొమ్మల్ని వంచి వంచిత ఐన ఓ పడతి గుండెలు బాదుకున్నట్లు తన మోడుకేసి మోదుకోసాగింది.
“అయ్యా బుద్ధయ్యా... నన్ను కూడా రేపోమాపో నరికేసి బండికెత్తి ఏ పీనుగునో కాలెయ్యటానికి బొందలగడ్డకు తోలమని చెప్పు నాయనా! మా మానులూ మనుషుల మాదిరే కునారిల్లి కూలుతున్నాం!” అని రోదిస్తూ ఆ ప్రౌఢ మామిడిమాను అదాటున తాడిచెట్టంత మనిషై భీకరంగా నిలబడింది. నిలబడిన ఆ మానుమనిషి ‘ఆకులో ఆకునై... పూవులో పూవునై... కొమ్మలో కొమ్మనై.... నునులేత రెమ్మనై’ అంటూ కృష్ణశాస్త్రి గారి పాటను భైరవిరాగంలోకి మార్చుకొని ఆర్ధ్రస్వరంతో పాడసాగింది.
పాట పూర్తికాగానే మళ్లీ మానై పచ్చగా నిలుచున్న ఆ మావిచెట్టు అంతలోనే తన మండల్ని డేగల రెక్కల్లా టపటపలాడిస్తూ నిర్వికారంగా నవ్వుతూ, “హ్హ హ్హ హ్హ... ఏవిరా ఆకులు? ఏవిరా కొమ్మలు? ఏవిరా రెమ్మలు? ఓ మనిషీ ! బుద్ధయ్యా... ఏదిరా వసంతం? అదిగో వాడింది! ఏదిరా హేమంతం? అదిగో మండింది! ఏమైంది వర్ష ఋతువుకు? ఎండింది! ఎక్కడ ఆ శరదృతువు? చచ్చింది! ఐతే యిక ఈ ఇలలో... అందరి కలలో... ఘడియ ఘడియకు గ్రీష్మమే... అడుగు అడుగుకీ శిశిరమేనా? అయ్యయ్యో... కృష్ణశాస్త్రిగారూ... క్షమించాలి మీరు!” అంటూ దు:ఖాతిశయం తనను కమ్ముకోగా కీచుగొంతుకతో “ఆరు ఋతువులు... ఆమని వేళలె మన తోటలో... మరచిపోకుమ తోటమాలి... పొరపడి ఐనా మతిమాలి” అంటూ బిగ్గరగా పాడసాగింది.
బుద్ధయ్య నుదుటి చెమట కణతల మీదుగా చంకల్లోకి యింకిపోయింది.
“ఆర్నీ చెట్టమ్మా... ఫాంటసీ, మ్యాజిక్ రియలిజంలో వందల కతలు రాసిన నన్నే అబ్బుర పరిచావే! యింతకే చెట్లన్నీ ఏమైనాయంటే ఏంటలా ఏడుస్తావ్? ఆయమ్మ అయ్యలు... రేణుకత్త, పెద్దిరెడ్డి మామ... ఎంత నెనరు వాళ్లకు ఈ తోటంటే. పాపం... వెన్నుపూసనుకాల్చే ఎండల్లో... ఒంట్లో మాంసం ఉడికిపోతున్నా... కడవల్లో, కావిళ్లలో ఊరిచెరువునుండి నీళ్లు మోసుకొచ్చి ఎంతో మక్కువతో పెంచుకున్నారు. జిహ్వాకో రుచి కదా... అన్ని నాలికలకు కావాల్సిన అన్నిరకాల మామిడి మధురాలను పంచాలని యిద్దరూ ఆరాటపడ్డారు. పెంచారు. ఏవా చెట్లన్నీ? ఎటుపోయాయి? చెప్పవే?”
“ఎటుపోయాయి? కర్రలై కాటికిపోయాయి! పుల్లలై పుర్రెలతోపాటు పేలాయి! అదంతా చెప్తాలేగానీ... నువ్వేంటిలా బుద్ధయ్యా? లిల్లీకాడలా నాజుగ్గా ఉండేవాడివి. రేవుకాడ తాటిమానులా భలే పెరిగావే! మీసం కూడా నెరుస్తుంది. మళ్ళీ యిటెందుకొచ్చినట్లు?”
“మళ్లీ లిల్లీలా కావటానికి!”
“కుదరదు”
“నీకేం ఉబ్బు?”
“ఉబ్బుగాదు. అది గబ్బు!”
“ఏంటి?”
“మళ్లీ బాల్యంలోకి మరలటం... కుదరదు!”
“నాకు కుదురుతుంది. నే సగం బాల్యమే గడిపానిక్కడ!”
“ఓహో! బాల్యం బాకీ ఉందా! ఐతే ఉండిపోలే! నాకూ తోడులేక నా నీడ కూడా ఉత్తగనే పోతుంది”.
“యింతకూ విషయం చెప్పు. నీ తోటిచెట్లన్నీ ఏమయ్యాయి? ఎవడీ తోటనిలా ముక్కచెక్కలు చేసింది? చుట్టూ రాతి స్థంభాలునాటి ఈ ఇనుప కచ్చడాలు కట్టిందెవడు?
“భూమి నాదన్న భూమి ఫక్కున నవ్వు... ఎవడిన్నాడు గనుక వేమన్న మాట. అంతా రియలెస్టేటు మహిమ నాయనా. కొన్నేళ్ల కిందట... పెద్దిరెడ్డి మామ ప్రాణం అట్లా పోయిందో లేదో... వారసులు చిన్నదినం నాడే ఆస్తులు పంచుకున్నారు. ఊరితో పేగుబంధం తెంచుకున్నారు. తోటనెవడో గన్నాయిగాడికి అమ్మారు. వాడు దీన్ని తూట్లుతూట్లుగా చదునుచేసి ప్లాట్లుప్లాట్లుగా అమ్ముకు నూకిండు!”
“అయ్యో...అయ్యో... అగో అక్కడ నైరుతి మూలన... ఆ ముంతమామిడినీ నరికేసారా”
“లేదు”
“మరి?”
“తనే ఉరేసుకుంది!”
బుద్ధయ్య వెన్నుపూస కంపించింది. కడుపులో దేవింది.
“అదేంటి? ఉరేసుకున్నదా? ఎవడైనా చెట్టుకు ఉరేసుకోటం విన్నాగానీ చెట్టే ఉరేసుకుందా? తనకంత కష్టమేమొచ్చింది చెట్టమ్మా?”
“అది మా అందరికన్న పెద్దది... మంచీ చెడూ మాకు చెప్పాల్సింది. కుక్కయినా మొక్కయినా తనను సాకినోడే తండ్రి. పెద్దిరెడ్డి మామ చచ్చిపోయిననాటినుండి ముంతమామిడి మాను మనాదిపడ్డది. అదీగాక మీ పిల్లలంతా రావటం మానేశారు. యిక తన చుట్టూ రాతిగుంజలు పాతి ఇనుపముళ్ళు బిగించేసరికి గుండెపగిలింది. మనోవ్యాధికి మందులేదు కదా. తాను ఒంటరినైపోయానంటూ, తన అమ్మానాన్నల వంటి రేణుకమ్మ, పెద్దిరెడ్డి మామ, అలాగే దేశాంతరాలు పోయిన మీ సోపతులంతా ఎందుకని కన్పించకుండా పోయారని ప్రతిరాత్రీ పొగిలి పొగిలి ఏడ్చేది. ఆఖరికి తనంత తనే ఓ పెనుతుఫాను గాలికి ఆ ఇనుప ఫెన్సింగు మీదకు కూలి ఆ లోహపు ముళ్లతీగల్ని వేర్లకు చుట్టలుచుట్టలుగా బిగించుకుని ఊపిరొదిలింది!
బుద్ధయ్య కన్నులు కన్నీటి నాలాలై పొంగాయి. ఏడుస్తూనే ఇంకో చెట్టును గుర్తు చేసుకున్నాడు, “మరి ఆ తల్లేది? ఆ పెద్దరసాల చెట్టు? రేణుకత్త గుండెల్లో ఎంత ఔదార్యం ఉండేదో ఆ చెట్టుకూ అంత...”
“ఔదార్యం ఒకనాటి జీవన సౌందర్యం బుద్దయ్యా. యిప్పుడంతా వ్యాపారం. పైసా దే... పైసా లో! ఐనా... మనిషి మారినా మాను మారునా? ఆ రసం చెట్టు వయసు మీద పడకుండానే జబ్బుపడ్డది. ఎలా అంటే అది ఉన్న ఆ ప్లాటులో ప్లాటు ఓనరు ఆ మధ్య కన్నడం వాళ్లతో బెల్లం గానుగలు పెట్టించాడు. అల్లం బెల్లం అంతా అదేదో ఆర్గానికంటగా యిప్పుడు! గానుగల దగ్గర పారబోసిన బెల్లం జిడ్డు, పిప్పి తీపికి అక్కడ లక్షల్లో చీమలు చేరాయి. వాటన్నిటికీ రసం చెట్టే ఇల్లయింది. అప్పట్లో మిమ్మల్ని అనుకున్నట్లే అన్ని చీమల్నీ తనబిడ్డలనే ఆదరించింది. ఓ రోజు ఆ ప్లాటు కొన్నాయన పిల్లలు ఆటకని తన కొమ్మలపై దూకుతుంటే ఆ మాను పులకరించిపోయింది. కానీ చీమలు వాళ్లను గట్టిగా పట్టిపీకాయి. కోపంతో ఆ ప్లాటు ఓనర్ మందు చల్లమని పనోళ్లకు చెప్తే వాళ్ళు తెలిసీతెలియక ఏదో ఆమ్లపు రసాయనం స్ప్రే చేసారు. అదీ మోతాదుకు మించి. దాంతో వొళ్ళంతా కురూపిలా ఐన తనను తాను చూసుకొని రేయింబవళ్ళూ శోకాలు పెట్టేది. ఎన్నో తరాలపాటు మధుర రసఫలాలిచ్చిన ఆ చెట్టు... పిల్లల్నీ, పిట్టల్నీ, పురుగుల్నీ అమితంగా ప్రేమించిన పెద్ద రసాల చెట్టు... మెలమెల్లగా కుంగి కృషించి ఒంటిపై ఒక్క మారాకు కూడా తొడగక, ప్రేమగా పిలుస్తున్నా ఏ చిలుకా ఏ బాలికా తన దరిచేరక... వాడిపోయి, తనువు మాడిపోయి మోడై కూలిపోయింది...” అని ఆర్తిగా పలికింది ఆ బంగినపల్లి మామిడి చెట్టు స్వరం.
“అయ్యో తల్లీ...అలా రాలిపోయిందా మన రసాల చెట్టు. హార్ట్ ఫెల్ట్ రిప్ టు మై బిలవిడ్ మ్యాంగో ట్రీ”
“ఆ... ఆ... ఈ రోజుల్లో మనుషులు ఓ రిప్ పడెయ్యటం తప్ప యింకేం చేయగలరులే”
“చెట్టమ్మా... నీకు మా రుక్మమ్మత్త తెలుసునా?”
“హాఁ.... తెలియకనే? మడమలనుండి చెంపలదాకా పసుపు రాసుకుని బోనమెత్తుకుని నడిచొస్తుంటే అమ్మోరే ఆమెలా కదిలొచ్చినట్టుండేది అప్పట్లో...”
“చిత్రం... మనుషులు మరచిన మనుషుల్ని మానులు తమ యాదిలో పదిలపర్చుకోవటం... నువు గొప్పదానివి చెట్టమ్మా... అచ్చం మన రుక్కమ్మత్తలానే... మొదలు కొమ్మలనుండి చిటారు కొమ్మల దాకా విరగకాసి పసుపువన్నెల పండ్లతో పెద్ద ముత్తయిదువలా హూందాగా అక్కడ ఆ కొసన నిలబడుండే ఆ దశేరి మామిడిచెట్టేది కాకా?”
“ఔనౌను బుద్ధయ్యా... నిండాకాసి నిండు గర్భిణిలా అగుపించే దశేరిని మీరంతా సరదాగా ‘అత్తచెట్టు... అత్తచెట్టు’ అని పిల్చుకునేవాళ్లు! అసలారోజుల్లోనే ఎక్కడో ఉత్తరాదినుండి ఆ దశేరి అంటు మొక్కను తెప్పించుకుని మరీ తోటలో వేసాడు. ఆ చెట్టంటే ఆయనకు గుట్టంత గావురం. తానో మైసూరు మహారాజానన్నట్లు ఆ దశేరి మావినే తన ప్యాలేసన్నట్లు ఆ చెట్టునీడలో ఓ పెద్ద కుర్చీ వేసుకుని ఓ తీపికునుకు తీసేవాడు. ఢిల్లీ సేట్ నుండి గల్లీ గరీబ్ వరకూ ఆ దశేరి మామిడి కాయలకోసం ఎగబడేవాళ్ళు. ఆ ఒక్క చెట్టు కాయల్తోనే పెద్దిరెడ్డి మామ జేబులు వందనోట్లతో నిండిపోయేవి. కానీ చివరికి? చనిపోయేముందు పెద్దిరెడ్డి మామ ఆ దశేరి చెట్టు వున్న కొంత తోటభాగాన్ని అల్లుడికి పంచాడు. తర్వాత మీ తెలుగుమాస్టారు రామేశ్వరం పంతులుగారి కొడుకు ఆ చెట్టున్న తోటభాగం రెండు కుంటలు కొన్నాడు. నీకు తెలుసుగా బుద్ధయ్యా... వాడుత్త హవ్ లా... లోభి.. దురుసు మనిషి... బండమూర్ఖుడు. తన ప్లాటు చుట్టూ ముళ్ళ ఫెన్సింగ్ వేయించాడు. అంతటితో ఆగక తన జాగనెవడో పెరుక్కుని పోతాడేమో అన్నట్లు దట్టంగా రేగు పరిగకంపలు, ఇంగ్లిష్ తుమ్మచెట్లు పెంచాడు. ఎవరూ పట్టించుకోకపోయినా పోషణగీషణ ఏదీ లేకుండానే దశేరి చెట్టు ఆ యేడు విరగకాసింది. సిటీలో వుండే రామేశ్వరం పంతులు గారి కొడుకు ఓ రోజు తన ప్లాటు చూసుకోవటానికి వచ్చాడు. చెట్టుకు కాపలా పెట్టుకున్న లచ్చయ్య అదే సమయంలో రెండు పండ్లు కోసి తన మనవరాలికిస్తుంటే అతను చూసి లచ్చయ్యను బండ బూతులు తిట్టాడు. ఆ చిన్న పాపను కూడా ఏదో అన్నదని కొట్టాడు. పంచాయితీ అయింది. అతగాడు తలదించుకుని తప్పుగట్టాడు... పాతిక వేలు. లేకపోతే కులదూషణ కింద కేసయ్యేది.
“మరి దశేరి సంగతేమైంది?”
“ఏమైతుంది! ఎంత భోగమో అంత రోగమన్నట్లు ... ఆ హరిత అప్సరస సజీవ దహనమైంది. పంచాయితీ ఐన తెల్లారే ‘అసలీయవ్వారమంతా ఈ చెట్టు వల్లనే... బొచ్చులో దశేరి... ఇదేమన్నా కల్పవృక్షమా?” అని మండిపడుతూ ఆ తెలుగు పంతులు గారి కొడుకు అదేదో పొగలుకక్కుతున్న ఆమ్లం తెచ్చి చెట్టు మొదట్లో పోయించాడు... అదంతా చూసిన రామేశ్వరం పంతులుగారి కోడలు నెత్తీనోరు కొట్టుకుంటూ ఆ రోజు ‘ఓ పాపిష్టోడా... ఛీ ఛీ... పెళ్లాం పిల్లల మీదనే అనుకున్నా... నీ రాకాసితనం చెట్ల మీదకు కూడా మల్లిందా? ధూత్... నిండు చూలాల్లాంటి ఆ పండ్లచెట్టుని చంపటానికి నీకు మనసెట్లా వొప్పిందసలు?’ అని మొగుడిపై లడాయికి దిగింది.
“నీకెలా తెలుసు ఇవన్నీ?” చకితుడయ్యాడు బుద్ధయ్య.
“మీకున్నవి పంచేంద్రియాలేగా బుద్ధయ్యా! ఆ ఇంద్రియాల ఆయువుకు, ప్రాణవాయువులందందించే మా తరువుల్ని మీకు బరువులైనట్లు కూలుస్తూ మమ్మల్ని ఆఖరికి మోళ్ళు, మొద్దులు అని భావిస్తారే! అదే మీ పిచ్చితనం... ఎదగని పసితనం! ఎక్కువ మంది మనుషులు తమ ఆకలిదప్పికలు, తమ సుఖస్వార్థాలు మించి యిక ఎదగలేరనిపిస్తుంది... వృక్షానిది మాత్రం విశ్వమంత వీక్షణమని ఎరుగరు మీరు!”
“ఒప్పుకుంటాం చెట్టమ్మా ... నీకు అటూ యిటూ ఆమడదూరంలో ఉండేవి... అ చిన్న రసం చెట్లు, తోతాపురి చెట్లు, యింకా ఆ జలాలు, నీలాలు, ఇమాం పసందు చెట్లూ... ఏవవి?”
“అవన్నీ పెద్దిరెడ్డి మామ చిన్నకొడుకు భాగానికి పోయాయి. అతగాడేమో తాను ఉంచుకున్న పెంచలమ్మకు ఆ చెట్లున్న భూమిని రాసిచ్చాడు. ఆవిడ కొడుకు... అదే ఆ కలప డిపో నడిపే సీనయ్య... ఆ చెట్లన్నీ నిలువునా నరికించేసి కొమ్మకొమ్మకూ కాసుల్లెక్కేసుకున్నాడు సన్నాసెధవ... నా తోటి మానులవి... నా కళ్లముందే కూలిన నా సోపతులు... కష్టసుఖాల్లో నా యిరుగుపొరుగు... ప్రతి వేసంగినాటికీ ఫలభారంతో మేము అలసిపోయి, పంటకానుపునంతా మా యజమానికి పంచి... పచ్చి బాలింతల్లా మేము మగతగా మాగన్నుగా అసుర సంధ్యల నులి వెచ్చదనంలో విశ్రాంతి పొందే ఘడియల్లో... చిరుగాలులతో కూడి ఆకులు సవ్వడులయుగళగీతాలు పాడుకునేవేళల... వానకారు కోయిలలు తమ ప్రవాసాల వనవాసాలనుండి మరలొచ్చి మమ్మల్ని కమ్మగా పలకరించే వేళల... ఈదురుగాలులకు మా చిటారు కొమ్మల తలలను తోటి చెట్ల తలలతో ఆప్యాయంగా స్పృశించుకుంటూ... ఒకరి చిగురాకులపై పడిన జల్లుల్ని మరొకరిపై అల్లరిగా చిలకరించుకుంటూ... తుఫానుల అలజడికి అతలాకుతలమైపోయి మనిషీ మృగమూ, పురుగూపిట్టా అన్నీ పారిపోయి కొంపల్లో, కలుగుల్లో గజగజ వణికే వేళల్లో కూడా... గుడిలో దేవరలకు సైతం వొళ్ళు ఝల్లనిపించే అగ్గిపిడుగుల హూంకారఘీంకారాలను విని కూడా ఓ నవ్వు మాత్రం నవ్వేసి నిబ్బరంగా ఉప్పెనల సవాళ్లకు సైతం ప్రతిసవాళ్లు విసిరి, ప్రకృతి బీభత్స తాండవానికి సైతం నిలబడ్డాంగానీ... మనుషుల స్వార్థపు గొడ్డళ్ళకు, భూదాహానికి మాత్రం ఘోరంగా బలవుతున్నాం బుద్ధయ్యా...”
“ఔనమ్మా... నూరుపాళ్లు సత్యం చెట్టమ్మా... మా తాతలు మందిరాల దగ్గర రావిచెట్లు, జమ్మి వృక్షాలు పెంచారు. ఈ తరం వాటిని కూలదోసి కుండీల్లో కాక్టస్ లు పెంచుతున్నాం... నీదీ నాదీ ఒకటే బాధ... ఈ మధ్యనే ‘ది లాస్ట్ బన్యన్ ట్రీ’ అనే నవల రాసాను కూడా... హిట్టయింది... మిలియన్ కాపీస్ సోల్డ్ ఔట్...”
“ఓహో మా బుద్ధయ్య రైటరయ్యిండా! ఎంత సంతోషం. మరి నీ దోస్తుల సంగతేంటి? ఏమయ్యారు? రఘు, చందర్, సాహిల్, కుమార్, తిరుపతి, ముస్తాఫా, తలసి, రమణి, మాధవి, సుధ... మీరంతా నా కొమ్మలపై దూకుతూ, నా కాండంపై పాకుతూ, అప్పుడప్పుడూ జారిపడి అంతలోనే లేచి యికిలిస్తుంటే... నా వొంటిపైని మారాకుల నరాలు తీపిరాగాలు పాడేవి... అపుడు నా వేర్లు నేలతల్లి గర్భంలో శిశువుల్లా కదలాడేవి. రాత్రంతా కనిపించని బిడ్డల కోసం పలవరించి పలవరించి పొద్దు పొడవగానే మీ లేతపాదాల నులివెచ్చదనం నా పచ్చనిదేహాన్ని ఎపుడెపుడు ప్రియమారంగా తాకుతుందా అని ఆత్రంగా ఎదురుచూసేదాన్ని... మిమ్మల్ని నా కొమ్మల రొమ్ముల మాటున అబ్బురంగా పొదుపుకుందామని తహతహలాడేదానిని బిడ్డా... ఏరి ఆ పిల్లలంతా? అసలు గుర్తున్నారా నీకు?”
ఆ ప్రశ్నకు బుద్ధయ్య దేహంలో పెద్ద పెద్ద అద్దాలు పగిలినట్లుగా, అలలు అలలతో తాడనం చేసుకున్నట్లుగా ఏదో హోరు వినిపించింది. ఆ వెంటనే అతని రెండు పాదాలూ బారు వేర్లలా నేలలోకి చొచ్చుకొనిపోయాయి. అతని మొండెం కాండంగా మారింది. అతని శిరోభాగంపై కొమ్మలు రెమ్మలు ఎత్తుగా మొలిచి అదాటున అతనో సాలవృక్షమై నిలిచాడు. యింతలో అక్కడ పల్చగా మంచుధారలు పారిజాతపూల చిరుజల్లుల్లా కురవటం మొదలైంది. ఆ తోట కొన్ని ఘడియలపాటు లుంబినీవనంలా దర్శనమిచ్చింది. బుద్ధయ్యనుండి మొలిచిన సాలవృక్షపు కొమ్మను తన వామహస్తంతో బిగించిపట్టుకుని యక్షిణులు తమ చెంగులను చుట్టూ పరచగా అమ్మ మహామాయ సిద్ధార్థుడిని కన్నది. ఆ శిశువు నిల్చోని ఏడు అడుగులు వేసాడు. అడుగు అడుగుకో పద్మం మొలచింది. ఆ వెంటనే ఆ శిశువు యువకుడై ఎదిగి బోధివృక్షం క్రింద ధ్యానముద్రలో ఉన్నట్లు, ఓ లిప్తపాటు వెలిగి మరునిమిషమే మృగదావనంలో ఐదుగురు శ్రమణులకు నాలుగు పరమ సత్యాలను బోధిస్తున్నట్లు ఓ చిత్రం కదలాడింది. ఆ ప్రదేశమంతా క్రమంగా చిన్నారుల మృదు బృందగానంలా త్రిశరణాలు ఓ సంగీతఝరియై అష్టదిక్కులా వినిపించసాగాయి.
అదంతా ఓ చిత్రదర్శినిలో వెంటవెంటనే మారిపోయే వర్ణచిత్రాల్లా వీక్షించి విభ్రాంతికి గురైన ఆ వృద్ధ మామిడిమాను తన కొమ్మలన్నిటినీ రెండు హస్తాలుగా ముకుళింపజేస్తూ నమస్కారం భంగిమలో నిలబడింది.
అల్లంత దూరం నుండి ఒక్కసారిగా వందల రామచిలుకలు గాల్లోకి ఎగురుతూ చేసిన కిలకిలలు వినవచ్చాయి. కోయిల ఒకటి మధ్యలో పాటందుకున్నది. అబ్బాయిలు కొందరు సుతారంగా ఊపుతుండగా పూలతీగెల ఊయలల్లో పడుచు అమ్మాయిల నిర్మలమైన నవ్వుల కేరింతలు చుట్టూ ప్రతిధ్వనించాయి. అదంతా తన చెవిని తాకగానే బుద్ధయ్య తన చెట్టు రూపాన్ని వదలి మళ్లీ మనిషి రూపులోకి మరలొచ్చాడు.
మామిడిచెట్టు తన ప్రశ్నను వదల్లేదు.
“బుద్ధయ్యా... నీ బాల్యమిత్రుల గురించి అడగ్గానే నాకంతా ఏదో ప్రాకృతిక లీలాదర్శనం చేయించావు! యింతకీ నీ దోస్తులు?”
“చెప్పలేకపోతున్నా చెట్టమ్మా... దుఃఖం తన్నుకొస్తుంది. వాళ్లలో చాలామంది, ఆ ముంతమామిడిలా తమను తాము చంపుకున్నారు. కొందరేమో ఆ దశేరిమావిలా చంపబడ్డారు!”
“అయ్యో... అయ్యో... ఈ తోటలో ఆడుకున్న ఆ గువ్వలు అలా ఆగమయ్యారా?”
“ఔనమ్మా... రఘు విదేశాలకు వెళ్లి కోట్లు సంపాదించాడు. వాడైతే కనీసం ఒక్కసారి కూడా ఈ నేలతల్లిని, కనీసం కన్నతల్లిని కూడా చూడటానికి రాలేదు. బాధ్యతలన్నీ ఇక్కడ తమ్ముళ్ళకే వదిలేసిపోయాడు. చివరికేమైంది? వ్యాపారాల ఒత్తిడిలోపడి డిప్రెషన్ కు గురై వాడామధ్య ఓ బస్తాడు కరెన్సీ నోట్లు మీదపోసుకుని నిప్పంటించుకుని చనిపోయాడట...”
“అయ్యో తండ్రి... మీ చిన్నప్పుడు వాడేది పట్టుకుంటే అది బంగారమవుతుంది అనుకునేవాళ్లు. ‘మిడాస్ టచ్’ చివరికలా అయిందన్నమాట... మరి చందర్...సాహిల్... యింకా ముస్తాఫా?” అందర్ని గుర్తుచేసుకుంది ఆ బంగినపల్లి మామిడి.
“చందర్ గాడు ఎన్నో ఫైవ్ స్టార్ హోటళ్లు నడిపాడు. కానీ యాభైయేళ్లు నిండకుండానే అతనికి షుగర్ జబ్బు బాగా ముదిరిపోయిందట. యింట్లోవాళ్ళు, డాక్టర్లు ఎంత హెచ్చరిస్తున్నా మూడు పూటలా వాడికిష్టమైన అన్నం, కూరలు బాగా తినేసరికి అతని షుగర్ లెవల్స్ ప్రమాదస్థాయికి చేరాయి. భార్యాబిడ్డలు అస్సలు అతణ్ణి అన్నం తినకుండా కట్టడి చేసారు. నీకు తెలుసు. చిన్నప్పటి నుండీ వాడు అన్నం పిచ్చోడు. వాడు ఏదైనా బంతి భోజనానికొస్తే అన్నం దబరా వాడిముందు పెట్టాల్సిందే. చివరికి అన్నం తిననీయకుండా అతన్ని ఓ గదిలో బంధించినంత పనిజేసారు. తలుపుకున్న చిన్న క్యాట్ హోల్ లాంటి కంత నుండి అన్నం తప్ప గింజలు, గుగ్గిళ్లులాంటివి గదిలోకి పంపేవారట. ఓనాటి నడిరేయి చందర్ ఎప్పుడో గతించిన తల్లికోసం ఆర్తిగా ‘అమ్మా... అన్నం... అన్నం పెట్టమ్మా అన్నం... నీ చేత్తో కొద్దిగంత ముద్దపప్పు, వేడి వేడి నెయ్యి కలిపి రెండు ముద్దలు పెట్టమ్మా... రెండే రెండు ముద్దలు చాలమ్మా... అమ్మా అన్నం... అన్నంపెట్టు తల్లీ... లేకపోతే నే చస్తానే!” అంటూ అరుస్తూనే తన నెక్ టై తోనే గొంతు బిగించుకుని ఊపిరి వొదిలాడంట ...”
ముసలి మామిడిచెట్టు తన కొమ్మలు వాల్చేసి విలపించింది.
“నాయనా... మనుషులట్లాకూడా మరణిస్తున్నారా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకునే రోజుల్నుండి కొందరికి అన్నం పరమవిషం అన్న స్థాయికి పోయిందా... హే భగవాన్... యింతకు వాడేమయ్యాడు? వాడే... ఆ ముస్తాఫా. ఎప్పుడు చూడూ ఆ మూలన సీతాఫలం చెట్ల సందుల్లో జొరబడి కమ్మగా పిల్లనగ్రోవి ఊదుతూ పూటంతా గడిపేవాడు. తోటలో ప్రతి కొమ్మా రెమ్మా పరవశించి ఊగేది ఆ పాటకు. ముస్తాఫా పెద్ద ఉస్తాద్ అయ్యుండాలి కదా బుద్ధయ్యా?”
“ఔనమ్మా అయ్యాడు... ముస్తాఫాకు సంగీతమే అన్నం నీరు కూడా. సంగీతాన్ని నేర్చుకోవటమే గాదు. క్లాసికల్ మ్యూజిక్ పై అద్భుత పరిశోధనలు చేసాడు. గొప్ప స్వరజ్ఞాని. లండన్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వాళ్ళు కూడా వాడితో ఆన్లైన్ క్లాసులు చెప్పించేవారంట. ఐతే బ్రహ్మచారిగా ఉన్న మన ముస్తాఫా ఒక చక్కని చురుకైన అమ్మాయిని చేరదీసి, ఆమెకు సంగీతం నేర్పిస్తూ తన వారసురాలిగా నిలబెడదామని అనుకున్నాడు. ఆమెను ముద్దుగా ‘మై లిటిల్ ఫిడేల్’ అని పిల్చుకునేవాడు. కానీ ఆ పిల్ల ఫిడేలు మాత్రం... వన్ ఫైన్ మార్నింగ్ అన్నట్లు... తన గురువు ఫిడేల్ తోనే అతని తలను మోది అతని సొమ్ములు, లక్షలు పలికే వింటేజ్ గ్రామ్ ఫోన్ రికార్డులు, డిస్క్ లు, ముస్తాఫా స్వరపర్చిన సరికొత్త కంపోజిషన్స్ ను ఎత్తుకెళ్ళి విదేశాలకు పారిపోయి ఓ కొరియన్ బ్యాండ్ లో చేరిపోయిందట!”
“బాప్ రే... ఈ రోజుల్లో జ్ఞానాన్ని పంచటమే ప్రమాదమైపోతుందన్నమాట! ఒకప్పుడు పంచుకో పెంచుకో... యిప్పుడు మాత్రం ‘పంచుకో-తుంచుకో’ అన్నట్లయింది కదా! యింతకూ మీ సోపతుల్లో ఆడపిల్లల ముచ్చట చెప్పనేలేదు?”
“హా... ఏముంది చెప్పటానికి? కొందర్ని వాళ్ళ కర్మం కాల్చేస్తే కొందర్ని వాళ్ల గర్భం కాటేసింది. నలుగుర్ని కన్న నాగరాణి, ఐదుగుర్ని మోసిన అలివేలు ఆశ్రమాల్లో అనాధలైపోయె! అన్ని భాగ్యాలున్న అరుంధతికూడా అభాగ్యురాలిగా ఒంటిగా రోజులెళ్ళదీస్తుంది. కడుపునకాచిన కాయలేమో విదేశాల్లో పండుతాయి... కాచిన తల్లుల కడుపులేమో యిక్కడ ఎండుతాయి!”
“అయ్యో అలాగా... ఆ చిట్టితల్లి తులసి కూడానా? ఎప్పుడూ నోములూ, పూజలూ అంటూ ఎంత భక్తితో నిష్టగా ఉండేది తను.”
“ఏం లాభం? చివరికి వేశ్యావాటికల పాలయ్యింది!”
“అమ్మో... అమ్మో... అంత ఘోరమా బుద్ధయ్యా?”
“ఔను... అస్తమానం గుళ్లూగోపురాల చుట్టూనేనా? కొంచెం మనుషుల మాయాలోకంలో కూడా తిరగాలి కదా! పూజలూ పుణ్యాలేనా? పాపం, స్వార్థం, ద్రోహం, లౌక్యం, మోసం... ఈ నాగరిక ముసుగుల గురించి కూడా కాస్త తెలుసుకోవాలిగా మరి! చివరికా భక్తబేల తులసిని ఓ కోడెఎద్దు మేసింది. అమితాబ్ లా భలే పొడుగ్గా చురుగ్గా ఉన్నాడని ఓ పంజాబీ పిల్లగాడిని నమ్మితే వాడు ఆమె వయసుని వొలిచేసి, మనసుని తొలిచేసి వదిలేసిపోయాడు. పాపం తులసి... ఇంటిముఖం చూడలేక భయపడి ఎక్కడెక్కడో ఎన్నెన్నో మగ చేతుల్లోనో మోసపోతూ ఆఖరికి సోనాగాచి చేరుకుంది. నేను సెక్స్ వర్కర్స్ పై ఒక నవల రాస్తున్నప్పుడు కలకత్తా వెళ్తే తాను వీధిలో తారసపడింది. నన్ను గుర్తుపట్టి పొగిలి పొగిలి యేడ్చింది. విషయం ఊళ్లో ఎవరికీ చెప్పలేదు. నీకు తప్ప!”
మామిడి చెట్టు ఒక్కసారిగా ఒక భారీకాయంతో స్త్రీమూర్తిలా మారిపోయింది. పచ్చని జరీ చీరలో పద్మాసనంలో కూర్చొని కొన్ని ఘడియలు ధ్యానంలోకి వెళ్ళింది. తర్వాత మూలిగినట్లుగా ఓ క్షణం రోదించింది. పైకిలేచి జెన్ బుద్ధిస్ట్ లా నమ్రతతో తల, మెడ వంచి ప్రణామం చేస్తూ మళ్లీ చెట్టుగా మారింది.
“ఏం చేసావిప్పుడు?” సంబ్రమంతో అడిగాడు బుద్ధయ్య.
“ఏం లేదులే... నన్ను తులసిలా ఓ ఆడదానిగా పుట్టించనందుకు మా ప్రకృతి అమ్మకు వందనాలు చెప్పుకున్నా!”.
“నువ్యూ పూస్తున్నావు... కాస్తున్నావు... ఆ చొప్పున నువ్వు కూడా స్త్రీ వేగా?”
“కానీ నాకు రొమ్ములు లేవు... కొమ్మలు తప్ప! యోనిలేదు ఈ కరకు మేని తప్ప! గర్భాలు లేవు గింజలు తప్ప!”
“అందుకేనేమోనమ్మా మీరు బతికిపోయారు... మా మగాళ్ళ బారినుండి!”
ఆ మాటకు కిలుక్కున నవ్వింది మామిడి మాను.
“ఆహా... ఎంత రమణీయంగా నవ్వావు!” మెచ్చుకోలుగా చూసాడు. ఆ మాట వినటంతోటే ‘రమణి’ గుర్తుకొచ్చింది.
“బుద్ధయ్యా... రమణి... రమణి ఎలా వుంది? పాపం! చిరుగుల పరికిణీతో చిన్నబుచ్చుకున్న ముఖంతో రోజూ పొద్దున్నే నా మొదట్లో కూర్చొని రాలిపడిన పండ్లు తీసుకొని ఆవురావురుమని ఆరగించేది. చుట్టుపక్కల వాళ్లు చక్కగా ఇడ్లీ దోసెలు పూరీలు పులిహోరలు చేసి తమ పిల్లలకు కమ్మగా తినిపిస్తుంటే పాపం రమణికి మాత్రం రోజూ ఇంట్లో చద్దన్నం నీళ్ల మజ్జిగనేనట కదా! అందుకే ఆషాఢమాసం చివరిదాకా నా గుబురు చిటారుకొమ్మల్లో కొన్ని పండ్లు తనకోసం దాచిపెట్టి ఉంచేదాన్ని! అల్లంత దూరాన నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ వస్తున్న రమణిని చూడగానే రెండు పండ్లను అవి చితికిపోకుండా సుతారంగా జారవిడిచేదాన్ని. ఆ పండ్లను అందుకొని రమణి నా దగ్గరగా వచ్చి, తలెత్తి నా వైపు చిరునవ్వుతో చూసి నన్ను హత్తుకుని ముద్దాడేది. యింత లావువున్న నా ఈ మానుమేను ఆ కోమలమైన చిట్టి చేతుల్లోకి ప్రియమారా ఒరిగిపోయినట్లే అన్పించేది”.
బుద్ధయ్య కన్నులు పగిలిన నీటికుండలైనాయి.
“నాకు తెలుసు బుద్ధయ్యా. మా కొమ్మల రొమ్ములపైన ఆనందంగా ఆడుకున్న ఆ నాటి చిన్నారుల్లో నువ్వు అత్యంత సున్నిత మనస్కుడివి. ఏడవకు నాయనా, మనిషీ మాను ఒక్కటే అనే మమేకభావన ఉన్నప్పటి రోజులు కదా అవి!” అంటూ కొన్ని లేరెమ్మలు క్రిందకు వంచి అతని కన్నీరు తుడిచి “యింతకూ రమణి ఎక్కడ?” అంటూ గాభరాగా అడిగింది.
“లేమితో మొదలైన బతుకులు కాసుల బలిమికోసం తీవ్రంగా కృషి చేస్తాయి. మంచిదే. కానీ కొందరు దానివల్లే కృషించిపోతారు. రమణి కష్టపడి చదివి సివిల్ ఇంజనీర్ అయింది. కానీ సంతృప్తి చెందలేదు. బీదరికాన్ని చవిచూస్తూ వచ్చిన ఆమెకు ధనదాహం పెరిగింది. ఉద్యోగం వదిలి భర్తతో కలిసి రియల్ ఎస్టేటు వ్యాపారం మొదలుపెట్టింది. మూడు విల్లాలు... ఆరు వెంచర్లు అన్నట్లుగా సాగింది వాళ్ళ వ్యాపారం. తను శ్వాస విడిచిన తర్వాత తన ఆరెకరాల అల్ట్రా - లగ్జరీ ఫామ్ హౌజ్ వెనుక గార్డెన్ లోనే తనను సమాధి చేయమని కొడుకులు, కూతుళ్లకు గట్టిగా చెప్తుండేది. కరోనా కల్లోల కాలంలో కాశీలో చిక్కుకుని లాక్ డౌన్ వల్ల సమయానికి అక్కడినుండి బయటపడలేకపోయింది. అక్కడే ఇన్ ఫెక్ట్ అయి చనిపోయింది. గంగానదిలోకి విసర్జించబడిన పీనుగుల్లో తనూ ఒకటైంది. ఆమె పోయిన తర్వాత భర్త యింకొకామెను ఇంటికి తెచ్చుకున్నాడు. ఆమె మెల్లిగా రమణి పేరున వున్న ఆస్థులన్నీ తనపేర రాయించుకుని రమణి కన్నబిడ్డల్ని ఫామ్ హౌజ్ నుండి గెంటేయించింది. వాళ్ళు సవతితల్లి మీద వ్యాజ్యాలు వేసి పుష్కరకాలం నుండీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు”.
“చెట్టుతల్లి నిట్టూరుస్తూ అన్నది “యిప్పుడర్ధమైంది నాకు. మా పిల్ల వేర్లు తల్లివేరునెప్పటికీ వదలకుండా ఎందుకని ఈ మట్టిలోనే అంటిపెట్టుకుని ఉంటాయో!”
“అర్ధం కాలేదు”.
“మీరంతా చదువుకుని సీమాంతరాలు దాటి ఎంతో ఎదిగిన తర్వాత ఎప్పుడన్నా ప్రేమగా ఈ తోటను గుర్తుచేసుకున్నారా?”
“లేదు!”
“మీ ఆటపాటలకు తావై... అమ్మలా నీడను తోడును ప్రేమను పండ్లను పంచిన మీ చిన్ననాటి తోట గతి ఏమయ్యిందో ఏమోనని ఒక్కరన్నా వచ్చి తిరిగిచూసారా?”
“లేదు!”
“అది మరి .... కొన్ని లెక్కలుంటాయ్ బుద్ధయ్యా! రాకెట్లలా రోదసి అంచులకు ఎదిగారు మీ దోస్తులు. పండుబండి రాలాల్సినవాళ్ళు మధ్యలోనే తారాజువ్వల్లా రాలిపోయారు. అందుకే ఎవడైనా తన ‘తోట’ను మరువగూడదు. ఒక్కడికీ ‘తోట’ గుర్తున్నట్లు లేదు! ‘తోట’ పట్ల కృతజ్ఞత లేనే లేదు !”
“లేదు... లేదు... నాకుంది. అందుకే యిన్నేళ్ళకైనా మళ్ళీ వచ్చా. ఐనా నువ్వు తప్ప యిక్కడ తోటేముంది నా బొంద! ఇది చీకటి తోటయింది. దీనికన్నా నా యిల్లేనయం. ఎప్పుడూ జీవజ్యోతులు మండుతూనే ఉంటాయి. సరే ఉంటా నేస్తమా... నాకు నైట్ డ్యూటీ ఉంది. బై మరి!” అంటూ వెనుదిరుగుతున్న బుద్ధయ్యతో చెట్టు అన్నది.
“సరే బుద్ధయ్యా... నీ మిగిలిన దోస్తులందరికీ చెప్పు... ‘తోట’ను మరవొద్దని. తరచూ రమ్మను వాళ్లను... ఊరి తోటను ఎన్నటికీ గుండెనుండి తుడిపేయకండి. మా తోటలా కాకుండా మీరంతా పచ్చగా బతకండి... ఓ... ఓ... ఓ... బుద్ధయ్యా అటెటు? ఊరు యిటువైపు కదా ! అటు కాష్టాల దిబ్బ... పోవద్దు... ఇటు నడువ్!” ఆందోళనగా హెచ్చరించింది మామిడి తల్లి.
“లేదు... నా దారి అటే... నా యిల్లే అది... నేను పదేళ్లనుండీ అక్కడే ఉంటున్నా! సెలవిక నా చెట్టు తల్లి!”
మాను మ్రాన్పడి మానై నిలబడి నోర్లు ఎల్లబెట్టింది.!
* * * * *
ఆ రోజు తెల్లవారి పొద్దున్నే ఊరి కట్టెలడితి పనోళ్లు గొడ్డళ్ళు, కరెంటు రంపం భుజాలపైన మోసుకొని వచ్చారు. కాష్టానికి కట్టెలకోసం.
“రేణుకమ్మ మా దొడ్డమనిషిరా... ఆ చల్లనితల్లి యింకా పదేళ్లుంటదని అనుకున్నాం” అంటూ మేస్త్రి తుండుగుడ్డతో కన్నీళ్ళు తుడుచుకున్నాడు.
“ ఔన్రా... ఆ తల్లి పెనిమిటితో కలిసి ఎంత ప్రేమగా పెంచుకుందోరా ఈ తోటని. ఎన్ని నోళ్లను తీపిచేసాయి ఈ చెట్ల కాయలు! రేణుకమ్మకు తొంభైయేళ్లు దాటాయి. కొడుకులు కూతుళ్లెవ్వరూ పక్కన లేకున్నా ఒంటిగానే ముప్పై యేళ్లూ బతుకెల్లదీసింది మా తల్లి. పాపం... యిగనవసరం అనుకునే మెడగోసుకుందిరా! పోయినేడు గూడా ఈ మిగిలిపోయిన ఒక్క చెట్టు కాయలు నాతో కోపిచ్చి అందరికీ తలా నాలుగు పంపింది. గొప్ప తల్లి... గొప్ప మనసు” బాధపడ్డాడు ముఠాలో ఓ పెద్దాయన.
“తన సావు తనకు తెలుసురా... ఈ చివరిచెట్టు కట్టెల్లోనే తానూ ఒక కట్టెనై కాలిపోవాలనుకుందిరా ఆయమ్మ” మేస్త్రి మళ్లీ కన్నీళ్లు తుడుచుకుంటూ తన చేతిలో గొడ్డలివైపు ఓసారి చూసుకొని దానిని బలంగా పైకి ఎత్తాడు.
అది విని తన తల్లితో తాను ఐక్యంకాబోతున్నానని పొంగిపోతూ గొడ్డళ్లకు వొళ్ళప్పగించింది ఆ పసిడిచెడిన చివరిమావి.
(మ్యాజిక్ రియలిజం ధోరణిలో రాసిన కథ)
No comments:
Post a Comment