Monday, June 15, 2026

 #నా_ఆపరేషనూ_నా_పరేషాను

   గత మూడేళ్లు గా మసకేసిన కళ్ళకు మరమ్మత్తు చేయించాలనుకున్నా... వినాయకుడి పెళ్ళికి విఘ్నాలు వేయి అన్నట్లు సాగింది.  
కొన్ని సార్లు ఫంక్షన్ లు, కొన్ని  తప్పించుకోలేని ప్రయాణాలు, 
మరి కొన్ని సార్లు యాత్రలు...ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. 

ముఖ్యంగా కొన్ని సామెతల్ని నిజం చేసేట్లు కొందరు ఉంటారు. నేనిట్లా ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటూ అని తెలియగానే... ధైర్యం చెప్పేవారు కొందరు,  భయంలోకి దింపేవారు కొందరు. అరగంటలో అయిపోయే ఆపరేషను. పరేషాన్ ఏమీ లేదు అనేవారు ఎక్కువ మంది. 
పనిమాలా వచ్చి పలానా వారికి చేసినప్పుడు ఇలా అయ్యింది, అలా అయ్యింది..అంటూ శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే పెళ్ళి కూతురు..__._..ఎక్కడా అన్నాడన్నట్లు ఫెయిల్యూర్ విశేషాలు పనిగట్టుకుని చెప్పేవారు కొందరు. 
[  ] వీరి సంఖ్య తక్కువే అయినా ప్రభావం ఎక్కువ పడేది. అందుకని  కొంచెం జంకాను. అయినా ఇదేమంత పెద్ద ఆపరేషన్ కాదేమో కానీ, సర్వేంద్రియాణo  నయనం ప్రధానం అంటారు గా..అందుకూ.

ఎట్టకేలకు ధైర్యం కూడగట్టుకుని...ఆపరేషన్ కోసం డాక్టర్ను సంప్రదించాం. 

మీరెంత పరేషాన్ అయినా ఆపరేషన్ తప్పదు అనేసరికి తప్పించుకోలేక తలాడించి వచ్చేసాం మీరెప్పుడు చెప్తే అప్పుడు వచ్చేస్తామంటూ.

నిజానికి నాకు భయం  ఉండదు...కానీ, కొద్ది మంది భయపెట్టడం వల్ల మాత్రమే పిచ్చాలోచనలు...వచ్చాయి.

అనుకున్న రోజు రానే వచ్చింది. రాత్రికి  అనుకున్న ఆపరేషను మధ్యాహ్నానికి నిర్ణయించారు. 
అమ్మ ఫోన్ చేసి ఏం భయం లేదు యామినీ. గండుచీమ కుట్టినట్లు ఉంటుంది అంతే అన్నారు. చిన్నప్పుడు గుంటూరు లో నేనూ మా చిట్టెమ్మ శివాలయం లో ఒప్పులకుప్ప తిరుగుతుంటే  గండుచీమ కుడికాలి చిటికెనవేలు ను కరిచేస్తే రక్తసిక్తం అయిన పాదం గుర్తొచ్చి గుండె గుభేలుమంది. అయినా తమాయించుకున్నా.

తీరా రానే వచ్చింది ఆరోజు. 
నా పాక సామ్రాజ్యానికి తాత్కాలిక సెలవులు ప్రకటించా. కొలువుతీరిన వందిమాగదుల్ని పేరుపేరునా పరామర్శించా.
నా స్థానం లో తాత్కాలికంగా రాజ్యాన్ని నడిపిస్తామన్న నా సోదరికి,మా వారి సహోదరి కి పేరుపేరునా పరిచయం చేశా.

ఎవరెవరి స్థానాలు ఎక్కడ ఉంటాయో చెప్పా. మళ్ళీ ఎన్నాళ్లకో..కదా వంట చేసేదని గలిజేరు పప్పు చేసి పెట్టా పోపు మీరు పెట్టుకోoడనీ. 
 ఇడ్లీలు చేసుకుని అల్పాహారం సేవించి, పొద్దున్నే చిక్కగా వేసి పెట్టుకున్న పేర్కొలెటర్ నుంచి డికాక్షన్ తో కాఫీ పెట్టుకుని త్రాగేసి, అందరికీ  టాటా చెప్పేసి కారెక్కేసాం ఇద్దరం.
కారులో కూర్చున్నప్పటి నుంచి కళ్ళ ముందు చిన్నప్పటినుంచి చూసిన కొందరు మెదులుతూనే ఉన్నారు. ఒక కంటికి పచ్చగుడ్డ కట్టుకున్న జహంగీర్ తాత, మనవడి భుజం మీద కర్ర ఉంచి అడుగులో అడుగు వేస్తూ నడుస్తూ పోతున్న సోమయ్య తాత, నులక మంచం మీద కూర్చుని గుమ్మానికి కర్ర అడ్డం పెట్టేసి చిన్న చప్పుడు అయినా ఎవరూ..అంటూ అరుస్తూ కూర్చునే కర్రసాము చేసే రంగవ్వ..ఒకరా ఇద్దరా?అందరిని స్మరిస్తూ...ఆసుపత్రికి చేరేసరికి కాస్త నెమ్మదించింది మనసు. అదో రకం ధైర్యం మొండిగా. 
మూడు గంటలకు థియేటర్ లోకి తీసుకుని వెళ్ళారు. 
తలకు టోపీ పెట్టారు,కాళ్లకు మోకాళ్ళ వరకూ సాక్సులు తొడిగారు, కట్టుకున్న చీరపైనే పొడవాటి గౌను తొడిగారు. 
అనస్థీషియా ఇచ్చే అతను మా మేనల్లుడి క్లాస్మేట్. లోపల్నుంచే చూసి నవ్వుతూ చెయ్యుపాడు. పడుకోబెట్టి కంటి దగ్గర చిన్న ఇంజెక్షన్ ఆంటీ. ఒక్క సెకను లో , పెద్ద నొప్పి ఉండదు అన్నాడు. అంతదాకా వచ్చి నొప్పి అని వెనక్కి వెళ్తామా ఏం?  సరే కానివ్వు అని కన్ను ఇచ్చేసి కామ్ గా పడుకున్నా. అమ్మ అన్నట్లే గండుచీమ కుట్టింది.  ఆ భాగం  అంతా తిమ్మిరిగా అవుతూ నిముషం లోపు మొద్దుబారిపోయింది. కానీ, లోపల కంటి గుడ్డు పెద్దది అవుతుందనిపిస్తోంది. ఆ కంటి మీద కాటన్ పెట్టీ నొక్కి ఉంచాడు. ఆ తర్వాత మెల్లగా తీసుకెళ్లి ఆపరేషన్ టేబుల్ ఎక్కించాడు. కంటి భాగం తెరిచి ఉంచి మిగతా ముఖం మొత్తం కప్పేసారు. 
నేనూ నా పరేషాన్ వదిలి ఆపరేషన్ మూడ్ లోకి వెళ్ళిపోయా.

ముఖం మొత్తానికి ఒక క్లాత్ కప్పేసారు. ఆపరేషన్ చేయాల్సిన కంటి భాగానికి మాత్రం ఓపెన్ ఉండేలా.
ఇక డాక్టర్ గారు ఆయన పని ఆయన చేస్తున్నారు. నేనేమో ఏం జరుగుతుంది అనేది గమనించడం మొదలుపెట్టాను.
కాసేపటికి కంట్లో మొత్తం చీకటిగా అయింది. అంటే అంతంత మాత్రంగా ఉన్న వెలుగు మాయం అయింది. వెంటనే ఆ శూన్యం లో వెలుగులు చిమ్మడం అయిపోయిన కాకర పువ్వోత్తి నీ గిరగిరా తిప్పుతుంటే వచ్చే మెరుపులు తిరగడం మొదలు పెట్టాయి. కొన్ని సెకన్లలో ఆ శూన్యం లో స్పేస్ షిప్ తిరుగుతున్నట్లు, మరి కాసేపటికి రేడియం కలర్ వేసిన చిన్ని మూడురెక్కల ఫ్యాన్ మెరుస్తూ తిరుగుతున్నట్లు
మళ్ళీ స్పేస్ షిప్ గా, మళ్ళీ ఫ్యాన్ లా రెండు మూడు సార్లు అనిపించింది. 
ఈమెకి బ్రౌన్ క్యాటరాక్ట్  అంటూ చెప్తున్నారు. అసలు ఎప్పుడో చేయించుకోవాల్సింది. బాగా లేట్ చేసారు అంటుంటే గుండెల్లో గుబులు. సిరంజి తో స్ప్రే చేస్తున్న సౌండ్ ఒక పది సార్లు వినిపించి ఉండొచ్చు దాదాపు గా.
అంతే. కాటన్ తో బాగా కంటి చుట్టూ తుడిచి బ్యాండేజ్ వేసేసి కళ్ళు ఓపెన్ చేయకుండా టేప్ వేశారు. 
ఆయన ముందే చెప్పారు. ఇది నా పద్ధతి.ఖచ్చితంగా కొన్ని గంటల పాటు బ్యాండేజ్ వేస్తే నే పేషెంట్ కు సర్జరీ అయిందన్న కాన్షస్ ఉంటుంది, ఉండాలి...అని.

ఇక లేమ్మా అనేసరికి మెల్లగా లేచి అటెండర్ సాయం తో రూమ్ కి వచ్చి పడుకున్నా. 
రాత్రి 8 గంటలకు...ఆరోజు సర్జరీ చేయించుకున్న అందరిని కింద హాల్ లోకి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. ఒక్కొక్కరికి బ్యాండేజ్ తీస్తున్నారు. 

నర్స్ వచ్చి ఒక్కొక్కరికి కంటికి వేసిన బ్యాండేజ్ తీసి...నల్ల కళ్ళద్దాలు తొడిగేస్తోంది. ఎందుకో గానీ నవ్వొచ్చింది. 
పాత సినిమాల్లో కళ్ళు రాగానే మీకిష్టం అయిన వారిని చూడండి అని డాక్టర్స్ గానీ, చూస్తాను అంటూ పేషెంటు గానీ చెప్పడం గుర్తొచ్చి ఓపెన్ లో ఉన్న ఒక కన్నుతో బాహుబలి గారిని వెతికే ప్రయత్నం చేస్తుండగానే..నర్స్ నా దగ్గరికి వచ్చేసి నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే బ్యాండేజ్ తీసేసింది. మిట్ట మధ్యాహ్నం పూట ఎండాకాలపు ఎండలో అద్దం పెడితే వచ్చేంత మెరుపు మెరిసినట్లు అనిపించింది. 
చెప్పొద్దూ..ఆ నర్సు పిల్ల ముద్దుగా, బొద్దుగా, భలే ఉంది. 
నాకూ నల్ల కళ్ళద్దాలు వేసేసి...వెళ్ళింది. 

అందర్నీ హాల్లో కూర్చోబెట్టాక డాక్టర్ గారు వచ్చారు.టేబుల్ ముందు నిలబడి అందరూ సిద్ధంగా ఉన్నారా క్లాసు వినడానికి...అన్నారు. నన్ను ఆ టేబుల్ ప్రక్కగా ఒక చైర్ వేసి స్పెషల్ గాకూర్చోబెట్టారు. 
ఇక తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ వివరంగా చెప్పి ఐ డ్రాప్స్ ఎలా వేసుకోవాలి అని డెమో ఇచ్చారు. అందుకోసం నా కంట్లో ఆయనే డ్రాప్స్ వేస్తూ అక్కడి పేషంట్స్ కి, వారికి తోడు వచ్చిన వారికి వివరిస్తుంటే.. ఇంటెలిజెంట్ స్టూడెంట్ ను క్లాస్ లో నిలబెట్టి మిగతా పిల్లలకి ఇలా చదవాలి అని చెప్పే సీన్ గుర్తొచ్చింది.😜

అన్ని జాగ్రత్తలు అయ్యాక ఇంటికి బయలుదేరాము. 
ఇంటికి రాగానే , మా ఇల్లు చూడగానే ఏమిటీ? వీళ్ళు లైట్స్ కూడా వేసుకోకుండా కూర్చున్నారు అనుకున్నా. కాస్త కళ్ళద్దాలు తీసి చూసి కళ్ళు జిగేల్ మనగానే, సతీ లీలావతి సినిమా లో కమల్ డైలాగ్ గుర్తించింది. పండగ పూట చీకట్లో ఉన్నారెంట్రా..? అంటే కోవై సరళ అంటుంది.  నువ్వు ముందు ఆ కళ్ళద్దాలు తియ్యి అని. బాగా  నవ్వొచ్చింది. నేరుగా దేవుడి గదికి వెళ్ళి కన్నారా(ఒక కన్ను కదా ఇప్పుడు క్లియర్) అందరిని చూసి...వచ్చేశా. 
అసలు పరేషాన్  ఇప్పుడు  కదా మొదలు అయింది. 
ఆ పరేషాన్ ఏమిటో రెండో భాగం లో రాస్తానేం.

(ఈ పోస్ట్ లో విరామ చిహ్నాలు వెతక్కండి. నేనే పెట్టలేదు.
ఇది రాయడానికి నేను వాయిస్ టైపింగ్ సాయం తీసుకున్నా.)

గమనిక:ఆపరేషన్ సందర్భం లో ఫీలింగ్స్ మొత్తం నాకు  కలిగినవి. ఎవరి ఫీలింగ్స్ కాపీ కొట్టలేదు.😜🥰

మిగతా పరేషాన్ రెండో భాగం లో.
(సశేషం)

No comments:

Post a Comment