Monday, June 15, 2026

 *నిజం విలువ*

ఒసేయ్ రమ్య… పెళ్లివారు వంట వచ్చునా ? అని అడిగితే వెర్రిదానిలాగా రాదు అని చెప్పకు. వచ్చునని తల ఊపు. అలాగే పాటలు కూడా. నిజం చెప్పి ఇంతకుముందు వచ్చిన సంబంధాలన్నీ అలాగే పోగొట్టుకున్నాం. మేము వెనకాల నుంచి ఎంత సైగ చేసినా నీ మట్టిబుర్రకు అర్థం కాలేదు, అని డెబ్బై ఏళ్ల బామ్మ చెప్పిన మాటలకు రమ్యకు నిజంగా నవ్వొచ్చింది.
చిన్నప్పుడు అబద్ధాలు చెబితే కొట్టేవారు. ఇప్పుడు పెద్దయ్యాక తెలియనివి కూడా తెలిసినట్టు చెప్పమంటున్నారు.
ఏమిటో ఈ పెద్దవాళ్లు! అని మనసులో అనుకుంది రమ్య.
నిజానికి రమ్యకు వంట రాదు. చదువు పూర్తవగానే క్యాంపస్‌లో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగ బాధ్యతలు, పనుల ఒత్తిడిలో కాలం గడిచిపోయింది.
అమ్మా, నేర్చుకోవడానికి నాకు అవకాశం ఎక్కడ వచ్చింది ? అని అడిగితే, రమ్య తల్లి సీతమ్మ వెంటనే —
అవకాశం లేదా ? స్కూల్లో చదువుకుంటున్నపుడు ఒక *టీ* పెట్టమంటే చచ్చినట్టు కూర్చునేదానివి. వంటింట్లోకి తొంగి చూసేదానివి కాదు. ఇప్పుడు అవకాశం లేదని సాకులు చెబుతున్నావు, అంటూ మందలించేది.
*ఒసేయ్, ఆ చెవులకు జూకాలు పెట్టుకో. బీరువాలో ఉన్న పట్టు చీర కట్టుకో. మెడలో ఆ రాళ్ల నెక్లెస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటావు. అలా మగరాయుడిలా దబదబా నడవకుండా కాస్త నెమ్మదిగా, పద్ధతిగా నడవవే బాబు*, అంటూ సీతమ్మ ఆందోళనగా చెప్పింది.
ఆందోళన ఎందుకు ఉండదు ?
ఆడపిల్ల పుట్టిందంటేనే తల్లిదండ్రుల మనసులో ఎన్నో భయాలు. ఎలాంటి భర్త వస్తాడో, అత్తవారి మనస్తత్వం ఎలా ఉంటుందో అనే కంగారు ఉంటుంది. ఎన్ని వివరాలు సేకరించినా, ఎన్ని మంచి మాటలు విన్నా, పెళ్లి చూపుల సమయంలో ప్రతి ఇంట్లో ఒక తెలియని భయం ఉంటుంది.
కానీ రమ్యకు పెళ్లి చూపులు అంటే భయం. కారణం సంబంధం కాదు… అబద్ధం చెప్పాల్సి రావడమే.
ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి.
వంట వచ్చా ? పాటలు పాడగలవా ? ఇంటి పనులు చేయగలవా ? అని అడుగుతారు. ఇవన్నీ నేర్చుకోవచ్చు. కాలంతో పాటు అలవాటు చేసుకోవచ్చు.
కానీ ఎవరూ ఇలా అడగరు—
నీ మనస్తత్వం ఎలా ఉంటుంది ? కోపం ఎక్కువా ? బాధ కలిగితే ఎలా స్పందిస్తావు ? నీ బలహీనతలు ఏమిటి ? నీ ఆశలు, అలవాట్లు ఏమిటి ?
ముఖ్యంగా అమ్మాయి మనస్తత్వం గురించి పెళ్లికొడుకు ఒక్కరికే కాదు, అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియాలి. అలాగే అబ్బాయి విషయంలో కూడా అమ్మాయి కుటుంబానికి తెలుసుకునే హక్కు ఉంది.
ఆభరణాలతో మెరుగులు దిద్దిన అమ్మాయి అందం గురించి మాట్లాడుకుంటారు. అబ్బాయి ఆరడుగుల ఎత్తు, రంగు, జీతం, ఉద్యోగం గురించి గొప్పగా చెప్పుకుంటారు.
కానీ అసలు అందం గురించి చాలా తక్కువగా మాట్లాడుతారు.
ఒక మనిషి యొక్క నిజాయితీ, సహనం, ప్రేమ, గౌరవం, బాధ్యత — ఇవే జీవితాన్ని నిలబెట్టే అందాలు.
జీవితాంతం కలిసి నడవబోయే ఇద్దరు మనుషులు ఒకరి మనసును మరొకరు తెలుసుకోవాల్సింది ఇవే కాదా ?
వంట రాకపోతే నేర్చుకోవచ్చు. పాట రాకపోతే పాడకపోవచ్చు. కానీ అహంకారం, అసహనం, స్వార్థం, అనుమానం వంటి మనస్తత్వ లోపాలు కాపురాన్ని నరకంగా మార్చగలవు.
పెళ్లి అంటే రెండు చేతులు కలవడం కాదు… రెండు మనసులు కలవడం, అని అనుకుంది రమ్య.
ఇదివరకు వచ్చిన సంబంధాలు అన్నీ మంచివే. కానీ మా అబ్బాయికి వండి పెట్టలేకపోతే ఎన్ని డిగ్రీలు చదివినా ప్రయోజనం ఏమిటి ? అని చెప్పి వెళ్లిపోయారు.
ఇది మూడో సంబంధం.
వారం రోజుల ముందే ఇంట్లో హడావుడి మొదలైంది. ఇల్లంతా శుభ్రం చేయడం, ముగ్గులు వేయించడం, పెళ్లివారికి పెట్టే టిఫిన్లు సిద్ధం చేయడం, మర్యాదల గురించి చర్చించడం అంటూ అందరూ పనుల్లో పడ్డారు.
ఆ రోజు ఉదయం నుంచే అందరి ముఖాల్లో ఆత్రుత.
అయ్యో! కారు శబ్దం వినిపిస్తోంది. బహుశా పెళ్లివారే వచ్చుంటారు, అని బామ్మ బయటికి తొంగిచూసింది.
ఆ మాటతో అందరి గుండెలు ఒకసారి గుబేలుమన్నాయి.
కొద్దిసేపటికి ఇద్దరు వయసు మళ్లిన దంపతులు, ఒక యువకుడు, ఒక మధ్య వయస్కురాలు లోపలికి వచ్చి కూర్చున్నారు.
కుశల ప్రశ్నలు, మర్యాదలు పూర్తయ్యాయి.
అమ్మాయిని తీసుకురండి, అని పెళ్లికొడుకు బామ్మ అనగానే సీతమ్మ గదిలోకి వెళ్లింది.
బామ్మ చెప్పిన మాటలు గుర్తున్నాయి కదా… జాగ్రత్తగా సమాధానం చెప్పు, అని మళ్లీ హెచ్చరించింది.
రమ్య నవ్వుకుంది.
హాల్లోకి వచ్చి అందరికీ నమస్కారం చేసి కూర్చుంది.
ఏం చదువుకున్నావు ? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ? అనే సాధారణ ప్రశ్నలు వచ్చాయి.
హమ్మయ్య! ఈ ప్రశ్నలకు అబద్ధం చెప్పక్కర్లేదు, అని మనసులో అనుకుంది.
అంతలో అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న వచ్చింది.
అమ్మాయి… నీకు వంట చేయడం వచ్చా? అని పెళ్లికొడుకు బామ్మ అడిగింది.
హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
సీతమ్మ, బామ్మ ఇద్దరూ కళ్లతో సైగలు చేయడం మొదలు పెట్టారు.
రమ్యకు వారి ఆత్రుత అర్థమైంది. వాళ్లు మోసం చేయాలని అనుకోవడం కాదు. కూతురి పెళ్లి జరగాలనే తపన.
కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు.
నిజం చెప్పాలంటే నాకు వంట పూర్తిగా రాదు అండీ, అని ధైర్యంగా చెప్పింది.
సీతమ్మ ముఖం వెలవెలబోయింది. బామ్మ నుదుటిపై చేయి వేసుకుంది.
కానీ రమ్య ఆగలేదు.
రాదు అంటే ఎప్పటికీ రాదని కాదు. నేర్చుకోవచ్చు. కానీ జీవితాన్ని ప్రారంభించే మొదటి మాట అబద్ధం కావాలని నేను కోరుకోను, అంది.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
అప్పుడు పెళ్లికొడుకు చిరునవ్వుతో అన్నాడు—
నాకు కూడా ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది.
అందరూ అతని వైపు చూశారు.
రమ్య గారు, మీకు కోపం ఎక్కువా ? బాధపడితే ఎలా బయటపడతారు ? మీకు నచ్చని విషయం ఉంటే మనసులో పెట్టుకుంటారా లేక మాట్లాడతారా ?
ఆ ప్రశ్న విన్న రమ్య ఆశ్చర్యపోయింది.
ఆమె మనసులో ఎన్నాళ్లుగానో ఉన్న ప్రశ్ననే అతను బయట పెట్టాడు.
ఇదే అసలు తెలుసుకోవాల్సిన విషయం, అని పెళ్లికొడుకు అన్నాడు.
వంట నేర్చుకోవచ్చు. నేను కూడా అవసరమైతే వంట చేస్తాను. కానీ ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి.
ఆ మాటలకు పెళ్లికొడుకు తల్లి నవ్వుతూ —
మా అబ్బాయికి వంట కూడా బాగానే వస్తుంది. కానీ కొన్నిసార్లు కోపం త్వరగా వస్తుంది. అదే తన బలహీనత, అంది.
ఆ యువకుడు నవ్వుతూ—
అవును, అది నిజమే. కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, అన్నాడు.
రమ్య కూడా చిరునవ్వుతో—
నాకు ఒక బలహీనత ఉంది. నిజం చెప్పేటప్పుడు కొన్నిసార్లు మాటలు కాస్త కఠినంగా ఉంటాయి. అంది.

ఆ రోజు అక్కడ మొదటిసారిగా నిజమైన పెళ్లి చూపులు జరిగాయి. వంట, పాటలు, ఆస్తి, ఉద్యోగం గురించి మాత్రమే కాదు—మనసులు, బలహీనతలు, అలవాట్లు, ఆశలు గురించి మాట్లాడుకున్నారు.
ఇదంతా గమనిస్తున్న రమ్య తల్లిదండ్రులు, బామ్మ ఈ పిల్లకి మళ్ళీ ఇంకో సంబంధం వెతుక్కోలేమో! ఓరి దేవుడా ఎన్నిసార్లు చెప్పినా ఈ పిల్లకు అర్థం కావటం లేదు. ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఎంత కష్టమో ఈ అమ్మాయికి అర్థం కావడం లేదు అనుకున్నారు మనసులో. 

మగ పెళ్లివారు కుర్చీలోంచి లేచి బయలుదేరుతూ వెళ్లేటప్పుడు  పెళ్లికొడుకు బామ్మ రమ్య చేతిని పట్టుకుని చెప్పింది—
అమ్మాయ్, వంట నేర్చుకోవచ్చు. కానీ నిజాయితీ నేర్చుకోవడం అంత సులభం కాదు. ఈ రోజు నువ్వు మాకు నచ్చింది నీ అందం వల్ల కాదు, నీ మాటల్లో కనిపించిన నిజం వల్ల.
కొద్దిసేపు ఆగి ఆమె మరొక మాట చెప్పింది—
పెళ్లికూతురు కదా అని సిగ్గుపడుతూ మూగబొమ్మలా కూర్చోమంటారు. కానీ అది తప్పు. జీవితాంతం కలిసి నడవబోయే వ్యక్తి ముందు మనసులో ఉన్న మాటను నిర్భయంగా చెప్పగలగాలి.
ఆ మాటలు విన్న సీతమ్మ కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి.
బామ్మ రమ్య చెవిలో మెల్లగా—
ఒసేయ్ రమ్య… ఈసారి నీ మట్టి బుర్రే గెలిచింది, అంది.
రమ్య చిరునవ్వు నవ్వింది.

ఆ రోజు కుదిరింది ఒక పెళ్లి సంబంధం మాత్రమే కాదు…
అబద్ధాల మీద కాదు. నిజాయితీ, పరస్పర గౌరవం, పరస్పర అవగాహన అనే బలమైన పునాదుల మీద నిలబడబోయే రెండు మనసుల జీవిత బంధం.

రచన : మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

No comments:

Post a Comment