*ఆకుపచ్చని సూర్యోదయం*
*- డా. ఎమ్. సుగుణరావు*
విశాఖపట్నంలో బీచ్ దగ్గరున్న ఒక కార్పొరేట్ స్కూల్లో ఇంగ్లీషు టీచర్ గా చేరింది సునంద. స్కూల్ ప్రిన్సిపాల్ సునందను, తన రూమ్ లోకి పిలిచి ఒక విషయం చెప్పింది.
“మన స్కూల్లో ఉన్న టీచర్లలో అందరూ ముప్ఫైఏళ్ళ వయసు పైబడినవారే, మీరు తప్ప. అందువల్ల మీకు ఒక ప్రత్యేకమైన ఎస్సైన్మెంట్ ఇస్తున్నాను” అంది.
“ఏంటి మేడమ్?” అంది సునంద ఉత్సాహంగా.
"ప్రతినెలా ఒక వాల్ మేగ్జైన్ తీసుకొద్దామనుకుంటున్నాం. దీనికి మీరు ఎడిటర్గా ఉండాలి. పిల్లలు మీకు తాము రాసిన చిన్న చిన్న కథలు, కవితలు వంటివి అందజేస్తారు. వాటిని పరిశీలించి, బాగున్న వాటిని వారిచేతనే ఆ వాల్ పేపర్మీద మీరు రాయించాలి.”
ప్రిన్సిపాల్ ఆమెకు ఆ విషయం చెప్పగానే, సునంద చాలా సంతోషపడింది. ఎందుకంటే సునందకు లిటరేచర్మీద చాలా అభిరుచి ఉంది.
“అలాగే మేడం” అంది.
ఆమె ఎమ్.ఏ. తర్వాత బి.ఇడి. చేసింది. భర్త ఉద్యోగరీత్యా చాలా ఊర్లలో అతను పనిచేయడంతోపాటు, కూతురుకు ఐదేళ్ళ వయసు వచ్చేవరకు ఆమెకు ఇష్టమైన టీచర్ ఉద్యోగం చేయడానికి వీలు కుదరలేదు. ఇప్పుడు భర్తకు వైజాగ్ ట్రాన్స్ఫర్ కావడంతో, అతను కొన్నేళ్ళపాటు వైజాగ్లో ఉండేలా పరిస్థితులు అనుకూలించడంతో, ఆమె ఆ స్కూల్లో చేరింది. కూతుర్ని అక్కడే చేర్పించింది.
తర్వాత రోజే ప్రిన్సిపాల్ స్కూల్లోని పిల్లలకు నోటీసు పంపించింది. స్కూల్ మంత్లీ వాల్ పేపర్ కోసం చిన్న చిన్న ఆర్టికల్స్ పిల్లలంతా పంపాలని, వారి రచనలు ప్రిన్సిపాల్ రూమ్ పక్కనున్న బాక్స్లో వేయాలని, పిల్లలందరికీ వర్తమానం పంపించారు.
నోటీసు పంపిన రెండు రోజుల తర్వాత ఒక పేజీ మీద రాసిన చిన్న ఆర్టికల్ మాత్రమే వచ్చింది. ఇంగ్లీషులో రాసిన ఆర్టికల్ అది. సునంద ఇంటికెళ్ళిన వెంటనే చదవడం మొదలెట్టింది.
"భూమిపైన మనం ఎన్నో లక్షల చెట్లను చూస్తుంటాం. వందల సంవత్సరాల నుండి ఉన్న చెట్లు కూడా ఉంటాయి. అవి ఎలా ఏర్పాడ్డావో తెలుసా మీకు? అవన్నీ కాకతాళీయంగా నాటబడినవే! అవును, అది ఆశ్చర్యం కలిగించే విషయమే. ఉడుతలు విత్తనాలను భూమిలో దాచిపెడతాయి. ఆ తర్వాత ఎక్కడ దాచాయో మర్చిపోతాయి. అలా మీరూ ఒక మంచిపని చేయండి. దానిగురించి మర్చిపోండి. మీరు చేసిన ఆ మంచిపని ఒకరోజు మహావృక్షమై మీ కళ్ళముందు ప్రత్యక్షమౌతుంది”
ఆ చిన్న రచనను చదవగానే సునందకు ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి.
'ఈ స్టూడెంట్ ఎవరో పర్యావరణ పరిరక్షణ గురించి చాలా కొత్తగా చెప్పారు' అనుకుంది. ఆ ఆర్టికల్ పేరు ‘ఉడుత సాయం'. అది రాసింది ఉదయ. అంటే ఒక అమ్మాయి. చదివేది ఆరో తరగతి. ఆ తర్వాత రెండు రోజులకు డబ్బాలో మరో ఆర్టికల్ కనిపించింది. అది కూడా ఉదయ రాసిందే. ఆ చిన్న కథ పేరు 'కానుక'.
"వరదలు వచ్చి ఒక ఊళ్ళో అంతా సర్వం కోల్పోయారు. వేరే ప్రాంతానికి వలసబాట పట్టారు. ఒక కావడి మీద ఒకవైపు సామాను, ఇంకోవైపు ఒక ఐదేళ్ళ మనవడిని మోసుకుంటూ వెళుతున్నాడు ఒక వృద్ధుడు. మార్గమధ్యంలో ఆహారం అమ్మే దుకాణం దగ్గర ఆగాడు. మనవడి కోసం ఆహారం కొని, తినిపించాడు. 'మరి నీకో?' అన్నాడు దుకాణదారుడు. 'నాకెందుకులే బాబు? నాకోసం కొనుక్కునే ఆహారానికి అయ్యే డబ్బుతో విత్తనాలు కొనడం మంచిది.' అన్నాడు. 'విత్తనాలు దేనికి?' అన్నాడు ఆ దుకాణదారుడు. 'తిండి లేక నేను చనిపోయినా, భవిష్యత్తులో ఈ విత్తనాలు నాటడానికి నా మనవడు ఉండాలి కదా! పంటలు పండించాలి కదా!' అనుకుంటూ ఆ ముసలాయన ముందుకు సాగిపోయాడు.”
సునందకు ఆ చిన్న కథ ఎంతో హృద్యంగా అనిపించింది. రేపటి తరాల క్షేమాన్ని, కోరుకునే ఆ కథలోని ముసలాయన మీద గౌరవం కలిగింది.
వరుసగా ఇలా పర్యావరణ పరిరక్షణ మీద కథలు రాస్తున్న ఆ అమ్మాయి ఉదయని చూడాలనిపించింది సునందకు. అయితే ఆ అమ్మాయి చదివేది ఆరో తరగతి. తను వారికి క్లాసులు తీసుకోదు.
రెండు రోజుల తర్వాత, ఓ ఆదివారంపూట సాయంత్రపు నడక ముగించుకుని తనింటికి దగ్గరలో ఉన్న షాపు దగ్గర సరుకులు కొనడానికి వెళ్ళింది సునంద. షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్లు చెల్లించే కౌంటర్ దగ్గరకు వచ్చింది. కౌంటర్లోని అమ్మాయి, "సంచి తెచ్చుకున్నారా మేడమ్? ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించారు కదా. మీరు సంచులను తెచ్చుకోవాలి” అంది.
“అయ్యో! ఇప్పుడెలా?” అంది సునంద.
“మా షాపు పక్కనే ఒకమ్మాయి గుడ్డ సంచుల్ని అమ్ముతోంది. మీరు చూడలేదా?” అంది.
“అలాగా...” అంటూ షాపులోంచి బయటకు వచ్చింది.
ఆ షాపు పక్కనే ఒకమ్మాయి నుంచుంది. దాదాపు పది పదకొండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. సన్నగా, పొడుగ్గా ఉంది.
ఆమెను ఎక్కడో చూసినట్టు అనిపించింది సునందకు.
ఆ అమ్మాయి చేతిలో ఒక అట్ట, దానిమీద 'మన భూమిని
మనమే రక్షించుకుందాం' అని ఉంది.
ఆ అమ్మాయిని చూసి, “సంచి కావాలి” అంది సునంద. “నమస్తే మేడమ్...” అంటూ అక్కడున్న సంచి తీసి ఇచ్చింది. సునంద పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వబోతుంటే, “ఫర్వాలేదు మేడమ్” అంది. థాంక్స్ చెప్పి, షాపులోకెళ్ళి తన సామాను తెచ్చేసుకుంది సునంద. అమ్మాయిది, తను పనిచేసే స్కూలేమో! ఏం పేరో తెలుసుకోవాలనుకుంది సునంద. అంతలో సెల్ రింగవడంతో గబగబా అక్కడినుంచి కదిలి, ఇంటికొచ్చేసింది.
✡✡✡
వారం రోజుల తర్వాత స్కూల్లో పిల్లలకు డిబేట్ క్లాస్. ఆ డిబేట్ పిరియడ్లో అన్ని క్లాసులవారూ పాల్గొంటారు. పిల్లలు తమకు నచ్చిన విషయం మీద మాట్లాడవచ్చు. ఆరోజు ఆ డిబేట్ పిరియడ్ నిర్వహించేది సునంద. మధ్యాహ్నం రెండు కల్లా లంచ్ బ్రేక్ ముగిసిన తర్వాత డిబేట్ పిరియడ్ జరిగే హాల్లో పిల్లలంతా వచ్చి కూర్చున్నారు. ఆ పిల్లల్లో తను షాపు దగ్గర చూసిన అమ్మాయి కనిపించింది సునందకి.
వరుసగా పిల్లలు వచ్చి, తమకు నచ్చిన సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారు. నలుగురు విద్యార్థులు మాట్లాడిన తర్వాత తను షాపులో చూసిన అమ్మాయి స్టేజిమీదకు వచ్చి, చెప్పడం మొదలెట్టింది.
“నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్... 'పర్యావరణ పరిరక్షణ'. నా పేరు ఉదయ, సిక్త్ క్లాస్" అంది ఆ అమ్మాయి.
“ఓహ్...” అంటూ ఆశ్చర్యంగా చూసింది సునంద.
తమ స్కూల్ గోడ పత్రికకు ఆర్టికల్స్ పంపించేది ఎవరో సునందకు అర్థమైపోయింది.
“మనదేశంలో పారిశ్రామికీకరణ వల్ల నేల, నీరు కలుషితమౌతున్నాయి. నీటిలో యురేనియం, ఆర్సనిక్ వంటి ప్రమాదకరమైన లోహాలు ఆనవాళ్ళుగా మిగులుతున్నాయి. ఈ కలుషిత నీటిని తాగితే, గుండె, ఊపిరితిత్తులు, లివర్, కిడ్నీలు పాడవుతాయి. వాహనాలు, పరిశ్రమల నుండి వెలువడే విషవాయువులు నీటి ఆవిరితో కలిసి ఆమ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఇది మన పర్యావరణానికే ముప్పు. మన భూమి చరిత్ర ఐదు యుగాలు దాటి ముందుకు సాగుతోంది. ఈ యుగాల్లో అనేక ప్రాణులు పరిణామం చెందితే, కొన్ని ప్రాణులు పతనమైనాయి. అలా ఐదు యుగాల్లోనూ జీవులు అంతరించిపోయే విషయంలో మనిషి ప్రమేయం లేదు. కాని ఆరవ యుగంలో మనిషి ప్రమేయంతో మనిషి కూడా అంతర్ధానమయ్యే పరిస్థితి వస్తోంది.”
ఉదయ ఆ మాటలు మాట్లాడగానే అందరూ చప్పట్లు కొట్టారు.
"ఇప్పుడు పర్యావరణం ప్రమాదకర పరిస్థితిలో ఉంది. మనుషులు, జంతువులు ఎవరి బతుకు వాళ్ళు బతకాలి. ఒకరి ఆవరణలోకి వేరేవారు వెళ్ళకపోవడమే జీవ వైవిధ్యం. అంటే బయో డైవర్సిటీ. మనకు చిన్న చిన్న ప్రాణులు ఎంతో మేలు చేస్తున్నాయి. వానపాము తన జీవితకాలంలో ఒక పావు ఎకరం ఎరువు తయారు చేస్తుంది. ఇసుకలో, పంటచేలలోని పురుగులను తినడం ద్వారా పంటలను కాపాడుతుంది. నత్త, తాబేలు, జలగ... నీటిలోని క్రిమికీటకాలను తిని, నీటి కాలుష్యాన్ని అరికడతాయి. అయితే మనషి ఏం చేస్తున్నాడు? ఈ ప్రాణుల్ని నాశనం చేసి, తన ముప్పు తానే తెచ్చుకుంటున్నాడు. ఈ సృష్టిలోని మిగతా జీవుల్లాగే మనిషి ఒక ప్రాణి. అంతే. ప్రాణికన్నా మనిషి ఎక్కువ కాదు. అది తెలుసుకుని మనం నడుచుకోగలిగితే కొన్ని సంవత్సరాల్లో ఆక్సిజన్ సిలెండర్ లేకుండా ఇంట్లోంచి బయటకు రాలేకపోయే ప్రమాదాన్ని ఎదుర్కోగలం” అని చెప్పడం ముగించింది ఉదయ.
ఉదయ చెప్పడం ముగించగానే, పిల్లలంతా లేచి చప్పట్లు కొట్టారు. సునంద ఆరోజు డిబేట్ పిరియడ్లో ఉదయకు ప్రథమ బహుమతి ప్రకటించింది.
✡✡✡
ఓ ఆదివారం ఉదయమే బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత, భర్తతో, కూతురుతో కలిసి బీచు వచ్చింది సునంద. కూతురు ఇసుకలో పిచ్చుక గూళ్ళు కడుతూ ఆడుతోంది. సునంద, ఆమె భర్త పక్కనే కూర్చుని కబుర్లలో పడ్డారు. కొంచెం దూరంలో ఏదో హడావుడి కనిపించింది సునందకు.
అక్కడ చాలామంది నేవీ అధికారులు కూడా ఉన్నారు. ఆ జనాల మధ్య తమ స్కూలు పిల్లలు కూడా కనిపించారు సునందకు.
“ఏమిటో ఒకసారి చూసి వస్తాను. పాపను చూసుకోండి" అంటూ ఆవైపు అడుగులు వేసింది సునంద. ఆమె అక్కడికి వెళ్ళేసరికి తమ స్కూలు పిల్లలంతా "గుడ్ మార్నింగ్ మేడమ్.. గుడ్ మార్నింగ్ మేడమ్..” అంటూ విష్ చేశారు.
“ఏమైంది మీరంతా ఇక్కడకు వచ్చారు?" అంది సునంద.
"మన స్కూల్ అమ్మాయి ఉదయ స్క్యూబా డైవింగ్ చేస్తోంది" అన్నాడు ఒక అబ్బాయి ఉత్సాహంగా.
“మైగాడ్ అంత చిన్నమ్మాయా?" అంది సునంద.
"ఉదయ డాడీ కూడా సముద్రంలోకి వెళ్ళారు మేడమ్" అంది ఇంకో అమ్మాయి.
పక్కనే ఉన్న నేవీ అధికారివైపు సునంద చూసి -
"చిన్నపిల్లలు ఇలా స్యూబా డైవింగ్ చేయడం రిస్క్ కదా సార్?” అంది సునంద.
"ఈ అమ్మాయి మెరైన్ లైఫ్ ప్రొటెక్షన్ కోసం పనిచేస్తోంది. ఈమె తండ్రి కూడా ప్రొఫెషనల్ స్క్యూబా డ్రైవర్.
అలాగే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్. చెన్నైలో కూడా సముద్రంలో ఈది, చాలా ప్లాస్లిక్ ని బయటకు తీసుకొచ్చింది ఈ అమ్మాయి ఉదయ" అన్నాడతను.
ఆ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది సునంద.
దాదాపు అరగంట తర్వాత ఉదయ, ఆమె తండ్రి సముద్రంలోంచి బయటకు వచ్చారు. ఆ చుట్టుపక్కలున్న ప్రెస్ రిపోర్టర్లు ఉదయ చుట్టూ మూగారు.
“ఇంత చిన్న వయసులో ధైర్యంగా ఎలా మీ అమ్మాయిని సముద్రంలోకి డ్రైవింగ్కి పంపుతున్నారు?” అన్నాడు ఒక ప్రెస్ రిపోర్టర్ ఉదయ తండ్రితో.
“ఉదయ పుట్టిన నెల రోజుల్లోనే మా ఇంట్లోని టబ్లో దింపాను. మూడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈదడం నేర్చుకుంది. ఎనిమిదో సంవత్సరంలో మొదటిసారి స్యూబా డైవింగ్ చేసింది.”
ఇంకో ప్రెస్ రిపోర్టర్, ఉదయ వంక చూసి “సముద్రంలోకి వెళ్ళడానికి భయం వేయలేదా?” అంది.
ఆ మాటలకు ఆమె నవ్వుతూ “ఒక మంచి పని చేయడానికి భయపడకూడదు. మనం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్ అంతా సముద్రాల్లో పేరుకుపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే, 2050 కల్లా సముద్రంలో ఒక చేప కూడా కనిపించదు అంటున్నారు శాస్త్రవేత్తలు. మన పర్యావరణం సమతుల్యతతో సాగాలంటే సముద్రాలను రక్షించుకోవాలి. ప్లాస్టిక్ సంచులకు బదులుగా గుడ్డ సంచులు వాడాలి. ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, ప్రతి ఆదివారం సముద్రంలో పేరుకొన్న ప్లాస్టిక్ని తొలగించేందుకు నేను ఇక్కడకు వస్తున్నాను.”
ఉదయ చెప్పడం ముగించింది.
ఆమె అలా చెబుతుంటే సునంద చాలా సంతోషపడింది. ఆమెచుట్టూ విలేకర్లు, బీచ్ సందర్శకులు మూగి ఉండడంతో ఆమెతో మాట్లాడే అవకాశం కుదరలేదు సునందకు.
ఇంటికొచ్చినా సునందలో ఆలోచనలు...
'ఇంత చిన్న వయసులో... ఈ అమ్మాయికి ప్రకృతిని పరిరక్షించుకోవాలనే గొప్ప ఆలోచన ఎలా వచ్చిందో?” అనుకుంది.
తర్వాతిరోజు స్కూల్లో ఉదయతో మాట్లాడదామని అనుకుందిగాని, ఆరోజు ఉదయ స్కూలుకు రాలేదు. స్కూల్లో ఉండగానే సునందకు ఫోన్ వచ్చింది.
"మేడమ్ నేను ఉదయ. మీరు ఈ రోజు సాయంత్రం మా ఇంటికి రావాలి. మా అన్నయ్య బర్త్ డే. మా క్లాస్మేట్స్ని, కొంతమంది టీచర్లను కూడా పిలిచాను" అంది.
"ఓహెూ... మీ అన్నయ్య బర్త్ డే గురించి ఈ రోజు స్కూలు మానేశావా?” అంది సునంద.
"మీ పాపను కూడా తీసుకుని రండి. ఆరోజు బీచ్లో చూశాను" అంటూ తన ఇంటి అడ్రస్ చెప్పింది ఉదయ.
“సరే తప్పకుండా వస్తాను" అంటూ ఫోన్ పెట్టేసింది.
ఆరోజు స్కూలు నుంచి తొందరగా ఇంటికొచ్చేసింది సునంద. భర్త ఆఫీసు పనితో బిజీగా ఉండడంతో, కూతుర్ని తీసుకుని స్కూటీలో బయలుదేరింది సునంద. పావుగంటలో ఆ ఇంటికి చేరుకుంది.
తలుపు కొట్టగానే, ఉదయే తలుపు తీసింది. అప్పటికే లోపలంతా, తమ స్కూలు పిల్లలు, టీచర్లు ఉన్నారు. ఆ గదిలో బల్లమీద క్యాండిల్స్ పెట్టిన కేక్.
ఉదయ తన తల్లిదండ్రుల్ని సునందకు పరిచయం చేసింది.
“నా పేరు రఘురాం... నా భార్య గాయత్రి" అన్నాడతను.
“చాలా సంతోషం. మీ అమ్మాయి నిత్యం ప్రకృతిని పరిరక్షించే లక్ష్యంగానే సాగుతోంది. మా స్కూలు వాల్ మేగ్ జైన్లో చిన్న చిన్న కథలు, ఆర్టికల్స్ రాస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే, ఇంత చిన్న వయసులో సముద్రంలోకి వెళ్ళి, డైవింగ్ చేసి, ప్లాస్టిక్ చెత్తను ఏరుకురావడం నిజంగా అద్భుతం" అంది సునంద.
“అవును మేడమ్... తనకు చిన్నతనం నుంచి ప్రకృతిని పరిక్షించడంలో అవగాహన ఉంది” అన్నాడాయన క్లుప్తంగా.
ఆ హాల్లో చుట్టూ చూసి, “ఇంతకీ మీ అబ్బాయి ఏడి?” అంది సునంద.
ఆ మాటలకు అతను క్షణంసేపు ఆగి, “వాడు మన మధ్యనే ఉన్నాడు. ముందు కేక్ కట్ చేద్దాం.” అంటూ ఉదయని, మిగతా పిల్లల్ని పిలిచాడు.
సునంద. అంతా కలిసి కేక్ కట్ చేశారు. పిల్లలకు కేకు, చాక్లెట్లు ఇచ్చింది ఉదయ వాళ్ళ అమ్మ. 'ఆ పిల్లల్లో ఎవరు ఉదయ అన్నయ్య? ఆ కుర్రవాడిని పరిచయం చేయలేదేంటి?' అనుకుంటూనే ఉంది
పిల్లలందరూ స్నాక్స్ తీసుకుని ఇంటిలోనుంచి బయటకు కదిలారు, వారితోపాటు టీచర్లు వెళ్ళిపోయారు. సునంద మనసులో మెదిలే ప్రశ్నకు జవాబు దొరకలేదు. దాంతో చిన్నగా ఏదో బాధ.
'అసలు ఉదయ అన్నయ్య ఉన్నాడా? లేడా? ఉంటే పరిచయం చేసేవారు కదా! ఏమయ్యాడో!' అనుకుంది. మరీ అడిగితే బాగుండదని, "వెళ్ళొస్తానండి. థాంక్యూ...” అంటూ ఆ ఇంట్లోంచి కదలబోయింది. ఉదయ తండ్రి -
“ఒక్క నిముషం ఆగండి, కూర్చోండి" అని అనడంతో,
నిలబడి ఉన్న సునంద, ఆ గదిలోని సోఫాలో కూర్చుంది.
“కొంచెం కాఫీ తాగి వెళుదురు గాని” అంది ఉదయ తల్లి వంటగదిలోకి నడుస్తూ.
ఉదయ తండ్రి పక్కనే కూర్చుంది. అతను చెప్పడం మొదలెట్టాడు.
ఆ "నేను వైజాగ్కు రాకమునుపు, కలకత్తాలో పనిచేశాను. మేం పనిచేసే ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీకి దగ్గరలోనే మా క్వార్టర్స్ ఉండేవి. మా అబ్బాయి, రోజూ సైకిల్ మీద, మా ఫ్యాక్టరీకి దగ్గరలో ఉన్న స్కూలుకు వెళ్ళేవాడు. వాతావరణం అంతా పొగతో, రసాయనాలతో నిండి ఉండేది. ఒకరోజు టౌన్షిప్ ప్రాంతంలో చెత్త కాలుస్తుంటే, పొగ వల్ల ఊపిరి పీల్చుకోలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత ఆరు నెలలు ఇలాగే, దగ్గు, ఆయాసంతో బాధపడ్డాడు. ఆ తర్వాత పరీక్షలు చేయిస్తే, డాక్టర్లు లంగ్ కేన్సర్ అని తేల్చారు.”
ఆయన అలా చెబుతుంటే, సునంద మనసు బాధతో సుడులుగా తిరిగింది.
"నేను ఉద్యోగానికి సెలవు పెట్టి, హైదరాబాదులోని కేన్సర్ ఆస్పత్రిలో మా అబ్బాయిని చేర్చాను. కీమో, రేడియోషన్ పూర్తయ్యాయి. ఒక సంవత్సరం బానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ వ్యాధి తిరగబడింది. డాక్టర్లు ఎక్కువ కాలం బతకడని చెప్పారు. ట్రీట్మెంట్ తీసుకుంటూనే, తనకు క్యాన్సర్ కలుగజేసిన ప్రకృతి కాలుష్యానికి వ్యతిరేకంగా ఏం చేయాలో, అది చేయడం ప్రారంభించాడు. అది తన ఆఖరి కోరికగా మాకు చెప్పాడు. అందుకు “నేషనల్ ఎన్విరాన్మెంట్” ప్రాజెక్ట్ ్వరు సహకరించారు. తనలాగ ఎవరూ వాతావరణ కాలుష్యానికి గురై, క్యాన్సర్ బారిన పడకూడదనే మా వాడి అంతిమ కోరిక. అలా తను ఉద్యమిస్తూనే, ఓ రాత్రిపూట ఈ కాలుష్య ప్రపంచం నుంచి, ఆరోగ్యకరమైన వాయువులు పీల్చుకునేందుకు వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు.”
ఆ మాటలు చెబుతున్న ఉదయ తండ్రి కళ్ళనుండి నీళ్ళు.
వంటగదిలోంచి ఉదయ తల్లి కూడా, తన కన్నీరు తుడుచుకుంటూ వచ్చి, సునందకు కాఫీ అందించింది. సునంద తండ్రి చెప్పడం కొనసాగించాడు.
"నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, మా సొంత ఊరైన విశాఖపట్నం వచ్చేశాను. తన అన్న సూర్య లక్ష్యాన్ని, చెల్లెలు ఉదయ కొనసాగిస్తోంది. నేను ఆమెను ప్రోత్సహిస్తున్నాను” అంటూ కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. ఆ గదిలో టేబుల్ మీద పదిహేనేళ్ళ వయసున్న అబ్బాయి ఫొటో. ఫొటో చుట్టూ ఆరోజే తాజాగా కట్టిన పూలమాల.
"మీ అబ్బాయి సూర్య, హరిత ఉద్యమాన్ని, మీ అమ్మాయి కొనసాగించడం చాలా గొప్ప సంగతి" అంటూ వారినుంచి సెలవు తీసుకుని, బయటకు వచ్చింది సునంద.
బయటకు వస్తుంటే, ఉదయ, ఒక గుడ్డ సంచి చేతికిస్తూ, “ఇది మా అన్నయ్య బర్త్ డే గిఫ్ట్” అంది. ఇంటికొచ్చిన సునంద, ఉదయ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో సంచిలోంచి తీసి చూసి ఆనందపడింది.
✡✡✡
ఆ రోజు సునంద తొందరగా నిద్రలేచింది. ఉదయ ఇచ్చిన ఆ చిన్న మట్టి తొట్టిలో ఉన్న ఆ లేత మొక్కవంక చూసింది. ఆరోజు ఉదయం ఆమెకు ఆకుపచ్చగా కనిపించింది. మనసుకు ఆహ్లాదం అనిపించింది.
No comments:
Post a Comment