Monday, June 15, 2026

 *అమ్మ పెట్టిన ముద్ద*

“ఒరేయ్ రాజూ… నీకు టిఫిన్ డబ్బా పెట్టాను. టైం దొరికినప్పుడు ఎక్కడైనా ఆగి తిను నాన్నా. పని ఉందని కడుపు మాట వినకుండా పోవద్దురా,” అని సీతమ్మ ప్రేమగా చెప్పింది.
“అలాగే అమ్మా… నువ్వు కంగారు పడకు. తింటాను,” అన్నాడు రాజు.
జొమాటో బ్యాగ్‌ను భుజాన వేసుకుని, మొబైల్‌లో యాప్ తెరిచి బైక్ స్టార్ట్ చేశాడు.
కొద్దిసేపటికే మొదటి ఆర్డర్ వచ్చింది. హోటల్ దగ్గరకు వెళ్లి ప్యాకెట్ తీసుకుని కస్టమర్ ఇంటి వద్ద అందించాడు. ఆ తర్వాత వరుసగా ఆర్డర్లు రావడం మొదలైంది.
ఉదయం నుంచి నగర వీధులన్నీ అతని బైక్ చక్రాల కింద తిరుగుతున్నాయి. ఒకవైపు ఆకలి కడుపును తొలుస్తుంటే, మరోవైపు ఎండ గొంతును ఎండబెడుతోంది.
అప్పుడే వెనుక ఉన్న టిఫిన్ డబ్బా వైపు అతని చూపు వెళ్లింది.
రోజూ ఎన్నో రకాల వంటల సువాసనలు అతని చుట్టూ తిరుగుతుంటాయి. వేడి వేడి ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, పూరీలు, బిర్యానీలు… వందల రూపాయల విలువైన వంటలు అతని చేతుల మీదుగా ఎన్నో ఇళ్ల గుమ్మాలు దగ్గరకు చేరుతాయి.
అతను కాసేపు నిట్టూర్చాడు.
“ఎంత విచిత్రం కదా ఈ జీవితం… ఎంతో మందికి ఆకలి తీర్చే భోజనం తీసుకెళ్తున్నాను. కానీ అందులో ఒక్క ముద్ద రుచి చూసే హక్కు నాకు లేదు,” అనుకున్నాడు మనసులో.
అలసిపోయి రోడ్డుపక్కన ఉన్న బస్ షెల్టర్ దగ్గర బైక్ ఆపాడు.
అమ్మ పెట్టిన టిఫిన్ డబ్బాను చేతిలోకి తీసుకున్నాడు. కడుపులో ఆకలి అలజడి మొదలైంది.
నెమ్మదిగా మూత తీశాడు.
అందులో చల్లారిన అన్నంలో కొద్దిగా పెరుగు కలిపి ఉంది. పక్కన చిన్న ఊరగాయ ముక్క.
ఒక్క క్షణం రాజు చేతులు కదలలేదు.
కొద్దిసేపటి క్రితం తన చేతుల మీదుగా వెళ్లిన బిర్యానీలు, పులావులు, స్వీట్లు, రుచికరమైన కూరలు అన్నీ అతని కళ్ల ముందు కదలాడాయి.
“నా వయసు వాళ్లు కాలేజీల్లో చదువుకుంటున్నారు. స్నేహితులతో నవ్వుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. నేను మాత్రం వారి ఇంటి గుమ్మాల వరకు భోజనం చేరుస్తూ, ఈ అమ్మ చేతి పెరుగు అన్నంతో నా ఆకలి తీర్చుకోవాలి ,” అనిపించింది.
కళ్ల చివర తడి మెరిసింది.
కానీ వెంటనే సీతమ్మ ముఖం గుర్తుకొచ్చింది.
ఎండలోనూ, వానలోనూ ఇతరుల ఇళ్లలో పని చేస్తూ తనను పెంచిన తల్లి… రోజంతా అలసిపోయి వచ్చినా “నాన్నా, తిన్నావా ?” అని అడగడం మర్చిపోని తల్లి…
గుర్తుకొచ్చింది. అలాగే నాలుగు ముద్దలు తిని
కాసేపు బస్ షెల్టర్‌లో కూర్చుని కళ్లు మూసుకున్నాడు.
ఇంతలో ఆకాశంలో నల్లటి మేఘాలు చేరాయి. గాలి ఒక్కసారిగా చల్లబడింది. దూరంగా ఉరుముల శబ్దం వినిపించింది.
“వర్షం పడేలా ఉంది… కొద్దిసేపైనా ఆర్డర్లు ఆగిపోతే కాస్త విశ్రాంతి దొరుకుతుంది,” అనుకున్నాడు.
కానీ జీవితం మనం కోరుకున్నట్టే నడిస్తే దానికి పరీక్షల విలువ ఏముంటుంది ?
అనుకున్నట్టుగానే మొబైల్‌లో నోటిఫికేషన్ మోగింది.
“అబ్బో… ఇంత దూరమా ?” అని నవ్వుకుంటూ నిట్టూర్చాడు రాజు.
రెయిన్‌కోట్ వేసుకుని బైక్ స్టార్ట్ చేశాడు.
వర్షపు చినుకులు మొదలయ్యే సమయానికి హోటల్‌కు చేరుకుని ఆర్డర్ తీసుకున్నాడు.
అశోక్ నగర్‌లోని ఒక పాత ఇంటి ముందు బైక్ ఆపేసరికి వర్షం కుండపోతగా మారింది.
తడిసిన దుస్తులతో గుమ్మం దగ్గరకు వెళ్లి బెల్ కొట్టాడు.
కొద్దిసేపటికి డెబ్బై ఏళ్ల వృద్ధుడు తలుపు తీశాడు.
“మీ ఆర్డర్ సార్,” అంటూ రాజు ఫుడ్ ప్యాకెట్ అందించాడు.
వానలో తడిసిపోయిన రాజును చూసిన వృద్ధుడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు.
“బాబు… వర్షం తగ్గాక వెళ్దువుగానీ. లోపలికి రా,” అన్నాడు ఆప్యాయంగా.
ఆ మాటల్లో ఉన్న ప్రేమకు రాజు కాదనలేకపోయాడు.
ఇంట్లోకి అడుగుపెట్టాడు.
ఆ ఇల్లు పెద్దది. కానీ ఎక్కడో ఒంటరితనం నిండిన నిశ్శబ్దం కనిపించింది.
వృద్ధుడు వేడి టీ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టాడు.
ఆ వేడి కప్పు తాకగానే రాజు కళ్లలో నీళ్లు మెదిలాయి.
“ఏమయ్యా బాబు… టీ బాగోలేదా ?” అని అడిగాడు.
“అది కాదు. రోజూ వందల ఇళ్ల గుమ్మాల ముందు నిలబడతాను. ప్యాకెట్ తీసుకుని తలుపులు మూసేస్తారు. కానీ ఈ రోజు మీరు ‘లోపలికి రా బాబు’ అని పిలిచి టీ ఇచ్చారు. ఎన్నాళ్లకో నేను కూడా ఒక మనిషిననే భావన కలిగింది,” అన్నాడు రాజు.
వృద్ధుడి కళ్లూ తడిశాయి.
“బాబు… ఏ పని చిన్నది కాదు. మన ఇంటికి వచ్చే ప్రతి ముద్ద వెనుక రైతు కష్టం ఉంటుంది, వంట చేసిన చేతుల శ్రమ ఉంటుంది, దాన్ని చేరవేసే నీలాంటి వారి చెమట ఉంటుంది. నీ పనిని ఎప్పుడూ చిన్నచూపు చూడకు,” అన్నాడు.
ఆ మాటలు రాజు మనసులో లోతుగా నాటుకున్నాయి.
“నీ ఇంట్లో ఎవరు ఉంటారు బాబు ?” అని అడిగాడు వృద్ధుడు.
“అమ్మ ఒక్కరే, నాన్న  చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ కష్టపడి నన్ను పెంచింది,” అన్నాడు.
వృద్ధుడు ఎదురుగా ఉన్న తన భార్య ఫోటో వైపు చూశాడు.
“ఆమె నా భార్య. ఐదేళ్ల క్రితం నన్ను వదిలి వెళ్లిపోయింది. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. డబ్బు పంపిస్తారు, ఫోన్ చేస్తారు. కానీ ‘తిన్నారా ?’ అని అడిగే స్వరం ఈ ఇంట్లో లేదు.
డబ్బుతో భోజనం కొనుక్కోవచ్చు బాబు… కానీ ప్రేమను కొనలేం. ఆప్యాయత దుకాణాల్లో దొరకదు,” అన్నాడు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది నువ్వు తెచ్చే భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గుమ్మం దాటి బయటకు రాలేరు. . ఆకలి తీర్చేవాళ్ళు  ఇంటిలో ఉండక నీలాంటి వాళ్ళ మీద ఆధారపడతారు. బజారుకు వెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్లు కూడా సౌకర్యం ఉన్నప్పుడు వినియోగించుకుంటారు. ఇలా నీలాంటి వాళ్ళు ఒకరి అవసరాన్ని తీరుస్తున్నారు. మరొకరికి సౌకర్యం సమకూరుస్తున్నారు అన్నాడు ముసలాయన.

ఆ మాటలు రాజు హృదయాన్ని తాకాయి.

బయట వర్షం క్రమంగా తగ్గిపోయింది.
రాజు లేచి, “వెళ్లి వస్తానండి,” అన్నాడు.
వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ, “ఈ ఇంట్లో గడియారం ముళ్లు తిరుగుతుంటాయి గానీ, మనుషుల మాటలు మాత్రం చాలా రోజుల తర్వాత వినిపించాయి బాబు,” అన్నాడు.
ఆ మాట విన్న రాజు హృదయం మెల్లగా కదిలింది.
బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ ఆలోచించాడు —
“అన్నీ ఉన్న ఆ తాతయ్యకు ఆప్యాయంగా మాట్లాడే మనిషి లేడు. కానీ నాకు ఇంటికి వెళ్లగానే ‘తిన్నావా నాన్నా’ అని అడిగే అమ్మ ఉంది. నేను ఎంత అదృష్టవంతుడిని!”
కాసేపటి క్రితం తనకు ఇబ్బందిగా అనిపించిన ఆ వర్షమే ఇప్పుడు తన మనసులోని వేడిని చల్లార్చినట్లు అనిపించింది.
ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు.
సీతమ్మ మళ్లీ ప్రేమగా అన్నం పెట్టింది.
రాజు ఆ పెరుగన్నం ముద్దను నెమ్మదిగా నోట్లో వేసుకున్నాడు.
ఆ రోజు అతను తిన్న ఆ సాధారణమైన పెరుగన్నం అతని జీవితంలో ఎప్పుడూ తినని గొప్ప విందుగా అనిపించింది.
ఎందుకంటే ఆ ముద్దలో పెరుగు రుచి మాత్రమే లేదు…
అమ్మ ప్రేమ ఉంది.
అన్నీ ఉన్నా ఆ అపరిచిత వృద్ధుడికి లేని అదృష్టం ఉంది.
జీవితాన్ని అర్థం చేసుకునే ఒక కొత్త వెలుగు ఉంది. ఇంతకంటే ఏం కావాలి ?

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు

No comments:

Post a Comment