ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు.
త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.
నీతి: పని నీ వంతు ఫలితం ఇవ్వడము పరమేశ్వరుని వంతు, మనసా వచ్చా కర్మనా ఏ పని అయిన త్రికరణశుద్ధి గా చేస్తేనే మంచి ఫలితాలు లభ్యం లేదంటే అవే నీ పాలిట శాపలు గా మారతాయి
No comments:
Post a Comment