Saturday, February 22, 2020

ఆధ్యాత్మిక సాధన

🌸 ఆధ్యాత్మిక సాధన 🌸

1. భగవంతుని ప్రార్థిస్తే భౌతిక సంపదలు ఇస్తాడు. గురువుని ప్రార్థింస్తే నిన్నే ఆ భగవంతుడిని చేస్తాడు.

2. మనస్సు ఏ కారణం వలన బాహ్యముఖానికి వస్తుందో ఆ కారణాన్ని కత్తిరించుటయే సాధన యొక్క గమ్యం.

3. నిజమైన భక్తులు నిర్మలంగా ఉంటారు, కూల్ గా ఉంటారు.. కాని పని చేస్తున్న జాడ కనబడదు.

4. భయం ఎక్కువుగా వస్తూ ఉంటే భగవంతుని మీద భారం వేయటం లేదు అని అర్ధం. భగవంతుని మీద భారం వేసే కొలది భయం తగ్గుతుంది.

5. దేవుడు మనకు అత్యంత సమీపములో మన హృదయంలొనే ఉన్నా, ఎక్కడో వైకుంఠములో ఉన్నాడని అనిపించటానికి కారణము మన దేహబుద్ధి.

6. మీ సాధన అంతా పూజకు, జపమునకు సరిపెట్టకుండా నీవు చేసే పనివలన, మాట్లాడే మాటవలన దేహబుద్ధి తగ్గేటట్లు చూసుకోవాలి.

7. మీకు ఏ శక్తులు అయితే ఉన్నాయో వాటిద్వారా తోటివారు అభివృద్ధి అవ్వటానికి, వారి చైతన్య స్థాయి పెరగటానికి కృషి చెయ్యండి. నీవు భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను అభివృద్ధి పొందటానికి ఈ కృషి నీకు సహకరిస్తుంది.

8. ఒకేసారి బ్రహ్మనుభవం కలగకపోయినా భగవంతుడు ఇచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకుంటే ఏ కుటుంబంలో జన్మ ఇస్తే నీకు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందటానికి అవకాశం ఉందొ అక్కడ జన్మని ఇస్తాడు.

9. కర్మఫలం నావలననే వచ్చింది అనుకున్నవాడికి కర్తృత్వం పెరుగుతుంది.కర్తృత్వమే మన దుఃఖానికి కారణం.

10. నిద్రపోయే వాడికి కలలు వస్తాయి. మేలుకువలో ఉన్నవాడి దగ్గర కల యొక్క ఆటలు సాగవు. అదేవిధంగా అజ్ఞానములో నుండి బయటకు వచ్చిన వాడిని మాయ ఏమి చెయ్యలేదు.

11. నాకు మోక్షం తప్పించి ఇంక ఏమి వద్దు అని ఎవడైతే కోరుకుంటున్నాడో వాడు మాత్రమే ఈ జనన, మరణ చక్రము నుండి బయటకు వస్తాడు.

12. ఏదో ఒక యోగమును అనుసరించండి, ఏదో ఒక దేవుని ఆశ్రయించండి ఈ ప్రకృతిని దాటి బయటకు రండి. ఈ ప్రకృతిని దాటితే కదా నీకు నాస్వరూపమును ఇచ్చేది అంటున్నాడు భగవంతుడు.

13.కర్మఫలాన్ని ఆశించకుండా ఉంటే మనకు రెండు లాభములు. 1) ఫలం మన చేతిలోకి వస్తుంది. 2) మాయ తప్పుకుంటుంది. అప్పుడు దేవుడు తెలియబడతాడు.

14. ఈశ్వర నామము స్మరిస్తూ ఉంటే, నిరంతరం ఈశ్వరుడిని తలపెట్టుకుంటూ ఉంటే మాయ నశిస్తుంది.

15. దైనందిన జీవితంలో నీపని నీవు చేసుకొంటూ ప్రశాంతంగా ఉండి నీ లోపల ఉన్న వస్తువును తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యి.

16. నీ హృదయంలొ ఉన్న వస్తువును తెలుసుకోవాలంటే నీమనస్సును చల్లగా ఉంచుకోవాలి. భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించంటం నేర్చుకోవాలి.

17. గురువు పాదాలను ఆశ్రయించి నీవు అభ్యాసం చేస్తూ ఉంటే నీ భక్తి సహజమవుతుంది.

18. మన భక్తి కనుక సహజం అయితే లోపల ఉన్న సహజవస్తువు మనకి దొరుకుతుంది.

19. బాహ్యమైన వస్తువుల మీద ఆధారపడకుండా నీ హృదయం మీద ఆధారపడి ఉంటే నీ బుద్ధి స్థిరంగా ఉంటుంది.

20. నీ మనస్సులో ఉన్న సంకల్పాలను వేరుతో సహా తొలగించినప్పుడు మాత్రమే నీవు స్థితప్రజ్ఞుడవు అవుతావు.

21. ఏ పద్ధతిలో నీవు సాధనచేస్తే నీ మనస్సుకు అంతర్ దృష్టి కలుగుతుందో, ఆ పద్ధతిలో నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో.

22. చేతిలో ఉన్న వస్తువు నోట్లో వేసుకొవటం ఎంత తేలికో భగవంతుని అనుగ్రహానికి పాత్రులయినవారు మోక్షం పొందటం అంత తేలిక.

23.మీ తలంపులనుండి, సంకల్పముల నుండి మీరు వేరు పడితే అప్పుడు మీ మనస్సు ఆత్మలో ఉంటుంది.

24. లోకం వైపుకు ప్రయాణం చేసే మనస్సు కు ఆత్మలో ఉన్న శాంతి అందదు. ఆత్మవైపుకు ప్రయాణం చేసే మనస్సుకే అది అందుతుంది.

25. ఆత్మవైపుకు ప్రయాణం చేసే మనస్సుతో ఆత్మలో ఉన్న శాంతిని, ఆనందమును జుర్రుకో, అప్పుడు నీవు స్థితప్రజ్ఞుడివి అవ్వుతావు.🙏

No comments:

Post a Comment