Sunday, February 23, 2020

ఓ సర్వేశ్వరా! నీ లీలలు ఎవరికీ అర్థం కావు

పంచభక్ష్య పరమాన్నాలు నైవేద్యంగా సమర్పించాము తినవయ్యా అంటే...
లేదు, నాకు హాలాహలమే ఆహారం అని తాగేస్తావు!

మంచి పట్టు వస్త్రాలు గైకొనవయ్యా అంటే...
లేదు, నాకు గజచర్మమే వస్త్రం అంటావు!

 బంగారు పళ్ళెంలో ఆహారం సేవించవయ్యా అంటే...
లేదు, కపాలంలోనే తింటాను అంటావు!

బంగారు దేవాలయాన్ని నివాసంగా తీసుకోవయ్యా
అంటే...
లేదు, స్మశానమే నా నివాసం అంటావు!

నవరత్న ఖచిత సింహాసనం మీద కూర్చోవయ్యా అంటే...
గడ్డకట్టించే మంచుకొండల్లో పులిచర్మముపైనే ఆశీనుడవు అవుతావు!

వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించవయా అంటే...
నాగుపాములే ఆభరణాలు అంటావు!

తలపై గంగమ్మ ఉన్నా,
భక్తులు చేసే జలాభిషేకమే ఇష్టం అంటావు!

వేదమంత్రాల ఘోష వినిపిస్తున్నా,
ముఖస్తుతి చేసే వారినే కరుణిస్తావు!

వాడికి వరమివ్వొద్దయా అని మొత్తుకుంటే,
వరమిచ్చి చెట్టు తొర్రన దాగావు!!!

రయమున తీసుకువెళ్లే ఆధునిక వాహనాలు
నడుపవయా అంటే,
ఆ ముదుసలి నందినే వాహనంగా కావాలి అంటావు!

ధనవంతునివి కాకపోయినా పిల్లని ఇవ్వడానికి ముందుకు వస్తే, మామని కొండని చేసావు!

ఏకాకిగా ఉన్న నీకు పెళ్లిని కుదర్చడానికి సిద్ధపడితే,
నీ మూడో నేత్రంతో భస్మం చేసావు!

శరణు అంటే చాలు విధి రాతని సైతం ధిక్కరించి,
దిక్పాలకులని త్రిశూలంతో బెదిరిస్తావు!

సౌగంధికా పుష్ఫ సౌందర్య లేపనాన్ని పూసుకోవయా అంటే,
లేదు భస్మమే నీ శరీరానికి అద్దుకుంటావు!

కుదురుగా కూర్చుని మా కోరికలు వినవయా అంటే,
శివతాండవం చేస్తూ కుదురుగా ఉండక
అతిచిత్రమైన వ్యక్తిగా ఎందుకిలా ఉంటావు అని అంటే నాకేమి తెలియదన్నట్లు నాటకమాడే ఓ సర్వేశ్వరా! నీ లీలలు ఎవరికీ అర్థం కావు. కానీ, నీ తత్వాన్ని ఎరిగిన వారికి నీవే తల్లివై, తండ్రివై, తోడువై, నీడవై కరుణించే భోళా శంకరునివి....!!

ఓం నమో పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర!!! :-

No comments:

Post a Comment