Tuesday, February 25, 2020

తాజా జీవనం

తాజా జీవనం
🕉️🌞🌎🏵🌼🚩

తాజాదనానికి ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధముంది. ఒకటి దేహమైతే, మరొకటి ఆ శరీరానికి ముఖభాగం వంటిది. ఆ రెండూ కలిసి ఒకదాన్నొకటి ఆవిష్కరిస్తాయి. వృద్ధులతో పోలిస్తే చిన్న పిల్లల్లో ఆరోగ్యం పాలు ఎక్కువ. అందుకే లేత ప్రాయంలో ముఖవర్చస్సు వెలిగిపోతూంటుంది. నిండు ఆరోగ్యంతో ఉన్న కొంతమంది వయోజనుల్లోనూ అంతే. ఇలాంటివాళ్లు నిరంతరం ఆనందంతో, ఉత్సాహంగా జీవిస్తుంటారు. ఈ తీరు బతుకు గమనంలో జీవితం తాలూకు తాజాదనాన్ని తేటతెల్లం చేస్తుంది.

మొత్తం విశ్వంలో నిత్య నూతనమై, ఎల్లప్పుడూ తాజాగా ఉండేది ఒకే ఒక్కటి. అదే- దివ్యత్వం. ఆ పరంధాముడి ప్రతిరూపాలకూ దైవ గుణాలే అబ్బుతాయి. అందువల్లే, పరమాత్మ దేహమైన ప్రకృతిని ఎప్పుడు చూసినా పచ్చగా, తాజాగా ఉంటుంది.

గణికుల్లో కాలాన్ని నేనే’ అన్నాడు గీతాచార్యుడు. కాలమంటే, జీవంతో నిండిన వర్తమానం. అది ‘శ్రీ’నివాసం. అంటే, ఆద్యంతాల్లో ఎల్లవేళలా నిత్యనూతనంగా ఉండే ‘చైతన్య శక్తి’ నిలయం. అదే దైవప్రాప్తి కలిగే సూక్ష్మాతి సూక్ష్మ ఆవరణ. ఆ సచ్చిదానందుడి నివాస స్థలం అనుభూతికోసం సత్యాన్వేషకులైన ధ్యాన సాధకులు జీవితకాలం తపిస్తారు. కఠోర తపశ్చర్యలో అన్నపానీయాలు మాని బక్కచిక్కినా, వారి ముఖాలు సూర్య తేజస్సుతో కళ్లు కాంతులీనుతూ తాజాగా ఉంటాయి.

గతం అంటే, జరిగిపోయిన కాలం. అది అనేకానేక జ్ఞాపకాల సమాహారంగా మనసులో, చరిత్రగా పుస్తకాల్లో నిలిచిపోతుంది. భవిష్యత్‌ కాలమంటే రాబోయేది.ప్రస్తుతానికి ఇంకా రాలేదు. కానీ, మరుక్షణంలో రావడానికి సిద్ధంగా ఉంటుంది. అయినా, రేపటి దానికి రూపం లేదని నానుడి. ఎలా ఉంటుందో తెలియని దాని తాజాదనానికి కచ్చితత్వం లేదు. గతంలో చేపట్టిన పని బాగా (సమర్థంగా) చెయ్యడం వల్ల అది పొంగిపొర్లి వర్తమానం దాటేసి భవిష్యత్తుగా రూపాంతరం చెందుతుంది. ఆ కారణంగానే గతంలోని స్వప్నం భవిష్యత్తులో సాకారమవుతుంది. గతమనేది పెట్టుబడి లాంటిదైతే, భవిష్యత్తు రాబడి వంటిది. అందుకే, ‘నభూతో న భవిష్యతి’ అన్నారు. అంటే, గతం లేకపోతే భవిష్యత్‌ లేదు అని... మరో అర్థం ‘రెండూ లేవని’. ఇక ఉన్నదేమిటి? తాజాగా ఉండే వర్తమానం.


పాశ్చాత్య తత్వవేత్త హెగెల్‌ ‘విశ్వమే దైవం’ అని అన్నారు. విశ్వంలో భూత, భవిష్యత్తులకు చోటు లేదు. అది నిరంతరం వర్తమానంలో ఉంటుంది. అందుకు భిన్నంగా మనిషి భూత, భవిష్యత్తులలో కాలం వెళ్ళబుచ్చుతాడు. (అంటే, గతం తలచుకుని చింతిస్తాడు. రాబోయే భవిష్యత్‌ గురించి అనవసరమైన ఆందోళన చెందుతాడు) వర్తమానంలో చాలా తక్కువ జీవిస్తాడు.

చైతన్యం భౌతికత్వమే చలనం. దాని ప్రతిరూపమే పదార్థం. చలనం లేకుండా పదార్థం లేదని ఆధునిక తత్వవేత్తలూ భావించారు. అవసర నిమిత్తమైన వాంఛలూ నెరవేరలేదని మనిషి కుంగుబాటుకు గురికాకూడదు. కలలు కనకుండా జీవితాన్ని నిస్సారంగా సాగనంప వద్దు. నిరాశా నిస్పృహలకు స్వస్తి పలకాలి. ప్రతి వైఫల్యాన్ని ఒక మెట్టులా భావించాలి. మనిషి మనసు తాజాగా ఉన్నప్పుడే ఎన్నెన్నో బృహత్కార్యాలు సఫలమవుతాయి.


ఎండిన చెట్టువైపు ఎవరూ వెళ్లరు. పచ్చని వృక్షం పైనే పక్షులు వాలుతాయి. దాని నీడన పశువులూ సేద తీరుతాయి. ఎంతటి విజ్ఞానిగా ఎదిగినా చెట్టు లేకుండా మనిషి బతుకే లేదు. అందుచేత మనిషి చెట్టును ఆదర్శంగా తీసుకోవాలి. చెట్టులా ఉన్నతంగా జీవించాలంటే మనిషి నిత్యం ధ్యానసాధన చెయ్యాలి. అదొక్కటే మానవ జీవితాన్ని అనుక్షణం తాజాగా ఉంచుతుంది.

🕉️🌞🌎🏵🌼🚩

No comments:

Post a Comment