Tuesday, February 25, 2020

నీ బలం కేవలం నీలోనే లేదు, నీతో నడుస్తున్న వారిలో కూడా ఉంది.

నీ బలం
''''''''''''

ఒక బాలుడు, అతని తండ్రీ కలిసి చిట్టడివిలో నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఒక చోట దారికి అడ్డంగా ఒక మొద్దు పడివుంది. ఆ బాలుడు తండ్రి వైపు తిరిగి, "నాన్నా, ఈ మొద్దును ఎత్తగలనా?" అని అడిగాడు.

"నీకున్న బలాన్నంతా ఉపయోగిస్తే, తప్పకుండా ఎత్తగలవు." అని తండ్రి బదులిచ్చాడు.

ఆ కుర్రవాడు చొక్కా చేతులు మడిచి, క్రిందికి వంగి, ఆ మొద్దు క్రిందికి చేతులు పోనిచ్చాడు.

చేతులు బిగించి తనకున్న సత్తువనంతా ఉపయోగిస్తూ మొద్దుని లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మొద్దు ఇసుమంత కూడా కదల్లేదు.

మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి అలిసిపోయి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.

తండ్రి వైపు నిరుత్సాహంగా, నిరాశగా చూసి "నేను దీన్ని ఎత్తగలనన్నావ్!" అన్నాడు.

అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ సౌమ్యంగా "నీకున్న మొత్తం బలాన్ని ఉపయోగిస్తే ఎత్తగలవు అన్నాను.

నన్ను సాయం పట్టమని నువ్వు అడగలేదు." అన్నాడు.

అప్పుడు ఆ కుర్రాడు తండ్రిని సాయం చెయ్యమని అడిగాడు, ఇద్దరూ కలిసి మొద్దుని దారి లోంచి పక్కకి పడేసారు.

నీతి: నీ బలం కేవలం నీలోనే లేదు,
నీతో నడుస్తున్న వారిలో కూడా ఉంది.
నీ ముందున్న పనికి నువ్వు సమవుజ్జీవి కాదనుకుంటున్నావంటే,...

నీకున్న బలాలన్నింటినీ నువ్వు ఉపయోగించుకోవట్లేదన్నమాట.

No comments:

Post a Comment