Saturday, February 8, 2020

"ఏమి నీ కోరిక ?" ఒక అద్భుత కధనం

🍁"ఏమి నీ కోరిక ?" ఒక అద్భుత కధనం🍁

ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు . చాలా ఆకలిగా ఉంది . అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం ?

సంత ఈ చివరి నుండి ఆ చివరికి
తిరిగాడు . ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది . దాని క్రింద రాసి ఉంది ఒక్క రూపాయి మాత్రమె అని .

ఆశ్చర్య పోయాడు పేదవాడు . అంత పెద్ద దీపం ఒక్క రూపాయే ఏమిటి అని ? దగ్గరకు వెళ్లి చూశాడు .

అది అల్లాఉద్దీన్ అద్భుత దీపం లా ఉంది . సుమారు ఒక కిలో బరువు ఉంటుంది . అయినా ఒక్క రూపాయేనా ?

అది అమ్మేసుకుంటే తనకు ఎక్కువ డబ్బులు వస్తాయిగా ! అదీ అతడి ఆలోచన .

షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు . ఎందుకు అథ తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని ..

ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం . ఇందులో భూతం ఉంది . అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది . అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది . అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది . ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి . లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది . అదీ దాని కధ "

పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు . ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని రుద్దాడు . భూతం ప్రత్యక్షం అయ్యింది . " ఏమి నీ కోరిక ? " అడిగింది .

తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు . క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది . భోజనం కాగానే

" ఏమి నీ కోరిక ? " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు . వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది . నిద్రపోతూండగా

" ఏమి నీ కోరిక ? " అడిగింది

ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు .
వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది .

" ఏమి నీ కోరిక ? " అడిగింది

పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు . కోరికలు అడుగుతూనే ఉన్నాడు . అవి తీరుతూనే ఉన్నాయి . అతడికి విసుగు వచ్చేస్తోంది .

ఎన్నని అడగగలడు ? అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది . భూతం తో పాటు సంపదలూ పోతాయి . ఎలా ?

పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి దగ్గరకు వెళ్ళాడు (ఆయనే గురువు) ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు .

తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి " ఏమి నీ కోరిక ? " అడిగింది

భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు . వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం . అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు . పాతేసి " ఏమి నీ కోరిక ? " అడిగింది .

ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు . నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని అది అని చెప్పాడు పేద వాడు . భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది .

పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు . తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు . తన సౌఖ్యం , తన ఇరుగు పొరుగు సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు .

కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు . భూతం స్థంభం ప్రక్కన నిద్రపోతోంది .

తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు .

ఇక్కడితో కధ కాలేదు .

ఈ కధను మనకు అన్వయించుకుంటే,,,

ఈ కధనుండి మనం ఏమి నేర్చుకుందాం ?

మన మనసే ఆ భూతం . అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది . ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని

సన్యాసి చెప్పిన ప్రకారం భూతం నాటిన స్థంభం " మంత్రం " --- ఎక్కడం దిగడం మంత్రం జపం . జప సాధన !

అను నిత్యం భగవత్ మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది .

అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది . మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది .

అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి , మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము . ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం ! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం!

కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా !!!

మనం మనసు మాత్రమె కాదు . అతకన్నా ఎక్కువ . మనం అవినాశి అయిన ఆత్మలం .

మన మనస్సు అవిశ్రాంత స్థితిలో ఉన్నంత వరకూ మనం మన ఆత్మ దర్శనం .చెయ్యలెము .

మనసుకు విశ్రాంతిని ఇచ్చినపుడే మన ఆత్మ మనకు గోచరం అవుతుంది . అపుడే మనం ఇహపరలోకాల ఆనందాలను అనుభవించగలం .

మన మనసు మనకు ఆలోచననూ , విచక్షణనూ , కోరికలనూ , అవగాహననూ , విమర్శనాత్మక దృష్టినీ , న్యాయాన్యాయ నిర్ణయాలను తీసుకునే శక్తినీ , ఎన్నింటినో ఇచ్చింది . దీనివలన మనం ఈ భౌతిక ప్రపంచం లో జీవనం సాగిస్తూ దైవీ స్థితికి చేరుకోగలం !

మన మనసు భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరం . ఆయన తన మనసును ఉపయోగించి ఈ సృష్టిని సృష్టించాడు . మన మనసుకు సరిగా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకుంటే అది మనం కోరుకున్న జీవితాన్ని సాధించేలా చేస్తుంది

ద్యానమూ , మంత్రం జపమూ చేస్తే అది మనలను ఆత్మ దర్శనం చెయ్యగలిగే స్థితికి చేరుస్తుంది . దాని నియంత్రణలో ఉంచుకోలేక
పోతే అది మనలని నాశనమూ చెయ్యగలదు.

ఒకేసారి అనేక విషయాలను ఆలొచించగలదు . ఒకే ఒక్క విషయం పై కూడా దృష్టి పెట్టగలదు .

మనసుకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనం ఎన్నో విజయాలను సాధించగలం . జీవిత లక్ష్యాలను సాధించగలం . దాని మానాన దానిని వదిలేస్తే
( శిక్షణ లేని మనసు ) అది మన వినాశనానికి హేతువులైన దురాశ , పగ , ప్రతీకారం , కామం , క్రోధం , గర్వం , అహంభావం , --- ఇటువంటి అధమ స్థాయి కోరికలకు బానిసలం అయ్యేలా చేస్తుంది .

మన మనసులో కదిలే ఆలోచనలు మన సమయాన్ని , మన దృష్టినీ కోరుతాయి . అవి మన ప్రవర్తనని నిర్ణయిస్తాయి.

కాబట్టి, బాగా అలోచించి సరైన నిర్ణయం తీసుకోండి!!!!.


👉🏼ధర్మస్య విజయోస్తు🙌🏼
👉🏼అధర్మస్య నాశోస్తు🙌🏼
👉🏼ప్రాణిషు సద్భావనాస్తు🙌🏼
👉🏼విశ్వస్య కళ్యాణమస్తు🙌🏼

No comments:

Post a Comment