Thursday, February 13, 2020

అతీంద్రియ శక్తులు

అతీంద్రియ శక్తులు

1. ఎథిరిక్ :-
శరీరం చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రాన్ని "ఎథిరిక్" అని పిలుస్తారు. మానవుని అణువుల పరిభ్రమణం వల్ల ఓ విధమైన విద్యుత్ ఏర్పడుతుంది. ఇది దేహమంతటా పుడుతూనే ఉంటుంది. దేహంలోని నీళ్ళు, లోహపు అణువులూ ఒక దానితో మరొకటి కలగలసి రసాయనిక చర్యల ద్వారా ఈ విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మన శరీరం మొత్తం ఈ విద్యుత్తు తో నింపబడి ఉంటుంది.
ఎథిరిక్ శరీరాన్ని ఆనుకుని వ్యాపిస్తుంది. శరీరానికి సుమారు అంగుళం లో ఎనిమిదో వంతు నుంచి ఒక్కోసారి ఆరు అంగుళాల దూరం వరకు ఈ ఎథిరిక్ వ్యాపించి ఉండవచ్చు. ఈ ఎథిరిక్ వల్ల ఆ వ్యక్తి ఉత్సాహాన్ని, శక్తినీ, ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. ఉత్సాహంగా ఉంటే ఈ ఎథిరిక్ ఎక్కువ దూరం వ్యాపించును. నీరసంగా వుంటే ఇది శరీరానికి అంటుకుపోయి కనిపించును.


2. ఆరా:-
శరీరాన్ని చుట్టూ ఎథిరిక్ ఆవరించి ఉన్నట్టే 'ఎథిరిక్' చుట్టూ 'ఆరా' మానవ దేహాన్ని కొంత దూరం వరకు ఆవరించి ఉంటుంది. ఆరా కూడా ఎథిరిక్ లాగానే ఎలక్ట్రిక్, మాగ్నటిక్ శక్తితోనే ఏర్పడి ఉంటుంది.
ఎథిరిక్ కన్నా ఆరాలు సూక్ష్మమైనవి. స్థూల శరీరానికి ఎథిరిక్ ఎంత సూక్ష్మంగా ఉంటుందో, అదే విధంగా ఎథిరిక్ శరీరాన్ని ఆవరించి ఉన్న 'ఆరా' అంతకన్నా సూక్ష్మంగా ఉంటుంది. కానీ ఆరా మాత్రం శరీరం చుట్టూ ఓ కోడిగ్రుడ్డు ఆకారంలో విస్తరించి ఉంటుంది. ఈ ఆరా సుమారు 7 అడుగుల ఎత్తు 4 అడుగుల వైశాల్యం ఉంటుంది. 'ఆరా' పై భాగంలో 'హేలో' ఉంటుంది. ఈ హేలో తల మీద పైకి చిమ్మే నీటి ధారలాగా ఉండే ఓ కాంతి పుంజం. ఇది కలువ ఆకారం లో విచ్చుకుంటున్నట్లు ఉండును. ఆరాకు వెలుపల ఓ పొర ఉంటుంది. ఒక ప్లాస్టిక్ సంచిలో పెట్టి బిగించినట్లు
ఈ అమరిక ఉంటుంది. దీనినే 'ఆరాసంచి' (Auric Sheath) అని పిలుస్తారు.
ఈ ఆరా లు ఏదో ఒక వర్ణంలో కనబడవచ్చు. ఆరా వర్ణాన్ని బట్టి ఆ మనిషి యొక్క మనస్తత్వం చెప్పవచ్చు.

➡ ఎరుపు - బలమైన జీవితానికి ఓ సంకేతం.
➡ ఆరెంజ్ - మానవతావాదులు, ఇతరుల యెడల సానుభూతిని కలిగి ఉంటారు.
➡ పసుపు - ఆధ్యాత్మికంగా బాగా ఎదిగి ఉన్నవారు.
➡ ఆకుపచ్చ - సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం.
➡ ఇండిగో - మతాన్ని గాఢంగా విశ్వసించేవాళ్ళు.
➡ ఊదా ( గ్రే) - అధోగతి పాలయిన వ్యక్తిని ఈ వర్ణం సూచిస్తుంది.

హేలో వర్ణం - మనస్తత్వం
➡ పసుపు లేదా కాషాయం - ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నవారు.
➡ బురద - పిచ్చి ఆలోచనలు, వికారమైన ఆలోచనలు కలిగిన వారు.


3. సూక్ష్మ శరీరం:-
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రెండు వస్తువులు ఒకే స్థలాన్ని ఆక్రమించి ఉండగలవు. ఉదాహరణకు నీటిలో ఉప్పు వేస్తే కాసేపటికి రెండూ కలిసిపోయినట్లుగానే. అట్లాగే మన శరీరంలోని అణువులు, పరమాణువుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాలలో కూడా ఇలాగే మరికొన్ని శరీరాలు సులువుగా సర్దుకొని ఉంటున్నాయి. ఈ శరీరాలు తక్కువ సాంద్రతతో - చాలా పలుచగా - దూరం దూరంగా ఉంటున్న అణువులతో నిర్మింపబడి ఉంటాయి. వీటిని మనం 'సూక్ష్మ శరీరాలు' అని అంటాము. ఈ సూక్ష్మ శరీరాలలోని అణువుల సాంద్రత స్థూల శరీరంలో అణువుల సాంద్రత కన్నా చాలా రెట్లు తక్కువగా ఉంటుంది. అంచేత ఈ స్థూల, సూక్ష్మ శరీరం రెండు ఒకే స్థలంలో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఉండగలుగుతున్నాయి.

సూక్ష్మ దేహాన్ని, స్థూల దేహాన్ని కలుపుతూ 'వెండి తీగప్రోగు' (సిల్వర్ కార్డ్) ఉంటుంది. ఈ వెండి తీగలోని అణువులు దూర దూరంగా ఉండి ఓ విలక్షణమైన వేగంతో కూడిన ప్రకంపనాలను కలిగి ఉంటాయి. అణువులు దూరదూరంగా ఉన్నా బలంగా నిలువగలిగిన త్రాడులాగా ఉండగలుగుతుంది. ఈ సిల్వర్ కార్డ్ సహాయంతో సూక్ష్మ-శరీరం ప్రయాణం చేయగలుగుతుంది.
ఈ సూక్ష్మ శరీరంతో సూక్ష్మ లోకాలలో కూడా విహరించవచ్చును. మనం కనురెప్ప పాటు కాలంలో సుదూర ప్రాంతాలకు పయనమై వెళ్ళవచ్చు. చనిపోయిన మన పాత స్నేహితులు, బంధువులు కలవవచ్చు. ఏ సిటీలోని, ఏ లైబ్రరీలోని, ఏ పేజీనైనా క్షణ మాత్ర కాలంలో చదవవచ్చు. మీరు వెళ్ళలేని ప్రదేశం అంటూ ఎక్కడ ఉండదు. ఎంత దూరం లో ఉన్న ప్రదేశం అయినా అనుకున్న వెంటనే అక్కడకు మీరు చేరుకోవచ్చు. ఈ సూక్ష్మ శరీరంతో గాలిలో తేలవచ్చు, నీటిలో మునగవచ్చు, అగ్నిలో దూకవచ్చు, భూమి మీద నడవవచ్చు. ఆకాశంలోని వేరే గ్రహాలకు వెళ్ళవచ్చు. విశ్వంలోని ఏ భాగానికైనా వెళ్ళవచ్చు. మళ్ళీ తిరిగి మీ స్థూల శరీరానికి సిల్వర్ కార్డ్ ద్వారా కనురెప్ప పాటులో చేరవచ్చు.

4. ఆకాషిక్ రికార్డు:-
దీనినే విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారం లేక సూక్ష్మ విజ్ఞానకోశం అని పిలుస్తారు. ఆకాషిక్ రికార్డు అంటే ఓ విధమైన సూక్ష్మ ప్రకంపన. ఈ ప్రకంపన కేవలం కాంతిని మాత్రమే కాదు, శబ్దాన్ని కూడా తనలో పొందుపరుచుకుని
ఉంటుంది. ఇవి విశ్వంలోని సమస్త జీవరాశుల జీవితాల్లోని, అన్ని ఆలోచనల అనుభవాల జ్ఞాన తరంగాలను రికార్డు చేస్తాయి. ఈ ఆకాషిక్ రికార్డులు అనేవి ఎప్పటికీ నాశనం కావు. కాలం వెనక్కి వెళ్ళి ఇందులో మనం గతించిన చరిత్రను దర్శించవచ్చు. ఈ భూమి మీదే కాక సమస్తవిశ్వాల్లోనూ, ఎక్కడైనా సరే, గతంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు. స్థూల శరీరంలో మనం ఉన్నంతవరకూ ఇలా 'కాల-ప్రయాణం' చెయ్యడం కుదరదు. కాబట్టి స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ శరీరాన్ని చైతన్యంతో, మన పూర్తి ఎరుకతో చెయ్యగలిగినట్లయితే ఈ కాల ప్రయాణం చేయవచ్చు. ఈ 'విశ్వ చైతన్య జ్ఞాన భాండాగారాన్ని' తెలుసుకోవచ్చు.

5. టెలీపతీ:-
దీనినే భావగ్రాహక ప్రసారణ విద్య అని కూడా అంటారు. ఇది కూడా ఒక విధమైన ప్రకంపనే. (Vibration)
టెలీపతి అనగా భాష, వ్రాత అన్నది లేకుండా ఎదుటి వారి భావాల్ని మనం అర్ధం చేసుకోవడం లేదా మన భావాల్ని ఇతరులకు అందించడం. జంతు సామ్రాజ్యంలోనూ, వృక్ష సామ్రాజ్యంలోనూ, దేవ సామ్రాజ్యంలోనూ ఈ విధమైన మార్గమే సహజంగా నెలకొని ఉంది.

6. టెలిపోర్టేషన్ :-
వస్తువులను ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వాహనాల ద్వారా చేర్చడాన్ని 'ట్రాన్స్పోర్టేషన్' (Transportation) అంటారు. అలాగే వస్తువులను ఏ వాహనం లేకుండా కేవలం భావనా శక్తి ద్వారా ఒక చోటు నుంచి మరో చోటుకు పంపించడాన్ని 'టెలిపోర్టేషన్' అంటారు.

7. క్లెయిర్ ఆడియన్స్ (Clair Audience) :
దీనినే మనం ఆకాశవాణి అని పిలుస్తాము. టెలీపతికి దీనికి కొంచెం వ్యత్యాసం వుంది. టెలీపతిలో మన భావాలు ఇతరులకు, లేదా ఇతరుల భావాలు మనకు మాత్రమే అందుతాయి. భావాలే కాదు., శబ్దాలు-మాటలు అన్నీ రిసీవ్ చేసుకోవడమే 'క్లెయిర్ ఆడియన్స్'. మనిషి అంతర్ముఖుడైతే ఈ స్థితి లభిస్తుంది. ఈ స్థితిలో దివ్య సందేశాలనూ, దివ్యమైన జ్ఞానాన్ని పొందవచ్చు.

8. క్లెయిర్ వయెన్స్(Clair Voyance):-
దీనినే మనం దివ్యదృష్టి (యోగ దృష్టి) అని పిలుస్తాము. ఏదైనా దృశ్యాన్ని కానీ, వస్తువును కానీ, మాస్టర్స్ ని కానీ, చనిపోయిన వారిని కానీ, దివ్య చక్షువుతో (మూడో కన్నుతో) చూడటమే 'క్లెయిర్ వయెన్స్' అంటే. అలాగే జరుగబోయే సంఘటనలను కూడా చూడడం సంభవిస్తుంది. బ్రహ్మంగారు 'కాలజ్ఞానం' రచించింది ఈ స్థితిలోనే.

9. ఆటో రైటింగ్:-
ఆటో రైటింగ్ అంటే ఆటోమేటిక్ రైటింగ్. ఎవరైనా కాస్త స్వాంత చిత్తంతో కాగితం మీద పెన్నును 15-20 నిమిషాల పాటు కదలకుండా పెట్టి ఉంచితే, కొంతసేపటికి ఆ పెన్ను తనంతట తానే కదలడం మొదలు పెడుతుంది.
అంటే ఇతర లోకంలోని మాస్టర్లు, ఆటో రైటింగ్ సాధన చేసే వారి చేతులను తమ స్వాధీనం చేసుకొని, చక్కటి సందేశాలను అందిస్తారు. ఈ ప్రక్రియను అనుభవజ్ఞులు మాత్రమే చేయగలరు.

10. సైకోమెట్రీ (Psychometry) :-
ఒక వస్తువును తీసి చేత్తో పట్టుకుని, ఆ వస్తువు ఎలా పుట్టిందో, ఏయే మార్పులు దానికి సంభవించాయో, ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో, ఆ వ్యక్తుల మనోగతాలేమిటో స్పష్టంగా చూసి గ్రహించగలిగే విద్యనే 'సైకో మెట్రీ' అంటారు. రహస్య జ్ఞాన విద్యల్లో కుడిచేతిని ఇహానికి, ఎడమ చేతిని పరానికి (ఆధ్యాత్మికతకు) ఉపయోగిస్తారు.

11. హీలింగ్ పవర్ (Healing Power):-
హీలింగ్ పవర్ అంటే వ్యాధుల్ని నయం చేసే శక్తి. ఈ పద్ధతిలో రోగం నయం చేసే వారిని 'హీలర్స్' అంటారు.
వీరు విశ్వ శక్తిని గ్రహించి, దానిని రోగికి అందించి వారి యొక్క రోగాలను నయం చేస్తారు.


పైన పేర్కొన్నవే కాక
12. ఆకాశ గమనం
13. పరకాయ ప్రవేశం
14. కావలసిన రూపం ధరించడం
15.అదృశ్యమవడం
మొదలైన అతీంద్రియ శక్తులు... ఆధ్యాత్మికతలో ఎదిగిన కొద్ది కలుగును. వీటిని ఆధ్యాత్మిక పురోగమనం (జ్ఞాన సముపార్జన) కోసమే ఉపయోగించాలి. వీటిని స్వలాభం కోసం వినియోగిస్తే పతనం తప్పదు. ఇంతటి "శక్తి" మనలో ఉందని చెప్పడానికే ఈ వివరణ.

No comments:

Post a Comment