Tuesday, February 11, 2020

నేను అనే పదం ప్రతి మనిషికీ ఎంతో ఇష్టమైనది

నేను
🕉🌞🌎🏵🌼🚩

రెండే రెండక్షరాల పదం ‘నేను’. ఈ పదం ప్రతి మనిషికీ ఎంతో ఇష్టమైనది. అయినా నేను అనే భావనను పోగొట్టడానికే ప్రతి మనిషీ ప్రయత్నించాలి. ఎందుకంటే నేను అంటే అహం. నేను అనుకున్నప్పుడే ‘నాది’ అనే భావం పుడుతుంది. అన్నింటిమీదా మమకారం కలుగుతుంది. నేను లేకపోతే ఇకనాది అనేది ఉండదు. అందుకే అహంకారాన్ని మనిషి తొలగించుకోవాలి.

అహంకారం మనసులోకి ప్రవేశించాక మనిషి మనుగడే కష్టమవుతుందని మన ఇతిహాసాలు, పురాణాలు బోధిస్తున్నాయి. రామాయణంలో శ్రీరాముడు తన సందేహాలు తీర్చుకోవడానికి వసిష్ఠుడి వద్దకు వెళ్తాడు. లోపలనుంచి వసిష్ఠుడు ‘ఎవరూ’ అని ప్రశ్నిస్తాడు. ‘నేను’ అంటాడు రాముడు. ‘నేనంటే’ అని వసిష్ఠుడు మళ్ళా ప్రశ్నిస్తాడు. ‘అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాను గురుదేవా’ అంటాడు రాముడు. అప్పుడు వసిష్ఠుడు ‘నేను కూడా నేను అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నాకు తెలిసిన తరవాత నీకు బోధిస్తాను’ అంటాడు.


ఈ పాంచ భౌతిక శరీరానికి ప్రాధాన్యం ఇచ్చినంతవరకు ‘నేను’ అనే భావం నుంచి బయటపడటం సాధ్యం కాదు. నేను, నాది, నావాళ్లు అనే ఆలోచనలు స్వార్థానికి దారితీస్తాయి. వీటి మీద మమకారం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. నేను అనే ఈ అహంకారం ఓ అజ్ఞానమని మహాభారతం బోధిస్తోంది. దానివల్ల మనిషి విచక్షణ కోల్పోతాడని, అతడి అభివృద్ధి కుంటువడుతుందని చెబుతోంది .

భారత యుద్ధంలో అర్జునుడు తన ఎదుట శత్రుస్థానంలో నిలిచి ఉన్నవారిని చూసి చలించిపోయాడు. సోదరులు, తాతలు, గురువులు... ఇలా అనేకమంది యుద్ధరంగంలో కనిపించారు. ‘వీరందరూ నా వాళ్లు... వీరినా నేను చంపాల్సింది’ అనే మమకారానికి లోనయ్యాడు . అప్పుడు శ్రీకృష్ణుడి గీతోపదేశంతో ఎరుక కలిగి కర్తవ్యాన్ని పాటించాడు. విజయుడయ్యాడు.

నిండుకుండ తొణకదు అన్నట్లుగా జ్ఞానాధికులు అహంకారం, మిడిసిపాటు లేకుండా వినయ విధేయతలతో కనిపిస్తారు. ఒకసారి సోక్రటీసు ఆలోచనలతో నిమగ్నుడై రహదారిపై నడుస్తున్నాడు. పరధ్యానంగా ఉన్న సోక్రటీసును ఓ అధికారి ఢీకొన్నాడు. ‘ఎవరు నీవు’ అని ఆ అధికారి సోక్రటీసును అడిగాడు. సోక్రటీసు నెమ్మదిగా ‘నేను ఎవరో తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నాను’ అంటాడు.


ఈ శరీరం నాది కాదు’ అని మహానుభావులు గ్రహిస్తారు. వారికి శరీరభావం ఉండదు. వారు పరోపకారం చేస్తూ ఉత్తమ వ్యక్తిత్వంతో మానవత్వ సౌరభాలు వెదజల్లేలా చేస్తారు.

ఒక భక్తుడు రమణమహర్షిని ‘దుఃఖంలో ఉన్నాను... మనశ్శాంతి ఎలా లభిస్తుంది’ అని ప్రశ్నించాడు. రమణమహర్షి ఇలా అన్నారు- ‘నిద్రలో లేని దుఃఖం మెలకువలో ఉంటోంది. కారణం నిద్రలో ‘నేను’ అనే తలంపు లేదు. అంతా సుఖమే. మెలకువ రాగానే ‘నేను’ అనే భావన కలుగుతోంది. అందుకే ‘నేను’ తాలూకు పుట్టుక స్థానాన్ని వెదకమంటున్నాను. ఈ ‘నేను’ పోతే అంతా సుఖమే. అంతా శాంతే!’

ఈ విశ్వానికి సృష్టికర్త ఆ భగవంతుడు. సృష్టి మొత్తం ఆ భగవంతుడిదే. అన్నీ ఆయనవే. ఆయనవి కానివి ఈ లోకంలో ఏమీలేవు. చివరికి మనం కూడా ఈ సృష్టిలోని భాగమే. అందుకే యమునాచార్యులు తమ స్తోత్ర రత్నంలో ఇలా పేర్కొన్నారు. ‘స్వామీ! ఇన్నాళ్లూ ఇదినాది అని అనుకున్నదేదీ నాదికాదని తెలిసిపోయింది. చివరకు నేను అనుకునే నేను కూడా నీకు చెందిన మనిషినే. అన్నీ నీవేనని తెలిసింది. నాదంటూ ఏదీ లేనప్పుడు... అసలు నేనే నాకు కానప్పుడు నీకు నేను ఏమివ్వగలను?’ ఇలా శరణాగతి లక్షణంతో భక్తితత్వాన్ని ప్రకటించిన మనిషి నిరహంకారుడై ఉంటాడు. అప్పుడే నేను గొప్ప, నేను తక్కువ అనే భేదభావం ఆ మనిషిలో ఉండదు. అతడు మానవసేవ చేస్తూ సకల ప్రాణుల్లోనూ సర్వేశ్వరుణ్ని చూస్తాడు.*

🕉🌞🌎🏵🌼🚩

No comments:

Post a Comment