*ఆందోళనకు మూలకారణం ఒక్కటే...
నేను-నాది అనే భావన*
నిజానికి ఈ నేను-నాది అనేవి ఎవడి సొత్తో
వాడికి(ఈశ్వరుడికి)స్వచ్ఛందంగా అప్పజెప్పడమే శరణాగతి.
* * *
నేను-నాది భావనను వదలనంతవఱకు మృత్యుభయం తప్పదు.
దృతరాష్ట్రుడు అటువంటి భావనను వదలకనే
మృత్యుభీతితో ఇలా ప్రశ్నించాడు సనత్సుజాతులవారిని.
దృతరాష్ట్రుడు: మీరు చిరంజీవులు....సృష్ట్యాది నుండి మీరు ఇలానే ఉన్నారు...
మా పూర్వీకులందరూ మరణించారు....త్వరలో నేనూ మరణిస్తాను...
మీ విషయంలో చూస్తే -
మరణం అర్థరహితం.
మా విషయంలో చూస్తే -
మరణం అనివార్యం.
ఇంతకీ మరణం అనేది ఏమి?
మరణం అనేది ఉందా?లేదా?
సనత్సుజాతులు: నీవు శాశ్వతమైన వస్తువును ధ్యానిస్తే నీవు శాశ్వతుడవు.
నీవు అశాశ్వతమైన వస్తువును ధ్యానిస్తే
నీవు అశాశ్వతుడవు.
* * *
అశాశ్వతవస్తువులైన నేను-నాది లను వదిలి
శాశ్వతమైన మహేశ్వరుని చరణాలకు శరణుపొందు...
ఆ పూర్ణార్పణం వలన నీవే ఈశ్వరుడవుతావు.
మృత్యుదేవతకు నీవే అధిపతి అవుతావు.
మరణభయం లేని కాలకాలుడవుతావు.
దేవాలయస్తంభాల మీద శిల్పాలు చూస్తాం...
ఈ అందమైన శిల్పాన్ని చెక్కినవాడెవడో! అని కాసింత ఆశ్చర్యపోతాము.
ఆ "ఎవడో" యొక్క నామ-రూపాలు తెలియదుగాని,
ఎవడో ఒకడు ఉండి ఉండాలి అనేది ఖాయం.
అలాగే ఈ జగత్తును చూస్తున్నాం కాబట్టి
బహువిధశక్తులు కలిగిన కారణకర్త ఒకడున్నాడు అనేది అందరూ అంగీకరీస్తారు.
వాడికి నామ-రూపాలు లేవు.
ఆ "ఎవడో" అనేవాణ్ణి మనం గుర్తుగా కొలుచుకోవడానికి మనలాంటి రూపాలనే చెక్కి దేవాలయాల్లో ప్రతిష్టించుకుని ఆరాధించుకుంటున్నాం.
నిజానికి ఆ "ఎవడో" అనేవాణ్ణి
కేవలం సృష్టికర్తగా మాత్రమే కాకుండా,
సృష్టికూడా వాడే అని గ్రహించడమే ఆధ్యాత్మిక లక్ష్యం.
1.ప్రేక్షకుడు
2.ఫిల్ము
3.తెర
4.కాంతి
ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి లేకపోయినా
సినిమా లేదు.
అలాగే -
1.తెలుసుకునేవాడు(జీవుడు)
2.జీవునిలో అవ్యక్తరూపంగా ఉన్న లోకం
3.తనలో అవ్యక్తంగా ఉన్న లోకం వ్యక్తవడానికి ఆధారంగా ఉన్న మహదాకాశం
4.జ్ఞానం.
ఈ నాలుగూ కలిపి ఈశ్వరుడు.
ఏ ఒక్కటి మాత్రమే ఈశ్వరుడు అనడానికి లేదు.
* * *
ఈశ్వరుడే ఉపాదానకారణము, నిమిత్తకారణము.
మట్టి, కుమ్మరి, కుండ మూడూ ఈశ్వరుడే.
కర్త, కర్మ, క్రియ మూడూ ఈశ్వరుడే.
అని ఉన్నప్పుడు ఇక ఏ అయోమయానికీ తావుండదు.
ఏ ఆటుపోట్లూ లేక జీవితప్రయాణం సాఫీగా హాయిగా సాగుతుంది.
* * *
మూలశక్తి ఒక్కటే.
అదే మూడయ్యింది-
1.వ్యక్తి, 2.జగత్తు, 3.దేవుడు గా
మూడు అయినాగాని "ఒకటి" సదా ఒకటిగానే ఉంది.
నగలుగా బహువచనంగా ఉన్నప్పటికీ
బంగారంగా సదా ఏకవచనంగా ఉన్నట్టు.
బంగార్లు అని ఎవడూ అనడు కదా!
బంగారు సదా ఏకవచనం.
అలాగే ప్రపంచం - బహువచనం.
పరబ్రహ్మం - ఏకవచనం.
నగలు వైపు దృష్టిమాని
బంగారం వైపు దృష్టి పెడితే
ఏకమే ఉంటుంది.
"అహంకారం" వలన సదా అనేకం వైపుకే దృష్టి మరలుతుంటుది.
నీ దృష్టిని సదా స్వరూపనిష్ఠలో ఉంచగలిగితే
దానివలన అహం"కారం" చస్తుంది.
అహంస్వరూపం శేషిస్తుంది
* * *
ఒకడు తిరుపతి బస్సు కోసం యెదురు చూస్తున్నాడు....
గురువుగారు అటువైపుగా వెళుతున్నారు...
గురువుగారికి నమస్కరించాడు...
అతను అంతటితో ఆగొచ్చుగా...
చిన్న సందేహం స్వామీ...అంటూ ఒక ఆధ్యాత్మిక సందేహాన్ని వెలుబుచ్చారు...
ఇప్పుడే చెప్పాలా? అడిగారు గురువుగారు.
అవును స్వామీ...! నాకు చాలారోజులుగా ఆ సందేహం అట్టే ఉండిపోయింది....అన్నాడు.
సరేనని ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోయారు-
అంతలో తిరుపతి బస్సు వచ్చేసింది...
సరే స్వామీ... వస్తాను... మళ్లే ప్పుడైనా మాట్లాడుదాం... అని బస్సు వైపుకు పరుగెత్తబోయాడతడు....
గురువుగారు వాని చెయ్యిని గట్టిగా పట్టుకుని ఆపారు.
"ప్రశ్న అడగడం నీ ఇష్టమే...వదిలేసి వెళ్లిపోవడమూ నీ ఇష్టమేనా? సమాధానం విని వెళ్లు...ఇంకో బస్సు వస్తుంది, వెళ్లొచ్చులే..." అన్నారు గురువుగారు.
అతను కాళ్లావ్లేళ్లా పడ్డాడు...స్వామీ...తిరుపతిలో కేసు వాయిదాకు హాజరుకావాలి...నన్నొదిలేయ్...! అంటూ...
గురువుగారు వదిలేశారు...
* * *
బస్సు వచ్చేలోపు కాలక్షేపానికి అడిగిన ప్రశ్న అది.
ఒకవేళ గురువు సమాధానం ఇచ్చినా అది ఏ మాత్రం అతని ఉపయోగపడుతుందో ఆలోచించండి...
ప్రశ్నకు, పరిప్రశ్నకు ఇదే తేడా...
కాలక్షేపానికి అడిగేది ప్రశ్న...
ప్రాణావసరంగా అడిగేది పరిప్రశ్న...
* **
వివేకానంద తన శిష్యులకు వేదాంతపాఠాలు చెబుతుంటే,
ఓ వృద్ధుడు వచ్చి కూర్చొనేవాడట...
ఆ వృద్ధుడు రాగానే, పాఠం చెప్పడం ఆపేసేవారు స్వామి...
ఆ వృద్ధుడు లేచి వెళ్లిగానే, మళ్లీ పాఠం మొదలుపెట్టేవారు...
శిష్యులు అడిగారు-
పాపం ఆ వృద్ధుడు మీ బోధలు వినాలని వస్తున్నాడు...మీరెందుకు అతని పట్ల కినుక వహిస్తున్నారు? అని.
"అతడు ఐహికసుఖాలన్నీ అనుభవించి, శరీరం కృశించి, ఇక ఏమీ తోచక కాలక్షేపానికి వస్తున్నాడు.
మీరో? మీ జీవితాల్ని భగవంతుని కోసం అర్పించినవారు...
నా ఉనికి మీ లాంటి వారికోసమేగాని,
అలాంటి బలహీనుల కోసం కాదు."
అని జవాబిచ్చారు స్వామి.
* * *
నిరాకారుడైన భగవంతుణ్ణి కొలవడం ఎలాగో తెలియకతన రూపంలాగే రూపొందించి తలుస్తున్నాడు, కొలుస్తున్నాడు మానవుడు.
తప్పదు మొదట్లో.
సాకారోపాసన ద్వారా నామరూప రహితమైన స్థితికి తాను ఎదగాలి.
ఆ నిరాకారస్థితిలో
భగవంతుణ్ణి ఎలా చూడగలడు?
"తాను"గానే ఉండగలడు(అనుభవించగలడు) అంతే.
సాకారుడు అంటే ఒక రూపానికే పరిమితమైనవాడు.
నిరాకారుడు అంటే సకలాన్ని తన రూపంగా ఉన్నవాడు.
అనంతమైన ఆకారమే నిరాకారం.
పరిమితమైన అనంతమే సాకారం.
తాను సాకారుడైనప్పుడు పరిమితదృష్టే ఉంటుంది.
కాబట్టి స్వరూపాన్ని చూడలేడు.
తాను నిరాకారుడైనప్పుడు
అనగా "చూచేవాడు-చూడబడేది-చూపు" మూడూ కలిపి "కన్ను"గా ఉన్న ఆ తుదిలేని కన్నుతో ఏంచూడగలడు?
చూడలేడు.
వెఱసి సాకారుడు, నిరాకారుడు
ఇద్దరూ స్వస్వరూపాన్ని కానలేరు...
* * *
అంధుడికి, దేవుడికి దృశ్యం కనబడదు.
దృశ్యముండి కన్నులేక కనలేనివాడు అంథుడు.
దృశ్యం కూడా కన్నులో భాగమై ఉన్నందు వలన
ఆ "తుదిలేని కన్ను"తో కనలేనివాడు దేవుడు.
* * *
నిన్ను విడిచి ఎక్కడా ఏమీలేదు.
నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్లొద్దు.
నిజానికి నిన్ను నీవు విడవలేవు.
కానీ నిన్ను నీవు విడిచినట్టు భ్రమపడతావు అంతే.
నిన్ను నీవు విడిస్తే - బంధం.
నిన్ను నీవు విడవకుంటే - మోక్షం.
దేవుని కోసం గురువు కోసం
ఒక్క అడుగు కూడా వేయవద్దు.
నీవున్న చోటు పేరే - దేవుడు.
నీవున్న చోటు పేరే - గురువు.
* * *
తోటి బాటసారిగా తనతో నటిస్తూ వస్తున్న
ఓ దొంగ తలగడ క్రిందనే
ఒకడు తన ధనం ముటను దాచాడట.
ఆ దొంగ అంతటా వెతికాడేగాని
తన తలగడ క్రింద వెతకాలనే ఆలోచనే కలగలేదు.
తన హృదయంలోనే నేను-నేను అంటూ
అహంస్వరూపంగా ఉంది ఆ పరధనం.
సత్యాన్వేషి తన్నొదిలి అంతటా వెతుకుతున్నాడే గాని
తనలో వెతకాలనే ఆలోచనే కలగడం లేదు.
తనలో తాను వెతికితే...అన్వేషణ సమాప్తం.
No comments:
Post a Comment