🙏🕉️🙏 ...... *"శ్రీ"*
*"ఓం అరుణాచలేశ్వరాయః"*
🪷🍇🪷🍇🪷🍇🪷
🪷🍇🕉🍇🪷
🪷🍇🪷
🪷
*"1. అంతర్ముఖత్వ సాధన"*
**************************
*"మహావాక్యాలూ, వాటి అర్ధనిర్ణయాలూ అంతులేని చర్చలకు దారితీసి సాధకుల మనస్సులను బహిర్ముఖంగా ప్రసరింపజేస్తూ ఉంటాయి. మనస్సును అంతర్ముఖం చెయ్యాలంటే సాధకుడు సూటిగా “నేను" లో నిలకడ సంపాదించుకోవటం అవసరం. బాహ్య ప్రవృత్తులంతరించి అతనికి అప్పుడు పరమశాంతి చేకూరుతుంది."*
*"2 . అంతా చిద్విలాసం"*
***********************
*"శివ శక్తులన్నా, ఈశ్వర జగత్తులన్న అంతా శివస్వరూపమే. ఒకటి శివుని అచల స్వరూపం, రెండవది శివుని సచల స్వరూపం, చిద్వస్తువే అటు అచలంగా , ఇటు సచలంగా కూడా ఉంది. చైతన్య స్వరూపులు కానివారెవ్వరు? చైతన్య స్వరూపమైన ఆత్మ ప్రత్యక్షం కాకపోతే శివుడు ప్రత్యక్షం కాలేదన్నమాటే."*
*"అంతా మాయేనా?"*
********************
*"అంతా మాయ, అసత్యమే కాని, సత్య వస్తునేది లేదంటారు కొందరు. కానీ, అంతా అసత్యమని నిర్ణయిస్తున్నది ఎవరు? అసత్యమైతే ఈ నిర్ణయం కూడా అసత్యమే కాదా? సృష్టి వికాశసిద్ధాంతం యిట్టి దృష్టి గల వానిచే ప్రపంచించబడింది. కానీ, అది ఎక్కడ ఉన్నది? మనస్సులో కాదా?"*
*"అందరూ గురువులే"*
*******************
*"లోకంలో చెడ్డ వారు, మంచివారు - అందరూ మన కు గురువులే, చెడ్డవారు తమ చెడ్డపనుల ద్వారా "నాచెంతకు రాబోకు' మని బోధిస్తూ ఉంటారు. మంచివారెప్పుడూ మంచివారే కదా. కనుక లోకంలో అందరూ మనకు గురువులవంటివారే".*
*"ఆకర్మ"*
********
*"అకర్మ అనగా కర్మగాని కర్మ. అహంకారం నిర్మూలమైన తరువాత చేయబడే కర్మే అకర్మ."*
*"ఆజ్ఞానం - ప్రజ్ఞానం"*
******************
*"సుషుప్త్యవస్థ అజ్ఞాన మంటూ వుంటారు. కానీ, జాగ్రదావస్థలోని వీపరీత జ్ఞానాన్ని బట్టి దానిని అలా అనడం జరుగుతుంది. జాగ్రదావస్థయే నిజానికి అజ్ఞానం. సుషుప్యవస్థ ప్రజ్ఞానం. "ప్రజ్ఞానం బ్రహ్మ" అని శ్రుతి చెప్పుచున్నది. సుషుప్తిని అనుభవించేవాడు ప్రజ్ఞానం. మూడు అవస్థల్లో కూడా అతడు ప్రజ్ఞానమే అయినా, సుషుప్తిలో ప్రజ్ఞాన ఘనుడు."*
*"అజ్ఞాన వినాశం"*
*****************
*"సూర్యరశ్మికి దూది తగులబడదు, భూతద్దం క్రింద దానిని ఉంచినప్పుడు మాత్రం, భూతద్దం ద్వారా ప్రసరించిన సూర్యకిరణాల కది నిప్పంటుకొని తగులబడి పోతుంది. అట్లే ఆత్మ యొక్క ఎరుక సర్వకాల సర్వావస్థలలోనూ ప్రకాశిస్తూ వుండేదే అయినా, జీవుని అజ్ఞానాన్ని మాత్రం అది నశింపచేయదు. ధ్యానసాధన ద్వారా చిత్తవృత్తి రాహిత్యపూర్వకమైన విశుద్ధ అహంస్ఫూర్తిని సాధించినప్పుడు అజ్ఞానం పూర్తిగా నశంచి పోతుంది".*
*"అజ్ఞానానికి ఆధారం"*
********************
*"సర్వమూ ఆత్మ పై ఆధారపడినదే. ఆత్మ పైన ఆధారపడనీది ఏదీ లేదు. ఏమంటే, అజ్ఞానం కూడా ఆత్మశక్తి విశేషమే. ఆత్మను బాధించ కుండా అది ఆత్మయందు గోచరిస్తుంది. అయితే, దానిచేత బాధించబడేవాడు అహంకార విశిష్టుడైన జీవుడు. కనుక, అజ్ఞానం జీవునిది."*
*"ఆద్వయ సుఖం"*
*****************
*"గాఢనిద్ర కూడా అద్వైత స్థితియే. జీవాత్మ పరమాత్మల భేదం అక్కడ లేదు. అన్ని భేదాలనూ మరచే స్థితి అది. అలా మరవడంలోనే సుఖమున్నది. ఆ సుఖం సంపాదించడం కోసమై జనులు మెత్తని పరుపులూ దిండూ మొదలైన వాటిని ఏ విధంగా సిద్ధం చేసుకుంటారో చూడండి. మెలకువ పోయి కమ్మని నిద్ర తెప్పించుకోడానికి ప్రయత్నమిది. కానీ, గాఢ నిద్రలో ఈ మెత్తని పరుపులు మొదలైన వాని అక్కర ఏమీ లేదు. దీని అభిప్రాయమేమంటే, సకల ప్రయత్నాలూ అజ్ఞాన నీర్ములనకే. జ్ఞానోపలబ్ది అయిన తరువాత ఇక ఏ ప్రయత్నాలతోనూ పని లేదు".*
*"అధికార భేదం - ధ్యాన పద్ధతి"*
*************************
*"సాధకుని అధికార భేదాన్ని బట్టి ధ్యాన పద్ధతి మారుతూ వుంటుంది. పట్టుకోగలిగితే నీ లోపల ఆలోచించే వానిని సరాసరి పట్టుకో, అప్పుడా ఆలోచించేవాడు తనకు మూలమైన శుద్ధ చైతన్యంలో తనంత తాను లీనమైపోతాడు. ఆ పద్ధతి కుదరకపోతే ఈశ్వర ధ్యానం చెయ్యి, అది నిన్ను పరిశుద్ధుని గావించి, నీలో ఆలోచించే వానిని పట్టుకోగలిగేటట్టు చేస్తుంది. తద్ద్వారా శుద్ధ చైతన్యంలో నీవు లీనం కాగలుగుతావు".*
*"అభయ స్థితి"*
*************
*"భయమనేది ఒక చిత్తవృత్తి. ఆత్మకంటే రెండవ వస్తువేదైనా ఉంటే భయపడడం యుక్తమే. కానీ, ఈ రెండవ వస్తువును చూస్తున్న దేవరు? మొదట అహంకారం తలయెత్తి ఆ పైన విషయాలను తన వెలుపల ఉన్నట్టు చూస్తుంది. అహంకారం తలయెత్తక పోతే ఉన్నది ఆత్మ ఒక్కటే, - రెండవదీ లేదు. ఆత్మస్థుడైన వానికి అహంకారాన్ని ఆశ్రయించుకొని బయలుదేరే సంశయాలూ భయాలూ మొదలైనవి ఏవీ ఉండవు."*
*"అభ్యాసం"*
***********
*"ఆలోచనవలన విక్షేపం పొందినప్పుడెల్ల, ఆత్మలోకి ఉపరమించే ప్రయత్నం చెయ్యడం అభ్యాసం. అది మనస్సును ఏకాగ్రం చెయ్యడమూ కాదు. వినాశం పొందించడమూ కాదు. కేవలం ఆత్మలోనికి ఉపరమించడం. తీవ్రంగా ఆలోచించగలిగితే మనస్సు చాలా బలంగా వున్నట్టు సామాన్యంగా అనుకుంటూ వుంటారు. కానీ, జ్ఞాన సాధనలో ఏ ఆలోచనలూ లేకుండా ఉండగలిగినప్పుడే మనస్సు చాల బలంగా ఉన్నట్టు. సాధకుడు తాను ఆత్మగా ఉండిపోవడం నేర్చుకోవాలి. ఆది చేతగానప్పుడు "నేను" అనే దాని నిజతత్త్వం విచారం చేసుకుంటూ ఇతరాలోచనలు వచ్చినప్పుడెల్ల తిరిగి దానినే చిక్కబట్టుకుంటూ రావాలి. ఇదే అభ్యాసం."*
*అరిషడ్వర్గ విజయం*
*********************
*"కామాది అరిషడ్వర్గాన్ని ఎలా నిగ్రహించడం? ఈ ఉద్వేగాలు ఎవరివో కనుక్కో. నీవు ఆత్మస్థుడవై ఉండగలిగితే ఆత్మకంటే వేరుగా నీ కేదీ కనిపించదు. అప్పడు నిగ్రహంచడమనే ప్రసక్తికే అవకాశం వుండదు."*
*'అసలు నేను'*
****************
*"అసలు నేను" చూడబడే వస్తువు కాదు. చూడబడేది, చూచేది, చూపు - - మూడూ దాని అభివ్యక్తులు. ఆత్మ సాక్షాత్కారంలో చూడబడేది ఏమీ ఉండదు. ఎరుక యే దాని స్వస్వరూపం. దాని వెలుగులోనే శరీరం, అహంకారం, ప్రపంచం మొదలైనవన్నీ ప్రకాశిస్తాయి.*
No comments:
Post a Comment