కర్మసిద్ధాంతం - 08
జీవుడు కర్మలను మూడు శరీరాల ద్వారా చేస్తాడు. అవే
1. స్థూల శరీరం
2. సూక్ష్మ శరీరం
3. కారణ శరీరం
ఆత్మ వీటికి అతీతమైనది.
1. స్థూల శరీరం అంటే కంటికి కనిపించే ఈ భౌతిక దేహం. ఇది పృధ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల వలన ఏర్పడిన పాంచభౌతిక దేహం. ఇది కాలానికి లోబడి ఉంటుంది. ఒకనాడు మరణం పాలవుతుంది. అగ్నికి ఆహుతువ్వడమో, లేదా మట్టిలో కలిసిపోవడం జరిగి, పంచభూతాల్లో లయమవుతుంది. ఈ స్థూల శరీరం నిలబడటానికి ఆహరం అవసరం. ఇది అనేక రకాల వ్యాధులకు లోనవుతుంది. జీవుడు తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరిచి, అతడి పడాల్సిన వేదనను అతనికిచ్చే వాహకం ఈ స్థూల శరీరం.
గత జన్మల్లో జీవుడు చేసిన పాపపుణ్యాల ఆధారంగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడు పంచీకరణం జరిగి, అతడి కర్మఫలానికి తగిన విధంగా స్థూల శరీరం ఏర్పడుతుంది.
ఆదిశంకరులు తత్త్వబోధలో దీని గురించి ఈ విధంగా చెప్పారు. పంచభూతాల కారణంగా పాపపుణ్య కర్మఫలాల కారణంగా పంచీకరణం చెంది రూపుదిద్దుకుంటుంది స్థూలశరీరం. ఇది సుఖదుఃఖాలకు నివాసస్థానం. షడ్ (6) వికారాలకు లోబడి ఉంటుంది. అవే
అస్తి - తల్లి గర్భంలో అండరూపంలో ఉండటం.
జాయతే - పుట్టడం
వర్ధతే - పెరగుట
విపరిణమతే - మార్పు చెందుట
అపక్షీయతే - కృశించుట
వినశ్యతి - నశించుట
అంటే తల్లి గర్భంలో ఏర్పడటం (అస్తి), రూపం పొంది పుట్టడం (జాయతే), పెరిగి పెద్దవ్వడం (వర్ధతే), క్రమంగా రూపాంతరం చెందడం (శరీరంలో మార్పులు చెందడం), ఒక వయస్సు వచ్చాక ఎలా ఎదిగామో, అలా ఒక్కో ఇంద్రియం శక్తి క్షీనించడం, అనగా ముసలితనం రావడం (అపక్షీయతే), మరణించడం (వినశ్యతి). వికారం అంటే మార్పు. ఈ 6 మార్పులు లేదా వికారాలు అనేవి భౌతిక దేహం యొక్క లక్షణాలు.
2. సూక్ష్మ శరీరం అంటే మనస్సు. ఈ సూక్ష్మ శరీరాన్నే లింగశరీరం అని కూడా అంటారు.దీన్నే అంతఃకరణం అని కూడా అంటారు. ఇది కంటికి కనిపించకపోయినా, చేయాలసిన కర్మలను చేస్తుంది.
శంకరులు ఇలా అంటారు - ఇది పంచభూతాలతో పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడిన రూపం. సత్కర్మజన్యం అనగా ఇది సత్కర్మ వలన ఉద్భవిస్తుంది. సుఖదుఃఖాది భోగాలకు సాధనం. ఇందులో మొత్తం 17 తత్త్వాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మ్యేంద్రియాలు, పంచ (5) ప్రాణాలు, మనస్సు మరియు బుద్ధి.
ఇవి సూక్ష్మంగా ఉన్నందువలన వీటిని ఇంద్రియాలు అంటారు. స్థూల దేహంలో ఉన్నవాటి ప్రతిరూపాలను గోలకాలు అంటారు. ఉదాహరణకు చెవితమ్మె స్థూలమైతే, వినికిడి శక్తి దాని సూక్ష్మరూపం). సూక్ష్మ శరీరం ఒక జీవుడి నుంచి ఇంకో జీవుడికి వేరుగా ఉంటుంది, కాబట్టి ప్రతి జీవుడు ప్రత్యేకమైనవాడు. ఈ అన్నింటితో ఉండేది సూక్ష్మ శరీరం.
సూక్ష్మశరీరం అనేది పంచభూతాల పంచీకరణం అనే ప్రక్రియకు ముందు ఏర్పడింది. కనుక వాటిని పంచ తన్మాత్రలు అంటారు.
ఈ సూక్ష్మశరీరం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'సాధనం' (Instrument). స్థూలశరీరం అనేది సుఖదుఃఖాలను అనుభవించడానికి 'ఆయతనం' (Locus) అంటే అందులో ఉండి, సూక్ష్మశరీరం ద్వారా అనుభవిస్తామన్నమాట. రకరకాల అనుభూతులు ఉంటాయి కనుక, వాటిని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి అనేక రకాల ఉపకరణాలు (సాధనాలు) కావాలి.
ఇంకా ఉంది..
No comments:
Post a Comment