*వాయిదాలు వేయవద్దు.*
➖➖➖
*“లోకం సమస్తం శోకహతం!”అంటున్నారు శంకరాచార్యులవారు.*
*నాది నాది అనే భ్రమలతోను, వ్యాధులతోను బాధపడుతూ ఏడవలేక నవ్వుతూ, చావలేక బ్రతుకుతూ ఎలాగో గడుపుతుంటారు జీవితాన్ని చాలామంది అందుకే!*
*మనం ఎక్కడ నుండి వచ్చామో, ఎక్కడకు పోవాలో, ఆ మార్గంలో ప్రయాణించటానికి 'ఇప్పుడే, ఇక్కడే' నిర్ణయం ఏమని ఎలా తీసుకోవాలి.*
*తామరాకు మీద నిలిచిన నీటిబొట్టు ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. ఇటూ అటూ కదులుతూ అంతలోనే అదృశ్యమైపోతుంది.*
*అలాగే మానవ జీవితం నీటి బుడగలాంటిది. క్షణికమైనది, ఇప్పుడున్నట్టే ఉంటాం. మరుక్షణంలో ఉంటామో లేదో తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం నుండి వీడ్కోలు తీసుకోవాల్సిందే.*
*అనంతకాల ప్రవాహంలో మానవ జీవితకాలం అత్యంత అల్పమైనది. పోనీ అల్పమైనదైతే అయింది. ఉన్న కొద్ది కాలమైనా సుఖంగా హాయిగా ఉంటామా అదేం లేదు. *
*పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాం, పుట్టిన తర్వాత బాల్యంలో తల్లిదండ్రులు అడిగిన వాటిని కొనిపెట్టలేదని ఏడుస్తాం. యుక్తవయస్సు వచ్చిన తర్వాత అనేక కోరికలు కలుగుతూ ఉంటాయి.*
*అవి తీరకపోతే తీరలేదని ఏడుస్తాం, తీరితే కొత్త కోరికలు పుట్టి వాటికోసం ఏడుస్తాం. ఆ తర్వాత వృద్ధాప్యం ప్రవేశిస్తుంది.*
*శరీర అవయవాలు పట్టు తప్పుతాయి, బలం సన్నగిల్లిపోతుంది, దానికీ ఏడుస్తాం, ఇక జీవించినంతకాలం రకరకాల జబ్బులు, దీర్ఘవ్యాధులు వస్తూ ఉంటాయి, వాటితో దుఃఖ పడుతుంటాం, ఏడుస్తుంటాం.*
*జన్మ ఉండేది కొద్దికాలం, ఆ ఉన్నంతకాలం కూడా అనేక దుఃఖాలు, బాధలు, భయాలు, శోకాలు. ఇలాంటి జీవితంలో నీవు ఎక్కువగా ఆశలు పెట్టుకోరాదు. వాటిని తీర్చుకొనుటకు ప్రయత్నిస్తూ నీవు మూర్కుడివి కావద్దు.*
*ఒక్కక్షణం ఈ జీవితాన్ని వృధా చేసినా ఆ క్షణం మళ్ళీ తిరిగిరాదు. మృత్యువు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుంది, అన్నా నిత్యమూ గుర్తుంచుకోవాలి.*
*మరైతే మన కర్తవ్యం ఏమిటి.. మానవ జీవిత పరమలక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి.*
*మనం ఎక్కణ్ణించి వచ్చామో, ఎక్కడకు పోవాలో తెలుసుకోవాలి.*
*ఆ మార్గంలో ప్రయాణించటానికి 'ఇప్పుడే, ఇక్కడే' నిర్ణయం తీసుకోవాలి, రేపు చూద్దాం అంటే కుదరదు, ఆ రేపు అసలు నీకున్నదో లేదో తెలియదు.*
*భగవద్గీత చెబుతున్నారట గదా ! నాకూ వినాలని ఉన్నదండీ! ఏదీ ఎంత తెముల్చుకుందామన్నా పనులతో తీరటం లేదు. ఏమైనా సరే వచ్చే సంవత్సరం నుండి తప్పక రావాలి, వినాలి అంటాడు.*
*పాపం వచ్చే సంవత్సరానికి భగవద్గీతను వాయిదా వేశాడు గాని, వచ్చే నెలలో రాబోతున్న చావును వాయిదా వేయగలడా...?*
*కనుక భగవత్సంబంధమైన ఆధ్యాత్మిక కార్యాలలో గాని, సత్కార్యాలు చేయటంలో గాని ఏమాత్రం జాప్యం పనికిరాదు, “ఆలస్యం అమృతం విషం” అన్నారు.*
*వాయిదాలు కూడదు, ఇప్పుడే - ఇక్కడే అనే సూత్రాన్ని పాటించాలి.*
.
No comments:
Post a Comment