Thursday, March 30, 2023

శ్రీ రమణీయం - 6 🌹 🥀 కార్యమా? కారణమా? 🥀

 [3/27, 17:11] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 6 🌹
🥀 కార్యమా? కారణమా? 🥀 
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ, 
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

🌈 6. కార్యమా ? కారణమా? 🌈

✳️ మనం పనిని కాదు! ప్రేరణని గుర్తించాలి! రోజు చేసే పనుల్లో మన ప్రయత్నాలను మాత్రమే పరిగణిస్తున్నాం. అందుకే అంతా మన ప్రమేయంతో జరిగిపోతుందన్న భ్రమతోనే ఉంటున్నాం. కానీ, మన ప్రమేయం లేకుండానే జరిగిపోయేదే ‘విధి’ అని మరచిపోతున్నాం. ఈ భ్రాంతిపోవాలంటే అసలు ఆ ప్రయత్నానికి వెనుక ఉన్న “ప్రేరణ” ఎవరిది అని విచారించి గుర్తించాలి. ఈ సృష్టిని నడిపే ఈశ్వరుడే మనలో ప్రేరకుడిగా ఉన్నాడని గుర్తించిన రోజు ఈ అహంకారం నశిస్తుంది. ఆనందం మన సొంతం అవుతుంది. 

✳️ సద్గురువులు, సత్పురుషులు కేవలం ఆ ప్రేరణతోనే తమ ప్రత్యేక సంకల్పం ఏదీ లేకుండా సంచరిస్తారు. కనుకనే వారు ఈశ్వర సమానులు. మనం చేయకపోయినా ఏదీ ఆగదు. కనుకనే దాన్ని 'విధి' అన్నారు. అది తెలియక,  నేను చేస్తున్నాను అన్న భావన చేత మనకి ఆధ్యాత్మిక సాధన భారం అవుతుంది. ఆత్మ చింతనకు తనకు శక్తిచాలటంలేదన్న భక్తునితో భగవాన్ ఇదే వివరించారు. 

✳️ అసలు 'నేను’ అన్న భావనలోనే సరియైన అవగాహన లేకనే ఇదంతా. అందుకే భగవాన్ 'నేనుఎవరు?’ అన్నప్రశ్ననే సాధనగా చెప్పారు. 'నేను ఎవరు?' అన్న ప్రశ్న కేవలం ఈ మనోదేహాల పరిధిలో వేసుకుంటే 'నేనంటే ఈ మనోదేహాలే’ అనిపిస్తుంది. మనుసుని, దేహాన్ని వివేకం చేత విడి విడిగా విశ్లేషిస్తే అసలు కిటుకు తెలుస్తుంది. మనం ఇప్పుడు 'నేను'గా భ్రమిస్తున్న మనసుగానీ, దేహంగాని అసలు 'నేను' కావని వీటికి ఆధారభూతమై మనోదేహాల ఉనికికి కారణమైన చైతన్యమే నిజమైన 'నేను' అని విశదమౌతుంది. వినటం ద్వారా అవగాహన అయిన ఈ విషయాన్ని సదా మననం చేసుకుంటే అది ధ్యాసగా మారి అనుభవాన్ని ఇస్తుంది. మనోదేహాలను విశ్లేషించటమే విచారణ మార్గంలోని ప్రాథమికఅంశం. అందుకు మనకి స్వప్నస్థితి సహకరిస్తుంది.

✳️ సహజంగా మనందరికీ మనసు, దేహాలంటే వేరు వేరు అన్న భావన ఉండదు. ఈ స్థితి నుండి తాను మనసునని, ఈ దేహం ఉపాధి మాత్రమేనన్న వివేచనకు రావాలంటే మన ప్రతి కదలికను మనం గమనించుకోవాలి. మనం మెలుకువలో ఉండి చేసే పనుల్లో అసలు మనసు అనేది ఉందన్న విషయమే మరచి దేహంగానే భావిస్తూ పనులు చేస్తాం. స్వప్నంలో ఈ దేహం నిద్రపోయి ఉండగానే మనసు మాత్రం దేహాంగకర్మలు చేస్తూనే ఉంటుంది. పగలు దేహంతో ఉండే మనసు స్వప్నంలో కూడా దేహంగా భావించి సంచరిస్తుంది. జాగృతిలో దేహమే మనసుగా ఉంటే, స్వప్నంలో మనసే దేహంగా ఉంటుంది. ఈ రెంటికీ విడదీయలేని ఈ బంధం వల్లనే అసలు ప్రాణం ఒకటి ఉందని అదే ఈ పనులు చేయిస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. 

✳️ ఈ దేహ వ్యవస్థ, మనోవ్యవస్థలను విశ్లేషించి వాటిపూర్తి స్వరూప స్వభావాలు తెలుసుకోవడమే విచారణమార్గం. అందుకే కేవలం మన ప్రయత్నాలు, కార్యకలపాలనే కాకుండా ప్రతి పని వెనుక ఉన్నప్రేరణ ఎక్కడ నుండి వస్తుందో గమనించే ప్రయత్నం చేయాలి. మనకు అనుభవంలోకి వచ్చే ప్రమాదాలు, అదృష్టాలు కేవలం ఎదురయ్యే సంఘటనలే తప్ప మన సంకల్ప ఫలితాలుకాదు. అయినా వాటిని మనకే ఆపాదించుకుంటాము.

✳️ మొలిచే గుణం విత్తనంలో, మొలిపించే గుణం భూమిలో ఉందని మరచి వాటిని మనమే పెంచుతున్నామని అనుకుంటాం. ఎవరి ప్రమేయం లేకుండా పెరిగిన కీకారణ్యం మాటేమిటి? దీని భావం మన ప్రయత్నం అక్కర్లేదని కాదు. ఆ అహంకారం విడనాడమని. అలానే “విధిని తప్పించలేము” అని అంటే అది మన చేతిలో లేదని స్పష్టం చేయటమే. అసలు విధి స్వరూపం ఒక్కక్షణం ముందైనా మనం తెలుసుకోగలమా? మరి దానిలో మన ప్రమేయం ఎలా ఉంటుంది. విధిని నడిపించే ఆ మహాచైతన్యం మాత్రమే దాన్ని ఎలాగైనా మార్చగలదు. లేనిది ఊహించటం మానుకొని ఉన్నది గమనించటమే విచార మార్గం. ఒకే సూర్యుడు వంద నీళ్ళ కుండల్లో ప్రతిబింబించినట్లే విశ్వమంత నిండిన ఆ మహాచైతన్యం ఉనికి మన హృదయంలోనూ వెలుగుతుంది. మనం ఈ దేహం అని అనుకుంటున్నాం కనుక ఆ దైవాన్ని ఈ దేహంలో మాత్రమే వెతకగలం. దైవాన్ని హృదయంలో వెతకటం ద్వారా బాహ్యదృష్టితగ్గి సత్యశోధన అలవడుతుంది. 

✳️ మనలో ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఆ దైవం మనసు, దేహాల ద్వారా వ్యక్తం అవుతూనే వాటినుండి పూర్తిగా విడిగానే ఉన్నాడు. నడిచేది, మాట్లాడేది, చూసేది, చేసేది అన్ని ఆ చైతన్య శక్తి మాత్రమే. మనలో ఉన్న ప్రాణం సర్వ స్వతంత్రం అయితే అందరిలోను సమానంగా ఉండాలి కదా ! కానీ అది ఓ మహా చైతన్యం ప్రేరణలో మాత్రమే మన దేహాల ద్వారా వ్యక్తం అవుతుంది. ఆ ప్రేరణని గుర్తించటమే ఆత్మానుభవం. మేఘాలు కదిలినా చంద్రుడే కదులుతున్నాడన్న భ్రమ కల్పించినట్లే చైతన్య కదలికను మరచి మనసు దేహాల గమనాన్ని గుర్తిస్తున్నాం.

✳️ ముక్తుడైన యోగి నియమించిన పనిని మాత్రమే చేస్తూ పోతాడు. అంతేగాని ప్రత్యేకంగా ఫలానా పని చేయాలనిగానీ, వద్దనిగాని అనుకోడు. చైతన్యస్రవంతి ఉండే సద్గురువుల దేహం, మనసు అన్ని ఆత్మగానే ఉంటాయి. వారి మనోదేహాలను స్మరించుటం చేతనే మన మనసులు సైతం ఆ ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాయి. వారి కాయము (శరీరం) కూడా సత్తు (ఆత్మ) గానే ఉంటుంది. కనుకనే వారిని 'సకాయులు' అంటారు.
[3/27, 17:12] +91 73963 92086: వారిని అనుసరించినా, అనుకరించినా, దర్శించినా, స్పర్శించినా మనకి ఆ దివ్యత్వపు శాంతి సంక్రమిస్తుంది. రమణ భగవాన్ సన్నిధిలో జంతుజాలాలు సైతం వాటి ప్రవృత్తిని, స్వభావాన్ని మర్చిపోవటం మనకి ఆవిషయాన్నే విశదపరుస్తుంది. సద్గురు సన్నిధి మనకు ఆ అనుభూతిని ఇస్తుంది. పరమాత్ముడు అయిఉండి కూడా సామాన్యుడిగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ లాగానే సద్గురువులు ఎక్కడా తాము అధిపత్యాన్ని ప్రదర్శించరు. 

✳️ 'సత్య దర్శనం' కావలన్న శుభేచ్చని కోరితే దైవం ఎన్నడు తిరస్కరించడు. తాను శివుడికి వేరుకాదన్న అద్వైత స్థితి వచ్చినా ముక్తుడు తాను ఆ స్థితికి ఎదిగిన సాంప్రదాయ మార్గాన్ని అందరికీ చూపడం ధర్మం. కేవలం అంతర్గత సాధనను మాత్రమే గౌరవిస్తే తరతరాలకూ దాన్ని అందించడం కష్టం. అందుకే భారతీయ సాంప్రదాయం భావితరాలకు అందించే రీతిలో మూర్తి (విగ్రహ) పూజ వంటి సంస్కృతికి పట్టంకట్టింది. పచ్చిదనం పోయిన కాయ చెట్టునుండి ఊడిపడినట్లే ముక్తి సాధనలో పక్వదశలోఅన్ని కర్మలూ వదిలేస్తాయి. ఆ స్థితి వచ్చేవరకూ మన దేవతారాధన, తపస్సు అవసరం. దైవాన్ని అంతటా చూడమని అంటే పూజలు ఆపమని కాదు, అందులో కూడా దైవాన్ని చూడమనే. అన్నింటికీ ప్రేరణగా నిలిచే దైవాన్ని గుర్తిస్తేనే మన జన్మ ధన్యం అవుతుంది. సద్గురువుల అనుగ్రహం కోరాలేగానీ వారిని అర్థంచేసుకునే ప్రయత్నం చేయడం మర్రిచెట్టుపై పాకే చీమ ఆచెట్టును పూర్తిగా తెలుసుకోవాలని అనుకోవడం లాంటిదే.

   🙏ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏

సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️

No comments:

Post a Comment