Thursday, March 30, 2023

శ్రీరామనవమి

 *_నేటి విశేషం_*

           *శ్రీరామనవమి*

*కల్యాణ రాముని అవతార కథ*
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు... 
ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 
పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. 
ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. 
శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది, శ్రీ రామ నవమి పండుగను స్వామి జన్మదినంగాను, సీతా మాతతో కళ్యాణ మహోత్సవంగాను జరుపుకుంటారు. 
భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది...
(ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీ.పూ 5114, జనవరి 10 న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. )

భగవంతుడు తన భక్తుల కోర్కెలను తీర్చుటకును, దుష్టుల సంహరించుటకును, సజ్జనుల కష్టముల నుండి కడతేర్చుటకును ఆయా సందర్భాను సారముగ అవతారముల నెత్తును, భారత ఇతి హాసముల ద్వారా పురాణముల ద్వారా కావ్యముల ద్వారా మనకు భగవంతుని అవతారముల గురించి తెలియుచున్నది...

పూర్వము వాల్మీకి యను మహర్షి శ్రీ మద్రామాయణము అను మహా కావ్యము వ్రాసెను. భారతీయులకు వాల్మీకి మొదటి కావ్యరచయిత;శ్రీ మద్రామాయణమే మొదటి కావ్యము, ఈ కావ్యము నుండి భగవంతుని దశావతారములు లోని రామావతారము గురించి మనకు తెలియుచున్నది...

భగవంతుడు ధరించిన మానవ అవతారములలో యీ శ్రీరామచంద్రమూర్తి అవతారము సంపూర్ణ మానవావతారమని రామాయణ కావ్యము తెల్పుతున్నది.
శ్రీరామునిగా మానవావతారమెత్తిన భగవంతుడు మానవుడు ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఏఏ ధర్మాలను పాటించాలి అనే విషయాలను తను ఆచరించి మానవులకు చూపి, ఆదర్శమూర్తి అయి, ఇప్పటికిని అనగా త్రేతాయుగములో అవతరించి, ద్వాపరము అయి కలియుగము నడుస్తున్న ఈ నాటికి కూడా దేవునిగా కొనియాడబడుతూ శ్రీ రామ నవమి అను పేరున నవరాత్రములు, కళ్యాణ మహోత్సవములు జరిపించుకొనుచున్నాడు.

*జన్మ వృత్తాంతం*
త్రేతా యుగమున రావణాసురుడు యను రాక్షసుడు భూలోకమున లంకాధీశుడై పరమశివుడు, బ్రహ్మలగురించి తపస్సు చేసి వారిచే అనుగ్రహింపబడిన వర గర్వితుడై ఎవ్వరిని లెక్క చేయక దేవతలను, ఋషులను, హరి (విష్టువు) భక్తులను వేధించుచుండెను. అప్పుడు వారందరు హరిని ప్రార్ధించి తమ కష్టములను మొర పెట్టుకొనగా, ఆ మహా విష్ణువు రామునిగా అవతరించి రావణుని కడతేర్చెద నని వారికి చెప్పి,వారిని శాంతపరచి పంపెను.

భూలోకమున అయోధ్యా నగర చక్రవర్తి దశరధుడు పుత్రుల కొరకై పుత్ర కామేష్టి యను యఙ్ఞమును చేయుచుండెను. 
ఆ యఙ్ఞమునకు సంతసించిన దేవతలు అగ్ని దేవుని ద్వారా దశరధునికి పాయసము ను పంపిరి. 
ఆ పాయసమును దశరధుడు తన మువ్వురు భార్యలకు అనగా కౌసల్య, సుమిత్ర,కైకేయి లకు పంచెను. 
కొన్నాళ్లకు యీ మువ్వురు భార్యలు గర్భవతులై నలుగురు మగబిడ్డలను ప్రసవించారు. 
ఆ మహా విష్ణువే తన ఆది శేషువు, శంఖ చక్రములు, గదలతో సహా యీ నలుగురు పుత్రులుగా అవతిరించెను, రావణ సంహారము కొరకు అవతరించిన ఆనలుగురు పుత్రులే శ్రీరామ చంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు.

చైత్ర మాసమున, శుద్ధ నవమీ తిధినాడు, పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహములు ఉచ్ఛంలో నుండగ కర్కాటక లగ్నమున గురుడు చంద్రునితో కలసి వుండగా, జగన్నాధుడు, సర్వలోకారాధ్యుడు , సర్వ లక్షణ సంయుతుడును అగు ఆ మహా విష్ణువు కౌసల్యాదేవి గర్భమున శ్రీరామ చంద్రమూర్తిగా జనియించెను...
శ్రీరాముడు పూర్ణ మానవుడుగా జీవించెను.

*రామ నవమి*
శ్రీ రాముని జననమైన నవమి తిధి నాడే ఆయన వివాహము సీతా మహాదేవి తో అయినదట. 
అట్లే రాజ్య పట్టాభిషేకము కూడ నవమి నాడేనట, అందుకనే శ్రీరామ నవమి అని చైత్ర శుద్ధ నవమి నాడే మనము పండుగ జరుపుకుంటాము.

*విది విద్ధానం*
ఆ రోజు మానవులందరూ తల స్నానము చేసి శుభ్రమైన లేక క్రొత్త బట్టలను ధరించి సీతారాముల పూజించి, కళ్యాణ మహోత్సవను జరిపించి, వసంత ఋతువు - ఎండాకాలము అగుటవలన పానకము, వడపప్పు ఆరగింపు చేసి ప్రసాదము పంచుదురు. 
దశమి నాడు పట్టాభిషేక ఘట్టము జరుపుదురు, కొందరు చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు రామనవరాత్రోత్సవము జరుపుదురు. 
ఈ తొమ్మిది దినములందు రామాయణ పారాయణము, రాత్రులందు రామకధా కాలక్షేపము జరుపుదురు.

శ్రీ రామనవమి నుండి రామకోటి వ్రాయుట నారంభించి, మరుసటి శ్రీ రామనవమికి ఆ వ్రతము ముగించు ఆచారము కూడ కలదు. 
శ్రీ రామ నామము లక్ష, కోటి వ్రాసిన ఒక్కోక్క అక్షరమే మహా పాతకములను నశింపజేయునని శంకరుడు పార్వతికి చెప్పునట్లు భవిష్య ఉత్తర పురాణమున ఉమామహేశ్వర సంవాదమున వివరింపబడినది.

               *_🌾శుభమస్తు🌾_*
    🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

No comments:

Post a Comment