కర్మసిద్ధాంతం - 09
శ్రోత్రే త్వక్ చక్షుః రసనా ఘ్రాణం ఇతి పఞ్చ జ్ఞానేంద్రియాణి
శ్రోత్రే - చెవులు
త్వక్ - చర్మం
చక్షుః - కళ్ళు
రసనా - నాలుక
ఘ్రాణం - ముక్కు
ఏ వ్యక్తికైనా వినికిడి, రుచి మొదలైన సమర్థతలు/ సామర్ధ్యాలు పరిమితంగానే ఉంటాయి. అది గుణంలోనైనా, పరిమాణంలోనైనా. ఒకనికి పరిమితమైన శక్తి ఉన్నదంటే, అప్పుడు అతడు అపరిమితమైన శక్తి యొక్క అంశ అని, అపరిమితమైన శక్తి ఒకటుందని అతడు భావించవచ్చు.
కాబట్టి ప్రతి సామర్ధ్యానికి, దానికి సంబంధించిన సంపూర్ణ శక్తి ఉంది. శక్తిని శాసించువాడు ఉంటే తప్పించి దానికి స్వతంత్రమైన వృత్తి ఉండదు. ఉదాహరణకు, దృష్టి( చూచే) శక్తి అనేది జీవుడి ఆధీనంలో ఉంటుంది. అతడు చూడాలనుకుంటేనే చూడగలడు. అలాగే సంపూర్ణశక్తికి, మన గ్రంథాలు, వాటిని నిర్వహించే నిర్వాహకులను వివరించాయి. వారిని అధిష్ఠానదేవతలు అంటారు. ఈ అధిష్ఠానదేవతలందరిని కలిపి, వారి సంపూర్ణ శక్తిని శాసించే అధికారి వెరొకడు ఉన్నాడు. అతడిని పరమేశ్వరుడని, ఈశ్వరుడని అంటారు. ఇదంతా ఆదిశంకరులు తత్వబోధలో వివరించారు.
శ్రోత్రస్య దిగ్దేవతా | త్వచే వాయుః |
చక్షుషాః సూర్యః | రసనాయ వరుణః |
ఘ్రాణస్య అశ్వినౌ | ఇతి జ్ఞానేంద్రియ దేవతాః |
శ్రోత్రస్య దిగ్దేవతా - చెవికి (వినికిడి శక్తికి) అధిష్ఠానదేవతలు దిగ్దేవతలు
త్వచే వాయుః - చర్మానికి వాయువు
చక్షుషాః సూర్యః - కన్నులకు (చూపుకు) సూర్యుడు
రసనాయ వరుణః - నాలుకకు (రుచికి) వరుణుడు ఘ్రాణస్య అశ్వినౌ - ముక్కుకు (వాసనకు) అశ్విని దేవతలు
వాక్పాణిపాదపాయుపిపస్థాని పఞ్చకర్మేంద్రియాణి |
వాక్ - నోరు, పాణి - చేతులు, పాద -పాదాలు,పాయువు - విసర్జన అవయవాలు, పిపిస్థ - జననాంగాలు
అనేవి 5 కర్మేయంద్రియాలు.
ఈ 5 కర్మేంద్రియాలకు కూడా ఐదుగురు అధిష్ఠానదేవతలు ఉన్నారు.
వాచో దేవతా వహ్నిః - వాక్కునకు అగ్ని హస్తయోరింద్రహః - చేతులకు ఇంద్రుడు పాదయోర్విష్ణుః - పాదాలకు విష్ణువు పాయోర్మృత్యుః - పాయువునకు మృత్యువు
ఉపస్థస్య ప్రజాపతిః - జననాంగాలకు ప్రజాపతి
కర్మసిద్ధాంతం - 10
సూక్ష్మ శరీరం గురించి చెప్పుకుంటూ గత భాగంలో పఞ్చ జ్ఞానేంద్రియాలు, పఞ్చకర్మేంద్రియాల గురించి చెప్పుకున్నాము. అలాగే ఇప్పుడు పంచ ప్రాణాలు, అంతఃకరణం గురించి చెప్పుకుందాము. పంచ ప్రాణాలు - ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులను పంచప్రాణాలు అంటారు. ఇవి ప్రాణమయ కోశంలో భాగం. ఈ 5 వాయువులు, వీటికి 5 ఉపవాయువులు ఉన్నాయి.
పంచ ప్రాణాలు - ప్రాణ వాయువు - ఊపిరి (ఉచ్ఛ్వాస, నిశ్వాస) ప్రక్రియలకు సంబంధించినది. మనం నిత్యం లోనికి తీసుకునే గాలి. మన ఆలోచనలు, భావావేశాలు, మనస్సు దీనితో గాఢంగా ముడిపడి ఉంటాయి.
అపానం - బొడ్డు నుంచి అరికాళ్ళ వరకు ప్రభావితం చేసే వాయువు. ఇది విసర్జన ప్రక్రియలను, కామోద్రేకాలను నియంత్రిస్తుంది. వ్యానం - శరీరమంతా వ్యాపిస్తూ, అన్ని భాగాలకు ప్రాణవాయువు ప్రసరణ జరిగేలా చూస్తుంది. రక్త ప్రసరణ చేస్తుంది. శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది. సమస్త శరిరాన్ని, ముఖ్యంగా నడులను ప్రభావితం చేస్తుంది. శరీరభాగాలకు పని చేయుటకు అవసరమైన శక్తినిస్తుంది.
ఉదానం - తిరస్కరించడం, ఎగదన్నటం దీని పని. కన్నీళ్ళకు కారణమవుతుంది. ఇది కంఠంలో ఉంటూ, నోట్లో ఆహారాన్ని మిరింగటం అనే ప్రక్రియలో కీలకంగా వ్యావహరిస్తుంది. ఇది హృదయం నుంచి శిరస్సుకు, మెదడకు ప్రసరణ చేస్తుంది. మరణ సమయంలో ఉదాన వాయువు సహాయంతోనే సూక్ష్మదేహం స్థూల దేహం నుంచి విడువడుతుంది.
సమానం - అరుగుదలకు (జీర్ణం చేసుకునేందుకు) కారకమవుతుంది. ఉదరంలో ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాల్లో వాయుప్రసరణ సమంగా ఉండేలా చూస్తుంది. ఆహారంలోని పోషక విలువలను దేహమంతటా పంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది.
ఉపవాయువులు -
1. నాగ - తేపులు (త్రేనుపులు), ఎక్కిళ్ళు, వాంతులను కలిగిస్తుంది. ప్రాణ, అపాన వాయువులలో ఏర్పడిన దోషాలను తొలగిస్తుంది. ఉదరం నుంచి ఊర్ధముఖంగా వెళ్ళే వాయువులను నియంత్రిస్తుంది.
2. కూర్మ - కంటి భాగంలో ఉంటూ, కంటి రెప్పలు తెరిచి, మూసే ప్రక్రియను నియంత్రిస్తుంది.
3. కృకర - శ్వాసకోశ వ్యవస్థలో దోషాలను తొలగించేందుకు చీదడంలో తోడ్పడుతుంది. ఆకలి దప్పికలను కలిగిస్తుంది.
4. ధనంజయ - కండరాలు, ముఖ్యంగా హృదయ కవాటాల వ్యాకోచ సంకోచాలు నియంత్రణ దీని ఆధీనంలో ఉంటాయి. మరణ సమయంలో శరీరాన్ని క్షీణింపజేసి, పంచభూతాల్లో కలిపేస్తుంది.
5. దేవదత్త - ఆవలింతలు కలిగిస్తుంది.
ఇవన్నీ శరీరంలో సక్ర్మంగా ఉన్నప్పుడే, వ్యక్తి ఆరోగ్యవంతుడిగా, సదాలోచనలతో ఆనందంగా ఉంటాడు. ఈ వాయువుల(ప్రాణాలు) ప్రసారంలో ఏర్పడే ఇబ్బందులు అనేక ఉపద్రవాలను తెచ్చిపెడతాయి. నిజానికి ఈ విజ్ఞానం మన రక్తంలో ఉంది. అందుకు ఉదాహరణ తెలంగాణ యాసలో స్పష్టంగా కంపిస్తుంది. ఎవరికైనా ఒంట్లో బాలేకపోతే, పానం (ప్రాణం) బాలేదు అంటారు. అంటే ఆయా శరీర భాగాలకు శక్తి ప్రసారం చేసే ప్రాణంలో అకస్మాత్తుగా దోషం ఏర్పడి, ప్రసారణ ఆగిపోయిందని, లేదా తక్కువగా ప్రసరణ చేస్తోందని చెబుతున్నారు. ఎంత అద్భుతం ఇది గమనిస్తే, మనం వాడే మాములు పదాల వెనుక సనాతన ధర్మానికి చెందిన సత్యాలు ఎన్నో ఉన్నాయి.
No comments:
Post a Comment