మనస్సు వాసనలు వీటి ప్రభావం మనపైన ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం
విషయాత్మికమైన అంతఃస్థిత మనోవృత్తియే వాసన. మనుష్యుడు ఏదైనా కార్యమును చేసినా చెయ్యకపోయినా, అతని మనస్సులోని కోరికను బట్టియే స్వర్గ ఫలమో నరక ఫలమో కలుగుతుంది. తత్త్వ జ్ఞానము కలిగినవానికి వాసనలు శిథిలమైపోతాయి. అంతేకాక అతడు తన సర్వకర్మ ఫలమైన ఆత్మకంటె భిన్నమైన అనుభవమును పొందుతాడు. వాసనలోనే జగత్ జాలమంతా ఉన్నది.
వాసనలతో దృఢమైన చిత్తము తనలో ఎవరిని చూడలేదు. వాసనలు శాంతించినచో, చిత్తము మూడు లోకాలను తృణప్రాయంగా చూస్తుంది. వాసనలు క్షీణించకపోతే, ఏ స్థితిలోను చిత్తవృత్తులను నిరోధించలేదు. వాసనలు నశించకపోతే తత్త్వజ్ఞాన లాభం కలుగదు.
మరి తత్త్వజ్ఞానము, చిత్తనాశము, వాసనాక్షయము ఇవన్నీ పరస్పరము ప్రకాశించటానికి చాలా కష్టమును కలిగిస్తాయి. వాసనాక్షయము, చిత్తనాశము, తత్త్వజ్ఞానము ఇవన్నీ ఒకే సమయంలో కోరిన ఫలాన్ని ఇస్తాయి. అందువలననే ఈ మూడింటిని ఒకేసారి నాశనం చేసే ప్రయత్నం చెయ్యాలి.
బుద్ధి...
బుద్ధి జగద్వ్యాపి కాదు. కాని అది కొన్ని పరిధులు ఉన్న స్థానాలలో వ్యాపించి ఉంటుందనేది నిశ్చయము. కనుక బుద్ధి ఒక వస్తు విశేషము. అంతేకాక అది ఒక విలక్షణమైనది. ప్రతి వారికీ ఇంతో అంతో బుద్ధి ఉంటుంది. కాని ఎవరికి బుద్ధి ఒక పరిమితి వరకే వ్యాపించి ఉంటుందని విశదమవుతుంది. కనుక బుద్ధి సాకారమైనదే కదా.. అందులో ఎలాంటి సందేహమూ లేదు. బుద్ధియే మంచి చెడులను గురించి ఆలోచిస్తుంది.
ఉత్కృష్టమైనదో నికృష్టమైనదో కోరేది కూడా బుద్ధియే. అంతేకాక, నానా విధములైన నూతన వస్తువులనూ ఆవిష్కరిస్తూ ఉంటుంది. ఎవరైనా ఒకరు విద్యలేనివాడైన్పటికీ, బుద్ది గలవాడయితే అతడు తన పనులన్నీ చేసుకోగలుగుతాడు. కాని బుద్ధి లేకపోయినా విద్య లేకపోయినా గట్టి పరిశ్రమను చేసి కొంత విద్యను సంపాదించినా అది విశేష కార్యం కాదు. బుద్ధి జీవ శరీరంలో అద్దంలాంటిది.
తృష్ణ...
తృష్ణ మనుష్యుని ఎంతగా దహిస్తుందంటే, ఆ మంటను అమృతం కూడా ఆర్పలేదు. తృష్ణయే మనిషిని భయభ్రాంతుని, దుఃఖితుని, గ్రుడ్డివానిని చేస్తుంది. తృష్ణయే అలభ్యమైన వస్తువు మీద ఆసక్తిని కలిగిస్తుంది. దొరకదని తెలిసి కూడా, ఆ విషయాన్ని ఆకాంక్షిస్తుంది. అంతేకాక ఒక చోట అది స్థిరంగా ఉండదు. అంతఃపురంలో ఉండేవారిని కూడా అతి కష్టమైన ప్రదేశాలకు అది తీసుకొనిపోతుంది.
ఈ తృష్ణయే ఆత్మతత్త్వాన్ని ఆచ్ఛాదించి, మనిషిలో ఎక్కువ అజ్ఞానాన్ని సృష్టిస్తుంది. తృష్ణలోనే మనస్సు చిక్కుకొని ఉన్నది. తృష్ణయే మోహంతో నిండిన ఏనుగును కూడా బందిస్తుంది. తృష్ణయే జరామరణ దుఃఖములకు కారణము.
చింత...
చింతన త్యజించ గలిగితే మనుష్యుడు సమస్త దుఃఖాలను తరించగలుగుతాడు. చింత అనంతకాలం వరకూ అన్ని విషయాలలోనూ ఆసక్తిని కనబరుస్తుంది. చింతన ఛేదించటం దుస్సాధ్యమన పనే అయినప్పటికీ జ్ఞానులు వివేకమనే ఖడ్గంతో దానిని ఛేదిస్తారు. తత్త్వజ్ఞానోదయం కానంత వరకూ చింత వదిలిపోదు. అట్లాగే చింత శాంతించనంత వరకూ తత్త్వజ్ఞానం కలుగదు. చింతకు సొంత సోదరుడు ధనము. మనం ఎట్లా ధనవంతులం అవుతాము.. ఏ ఉపాయాన్ని అవలంభిస్తే ధనోపార్జన అవుతుంది.. ఇలాంటి చింతల తోనే మనుష్యులంతా జీర్ణించిపోతున్నారు. చింత అన్ని సమయాలలోనూ అస్థిరంగానే ఉంటుంది.
ఒక చింత తరువాత మరొక చింత ఎక్కడి నుంచి వస్తుందో సరిగ్గా చెప్పలేము. అందువలననే చింతకు అంతం లేదు. చింతాశూన్యుడైన మనిషీ లేడు. మనిషి ఎలాంటి చింతా లేకుండా గడిపిన రోజు ఏ ఒక్కటీ ఉండదు. చింత వలన శరీరము జీర్ణించిపోతుంది. అట్లాగే చింత సమాప్తికాగానే ముక్తిమార్గం సుగమమవుతుంది.
మాయ...
మాయ జగత్తు యొక్క ఉత్పత్తికి కారణము. ఈ మాయ చేతనే వివేకము కప్పబడి ఉంటుంది.
ఈ మాయ ఏమిటనేది తెలుసుకోలేని విషయము...
ఈ జగత్తు అత్యద్భుతమైనది. వివేకంతో నడవకపోతే మాయ వృద్ధి చెందుతుంది. అట్లాగే వివేక దృష్టితో చూస్తే ఏమీ ఉండదు. ఈ మాయా స్వరూపం అవగతం కాకపోవటం వలన దాని మాహాత్మ్యమును అనుభవించలేము.
సంసార బంధనం కోసం ఈ మాయ ఆశ్చర్యజనకమైన పనులు చేస్తుంది. ఎందుకంటే, ఈ మాయ ఎప్పుడూ అసత్యమైనదే అయినా.. అది సత్యంలాగానే అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ సంసార రూపమైన మాయ పరమ పదమునకు భిన్నంగా ప్రవర్తిస్తుంది.
ఈ మాయకు పారమార్థిక సత్తా లేదు. ఒకవేళ నీవు ఏకాగ్ర చిత్తుడవై భావనాబలంతో ఆత్మయొక్క వాస్తవిక స్వరూపాన్ని తెలుసుకోగలిగితే అప్పుడు నీకు అన్ని విషయాల మర్మములు అవగతమవుతాయి..
No comments:
Post a Comment