Wednesday, May 31, 2023

భగవంతుడిని చూడగలుగుతాం..!

 *ఒకతనికి దేవుణ్ణి చూడాలన్న కోరిక కలిగింది.*

*అతను ఎన్నోతీర్థయాత్రలు చేశాడు.*

*ఎన్నో పురాణాలు, గ్రంధాలు చదివాడు.*

*కానీ అవి ఏవీ అతనికి తృప్తి ఇవ్వలేదు. అతని కోరిక తీరలేదు.*

*భగవంతుడిని వెతుకుతూ అతను ఒక చోటి నుండి మరొక చోటికి తన ప్రయాణం సాగిస్తూనే ఉన్నాడు.*

*ఒక చలికాలం సాయంత్రం వేళ అతను ఒక ముసలవ్వ పొయ్యిలో కర్రలు కదుపుతూ ఉండడం చూసాడు. అస్తమానూ ఆ బొగ్గులపైన బూడిద కప్పి వేస్తున్నది. ముసలవ్వ తన చేతిలోని చువ్వతో బొగ్గులను కదుపుతూ వాటిపైన బూడిదని రాల్చి వేస్తున్నది. ఆమె అలా చువ్వతో కట్టెలను కదుపుతూ, వాటిపైన బూడిదను నెట్టి వేస్తుండడం అతను శ్రద్ధగా గమనించాడు. ఆమె బూడిదని తీసినప్పుడల్లా మరింత ఎక్కువగా ఉండడం కూడా అతను చూస్తున్నాడు.*

*మర్నాడు అతను ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుంటూ బాగా ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని చూశాడు.” ఓ సూర్యుడా ! నీవు ప్రపంచం అంతటినీ గమనిస్తూ ఉంటావు కదా. దేవుడు ఎక్కడ ఉంటాడో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది. దేవుడు ఎక్కడ దాక్కున్నాడు ? అన్నిచోట్లా ఆయన కోసం వెతికాను కానీ నాకు ఎక్కడా కనిపించలేదు” అన్నాడు.*

*ఇంతలో ఒక మేఘం అలా వస్తూ సూర్యుడిని కప్పివేసి కనబడకుండా చేసింది. కొంతసేపటి తరువాత మబ్బు దాటిపోయింది. సూర్యుడు మళ్ళీ మరింత కాంతివంతంగా, ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపించాడు.*

*ఆ మనిషి నిట్టూరుస్తూ ”ఎప్పటికైనా నేను దేవుడిని చూడగలనా ?” అని అడిగాడు.*

*నాచుతో పూర్తిగా నిండి ఉన్న ఒక చెరువు పక్కనే అతను నడుస్తూ వెళ్తున్నాడు.*

*కొంతమంది గ్రామస్థులు ఆ చెరువులోని నాచును తొలగించి చెరువును శుభ్రం చేసే పని చేస్తున్నారు. "ఈ మురికి నాచును చెరువులో ఎవరు వేశారు ?” అని ఆ వ్యక్తి గ్రామస్థులను అడిగాడు. “ఎవరూ వెయ్యలేదు. నీటిలో నుండే నాచు పుట్టి పెరుగుతుంది. ఎక్కువ కాలం నీరు ఒకచోట నిలవ ఉంటే ఆ నీటిలో నాచు పెరుగుతుంది.*

*ఇప్పుడు మేము ఆ నాచునంతా తొలగించి శుభ్రం చేస్తున్నాము కనుక త్వరలోనే చెరువు తేటగా, శుభ్రంగా తయారవుతుంది అన్నారు గ్రామస్తులు.*

*ఆ మనిషి ఇదంతా తలుచుకుని ఆలోచించసాగాడు.*

*నాచు నీటిలో నుండే వచ్చింది కాని అది ఎంత దట్టంగా పెరిగి నీటిని కప్పివేసిందంటే అదంతా తొలగిస్తేగాని నీరు శుభ్రపడి పైకి కనిపించలేదు.*

*అలాగే సూర్యుని వేడి వలన ఏర్పడే మేఘాలు ఆ సూర్యుడినే కప్పివేసి సూర్యప్రకాశాన్ని బయటకు కనిపించకుండా చేస్తున్నాయి. గట్టిగా గాలి వీచి మేఘాలు చెదిరిపోయినప్పుడు మళ్ళీ సూర్యుడు మనకి కనిపిస్తున్నాడు.*

*అదే విధంగా నిప్పు నుండే బూడిద ఏర్పడుతున్నది. కాని ఆ బూడిద నిప్పును కప్పివేసి ఇంచుమించు ఆరిపోయేలా చేస్తున్నది. బూడిదను తొలగించినప్పుడు మళ్ళీ నిప్పు రాజుకుని మంట కనిపిస్తున్నది.*

*పైన చెప్పిన ప్రతి ఉదాహరణలోనూ నీరు, నిప్పు, సూర్యుడు ఇంతకు ముందే ఉన్నాయి. కొత్తగా ఏర్పడలేదు, కాని అవి కనబడాలంటే మనం కూడా కొంత ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది.*

*స్పష్టంగా చూడడానికి అతను ప్రయత్నం చేసినప్పుడు అతనికి సత్యం బోధపడింది..!*

*ప్రపంచమనే దుప్పటిని కప్పుకోవడం వలన మనిషి తాను ఎక్కడ నుండి వచ్చాడో మరచిపోతున్నాడు.*

*ప్రపంచం అనే దుప్పటిని పక్కకి తొలగించి హృదయంలోకి తొంగి చూస్తే భగవంతుడిని చూడగలుగుతాం..!*

*సర్వే జనా సుఖినోభవంతు*
🙏🏼🙏🏽🙏🏼

No comments:

Post a Comment