*నానుడి కథ - 8*
*యమ గండం*
ఈ నానుడి ఓ కథ ద్వారా వాడుకలోకి వస్తున్నట్టు తెలుస్తుంది. యముడి ద్వారా వచ్చే గండంనే యమ గండంగా చెప్పుకోవొచ్చు. ఈ గండంను ఎవరు తప్పించలేరని ఆర్యోక్తి. ఆ గండం ఏమిటో?, యమగండం నానుడి ఎలా వాడుకలోకి వచ్చిందో , ఆ కథ ఏమిటో తెలుసుకుందాం.
పూర్వం దేవతలంతా శివుని పూజించటానికి పాడుబడిన శివాలయానికి వెళ్లారు. ముందుగా విగ్నేశ్వరుడు తన వాహనం ఎలుకను బయట నిలబెట్టి లోపలికి వెళ్ళాడు. అలాగే కుమారస్వామి వచ్చి తన వాహనం నెమలిని బయట ఉంచి లోపలికి వెళ్లాడు. కాసేపటికి యముడు వచ్చాడు. తన వాహనం దున్నపోతును బయట ఉంచి లోపలికి వెళుతూ చెట్టుపైన కిచకిచమంటూ శబ్దం చేస్తూ సంతోషంగా ఉన్న పిచుకను చూసాడు. క్షణ కాలం అలాగే చూసి నవ్వుకుంటూ గుడి లోపలికి వెళ్ళాడు. యముడు నవ్వటంతో పిచుకకు భయం పట్టుకుంది. ఆయన ఎందుకు నవ్వాడో అర్థంకాక అతడి వాహనం దున్నపోతును అడిగింది. తనకు తెలియదని అది తల అడ్డంగా ఊపింది. పిచ్చుక ప్రాణ భయంతో గడగడా వణకుతుంది.
ఇంతలో గరుడ పక్షి పై వచ్చిన విష్ణు మూర్తి గరుడపక్షిని బయట వదిలి లోపలికి వెళ్ళాడు. వెంటనే పిచ్చుక పక్షి రాజు వద్దకు వెళ్ళింది. యముడు నవ్విన సంగతి చెప్పింది. తన భయం బయట పెట్టింది. గరుత్మంతుడు ఆ పిచుకను వీపుపై ఎక్కించుకుని వాయు వేగంతో ఏడేడు సముద్రాల ఆవల ఉన్న మర్రి చెట్టు తొర్రలో దాచింది. ఇంకేమి భయంలేదు అని చెప్పి అదే వేగంతో వచ్చింది.
అప్పుడే యముడు గుడిలో నుండి బయటకు వస్తున్నాడు. పక్షిరాజు ఆయన వద్దకు వెళ్లి వినయంగా అడిగింది. పిచుకను చూసి ఎందుకు నవ్వావు అని. యముడు మళ్ళీ నవ్వి " ఏమీలేదు గారుడా! ఆ పక్షికి గడియ కాలంలో చావు రాసుంది. అది ఇక్కడ కాదు ఏడేడు సముద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలో నివాసం వుండే ఒక పాము దాన్ని చంపి తింటుంది. ఇదెలా సాధ్యం. గడియ కాలంలో ఆ పాము ఇక్కడికి రాలేదు. ఈ పక్షి అక్కడికి పోలేదు. ఆ విధిరాత ఎలా ఉంటుందో అని నవ్వాను అంతే" అన్నాడు. పక్షిరాజు గరుత్మంతుడు కుప్పకూలి పోయాడు. యమ గండాన్ని ఎవరూ తప్పించలేరని తెలుసుకుంది ఆ పక్షి.
ఇలా ఈ యమ గండం అనే నానుడి వాడుకలోకి వచ్చింది. యముడి నుండి వచ్చే ఆపదను తప్పించటం ఎవరివల్లా కాదని చెప్పటానికి ఈ యమగండం నానుడి ఉపయోగిస్తారు.
*౼ డా.దార్ల బుజ్జిబాబు*
No comments:
Post a Comment