. *⛳20వ సర్గ 2వ భాగం⛳*
*꧁❀❀━❀🐿️🌏🐿️❀━❀❀꧂*
*కౌసల్య: నాయనా! రామా! గొడ్రాలికి ఒక్కటే దుఃఖం “అయ్యో నాకు బిడ్డ లేకపోయాడే' అని. కానీ నీవు పుట్టడంవల్ల నాకు దుఃఖమే మిగిలింది సుమా!*
*నాయనా! నేను మీ నాయనగారి వల్ల ఏ విధమైన సుఖసంతోషాలనూ పొందలేదు. అన్నీ నా కొడుకు హయాంలో రాజైన (తరువాత) రాజమాతగా పొందవచ్చునని సంతోషపడుతూ ఉండేదాన్ని. అవన్నీ కలలే అయిపోయాయి. నీటి మీద వ్రాసిన రాతలైపోయాయి.*
*నాయనా! ఆడది భర్త కొట్టినా బాధపడదు గాని, తోటికోడలు నవ్వితే తల ఎత్తుకుని తిరుగలేదు. నా పని అట్లాగే అయింది. నేను ఇంతకాలం పట్టమహిషిగా ఉన్నాను. ఇకపై నా సవతులు చేసే ఎద్దేవా తలచుకొంటే తలకొట్టెసినట్లుంటుంది సుమా! వారి సూటిపోటి మాటలు వినలేను. వారు చేసే అవమానాలన్నీ పడాల్సిందే! ఇక నా దుఃఖానికి అంతే ఉండదు సుమా! ఓ రామా! నువ్వు ఇక్కడ ఉండగానే నన్ను ఈ విధంగా అవమానిస్తున్నారే! ఇక నువ్వు* *వనవాసానికి పోతే నన్ను వీళ్ళు బ్రతుకనివ్వరు. నాకు మరణం తప్ప వేరే గత్యంతరం లేదు. నీ తండ్రి నా బ్రతుకును, కైకేయి దాసి కన్నా హీనంగా చేశాడు. నా స్వాతంత్ర్యాన్ని పూర్తిగా హరించివేశాడు. ఇప్పుడు నాకు సేవచేస్తున్న సేవకులు కూడా, భరతునికి ఎక్కడ కోపం వస్తుందోనని భయపడి నన్ను పలకరించను కూడా పలుకరించరు. ఇక సేవల మాట చెప్పాలా? ఇకపై ఎవరూ నా ముఖం వంక కూడా చూడరు. నేను దిక్కుమాలిన దాననై పోతాను. కైకేయి ఇప్పుడు నన్ను చూస్తే నిప్పులు చెరుగుతూ ఉంటుంది. ఇక నువ్వు కూడా లేకపోతే ఆవిడతో నేనెట్లా వేగగలను?*
*రామా! ఎప్పటికైనా నాకు మంచి రోజులు వస్తాయని, నా దుఃఖాలన్నీ తొలగిపోతాయని నీ ఉపనయనం అయిన తర్వాత పదిహేడు సంవత్సరాల నుండి ఎదురుచూపులు చూస్తున్నాను. కానీ, రామా! నా అదృష్టం ఇట్లా తారుమారై ఈ వృద్దాప్యంలో కూడా నా సవతులచే అవమానాలు ఈసడింపులు పడాలని నా ముఖాన రాసి ఉంది కాబోలు! ఈ ముసలితనంలో ఈ అవమానాలన్నీ ఎట్లా సహించగలను? చంద్రబింబం లాంటి నీ ముఖం చూడకుండా ఎట్లా ఉండగలను?*
*ఓ రామా! నీ కోసం ఎన్నో పూజలు చేశాను. ఎన్నో ఉపవాసాలు ఉన్నాను. ఎందరో దేవుళ్ళను పూజించాను. కాని ఒక్కళ్ళకూ నాపట్ల కనికరం లేకుండాపోయింది. నా తపస్సు అంతా చవిటి నేలలో నాటిన విత్తనాల్లాగా వ్యర్థమైపోయింది. నిన్ను కన్ననాటి నుండి కళ్ళల్లో వత్తులు వేసుకొని జాగ్రత్తగా పెంచాను. నేను దరిద్రురాలను కావటంచేతనే నీకు ఈ కష్టం దాపురించిందేమో? రామా! ఏటిగట్లు కూడా వరదలొస్తే తెగిపోతూ ఉంటాయి కానీ, నా దుః ఖానికి నా గుండెలు పగిలిపోవటంలేదు. బహుశా నా గుండె రాతితో చేశాడో, ఏమో! ప్రాణభయంతో ఒణికిపోతున్న లేడిని సింహం కనికరం లేకుండా నోట కరచుకుపోతుంది. కానీ ఇన్ని అవమానాలు పడుతున్నా భయంతో ఒణికిపోతూ జీవితం సాగిస్తున్నా యముడు నన్ను తీసుకుపోవటంలేదు. యముడికి కూడా నాపై కనికరం లేకుండా పోయిందా? లేక యమలోకంలో నాకు చోటు లేకుండా పోయిందా? ఇన్ని దుఃఖాలు, అవమానాలు భరించి ఇంకా మరణం రాలేదంటే, అసలు నాకు మరణం లేదేమో! ఓ రామా! దూడ వెంటపోయే బక్క ఆవులా నేను కూడా నీ వెంట వస్తాను. చంద్రబింబం లాంటి నీ ముఖం చూసుకొంటూ బ్రతుకుతాను. రాముడు తండ్రి ఆజ్ఞను జవదాటడని తెలిసినా లోపలనుండి ఉబికి వచ్చే దుఃఖాన్ని ఆపుకోలేక కౌసల్య, రాముణ్ణి పెనవేసుకొని ఏడ్చింది.*
*┈┉┅━❀꧁ జై శ్రీరామ్ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🐿️🍁 🙏🕉️🙏 🍁🐿️🍁
No comments:
Post a Comment