Monday, August 25, 2025

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

           *శ్రీ కృష్ణాష్టమి విశిష్టత:*
                 ➖➖➖✍️

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం।
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం॥

శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే భగవంతుడు కృష్ణ పరమాత్మగా అవతారము ధరించిన రోజు. దానినే మనము కృష్ణ జయంతిగా భావిస్తున్నాము. 

కృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేశారు. అప్పటివరకు అర్జునుని మనస్సు అంతా విషాదంతో, దుఃఖంతో కలత చెంది వున్నది. అటువంటి అర్జునునికి జ్ఞానప్రాప్తి కలుగచేసి కర్తవ్య నిర్వహణకు గీతోపదేశం చేశారు. 

రెండవ అధ్యాయంలో ఆత్మ స్వరూపమేమిటో తెలిపి, మూడవ అధ్యాయంలో కర్మయోగ ప్రయోజనం మొదలైన విషయాలను గురించిన ఉపదేశములు చేశారు.

భగవానుడు అర్జునునితో అంటారు - “నేను ఈ రూపంలో చెప్పుచున్న విషయాలు నీవు ఎరుగవు. ఎన్ని జన్మల తరువాత అర్జునునిగా జన్మించావో నీకు తెలియదు. నాకు సమస్తమూ తెలుసు.  జన్మ అనేది అనేక జన్మలలో చేసిన ధర్మాధర్మ కార్యముల ఫలమును అనుభవించుట కొరకు అనే విషయాన్ని తెలుసుకో. నేను నా ఇష్ట ప్రకారము జన్మను పొందగలను అనే విషయాన్ని గూడా గ్రహించు!”అన్నారు. 

అప్పుడు అర్జునుడు - “మీ ఇష్ట ప్రకారం జన్మిస్తారు అంటే - మీకు ఎప్పుడు ఇష్టమౌతుంది?” అని అడిగాడు. 

దానికి సమాధానంగా భగవానుడు-

“యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్ ||”

అని భగవానుడు చెప్పాడు. అంటే ధర్మానికి ఎప్పుడు గ్లాని (పతనం) ఏర్పడుతుందో అప్పుడు నేను అవతారం ధరిస్తాను అని అర్ధం. ఇప్పుడు ఆ సందర్భం ఏర్పడింది. అందుచేత ధర్మమును సంరక్షించేటందుకు కృష్ణావతారం ధరించటం జరిగింది.

ఈ అవతారములో కృష్ణుడు అనితరమైన, అమానుషమైన ఎన్నో కార్యములు చేశాడు. తాను అవతరించిన వెంటనే మాతాపితలకు (దేవకీవసుదేవులకు) విశేషమైన దర్శనమిచ్చాడు. ఈ విధమైన ఎన్నో అమానుషశక్తులను ప్రదర్శించే సందర్భాలు వచ్చాయి.

దుర్యోధన పక్షపాతియైన అశ్వత్థామ పాండవ వంశనాశన ప్రతిజ్ఞ చేశాడు. ఉత్తరాగర్భస్థుడైన పరీక్షిత్తుని సంహరించటానికి బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. 

అది తిరుగులేని సంహారక దివ్యాస్త్రం. అటువంటి దివ్యాస్త్రాన్ని కృష్ణ భగవానుడు తన చక్రముతో మాయాలీలగా అడ్డుపెట్టి పరీక్షితుని రక్షించి పాండవ వంశ రక్షణచేశాడు. 

ఆ అద్భుతాన్ని చూచి ద్రౌపది మొదలైన స్త్రీలు, పురుషులు అంతా కృష్ణుని శ్లాఘించి కీర్తించారు. 

‘పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుని ఎందుకు రక్షించలేదు’ అని కొందరకు సందేహం కలుగవచ్చు. 

అభిమన్యుడు ధర్మబద్ధమైన, వీరోచితమైన కార్య నిర్వహణలో మరణించాడు. కాబట్టి అనివార్య పరిస్థితులలోనే అమానుష శక్తులను భగవానుడు ఉపయోగించటం జరిగింది.

యుధిష్ఠిరుడు ధర్మమునకు ప్రతిరూపమైనవాడు. దుర్యోధనుడు అధర్మాన్ని ఆశ్రయించినవాడు. శకుని జూదరి. ధర్మరాజు ద్యూతమునకు అంగీకరించినాడు. సమస్తము కోల్పోయాడు. భగవానునికి తెలియదా? అంటే అక్కడ అనివార్య పరిస్థితి ఏర్పడలేదు. 

మరియొక సందర్భంలో ధర్మరాజు యొక్క ధర్మగుణాన్ని పరీక్షించుటకు దుర్వాస మహాముని శిష్యగణంతో అతిధిగా వస్తాడు. ధర్మరాజు ఆనందంతో ఆతిథ్యమిచ్చుటకు అంగీకరిస్తాడు. దుర్వాస మహాముని శిష్యగణంతో స్నానాది అనుష్ఠానాలకు వెళ్ళాడు. ఆ సమయానికి ద్రౌపది భోజనపాత్రలన్నీ కడిగి పెట్టేసింది. భోజన సౌకర్యం చేసే అవకాశమే లేదు. 

అతిథులు స్నానాదికాలు ముగించుకొని ఆతృతతో భోజనానికి వస్తున్నారు. ద్రౌపదికి పాలుపోలేదు. కృష్ణభగవానుని తలచుకొని తులసి దళం సమర్పించింది. 

దుర్వాసులవారు వచ్చారు. ధర్మరాజు సంకట స్థితిలో పడ్డాడు. కృష్ణభగవానుని లీలాప్రభావంతో దుర్వాస మహామునికి, శిష్య గణానికి కూడా కడుపులు ఉబ్బిపోయాయి. వారు భోజన ప్రసక్తే భరించలేని స్థితిలో పడ్డారు. ఆ పరిస్థితులలో ధర్మరాజును కాపాడకపోతే అనర్ధం చేకూరుతుంది. అటువంటిది జరుగకూడదు. కనుకనే కృష్ణపరమాత్మ తన లీలా విలాసాన్ని చూపినారు. 

ద్రౌపదీ వస్త్రాపహరణం సందర్భంలో కూడా పాతివ్రత్య మహిమను కాపాడి, దానిని లోకంలో సుస్థాపితం చేసే నిమిత్తమే ద్రౌపది ప్రార్ధనకు ఫలితంగా కృష్ణభగవానుడు తన లీలా ప్రభావంతో వస్త్రపరంపరను సృష్టించి మాన సంరక్షణచేశాడు. అది అనివార్య పరిస్థితి. రావణసంహారం తరువాత స్త్రీలకు ఏ విధమైన భంగము చేయబడలేదు. శ్రీరాముని పాలనలో ఎటువంటి దురాగతమూ జరుగలేదు. అది ధర్మరక్షణ.

కృష్ణభగవానుడు - “అర్జునా! దేవతలకు కూడా లభ్యము కాని నా విశ్వరూపాన్ని మానవులలో నీకొక్కనికే దర్శింప చేశాను” అన్నాడు. 

‘అయితే పూర్వము తల్లియైన యశోదకు కూడా విశ్వరూపాన్ని చూపాడు కదా! మరి, మానవులలో నీ కొక్కనికే అంటే భగవానుడు చెప్పినది అసత్యమా?’ 
కాదు..!
ఎందుచేతనంటే మానవులనగా స్త్రీ, పుం లింగములు రెండూ రెండు వర్గాలవారు అని గ్రహించాలి. అందుచేత పురుషులలో అర్జునునకు స్త్రీలలో తల్లియైన యశోదకు అనే అర్థంలోనే భగవానుడు చెప్పినట్లు మనము గ్రహించాలి. 

అందుచేత సందర్భానుసారంగా భగవానుడు తన అమానుష శక్తిని, సర్వజ్ఞతను, చాతుర్యమును ప్రదర్శించినాడు.

భారత యుద్ధంలో సైంధవుని సంహరించటం ఎవరికీ సాధ్యపడలేదు. అర్జునుడు సూర్యాస్తమయంలోపుగా అతనిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. యుద్ధం జరుగుతోంది. అర్జునుడు అసహాయ స్థితిలో వుంటాడు. ఆ సమయంలో భగవానుడు అర్జునునికి మర్మమైన విషయాన్ని జ్ఞాపకపరచి సైంధవుని తలభూమిపై పడకుండా జాగ్రత్తగా బాణాన్ని సంధించమంటాడు. 

సైంధవుని తల నేలపై పడితే, ఆ విధంగా పడవేసిన వాని తల నూరు ముక్కలవుతుందని తండ్రి శాపం. 

ఆ విధంగా అర్జునుని కార్యం సఫలమైంది. అనివార్య స్థితిలోనే భగవానుడు ధర్మరక్షణచేశాడు.

భారతయుద్ధం ముగిసిన తరువాత ధృతరాష్ట్రుడు కపట బుద్ధితో ధర్మరాజును పరామర్శించి, పరాక్రమ శాలియైన భీముని ఆలింగనం చేసుకోవాలి. ‘భీముడు ఎక్కడ?’ అని అడుగుతాడు. 

సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు అయిన కృష్ణభగవానుడు లోహముతో నిర్మితమైన భీముని ప్రతిమను ధృతరాష్ట్రుని ముందు ఉంచుతాడు. 

ధృతరాష్ట్రుడు తన బాహుపాశంలో లోహమూర్తిగావున్న భీముని ముక్కలుగా చేస్తాడు. అంతటి మహాబలశాలి ధృతరాష్ట్రుడు. 

కృష్ణుడు అతని మనోగతము, శక్తి తెలిసినవాడు కాబట్టే ఆ విధంగా భీముని రక్షించాడు. ధృతరాష్ట్రుని కపట బుద్ధిని బహిర్గతం చేశాడు.


అటువంటి పరిస్థితులలో ధర్మ సంస్థాపన చేయటం కొరకే భగవంతుడు అవతారాన్ని ధరించవలసి వచ్చింది. 

భగవద్గీతను లోకానికి అంద చేయటం జరిగింది. ధర్మరాజును కాపాడటం అంటే ధర్మాన్ని సంరక్షించినట్లు. 

కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినమైన జన్మాష్టమి మనకందరకూ పవిత్రమైన రోజు. మనమందరమూ శ్రద్ధా భక్తులతో కృష్ణ భగవానుని స్మరించి పూజించాలి.✍️
हर नमः पार्वती पतये हरहर महादेव 
--- జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహస్వామివారు.

🙏 **సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment