*శ్రీరాముడి హితబోధ.....*
*🫒శ్రీరాముడు వనవాసానికి వెళ్ళిన తరవాత తల్లి చేసిన పనికి కోపించిన భరతుడు తనకు రాజ్యం, పట్టాభిషేకం వద్దని దుఃఖంతో అన్నగారి కోసం అరణ్యాలకు సాగిపోయాడు. సైన్యం అతణ్ని అనుసరించింది. వస్తున్నది భరతుడని గ్రహించిన లక్ష్మణుడు కోపం పట్టలేకపోయాడు. ఎదురులేని సార్వభౌమత్వాన్ని అనుభవించాలనే దురుద్దేశంతో తమను మట్టుపెట్టడానికే అతడు వస్తున్నాడని భావించాడు. భరతుణ్ని చంపాలని ఆవేశంగా లేవబోయాడు.*
*🫒లక్ష్మణుణ్ని వారిస్తూ రాముడు- భరతుడు తనను చూడాలని, తీసుకుంటే రాజ్యాన్ని అప్పగించాలని వస్తున్నాడన్నాడు. ‘రాజ సింహాసనాన్ని అనుభవించదలచి భరతుణ్ని చంపగోరుతున్నట్లయితే ఆ మాట చెప్పు. నేను భరతుడికి చెప్పి శాంతంగా నీకు రాజ్యం ఇప్పిస్తాను’ అన్నాడు. ఆ మాటతో లక్ష్మణుడు సిగ్గుపడి తగ్గాడు. భరతుడు* *వచ్చి రాముడి పాదాలమీద పడ్డాడు. తాను రాజ్యభారాన్ని వహించలేనని, తిరిగి వచ్చి రాజ్యపరిపాలనను స్వీకరించమని ప్రాధేయపడ్డాడు.*
*🫒 రాముడతణ్ని లేవదీసి తండ్రికి ఇచ్చిన మాట పాలించడంలో తన నిర్ణయానికి తిరుగులేదని చెప్పాడు. లక్ష్మణుడి లాగానే తానూ అడవిలో ఉండిపోతానని భరతుడు అన్నప్పుడు తాను తండ్రిగారికి చేసిన వాగ్దానానికి భంగం కలగకుండా ఉండాలంటే అతను అయోధ్యకు వెళ్ళి రాజ్యపాలన చేయకతప్పదని అన్నాడు. ఏ అనుభవం లేని తాను రాజ్యపాలన ఎలా చేయగలనని భరతుడు అడిగాడు.*
*🫒ఆ మాటకు రాముడు భరతుడికి అర్థమయ్యేలా రాజ్యపాలన మెలకువలు చెప్పాడు. ‘పాలించేవాడు ధర్మబద్ధమైన వాడైతే రాజ్యం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. పాలకుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బ్రాహ్మణులను, పెద్దలను, దేవతలను సరైన రీతిలో గౌరవించాలి. స్త్రీలకు గౌరవం, రక్షణ కల్పించాలి. వివాదాలను నిష్పక్షపాతంగా పరిష్కరించాలి’ అని సూచించాడు.*
*🫒 నాస్తికత, క్రోధం, సోమరితనం, దీర్ఘసూత్రత, ఇంద్రియలోలత్వం, మంచి సలహాల పట్ల తృణీకారం, ప్రమత్తత, దుస్సంగ ప్రియత్వం, ఆచరించడానికి వీలుపడని ప్రణాళికలు వేయడం, రహస్యాలను దాచుకోలేకపోవడం, మూర్ఖులైన మిత్రులపట్ల అనురక్తి, సదాచారాల పట్ల నిర్లక్ష్యం, శత్రువుల్ని నియంత్రించలేకపోవడం వంటి బలహీనతలకు దూరంగా ఉండాలన్నాడు.*
*🫒 ఉత్సాహం, అధికారం, బుద్ధి చాతుర్యం అనే మూడు శక్తులు కలిగి ఉండాలని చెప్పాడు. వ్యర్థ ప్రలాపాలు చేసేవారికి, దుర్భాషలాడేవారికి దూరంగా ఉండాలన్నాడు. ఎటువంటివారితో స్నేహం చేయకూడదో విపులీకరించాడు.*
*🫒వేల మంది అజ్ఞానులైన మూర్ఖులతో మైత్రి కన్నా, నిపుణుడైన ఒక్క జ్ఞానిని కలవడం మంచిదని గ్రహించమన్నాడు. వ్యాధిని ప్రకోపింపజేయడానికి దోహదపడే వైద్యుడు, యజమానికి తలవంపులు తేవడమే లక్ష్యంగా ఉన్న సేవకులు, తానే రాజు కావాలని ఆశించే యోధుడు... వీరి పీడను సకాలంలో వదిలించుకోకపోతే వారివల్ల ప్రాణహాని ఉంటుందని బోధించాడు.*
*🫒వివేకవంతుడు, జ్ఞాని అయినవాడు చనిపోయిన తరవాత సద్గతి పొందడానికి గాను జీవించి ఉన్నప్పుడే ధర్మాచరణ కోసం తన శక్తిని వినియోగించాలని, అది రాజులకు సుపరిపాలన వల్లనే సాధ్యమని సూచించాడు.*
*🫒కేవలం విషయ వాంఛల కోసం జీవించేవారు విశృంఖలమైన కామ లోభాలకు దాసులవుతారని, కాబట్టి పాలకుడు వాటికి దూరంగా ఉండాలని బోధించాడు.*
*🫒చివరగా ‘ధర్మ మార్గంలోనే ప్రజలను మనకు అనుకూలంగా చేసుకోగలం.*
*🫒 ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయం ఓడిపోకూడదు’ అని హెచ్చరించాడు.*
*┈┉┅━❀꧁ జై శ్రీరామ్ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🏵️🏹🏵️ 🙏🕉️🙏 🏵️🏹🏵️
No comments:
Post a Comment