Friday, July 3, 2026

*🌺నేటి మాట🌺* *🌺 దైవభక్తి అంటే ఏమిటి? 🌺*

 *🌺నేటి మాట🌺*
     *🌺 దైవభక్తి అంటే ఏమిటి? 🌺*

దైవభక్తి ఉన్నచోట మంచితనం ఉంటుందంటారు. మరి నేడు చాలా మోసాలు జరుగుతున్నాయి ఎందుకు? దైవభక్తులమని చెప్పుకొనేవారూ పాపాలు చేస్తున్నారు. భక్తి ఉంటే పాపాలు చేసినా ఫరవాలేదా?

దేవుడికి పూజలు చేసే వారంతా దైవభక్తులైపోరు. నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవారే దైవభక్తులు. భక్తి ఉన్నవాడు పాపం చేయడు, చేయలేడు. ఎందుకంటే దైవం ధర్మప్రియుడు. ధర్మాన్ని విడిచిపెడితే అది భక్తి అనిపించుకోదు. భక్తికి ధర్మమే ప్రాణం.

గుళ్లు, గోపురాలు తిరిగేవారు, దేవుడికి పూజలు చేసేవారు అందరూ భక్తులేనని చెప్పలేం. తమ కోరికలను తీర్చుకోవడానికి ఎవరికి వీలైన మార్గాన్ని వారు ఆశ్రయిస్తారు. అలా కొందరు దేవుడిని కూడా కొలుస్తారు. వారికి దేవుడి పట్ల నిజమైన శ్రద్ధ ఉండదు. అలాంటి వారందరినీ "భక్తులు" అనే వర్గంలో చేర్చకూడదు.

అలాగే ప్రజల్లో తమ కోరికల కోసం దేవుడి పట్ల చూపించే ఆసక్తిని అవకాశంగా మార్చుకొని సొమ్ము చేసుకునే వ్యాపారులు కూడా ఉంటారు. వారినే భక్తులుగా భావించడం పొరపాటు.

పాపం ఉన్నచోట భక్తి పండదు. దైవశక్తి జాగృతం కాదు. దేవాలయాల దగ్గర చేరే గుంపులందరికీ దైవతత్త్వం పట్ల నిజమైన ఆసక్తి ఉండదు.

భక్తుడు భగవంతుని నామ, గుణ, మహిమల పట్ల ప్రేమ కలిగి, నిరంతరం ఆ చింతనలోనే కాలం గడుపుతూ, సత్యం, అహింస, శుచి, దయ వంటి సద్గుణాలను అలవరచుకుంటాడు.

నిజంగా భగవంతుని అనుగ్రహం ధర్మపరునికే లభిస్తుంది. ధర్మం, ప్రేమ ఈ రెండూ కలిసినప్పుడే అది భక్తి అవుతుంది.

'మంది' చేరే చోట సొమ్ము చేరుతుంది. ఆ సొమ్మును స్వాహా చేయడానికి అక్రమార్జనపరులు కూడా చేరతారు. అదే విధంగా దేవుడి సొమ్మును స్వాహా చేసే మహాపాపాత్ములు కూడా ఉంటారు.

అలాంటి కొంతమంది దేవాలయాల్లో ఉన్నంత మాత్రాన వారు భక్తులైపోరు. వారి పాపాలు కూడా పరిహరింపబడవు. పైగా, బయట చేసే మోసాలకన్నా దైవసంబంధమైన సంపదను దుర్వినియోగం చేయడం మరింత ఘోరమైన పాతకంగా శాస్త్రాలు పేర్కొంటాయి. అందువల్ల వారు, వారి తరువాతి తరాలు కూడా తమ కర్మఫలాలను అనుభవించక తప్పదు.

తాత్కాలికంగా వారు లాభపడినట్లు కనిపించినా, భవిష్యత్తులో వారు తీవ్రమైన బాధలను అనుభవిస్తారనే విషయంలో సందేహం లేదు.

అటువంటి వారిని చూసి "ఇదే భక్తి", "ఇదే ఆధ్యాత్మికత" అని పొరపడకండి. పాపం ఉన్నచోట పరమాత్మ ఉండడు. ధర్మం ఉన్నచోటే దైవానుగ్రహం ఉంటుంది. 🙏🌺

*🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺*
            *_📿శుభమస్తు📿

No comments:

Post a Comment