Saturday, August 8, 2026

 భేతాళ కథలు - 15

విక్రమార్కుడు పలకలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఐనా వదలలేదు భేతాళుడు. “విక్రమార్క మహీపాలా! నేను- నీకు అలసట తెలియకుండానూ, యీ నిశీధిలో నడచి నడచి విసుగురాకుండానూ. ఒక కథ చెబుతాను. సరేనా?' 'అతను ఔననికాని కాదని కాని ఏమీ అనకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. శవాన్ని మోసుకుంటూ నడవసాగాడు.

మళ్లీ భేతాళుడి అన్నాడు. “కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్నవేస్తాను. ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసికూడా చెప్పక పోయావో తక్షణమే నీ తల వెయ్యి ముక్కలవుతుంది. కనుక జాగ్రత్తగా విను. కథ మొదలు పెడుతున్నాను. -”

భేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదట కథ చెప్పడం మొదలుపెట్టాడు. విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినసాగాడు.

ఎవరు భర్త? ఎవరు సోదరుడు? 

"రాజా శోభావతీ అనే పురముండేది. దానిని యశఃకేతుడనే రాజు పరిపాలించేవాడు. అతను దేవ బ్రాహ్మణభక్తి కలవాడు. అంతే కాకుండా గొప్ప రాజకీయవేత్తగూడా. తన వేగుల (రహస్యముగా యితర దేశముల విషయములు తెలుసుకొను వారు) ద్వారా యితర దేశముల రహస్యములను సేకరించేవాడు. పని కొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కని బహుమానాలనీ, విరివిగా జీతాల్నీ యిచ్చేవాడు.

మాకెప్పుడూ యీ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా, ధర్మంగా రాజ్యపాలన చేస్తూండేవాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు.

ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఉండేది. ప్రతి సంవత్సరమూ ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు. ఆ ఆలయం కెదురుగా ఒక కోనేరుంది. జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి, శుచిగా, దేవి నారాధించి వెళ్లేవారు

ఒక యేడు-ఉత్సవం నాడు కొందరు ఆడవారు కొలనులో స్నానం చేస్తున్నారు. మరో దేశం నుంచి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న యీ చోటుకి అనుకోకుండా వచ్చిన ధవళుడను రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు. అతనికా సౌందర్యవతి మీద విపరీతమయిన మోహం కలిగింది.

“ఈమె నాకు భార్య అయినచో.. కొంతకాలం కాపరం చేశాక నా శిరమును నీకు బలి యిచ్చుకుంటాను.. " అని ఆలయంలోని కాళికి మొక్కుకుని... దేవీపూజలు చేసి ఆమెను వెంటాడి, ఆమె యింటి గుర్తులు చూసుకుని... తానే పనిమీద బయలుదేరాడో అది మరచిపోయాడు. తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతియందు ప్రేమతో రోజురోజుకీ కృశించిపోసాగాడు. అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి ఆయోమయంలో పడిపోయారు. ధవళుడు మంచం పట్టేశాడు. ఇక తల్లిదండ్రులు ఆరాటమూ, భయమూ ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు. సంగతేమిటని అడిగారు. అతను కూడా ఏదీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పాడు. అతను యిచ్చిన గురుతులనిబట్టి శోభావతీపురానికి వచ్చి కనుక్కోగా - ఆమెది కూడా వారి కులమే అని తెలిసింది. అందుకు వాళ్లెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకుని .

“మా కొడుకు మీ అమ్మాయి యందు మనసుని లగ్నం చేసుకున్నాడు. ఆమె అతనికెంతో యిష్టము. మా బిడ్డకు మీ పుత్రిక నిత్తురా?” అని అడిగాడు. “తప్పకుండా. మాకంగీకారమే” చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకేం?

కొద్దిరోజులలోనే ధవళుడికీ ఆమెకీ వివాహం జరిగిపోయింది. తరువాత ధవళుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు.

కొంతకాలం గడిచింది. అప్పుడు ధవళుడి బావమరిది వచ్చాడు. అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ. "బావా! నిన్నూ మా సోదరినీ మా తల్లితండ్రులు యింటికి తీసుకురమ్మన్నారు. మీ తల్లితండ్రుల అనుమతి పొందాను. ఇక నీదే ఆలస్యం" అన్నాడు. ధవళుడు అభ్యంతరం చెప్పలేదు. భార్యని తీసుకుని బావమరదితో తన అత్తవారింటికి బయలుదేరాడు.

వారు ముగ్గురూ ప్రయాణం చేసి చేసి శోభావతి నగర పొలిమేరలు చేరారు. అలసివున్న వారు కాళికాలయం.. కోనేరు... చూసేసరికి ధవళుడికి గతం గుర్తుకొచ్చింది. దేవికి తాను మొక్కిన మొక్కు మనసులో మెదిలింది. అంతే భార్యకుకాని బావమరదికి కాని చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్లి తన శిరసును కాళికి బలియిచ్చాడు.

బావ ఏమయ్యాడో తెలియకు - "వెదికి వస్తాను ” అని బయలుదేరాడు బావమరిది. ఆ ప్రాంతమంతా తిరిగి అతను చివరకి ఆలయంలోకి వచ్చాడు. తల తెగి పడివున్న బావని చూశాడు. అతనికేమీ తోచలేదు. తను కూడా తల నరుక్కుని బావగారి పక్కనే పడిపోయాడు.

తన సోదరుడు - బావని వెదకడానికి వెళ్లినవాడు కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరినీ వెదకడానికి ఆమె బయలుదేరింది. వెదకి వెదకి వేసారి చివరకామె కాళికాలయానికి చేరింది. అక్కడ -

తన భర్తదీ, సోదరుడిదీ - తలలు. వాటిపక్కనే వారి మొండెములు కనిపించాయి. ఆమెకు భయము వేసింది, విపరీతమయిన దుఃఖమూ, వైరాగ్యమూ కూడా కలిగాయి. అ భీభత్సదృశ్యాన్ని చూసేసరికి ఏడుపు ఆపుకోలేకపోయింది. – ఆమె

సశేషం

No comments:

Post a Comment