*స్మార్తం - సాంప్రదాయం*
రచన లక్ష్మీ మదన్
_______________
"రమణీ! ఏం చేస్తున్నావు ?" అంటూ వచ్చింది పక్కింటి సుందరి.
"రేపు శివుడు ఎవరింట్లోనో అభిషేకం చేయాలట! వాళ్లు పత్రి వీడినే తెమ్మని చెప్పారట! అందుకే శుభ్రం చేసి కడిగి తుడిచి పెడుతున్నాను అక్కా!" అన్నది రమణి.
"అలాగా! మావాడు పొద్దున్నే ఆఫీసుకు వెళ్తాడు. చక్కగా బాక్స్ లో చపాతీలు తీసుకొని వెళ్లి వస్తాడు. శివుడికి తిండి తిప్పలు కూడా సరిగా ఉండవు! ఇంతకీ మొన్న వచ్చిన సంబంధం ఏమైంది ?" అని అడిగింది.
"తెలిసిందే కదా అక్క! ఈ మధ్య ఎవరు పౌరోహిత్యం చేసే వాళ్లను చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఆడపిల్లలు ఇలా ఎందుకు చేస్తున్నారో ఏమిటో! వీళ్ళకి సంపాదన లేదా! సంపాదనతో పాటు చక్కని సంస్కారం కూడా ఉంది. అయినా పెళ్లిళ్లు కావడం లేదు" అన్నది దిగులుగా..
"నేను చెప్తే విన్నావా! చక్కగా ఇంగ్లీష్ చదువులు చదివించు అని ఆనాడే చెప్పాను. లేదు వాడు స్మార్తం నేర్చు కుంటా అంటున్నాడు అన్నావు. ఇప్పుడు చూడు ఎవరైనా పిల్ల నియ్యడానికి వస్తున్నారా! మా వాడికి ఇప్పటికే పది సంబంధాలు వచ్చాయి. కానీ వాసు ఏ అమ్మాయిని నచ్చడం లేదు" అన్నది ముఖం నాలుగు వంకలుగా తిప్పుతూ...
రమణకి మనసు చివుక్కుమన్నది. అసలే సంబంధాలు ఖాయం కావడం లేదని బాధపడుతుంటే ఇలా సుందరి వచ్చి ఏదో ఒక మాట అని పోతూ ఉంటుంది. ఒక సుందరే నా! ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటున్నారు.. దాదాపు 30 ఏళ్లు వస్తున్నాయి. సుందరి కొడుకుకు 26 ఏళ్ళే.. కానీ ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. సుందరి బడాయి చెప్పుకుంటుంది గాని ఆ అబ్బాయి జీతం అంతంత మాత్రమే!అని మనసులో బాధపడింది.
"కాఫీ తాగు అక్క" అంటూ గ్లాస్ చేతిలో పెట్టింది.
"ఏంటోనే! మీ ఇంట్లో ఇంకా అన్నీ పాత పద్ధతులే! కప్పులో తాగితేనే తాగినట్లు ఉంటుంది నాకు" అన్నది గ్లాసు అందుకుంటూ...
ఏమి మాట్లాడకుండా రమణి కూడా కాఫీ గ్లాస్ తెచ్చుకొని కూర్చుంది. ఇంతలో శివుడు వచ్చాడు. చూడగానే నిజంగా శివయ్యని చూసినట్లే అనిపిస్తుంది. చక్కని ముఖ వర్చస్సు నుదుట విభూతి రేఖలు, మెరిసే కుంకుమ బొట్టు బలిష్టమైన దేహం తెల్లని పంచే కట్టుకొని భక్తి భావం ఉట్టి పడేలాగా కనిపించాడు.
సుందరీని చూడగానే...
"పెద్దమ్మ! బాగున్నారా! వాసు ఆఫీస్ వెళ్ళాడా ?" అని పలకరించాడు.
అతన్ని చూసి మనసులో మెచ్చుకోకుండా ఉండ లేకపోయినా.. తన గొప్పతనం ప్రదర్శించుకోవాలని..
"అవును శివుడూ! బోలెడు పని ఉంటుంది వాడికి. ఆఫీసులో అన్ని బాధ్యతలు వాడివే! అయినా ఏసీ గదుల్లోనే కూర్చుంటాడు కదా! అంత కష్టం ఏమి ఉండదులే! పాపం నీలాగా పౌరోహిత్యం చేసుకునే వాళ్ళకి ఒకపక్క వేడి, చెమటలు కారుతూ పనులు చేసుకోవాల్సి వస్తుంది" అన్నది వ్యంగ్యంగా..
శివుడు చిరునవ్వుతో..
"అవును పెద్దమ్మ! వాసు చేసే పని బాధ్యత కలది! అది వాళ్ళ ఆఫీసు వరకే ఉంటుంది. కానీ మేము చేసే పనులు లోక కళ్యాణం కోసం! పౌరోహిత్యం చేసే వాళ్ళందరూ వాళ్ల స్వార్థం కోరుకోరు. ఎండైనా వానైనా ఓర్చుకోవాల్సిందే! ఆ శివయ్య ఆజ్ఞ శిరసా వహించాల్సిందే!" అన్నాడు నవ్వుతూ..
మనసుకు శివుడి అన్న మాట తగలగానే సుందరీ లేచి..
"రమణీ! వచ్చిన మాటే మర్చిపోయాను. ఒక ఐదు వేలు ఉంటే ఇస్తావా! మా వాసు బ్యాంకు కార్డు పని చేయలేదట! అనుకోకుండా చిన్న ఖర్చు వచ్చి పడింది. సాయంత్రానికి ఇచ్చేస్తాలే! వాడి బ్యాంకులో బోలెడంత డబ్బుంది" అన్నది బెట్టు పోనీయకుండా!
"అలాగా! ఇస్తాలే అక్క" అంటూ వంట గదిలో ఉన్న ఒక డబ్బా తీసి అందులో ఉన్న నోట్ల కట్టల నుండి 5000 తీసి ఇచ్చింది.
ఆ డబ్బు చూడగానే సుందరీకి కళ్ళు బైర్లు కమ్మాయి.
"వంటింట్లోనే ఇంత డబ్బు ఉందంటే అల్మారాలో ఎంతుందో" అని అనుకొని..
"అదేంటి రమణి! డబ్బు వంటింట్లో పెట్టావు" అన్నది.
"ఎవరో ఒకరు సువాసిని పూజ చేయడానికి వస్తారు. నేను వంటింట్లో మడితో ఉంటాను! అలా వాళ్ళు తాంబూలం ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా ఒక డబ్బాలో పెట్టి పెడుతుంటాను. శివుడు కూడా వాడికి వచ్చిన డబ్బు నాకే ఇస్తాడు. అవి మాత్రం లోపలే పెడతాను అక్క" అన్నది రమణి.
కళ్ళు కుతకుత మన్నాయి సుందరికి.
గొప్పలకు ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బోలెడు డబ్బులు వస్తున్నాయి అని చెప్పింది. కానీ, ఆ వచ్చిన డబ్బు వాడి పెట్రోలుకు ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. అని అనుకొని బయటకు వెళ్ళింది.
శివుడు స్మార్తాన్ని ఇష్టంగా నేర్చుకున్నాడు. ఇటు ఈ చదువు చదువుతూనే డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఎంతో తెలివైనవాడు. వాళ్ల పూర్వీకులు ఇదే వృత్తిలో ఉండటం వల్ల తనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నా కూడా ఇందులో చేరిపోయాడు. అతని వృత్తికి అంకితమై అందరితో గౌరవంగా ఉండటం, పూజలు చక్కగా చేయించడం చూసి అతనిని అందరూ ఇష్టపడతారు. అతను కూడా నిజాయితీగా తనకు ఎంత అవసరమో అన్ని డబ్బులు మాత్రమే తీసుకుంటాడు. కానీ ఈ రోజుల్లో పౌరోహిత్యం చేయటం వల్ల మంచి ఆదాయమే కలుగుతుంది. దానిని వాళ్ళు స్వప్రయోజనాలకు చక్కగా ఉపయోగించుకొని నలుగురికి ఉపయోగపడే పనులు కూడా చేస్తున్నారు. తనకు వచ్చిన డబ్బులతో శివుడు చక్కని ఇల్లు కట్టించి తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి తాను మాత్రమే కష్టపడుతున్నాడు. తల్లిని కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. తన ఖర్చుతో చెల్లి పెళ్లి కూడా చేశాడు. కానీ శివుడికి మాత్రం పెళ్లి సంబంధాలు రావడం లేదు.
ఒకరోజు వాసుకి పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మాయి వాళ్ళది వేరే ఊరు కావడం వల్ల వాళ్లు అమ్మాయిని తీసుకొని వాసు వాళ్ళ ఇంటికే
వస్తామని చెప్పారు.
ఇక సుందరికి ఆకాశంలో తేలి పోయినట్లుగా ఉంది. పక్కింటి శివుడికి పెళ్లి సంబంధాలు రాకుండా తన కొడుకుకు వస్తున్నాయని మురిసి పోసాగింది.
అప్పటికే నాలుగు సార్లు రమణి దగ్గరికి వచ్చి ఈ వార్తను చెప్పి వెళ్ళింది. రమణి కూడా అతనికి పెళ్లి సంబంధం వచ్చింది అని కుళ్ళు కోకుండా..
"ఏదైనా అవసరం ఉంటే చెప్పు అక్క" అన్నది ప్రేమగా..
"ఏం అవసరం ఉంటుందిలే! అన్ని బయట నుండి తెప్పిస్తాను. వంటింట్లో కూర్చుని చేసే ఓపిక లేదు నాకు. అందులో వాసు కూడా ఒప్పుకోడు వాడికి అన్నీ కాస్ట్లీగా ఉండాలి" అని చెప్పింది.
అయినా సరే వినకుండా రమణి రవ్వ లడ్డులు చేసి పంపించింది.
11 గంటల ప్రాంతంలో పెళ్లికూతురు వాళ్ళు వాసు ఇంటికి వచ్చారు. రెండిళ్లకు గోడ అడ్డంగా ఉండటం వల్ల వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా ఈ ఇంట్లో కూడా కనిపిస్తుంది.
వాసు చూడటానికి చక్కగానే ఉంటాడు. కానీ తల్లి నేర్పిన దర్పం వల్ల అప్పుడప్పుడు పొగరుగా మాట్లాడుతుంటాడు.
పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి పేరు ధరణి. ఆ అమ్మాయి వాళ్ళ ఊళ్లోనే ఉద్యోగం చేస్తూ సాయంత్రాలు బడికి పోనీ పిల్లలకు అక్షరాలను నేర్పిస్తుంది. మంచి మనసున్న అమ్మాయి.
పెళ్లివాళ్ళకి ఒక గది ఇచ్చారు. ధరణి పెద్ద ఆర్భాటంగా తయారు కాకుండా ముఖం కడుక్కొని జడ వేసుకొని పింక్ కలర్ చుడిదార్ వేసుకుని బయటకు వచ్చి కూర్చుంది.
అక్కడే ఉన్న సుందరి.. 'కనీసం పట్టు చీరైన కట్టుకోలేదు. రేపు పెళ్లిలో నగలు ఏమైనా పెడతారో లేదో'అని అనుకుంది.
కాఫీ ఫలహారాలు అయిన తర్వాత వాసు ఆ అమ్మాయి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయికి ఉన్న భావాలు వాసుకి అంత పెద్దగా నచ్చలేదు.
'ఎవరి కుటుంబం వాళ్ళు చూసుకోక ఇంకా దేశోద్ధరన ఎందుకు! అని మనసులో అనుకొని..
"నువ్వు జాబ్ చేస్తావా ?" అని అడిగాడు.
"ప్రస్తుతం జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తూ కూడా ఏదో ఒక సేవ చేయడం నాకు అలవాటు" అన్నది.
"ఎవరి సంపాదన వాళ్ళకే సరిపోదు. ఇంకా సేవ ఏమిటి" అన్నాడు వాసు..
"సేవ అంటే డబ్బు ఒకటే కాదు కదా! ఉచితంగా విద్య నేర్పిస్తుంటాను. నాకు తెలిసినది ఏదైనా చేస్తుంటాను" అన్నది ధరణి.
"ఉచితంగా ఎందుకో డబ్బులకు ట్యూషన్స్ చెప్పవచ్చు కదా" అన్నాడు వాసు.
"నాకు ఇప్పుడు మంచి శాలరీనే వస్తుంది! ఇంకా సంపాదన నాకెందుకు ?" అన్నది ధరణి..
ఇలా చాలా విషయాల్లో ఇద్దరి మాటలకి పొంతన కుదరలేదు..
ఆ తర్వాత కాసేపటికి వరండాలోకి వచ్చింది ధరణి.
అప్పుడే బయట నుంచి వచ్చిన శివుడు వీధిలో కుక్క పడి ఉంటే దానిని వరండాలోకి తీసుకెళ్లి కట్టు కట్టి నీళ్లు తాగించి, ప్లేట్లో అన్నం పెట్టాడు. ఇదంతా గమనించిన ధరణి..
గోడ దగ్గరికి వెళ్లి..
"మీరు వెటర్నరీ డాక్టరా ?" అని అడిగింది.
ఎందుకంటే ఇప్పుడు అతని రూపం పంచ కట్టులో లేదు.. ప్యాంటు షర్టు వేసుకొని ఉన్నాడు.
వెనుకనుండి వచ్చిన వాసు..
"అతను పౌరహిత్యం చేస్తాడు" అని చెప్పాడు.
"అవునా! ఈ రోజుల్లో అందరూ ఉద్యోగాలు చేయాలనుకుంటే మీరు ఈ వృత్తి ఎందుకు ఎన్ను కున్నారు!" అని అడిగింది ధరణి.
"వృత్తి అన్నారు కదా! మా తరతరాలు ఇదే వృత్తిలో జీవిస్తున్నారు. నాకు కూడా ఈ వృత్తిపట్ల గౌరవం, ఇష్టం రెండూ ఉన్నాయి. అందుకే చేస్తున్నాను. అందరూ వద్దు అనుకుంటే మరి ఎవరు చేస్తారు ?" అన్నాడు.
ఎందుకో శివుడంటే అభిమానం కలిగింది ధరణికి..
పెళ్లిచూపులై వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత.. ధరణి తల్లిదండ్రులు శివుడి ఇంటికి వచ్చారు.. శివుడు ధరణికి బాగా నచ్చాడని, ఒకవేళ శివుడికి కూడా ఈ అమ్మాయి నచ్చితే పెళ్లి చేయడానికి వాళ్లకు ఏ అభ్యంతరం లేదని చెప్పారు.
రమణి భయపడిపోయింది. పక్కింటి సుందరి ఏమనుకుంటుందో అని...
కానీ అప్పటికే వాసుకు నచ్చలేదని చెప్పి ఉండటం వల్ల.. వీళ్లు ఈ సంబంధాన్ని నిశ్చయం చేసుకున్నారు.
మనసులో సుందరి ఎంతో కుళ్ళుకుంది. అనవసరంగా సంబంధం వద్దు అనుకున్నాము అని బాధపడింది..
కానీ ధరణి సంతోషంగా శివుడి చేయి పట్టుకొని ఇంట్లోకి అడుగు పెట్టింది.
వృత్తిపట్ల శివుడికి ఉన్న గౌరవాన్ని చూసి ఆమెకు ఎంతో ఇష్టం ఏర్పడింది. అలా వాళ్ళిద్దరూ చక్కని జంటగా నిలిచారు.
_______________
No comments:
Post a Comment