చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత.
కర్ణుడు వయసులో కౌరవ పాండవులందరికంటే చాలా పెద్దవాడు .
ద్రోణుడు అంతమంది కురువీరులకు అస్త్ర శస్త్ర విద్యలు నేర్పే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతగా అదొక కుటుంబ సంబరంగా కుమార అస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేశాడు. కర్ణుడూ ఆయన దగ్గర విద్యలన్నీ నేర్చాడు. ఈయనే కాదు అశ్వత్థామ గూడా నేర్చాడు.
కన్నకొడుకు అక్కడ విద్యా ప్రదర్శన చేయలేదు.
కర్ణుడు వచ్చి అర్జునుడి మీద మండిపడ్డాడు.
దుర్యోధనుడు దాన్ని అవకాశంగా తీసుకొని కర్ణుణ్ణి అర్జునుడికి దీటూగా రణరంగంలో దింపవచ్చు అని ఏకంగా అంగరాజ్య అధికారం ఇప్పించాడు.
అంటే పాండవులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే రాజ్యాధికారం చేతికివచ్చి చక్రం తిప్పాడు. అది మొదలు రాజభోగాలు అనుభవించాడు.
స్వభావాన్ని బట్టే గానీ, కులం చూచి ఆ రోజుల్లో ఎవరినీ తక్కువ చేయలేదు. దుర్భాషలాడుతూ అతడు ఉన్నా తన వంశంవాడని భీష్ముడు లోలోపల వాత్సల్యం కలిగే ఉన్నాడు. కౌరవసభలో దుర్యోధనుడి నెచ్చెలిగా అతడాడినది ఆటగా సాగింది. ఎక్కడా నా కులాన్నిబట్టి తక్కువగా చూస్తూన్నారే అనే భావన కర్ణుడి మనసులో లేదు.
పెత్తనం చూస్తే ఏమీ తక్కువ లేదు.
సంజయుడు రాయబారిగా వచ్చినపుడు —
* అక్కడ ఇంకా ఆ కర్ణుడి మాటే చెల్లుతున్నది గదా !* అని సంజయుణ్ణి అడుగుతాడు ధర్మరాజు.
అంటే కర్ణుడి మాట దుర్యోధనుడికి వేదవాక్కు.
సింహాసనంలో ఉన్న ధృతరాష్ట్రుడూ కాదనలేడు.
కార్యమునకు ఖడ్గమునకు కలవాడై కౌరవసభలో చక్రం తిప్పాడు. "మీరు దిగిపోతే మా కర్ణుడు ఈ పాండవులను క్షణంలో వధిస్తాడు " అని భీష్మద్రోణులతో అనేటంత పలుకుబడి గడించాడు కర్ణుడు.
* నన్ను కురురాజ్యంబేలింపుము * అని ప్రాధేయపడ్డాడు దుర్యోధనుడు.
అంగరాజైన తర్వాత ఆ జీవితంలో వెనక్కు తిరగడమే లేదు. ఈ నాటి మన ఆలోచనలు భారతకాలానికి ముడిపెట్టి చూడగూడదు.
*****
ద్రోణుడు అన్ని అస్త్రాలూ చక్కగా నేర్పాడు. కుమార విద్యా ప్రదర్శన ఆ 105 మందికి మాత్రమే ఉద్దేశించినది. కర్ణుడు అక్కడ తలదూర్చడమే తొందరపాటు చర్య.
బ్రహ్మాస్త్రం అశ్వత్థామకే పూర్తిగా నేర్పలేదు. అతడి స్వభావానికి అది ప్రమాదకరమని.. అట్టే అయింది గూడా. అది ప్రయోగించి 3000 సంవత్సరాలు రోగబాధ పడవలసి వచ్చింది.
అర్జునుడు నేర్చినా ఆ విపత్తు తెచ్చుకోలేదు.
విద్యలు వ్యక్తి యోగ్యతనుబట్టి ఇవ్వడం శాస్త్రసంప్రదాయం. ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో లేదా భారమౌతుందో తెలుసుకొని అతడికి ఆత్మరక్షాకరమైనంతే నేర్పుతారు.
మంత్రవిద్యలు వేర్వేరుగా ఒక్కొక్కరికి ఉపదేశం చేసేవి.
క్లాస్ రూం పాఠాలుకాదవి. శుక్రాచార్యులు మృతసంజీవని అవసరపడి ఒక్క కచుడికే చెప్పాడు. పదిమందికి చెప్పలేదు.
బ్రాహ్మణులకు, ఉత్తమగుణవంతులైన క్షత్రియులకే ఇచ్చేది బ్రహ్మాస్త్రం.
ద్రోణుడు అదే చెప్పాడు.
పరశురాముడి దగ్గర బొంకి ఆ బ్రహ్మాస్త్రమూ నేర్చాడు.
ఇది రాక్షసప్రవృత్తి. అనుచితంగా ఇతడు ఉపయోగించుకొనే ప్రయత్నం చేయవచ్చు అని ఆయన అవసరమైనప్పుడు స్మరణకు రావు అన్నాడు.
కర్ణుడు ద్రోణుడూ పరశురాముడూ ఇచ్చిన అన్ని అస్త్రాలూ ప్రయోగించాడు. భార్గవాస్త్రం ఒకటే చివరి క్షణాలలో గుర్తురాలేదు.
జీవితంలో చేసిన ఘోర అకృత్యాలకు పరిణామం ఆ చివరిదశ. అందుకు మన సానుభూతి అనవసరం.
స్వకృతం భుంజతే పాపం
న ప్రతార్య సుఖీ భవేత్.
No comments:
Post a Comment