Saturday, August 8, 2026

 🎻🌹🙏 బలి చక్రవర్తి పూర్వ జన్మ వృత్తాంతము...!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿పూర్వం ఒకప్పుడు ఒక రాజ్యంలో ప్రసిద్ధికెక్కిన ఒక జూదరి ఉండేవాడు. జూదాన్నే వృత్తిగా చేసుకున్న అతడు దేవతలను బ్రాహ్మణులను సదా నిందిస్తూ ఉండేవాడు. లోకంలోని చెడు వ్యసనాలన్నిటికీ అతడు ఆలవాలమైనాడు.

🌸ఇలా ఉండగా ఒకరోజు జూదంలో చాలా ధనం గెలుచుకున్నాడు. దాంతో అతడి మనస్సు సంతోషంతో పొంగిపోగా, అతడే తన చేతులతో కిళ్ళీ కట్టి, చందనమూ, పువ్వుల మాలలు వంటివి తీసుకొని ఒక వెలయాలి ఇంటివైపు వేగంగా అడుగులు వేస్తూ పోతున్నాడు.

🌿దారిలో కాళ్ళు తడబడటంతో కిందపడి స్పృహ కోల్పోయాడు. | కాసేపటికి స్పృహ వచ్చాక అతడు తన హృదయంలో ఏదో మార్పు కలగటం గ్రహించాడు. 

🌸తను అంతదాకా గడిపిన చెడు జీవితం గురించిన దిగులు అతణ్ణి పట్టుకొంది. తత్ఫలితంగా అతడిలో వైరాగ్య బీజాలు అంకురించాయి. 

🌿పిదప మనస్సులో స్పష్టత జనించగా నిర్మలమైన మనస్సుతో తన చేతిలో ఉన్న వస్తువులను సమీపంలో వెలసి ఉన్న ఒక శివలింగానికి అర్పించి ఇంటి ముఖం పట్టాడు.

🌸కాలం తన వేగగతిలో వెళ్ళిపోతుంది. జూదరి జీవిత పయనం అంతమయింది. యమదూతలు అతణ్ణి యమలోకానికి తీసుకుపోయారు.

🌿యమధర్మరాజు అతణ్ణి చూసి, "మూర్ఖుడా! నువ్వు ఒనరించిన దుష్టకర్మల కారణంగా నరకంలో ఘోరమైన శిక్షలు అనుభవిస్తూ రోదించవలసి ఉంది" అని చెప్పాడు. ఆ మాటలు విన్న మన జూదరి వణకిపోతూ యమధర్మరాజుతో,

🌸"స్వామీ! నేను ఏదైనా పుణ్యం కూడా చేసి ఉండవచ్చు గదా? దయచేసి ఆ పుణ్యకర్మ ఫలాన్ని కూడా పరిగణించి తీర్పు ఇవ్వండి" అని ప్రార్థించాడు.

🌿యమధర్మరాజు, చిత్రగుప్తుని వైపు చూశాడు. చిత్రగుప్తుడు: నువ్వు మరణించడానికి మునుపు కొద్దిగా చందనాన్ని -ఈ శివలింగానికి అర్పించావు. దాని ఫలితంగా నువ్వు మూడు గడియల ఇక కాలం స్వర్గ సింహాసనం మీద దేవరాజుగా ఉండడానికి అర్హత పొందావు.

🌸జూదరి: అలా అయితే మొదట స్వర్గంలో నేను అనుభవించవలసిన వాటిని అనుభవించడానికి నాకు అనుమతి ఇవ్వండి. ఆ తరువాత నరకంలో పడవలసిన బాధలన్నీ పడతాను.

🌿వెంటనే యమధర్మరాజు ఆదేశ ప్రకారం జూదరిని స్వర్గలోకానికి పంపించారు. దేవగురువైన బృహస్పతి, ఇంద్రుణ్ణి పిలిచి మూడు గడియల కాలం స్వర్గ సింహాసనాన్ని ఖాళీచేసి ఆ జూదరికి ఇవ్వమని నచ్చజెప్పి, ఒప్పించాడు.

🌸 మూడు నాళికల కాలం గడిచాక మళ్ళీ ఇంద్రుడే దేవసింహాసనాన్ని అధిష్ఠిస్తాడని కూడా బృహస్పతి చెప్పాడు.

🌿ఇంద్రుడు సింహాసనం నుండి దిగగానే జూదరి దేవలోకానికి అధిపతి అయ్యాడు. ఇంకా మూడు గడియల కాలం మాత్రమే ఉందే! జూదరి ఆలోచనలో పడ్డాడు. 'మహాశివుడు తప్ప నాకు మరో శరణ్యం లేదు' అని మనస్సులో సంకల్పించుకున్నాడు.

🌸 వస్తువుల పట్ల గల అనురక్తి అతడి నుండి తొలగిపోసాగింది. వెంటనే తన ఆధిపత్యం కింద ఉన్న వస్తువులను అన్నిటినీ దానం చేయడం మొదలుపెట్టాడు.

🌿శివభక్తుడైన అతడు సుప్రసిద్ధమైన దేవేంద్రుని ఐరావతమనే గజరాజును అగస్త్యమునికి దానంగా ఇచ్చేశాడు. ఉచ్ఛైశ్రవమనే అశ్వాన్ని విశ్వామిత్ర మునికి సమర్పించాడు.

 🌸కామధేనువును వసిష్ఠ మహర్షికి అర్పించాడు. చింతామణి అనే అమూల్య రత్నాన్ని గాలవ మహర్షికి దానంగా ఇచ్చాడు. కల్పవృక్షాన్ని పెకలించి కౌండిన్య మహర్షికి ఇచ్చేశాడు. ఈ విధంగా అతడు మూడు నాళికల కాలం అయ్యేదాకా దానం ఇస్తూనే ఉన్నాడు. 

🌿స్వర్గంలోని అమూల్యమైన వస్తువులను అన్నింటినీ దానంగా ఇచ్చేశాడు. మూడు గడియల కాలం గడిచిందో లేదో, మాట్లాడకుండా సింహాసనం నుండి దిగిపోయాడు.

🌸దేవేంద్రుడు తిరిగి వచ్చి చూసేసరికి అమరావతీ నగరమే సర్వసంపదలూ కోల్పోయి వెలవెలబోతూ కనిపించింది. వెంటనే దేవేంద్రుడు దేవగురువైన బృహస్పతిని తోడ్కొని యమధర్మరాజు వద్దకు వెళ్ళాడు.

🌿 కోపోద్రేకంతో యమధర్మరాజును చూస్తూ, "ధర్మదేవా! మీరు నా పదవిని ఒక జూదరికి అర్పించి తగని పని చేశారు. అతడు అక్కడకు వచ్చి చెయ్యరాని పనులన్నీ చేశాడు.

🌸 నా అమూల్యమైన రత్నాలను అన్నింటినీ అతడు మునులకు దానం చేశాడు. వచ్చి అమరావతీ నగరాన్ని తిలకించండి! కొల్లగొట్టబడినట్లు ఎంత శూన్యంగా కనిపిస్తోందో కళ్ళారా మీరే చూసి తెలుసుకోండి" అని చెప్పాడు.

🌿అంతా విని యమధర్మరాజు, "దేవేంద్రా! మీకు వయస్సు అధికరించడంతో వృద్ధులయ్యారు. అయినప్పటికీ, మీకు రాజ్యాధికార అనురక్తి ఇంకా పోలేదే!

🌸 జూదరి చేసిన పనుల వల్ల అతడికి ఇప్పుడు లభించిన పుణ్యం మీరు చేసిన వందల సంఖ్యలోని యజ్ఞాల వలన కలిగిన పుణ్యం కంటే ఎంతో అధికరించింది. 

🌿తన వశంలో అత్యంత గొప్ప అధికారం అప్పగించబడినప్పటికీ ఎవరు కించిత్తు కూడా గర్వించక సత్కర్మలు చెయ్యడంలో తలమునకలై ఉంటాడో అతడే సర్వోత్కృష్టుడు. 

🌸వెళ్ళండి, మునులకు అవసరమైన వస్తువులను ఇచ్చో లేదా మరి కాళ్ళ మీద పడో మీ రత్నాలను తిరిగి తెచ్చుకోండి” అని జవాబిచ్చాడు. 

🌿ఇది విని ఇంద్రుడు, “సరే, మంచిది" అంటూ తిరిగి వెళ్ళిపోయాడు. జూదరి తను ఇదివరలో చేసిన దుష్కర్మల ఫలితంగా కలిగిన నరకవాస జీవితాన్ని గడపటం నుంచి విడివడ్డాడు.

🌸 తరువాత అతడు మరుజన్మలో విరోచనునికి మహాతపస్వి, దానశీలి అయిన బలి పేరిట పుత్రుడుగా జన్మించాడు..🚩🌞🙏🌹🎻

No comments:

Post a Comment