*స్టేషన్ కి ఎవరూ రాలేదే* ?
Alaparthy Ramakrishna
ఇంట్లోకి అడుగు పెడుతూనే అడిగాడు గోవర్ధన్.
ఈశ్వరయ్య విస్తుపోయాడు
నువ్వేమన్నా చిన్నపిల్లాడివా ? ఈ ఊరికి కొత్తా నువ్వు ? స్టేషన్ కు మేము రావడం ఏమిటి ? అన్నాడు కొడుకుతో
కొంచెం వొళ్ళు వచ్చి రంగు తేలిన, కొడుకు కేసి ఆనందంగా చూస్తూ ఉండిపోయింది తల్లి భాగ్యలక్ష్మమ్మ
నేను వస్తున్నానని తెలిసి ఊళ్లో సగం మందికి పైగా పెద్దవాళ్లు, ఫ్రెండ్స్, మున్సిపల్ చైర్మన్ తో సహా స్టేషన్కు వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నారు.. మీరు రాకపోవటం లోటు గానే ఉంది
కొడుకులో ఏదో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది ఈశ్వరయ్యకు
... అవును... వాడిప్పుడు ఏమన్నా చిన్నా,చితకా ? గ్రూప్ వన్ పరీక్షలు పాసై, ఆర్డిఓ అయ్యాడు.. పట్నంలో వాడు ఉండటానికి పెద్ద బంగ్లా, జీవు.. చేతికింద నౌకరులు... తన దగ్గర ఏ బి సి డి లు నేర్చుకున్న కొడుకు కాదు..
... పోనీలే!.. కొడుకు పెద్ద ఆఫీసర్ అవడం తనకు మాత్రం సంతోషం, గర్వం కాదూ!
ఎలా ఉందిరా నీ ఉద్యోగం ?
బాగానే ఉంది.. క్రిందటి నెలలో రిటైర్ అయ్యారని ఉత్తరంలో రాశారు.. మీకు ఇక్కడ ఏం తోస్తుంది ?.. మీరు అమ్మ, పిల్లలు నా దగ్గరకు వచ్చేయకూడదూ ?
నవ్వి ఊరుకున్నాడు ఈశ్వరయ్య
నాకేం తెచ్చావు అన్నయ్యా ? అడిగింది పరిమళ
ఎమ్మెస్ చదువుకున్నావ్ ? ఇంకా నీకు ఏం తీసుకురావాలి ? నువ్వు ఏమైనా చిన్నపిల్లవా ? నీకు ఏదైనా కావాలంటే డబ్బులు ఇస్తాను..నీకు కావాల్సింది కొనుక్కో!
మొహం ముడుచుకుంది పరిమళ. డబ్బులు కావాలంటే నాన్న ఇవ్వడా నిన్ను అడగటం దేనికి ? అంత దూరం నుంచి వచ్చావు.. నాకు ఏదైనా ప్రజెంటేషన్ తెచ్చావేమోనని సరదాగా అడిగానన్నయ్యా!
నీకు పెళ్లి చేసి చాలా దూరం పంపించేయాలి! అక్కడి నుంచి అమ్మా నాన్నకు నువ్వు ఏ ప్రజెంటేషన్ పంపుతావో నేను చూస్తాను కదా! అన్నాడు గోవర్ధన్
ఏదో మాట్లాడబోయింది పరిమళ.. తల్లి రావడంతో మౌనంగా ఉండిపోయింది
"వెళ్లి స్నానం చెయ్!" అన్ని భాగ్యలక్ష్మి
అందరూ టేబుల్ చుట్టూ కూర్చుని భాగ్యలక్ష్మమ్మ వడ్డిస్తుంటే ఆమె చేతి వంట మెచ్చుకుంటూ మాట్లాడుకోసాగారు..
ఇంటికేమి డబ్బు పంపడం లేదు.. జీతం అంతా ఖర్చు పెట్టేస్తున్నావ్ రా! అడిగింది భాగ్యలక్ష్మమ్మ
ఇంటికి మనీ ఆర్డర్ పంపడం ఏంటి ? మన ఇల్లు సగం అద్దెకిచ్చారు గదా! అద్దె ఐదు వందలు, నాన్నగారికి వచ్చే పెన్షన్, రెండు ఎకరాల మీద వచ్చే పంట డబ్బు.. ఇవి సరిపోవటం లేదా మీకు ?.. ఓ పని చేయండి..ఇల్లంతా అద్దెకిచ్చేసి మీ ముగ్గురు నా దగ్గరకు వచ్చేయండి! అనేశాడు తేలిగ్గా
డబ్బు సరిపోవటం లేదని కాదురా!నాన్నగారికి కొంత డబ్బు పంపిస్తే రేపు మీ చెల్లెలు పెళ్లి ఖర్చులకు పనికొస్తుంది కదా! అంది భాగ్యలక్ష్మి
నాకేం పంపక్కర్లేదు కానీ, వాడిని సరదాగా ఖర్చు పెట్టుకొనీ..ఈ వయసులో ఖర్చు పెట్టుకోకపోతే వాడు ఎప్పుడు ఖర్చు పెట్టుకుంటాడు ? అనేసి పళ్లెంలో చేయి కడుక్కున్నాడు
అదేమిటండి ? పెరుగన్నం తినకుండానే చేయి కడుక్కున్నారు.. మరో పళ్ళెం తెస్తాను కూర్చోండి!
"వద్దులేవే! ఆకలి లేదు.. ఎక్కువగా తింటే అజీర్తి చేస్తుంది!"
ముందు గదిలోకి వచ్చి పడకుర్చీలో కూర్చున్నాడు ఈశ్వరయ్య..
పైకి మనిషి గంభీరంగానే ఉన్నాడు గాని, మనసులో అలజడి ప్రారంభమైంది.. కొడుకును డబ్బు పంపొద్దు అన్నాడే గాని మనసులో వాడు మనియార్డర్ పంపితే ఎంత బాగుణ్ణు!" అనుకున్నాడు
అయినవాళ్లకు డబ్బు పంపడంలో ఉన్న ఆనందం వాడికి ఏం తెలుసు ? పెద్దన్నయ్య తన సౌఖ్యం చూసుకుంటే తానీ స్థితిలో ఉండేవాడా ?..
పెద్దన్నయ్యది ఎంత మంచి మనసు!
గతం తాలూకు జ్ఞాపకాలు సెలయేరు మోతలా మెదడులో వినిపించింది.. సినిమా రీళ్లలాగా కనిపించాయి..
*** *** ***
నాన్న వయసులో ఉన్నప్పుడే, ఏదీ కలిసిరాక ఆస్తి అంతా హారతి కర్పూరంలా హరించుకుపోయింది.చివరకు మూడు ఎకరాల పొలం మిగిలింది.. ఇంట్లో ఎనిమిది మంది పిల్లలు.. బాధ్యతలు తెలుసుకొని ఖర్చులు తగ్గించాడు నాన్న..
పెద్దన్నయ్య ఒక్కడే ఉద్యోగం చేస్తున్నది సదరన్ రైల్వేస్ లో బ్రిడ్జి ఇన్స్పెక్టర్ పని చేసేవాడు.. కేరళలో ఎక్కువ సంవత్సరాలు పనిచేశాడు..
ప్రతి నెల ఆరో తారీకు కల్లా అన్నయ్య నుంచి మనీ ఆర్డర్ వచ్చేది.. ఆరో తారీకు వచ్చిందంటే చాలు నాన్న బయటకు కదిలేవాడు కాదు.. వరండాలోనే పోస్ట్ మాన్ వచ్చేంతవరకు కూర్చునేవాడు.. అతను రావడం ఆలస్యం అయితే గేటుదగ్గర కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉండేవాడు.. అమ్మ భోజనం వడ్డిస్తాను అన్నా ఇంట్లోకి వచ్చేవాడు కాదు..
కొడుకు పంపిన రెండు వందల్లో ఓ వంద కిరాణాకొట్టులో జమ చేసేవాడు.. కొట్లో బాకీ పెరిగిపోతూనే ఉండేది.. గుడ్డల కొట్టు, కూరగాయలు కొట్టు అన్నిచోట్ల బాకీలే!
పంటలు బాగా పండిన సంవత్సరం అప్పులు తీరేవి.. మళ్లీ అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బ తినేవి.. షరా మామూలే! అప్పులు పెరిగిపోయేవి... తన ఖర్చులు కని పది రూపాయలు ఉంచుకొని, మిగిలిన తొంభై అమ్మకి ఇంట్లో ఖర్చులు ఇచ్చేవాడు..
ఇంట్లో మగ పిల్లలందరికీ ఖాఖీ బట్టలే! మురికి కనపడదని ఎక్కువ రోజులు వస్తాయని..
స్కూల్లో పోలీసోడు! అనేవాళ్ళు. తన ఖాఖీ బట్టలు చూసి.. మనస్సు చివుక్కుమనేది...
నాన్న చనిపోయే వరకు అన్నయ్య డబ్బులు పంపుతూనే ఉండేవాడు.. పదకొండు సంవత్సరాలు క్రమం తప్పకుండా నెల మొదటి వారంలోనే డబ్బులు పంపించడం అంటే గొప్ప విషయమే కదా! కూతుళ్లు పెళ్లి ఈడుకి రావడంతో నాన్న చనిపోయాక డబ్బు పంపడం ఆపేశాడు.. అప్పుడే రెండో అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది.. ఓ సంవత్సరం డబ్బులు పంపి ఆ తర్వాత పంపడం మానేశాడు వదిన పోరు పడలేక..
చెల్లెలి పెళ్లి తన చదువు పూర్తి అయ్యేసరికి ఒక్క ఎకరం పొలం మాత్రమే మిగిలింది.. ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు చిన్న తరగతుల్లోనే ఉండిపోయారు...
హైస్కూల్లో టీచర్ గా సెటిల్ అయ్యాడు..తను ప్రతి నెల అమ్మకు డబ్బు పంపించేవాడు..
పంపడం ఆలస్యం అయితే తమ్ముళ్లు ఉత్తరం మీద ఉత్తరం రాసేవాళ్ళు ... వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారేమోనని ఒక్కొక్కసారి *టీయంఓ* చేసేవాడు.. తమ్ముళ్లు ఎదిగి, ఉద్యోగాలు సంపాదించుకున్నాక ఇంటి భారం తగ్గింది...
కానీ మనీ ఆర్డర్ పంపడం ఆగలేదు.. రెండు అక్కయ్య కొడుక్కి పంపించాల్సి వచ్చింది...శ్రీనివాస్ కి ఇంజనీరింగ్ సీటు వచ్చింది.. బావ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఐదేళ్లు వాడికి డబ్బులు పంపించాడు.. శ్రీనివాస్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.. వాడు చదువు పూర్తి కాగానే అక్కయ్య కళ్ళల్లో మెరిసిన ఆనందం చూశాడు....అదే తనకు తృప్తి!..
తను సంపాదించినన్నాళ్లు మని ఆర్డర్లు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు సంపాదన లేదు.. డబ్బు పంపాల్సిన వాళ్ళు కూడా లేరు..
చిన్నప్పటినుండి మనీ ఆర్డర్ తో ఏదో అనుబంధం.
తనకు ఎవరైనా మనీ ఆర్డర్ చేస్తే బాగుణ్ణు !
డబ్బు పంపరా అని తన కొడుకుని ఎలా అడగగలడం. ఒకవేళ అలా అడిగి డబ్బు తెప్పించుకుంటే మళ్లీ తనకు అసంతృప్తి..
**** *** ****
నాన్న నీకు *మనీ ఆర్డర్* వచ్చింది! పరిమళ కేకేసింది.
ఈశ్వరయ్య హడావిడిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఊడిపోతున్న పంచెను పైకి ఎగదోపుకుంటూ..
పోస్ట్ మాన్ కేసి ఎగాదిగా చూశాడు.. *మనీ ఆర్డర్ తనకేనా* ? అన్న అనుమానంతో. మనియార్డర్ ఫారం పైన తన అడ్రస్ చూసి స్థిమితపడ్డాడు
పోస్టుమెన్ దగ్గర నుంచి డబ్బు అందుకుంటున్నప్పుడు అనిర్విచనమైన అనుభూతితో ఊగిపోయాడు
మనీ ఆర్డర్ కూపన్ తో పాటు, ఒక ఉత్తరం కూడా ఇచ్చి వెళ్ళాడు పోస్ట్ మెన్...
కళ్ళజోడు సరి చేసుకుంటూ ఇన్ ల్యాండ్ లెటర్ విప్పి చూశాడు..
ముత్యాల్లా అక్షరాలు బారులు తీరి ఉన్నాయి
"పూజ్యనీయులైన మావయ్యగారికి
నమస్సులు -
అందరూ క్షేమమని తలుస్తాను
అమ్మ కులాసాగానే ఉంది
ఫ్యాక్టరీలో వర్క్స్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది. నెలకు 3000 జీతం.. పెద్ద క్వార్టర్..కారు కూడా ఇచ్చారు..నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం మీరే! అంతా మీ చేతి చలవే!...
మీరు చేసిన సహాయానికి ఇలా డబ్బు పంపటం చెల్లు కాదు.. అమ్మ పంపమని గట్టిగా చెప్పింది.. మీరు కాదనకూడదు.. మీకు ఈ డబ్బు అవసరం లేకపోతే పేదవాడికో సహాయం చేయండి! అది మీ చేతుల మీదుగా జరిగితే నాకు తృప్తి..
అమ్మను తీసుకొని మీ ఆశీస్సులు కోసం వస్తాను..
పరిమళను అడిగినట్లు చెప్పండి..
ఇట్లు
మీ మేనల్లుడు
శ్రీనివాస్
తన భుజం పైనుంచి ఆసక్తిగా ఆ ఉత్తరం చదువుతున్న కూతుర్ని గమనించాడు ఈశ్వరయ్య
*ఉత్తరంలో ఆఖరి వాక్యం నీ గురించే తల్లీ!*
తండ్రి చేతిలోని ఉత్తరం లాక్కుని లేడీ పిల్లలా ఇంట్లోకి పరిగెత్తింది పరిమళ..
🌹🌹🌹 ❤️❤️❤️ 🌳🌳🌳
ఈ కథ యువ మాస పత్రిక అక్టోబర్ 1985 సంవత్సరం ప్రచురితమైంది
అప్పట్లో మా ఇంటి పరిస్థితులు కూడా దాదాపుగా కథలో పేర్కొన్నట్లే ఉండేవి.. కథ కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు చేశాను..
మూడో అన్నయ్య మంగారావు రైల్వేలో బ్రిడ్జి ఇన్స్పెక్టర్గా చేస్తూ ఉండేవాడు.. ప్రతి నెల మొదటి వారంలోనే క్రమం తప్పకుండా నాన్నకు మనీ ఆర్డర్ పంపుతూ ఉండేవాడు.. అలా పదకొండు ఏళ్లు సాగింది..
పెద్దయ్యాక..
ఉద్యోగాలు చేస్తున్న రోజుల్లో కూడా ఎవరైనా మనీ ఆర్డర్ పంపితే బావుణ్ణు! అనుకునేవాడిని
మా ఇద్దరు అబ్బాయిలు చదువుకునే వయస్సు.. నాకెవరు మనియార్డర్ పంపుతారు ? అనుకుంటూ ఉండేవాడిని.. ఆర్థికంగా ఆ అవసరం లేకపోయినా!
సచివాలయం (హైదరాబాదు)లో ఉద్యోగం చేస్తున్నప్పుడు పత్రికల నుంచి అప్పట్లో M.O లు వచ్చేవి..
ఆంధ్ర సచిత్ర వార పత్రికలో *దారితప్పిన బాటసారులు* కథకు పారితోషికంగా 40 రూపాయలు పంపారు.. అదే నేను అందుకున్న మొదటి మనీ ఆర్డర్.. ఆ తర్వాత మరికొన్ని పత్రికల నుంచి..40 నుంచి 50.. ఆ తర్వాత పారితోషికాలు పెరిగాయి.. కథకు 100... Money order కు బదులు cheque..ఆ తర్వాత NEFT ద్వారా డబ్బు పంపడం..
సచివాలయంలో వేల జీతం తీసుకుంటున్నా, ఓ పత్రికకు పత్రికలో పడిన రచనకు డబ్బులు పంపితే మహాదానందంగా ఉండేది.. రచయితగా గుర్తింపు మరింత ఆనందాన్ని కలిగించేది.. రచయిత(త్రు)కు అది స్వర్ణయుగంగా అనిపించేది..
*** 🌳🌳 ***
No comments:
Post a Comment