Saturday, August 8, 2026

 శీర్షిక:"అయితేనే"

ఉన్నంతలో సర్దుకుపోక 
ఉన్నత స్థితికి చేరాలనే
లక్ష్యం ఉండటం 
అత్యంత సహజం....

కానీ ఆ క్రమంలో 
నడిచే దారి ధర్మబద్ధం 
"అయితేనే" 

లక్ష్యసిద్ధి 
మనకు ప్రయోజనం 
రేపటి తరానికి మార్గదర్శనం‌...!!

పుట్టుకతో
కులమతాలు 
ఎంచుకోవడం మన చేతుల్లో లేదు
తోటి మనిషి 
కష్టంలో ఉన్నప్పుడు 
స్పందించే గుణం 
తప్పక ఎంచుకోగలం.... 

కానీ ఆ క్రమంలో 
ప్రతిఫలాన్ని ఆశించకపోవడం, హోదాను బట్టి కాక 
వ్యక్తిత్వాన్ని బట్టి గౌరవించడం 
మన హృదయ స్పందన 
"అయితేనే"....

మానవసేవే మాధవ సేవ 
అన్నది
మనకు  వాస్తవ దర్పణం
రేపటి తరానికి ముఖచిత్రం....!!

పసిపాపకు 
తల్లి ఒడే గర్భగుడి 
మనసు విరబూసే వయసులో 
తండ్రి కష్టాన్ని గుర్తించటం 
భవితకు దారి చూపే 
గురువుని గౌరవించడం
ఎదగటానికి 
మూల సూత్రం కావచ్చు....

కానీ ఆ క్రమంలో 
ప్రతిభను 
పరమాత్ముడు 
వరంగా ప్రసాదించాడు....
అది పరిమళభరితంగా 
రూపాంతరం చెందటానికి 
కారణం 
నా చుట్టూ ఉన్న 
అందరూ అనేది 
మన అభిమతం 
"అయితేనే "....

ఆ గెలుపు మనకు 
అంతర్గత యజ్ఞం 
రేపటి తరానికి 
"విలువల పుస్తకం".....!!

No comments:

Post a Comment