Saturday, August 8, 2026

 ఖాళీ కుర్చీ“నాన్నా... ఈసారి రావడం కుదరడం లేదు.”

ఫోన్‌లో మాధవి గొంతు వినగానే రాఘవరావు క్షణం మౌనంగా ఉండిపోయాడు.

“పర్వాలేదమ్మా... పని ముఖ్యం.”

“మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. వెంటనే ఆర్డర్ చేస్తాను.”

“నాకు కావాల్సింది ఆర్డర్‌లో రాదులేమ్మా!”

మాధవి నవ్వింది.

“ఏంటి నాన్నా! ఈ మధ్య బాగా జోకులు వేస్తున్నారు.”

రాఘవరావు కూడా నవ్వాడు.

ఆ నవ్వులోని బాధ ఆమెకు కనిపించలేదు.

ఎందుకంటే...

అది వీడియో కాల్ కాదు.



రాఘవరావు ఒకప్పుడు ఆ ఊరిలో పేరున్న వ్యాపారవేత్త.

చిన్న దుకాణంతో మొదలుపెట్టి, ఇరవై ఏళ్లలో పెద్ద వ్యాపారం నిర్మించాడు.

భార్య సుమతి ఎన్నోసార్లు అనేది—

“మీరు సంపాదించింది చాలు. కాస్త పిల్లలతో గడపండి.”

అప్పుడు రాఘవరావు సమాధానం ఒక్కటే.

“ఎవరి కోసం సంపాదిస్తున్నాను? వాళ్ల కోసమే కదా!”

ఇద్దరు కూతుళ్లు—మాధవి, మానస.

వాళ్ల చదువుల విషయంలో ఎక్కడా రాజీపడలేదు.

మాధవి విదేశాలకు చదువుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తనకు ఎంతో ఇష్టమైన పొలాన్ని అమ్మేశాడు.

మానస పెళ్లికి అప్పు చేశాడు.

“మనకు ఎందుకండీ ఇంత కష్టం?” అని సుమతి అడిగితే—

“మన పిల్లలు మనకంటే బాగా బతకాలి. అదే మన సంపాదనకు అర్థం.”

అనేవాడు.

అతను కోరుకున్నట్టే జరిగింది.

పిల్లలు బాగా స్థిరపడ్డారు.

కానీ...

వాళ్లు పైకి ఎక్కుతున్న కొద్దీ తండ్రికి దూరమవుతున్నారని మాత్రం అతను గమనించలేదు.



కాలం ఎవరికోసం ఆగదు.

సుమతి అనారోగ్యంతో చనిపోయింది.

అంతవరకు సందడిగా అనిపించిన పెద్ద ఇల్లు ఒక్కసారిగా రాఘవరావును మింగేసేంత నిశ్శబ్దంగా మారిపోయింది.

ఉదయం లేస్తే—

“కాఫీ తాగండి” అనే గొంతు లేదు.

భోజనం చేస్తుంటే—

“కూర బాగుందా?” అని అడిగేవారు లేరు.

రాత్రి పడుకునేటప్పుడు—

“తలుపులు చూశారా?” అనే మాట లేదు.

మొదట్లో కూతుళ్లు తరచూ ఫోన్ చేసేవారు.

తర్వాత రోజుకు ఒకసారి.

తర్వాత రెండు మూడు రోజులకు ఒకసారి.

కానీ డబ్బుకు మాత్రం కొరత రానివ్వలేదు.

మాధవి ప్రతి నెలా డబ్బు పంపేది.

మానస మందులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేది.

ఒకసారి రాఘవరావు నవ్వుతూ అన్నాడు—

“మీరిద్దరూ నాకు అన్నీ పంపుతున్నారు... మీరే తప్ప.”

అవతల మాధవి నవ్వింది.

“రిటైర్ అయ్యాక మీ దగ్గరకే వచ్చేస్తాను నాన్నా!”

“అప్పటివరకు నేను రిటైర్ కాకుండా ఉండాలమ్మా!”

“ఏంటి నాన్నా అలా మాట్లాడతారు!”

మాట మారిపోయింది.

కానీ తండ్రి మనసులోని మాట మాత్రం అక్కడే ఆగిపోయింది.



ఒకరోజు రాఘవరావు తనంతట తానే వృద్ధాశ్రమంలో చేరాడు.

కూతుళ్లు అభ్యంతరం చెప్పారు.

“నాన్నా! మంచి caretaker పెట్టిస్తాం.”

రాఘవరావు నవ్వాడు.

“నాకు caretaker కాదు... మాట్లాడటానికి మనుషులు కావాలి.”

ఆ ఒక్క మాటకు ఇద్దరూ మౌనమయ్యారు.

వృద్ధాశ్రమంలో అతనికి కొత్త ప్రపంచం కనిపించింది.

ఎవరికో కొడుకు అమెరికాలో.

మరొకరికి కూతురు ఆస్ట్రేలియాలో.

ఇంకొకరికి పిల్లలు అదే నగరంలో ఉన్నా నెలల తరబడి కనిపించరు.

అక్కడ ప్రతి గదిలోనూ ఒక కథ ఉంది.

కానీ అన్ని కథల్లోనూ ఒక పాత్ర మాత్రం కామన్—

ఎదురుచూపు.



రాఘవరావు గదిలో రెండు కుర్చీలు ఉండేవి.

ఒకదానిలో అతను కూర్చునేవాడు.

మరోటి ఎప్పుడూ ఖాళీగా ఉండేది.

“ఎందుకు సార్ ఈ కుర్చీ?” అని నిర్వాహకుడు శేఖర్ అడిగాడు.

“అది reservation.”

“ఎవరికి?”

రాఘవరావు నవ్వాడు.

“ఎప్పుడో ఒకరోజు నా పిల్లల్లో ఎవరో వచ్చి కూర్చుంటారని.”

శేఖర్‌కు ఏం చెప్పాలో తెలియలేదు.



ప్రతి ఆదివారం వీడియో కాల్.

“నాన్నా! ఎలా ఉన్నారు?”

“బాగున్నానమ్మా.”

“మందులు?”

“వేసుకున్నాను.”

“డబ్బులు?”

“ఉన్నాయి.”

“ఏమైనా కావాలా?”

ప్రతిసారీ అదే ప్రశ్న.

ప్రతిసారీ రాఘవరావు అదే సమాధానం.

“ఏమీ వద్దు.”

కానీ అతని వెనుక కనిపించే ఖాళీ కుర్చీ మాత్రం ప్రతివారం ఏదో అడుగుతూనే ఉండేది.

దాన్ని ఎవరూ గమనించలేదు.



ఒక ఆదివారం వీడియో కాల్ రాలేదు.

మాధవి బిజీగా ఉంది.

మానస ఒక కార్యక్రమానికి వెళ్లింది.

సోమవారం ఉదయం శేఖర్ ఫోన్ చేశాడు.

“మేడమ్... మీ నాన్నగారు...”

ఆ తర్వాత మాట చెప్పడానికి అతనికి గొంతు రాలేదు.

రాఘవరావు నిద్రలోనే వెళ్లిపోయాడు.

మాధవి చేతిలోని ఫోన్ జారిపోయింది.

మానస ఏడుస్తూ అక్కకు ఫోన్ చేసింది.

ప్రయాణం...

టికెట్లు...

అత్యవసర బాధ్యతలు...

సమయం...

అన్నీ ఒక్కసారిగా అడ్డుగోడల్లా నిలబడ్డాయి.

చివరకు—

తండ్రి అంత్యక్రియలను ఇద్దరూ వీడియో కాల్‌లో చూడాల్సి వచ్చింది.

చితిమంటలు ఎగసిపడుతున్నాయి.

మొబైల్ స్క్రీన్‌పై ఇద్దరు కూతుళ్ల కన్నీళ్లు.

జీవితమంతా వాళ్ల భవిష్యత్తు కోసం పరుగెత్తిన మనిషి...

చివరకు వాళ్లకు కొన్ని అంగుళాల స్క్రీన్‌లో కనిపిస్తున్నాడు.

అంత్యక్రియలు పూర్తయ్యాక శేఖర్ అన్నాడు—

“మేడమ్... మీ నాన్నగారు మీ కోసం ఒక వీడియో పెట్టారు.”

వీడియో ప్రారంభమైంది.

స్క్రీన్‌పై రాఘవరావు.

వెనుక అదే ఖాళీ కుర్చీ.

“మాధవీ... మానసా...

మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నేను మీకు కనిపించని చోటుకు వెళ్లిపోయానన్నమాట.”

ఇద్దరూ ఏడవడం మొదలుపెట్టారు.

“ఏడవకండి.

మీ మీద నాకు కోపం లేదు.

మీరు నన్ను నిర్లక్ష్యం చేశారని కూడా నేను అనుకోను.

డబ్బు పంపారు.

మందులు పంపారు.

ప్రతి వారం ఫోన్ చేశారు.

మీ బాధ్యతలన్నీ చేశారు.

కానీ...

నా వెనుక ఈ కుర్చీ కనిపిస్తోందా?”

మాధవి ఒక్కసారిగా స్క్రీన్‌కు దగ్గరైంది.

“ఆరు నెలలుగా ప్రతి వీడియో కాల్‌లో అది మీకు కనిపిస్తూనే ఉంది.

మీలో ఎవరో ఒకరు వచ్చి నా పక్కన కూర్చుంటారని పెట్టుకున్నాను.

కానీ అది ఖాళీగానే ఉండిపోయింది.”

రాఘవరావు కాసేపు మౌనంగా ఉన్నాడు.

తర్వాత చిన్నగా నవ్వాడు.

“ఒక విషయం ఆలస్యంగా నేర్చుకున్నాను అమ్మా...

డబ్బు పంపడానికి బ్యాంక్ యాప్ చాలు.ప్రేమ పంపడానికి మాత్రం మనిషి రావాలి.

మీరు సంతోషంగా ఉండండి.

అదే నాకు కావాలి.”

వీడియో ఆగిపోయింది.

మాధవి మాత్రం స్క్రీన్‌నే చూస్తూ ఉండిపోయింది.



పది సంవత్సరాలు గడిచాయి.

మాధవి రిటైర్ అయింది.

ఆమె కొడుకు ఆదిత్య విదేశాల్లో పెద్ద ఉద్యోగంలో స్థిరపడ్డాడు.

ప్రతి నెలా తల్లికి డబ్బు పంపుతాడు.

ఖరీదైన మందులు ఆర్డర్ చేస్తాడు.

వారానికి రెండుసార్లు వీడియో కాల్ చేస్తాడు.

ఒకరోజు మాధవి పుట్టినరోజు వచ్చింది.

ఉదయాన్నే పెద్ద కేక్ డెలివరీ అయింది.

పూల బొకే వచ్చింది.

కొత్త ఫోన్ వచ్చింది.

సాయంత్రం ఆదిత్య వీడియో కాల్ చేశాడు.

“హ్యాపీ బర్త్‌డే అమ్మా! నా gifts నచ్చాయా?”

“చాలా నచ్చాయి నాన్నా.”

“ఇంకేమైనా కావాలంటే చెప్పు. Order చేస్తాను.”

మాధవి ఒక్కసారిగా మౌనమైంది.

ఎక్కడో...

ఎప్పుడో...

అదే మాట.

“మీకు ఏమైనా కావాలంటే చెప్పండి నాన్నా... వెంటనే ఆర్డర్ చేస్తాను.”

ఆమె గుండె ఒక్కసారిగా బరువెక్కింది.

“ఆదిత్యా...”

“చెప్పమ్మా.”

“ఈసారి నువ్వు వస్తావా? నాలుగు రోజులు నా దగ్గర ఉండి వెళ్లు.”

ఆదిత్య ముఖం మారింది.

“అమ్మా... రావాలని నాకూ చాలా ఉంది. కానీ project చాలా critical. ఇంకో రెండు నెలల్లో చూద్దాం. నీకు ఏం కావాలో చెప్పు... పంపిస్తాను.”

మాధవి సమాధానం చెప్పలేదు.

నెమ్మదిగా తల తిప్పింది.

గది మూలలో ఒక పాత కుర్చీ కనిపించింది.

తండ్రి వృద్ధాశ్రమంలో ఉపయోగించిన అదే కుర్చీ.

అతను చనిపోయాక ఆమె తెప్పించుకుంది.

ఇన్నేళ్లుగా అది ఒక జ్ఞాపకం.

ఆరోజు మొదటిసారి—

అది జ్ఞాపకంలా కనిపించలేదు.

అద్దంలా కనిపించింది.

తన తండ్రి స్థానంలో ఇప్పుడు తాను కనిపించింది.

తన స్థానంలో తన కొడుకు కనిపించాడు.

ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.

“ఏమైంది అమ్మా?” ఆదిత్య అడిగాడు.

మాధవి కన్నీళ్లు తుడుచుకుంది.

“ఏమీ లేదు నాన్నా.”

కొద్దిసేపు ఆగి అంది—

“నీకు వీలైనప్పుడే రా. నేను నిన్ను తప్పుపట్టను.

కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో.

డబ్బు పంపడానికి ఆలస్యమైతే మళ్లీ పంపొచ్చు.మనిషిని చూడటానికి ఆలస్యమైతే...కొన్నిసార్లు మళ్లీ అవకాశం రాదు.”

ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు.

కాల్ ముగిసింది.

మాధవి నెమ్మదిగా నడిచి ఆ ఖాళీ కుర్చీలో కూర్చుంది.

చేతితో దాని అంచును తడిమింది.

“నాన్నా...”

గొంతు వణికింది.

“నువ్వు చెప్పింది అప్పుడు నాకు అర్థం కాలేదు.

ఇప్పుడు అర్థమైంది.

కానీ...

అర్థమయ్యేసరికి నువ్వు లేవు.”

గదిలో ఎవరూ లేరు.

ఆమె ఎదురుగా మొబైల్ మాత్రం వెలుగుతోంది.

మాధవి దాన్ని ఆఫ్ చేసింది.

గది చీకటైంది.

కానీ ఆమెకు ఒక నిజం స్పష్టంగా కనిపించింది.

కొన్ని తప్పులకు శిక్ష దేవుడు వేయడు.కాలమే వేస్తుంది.

మనం ఒకప్పుడు మరొకరికి ఇచ్చిన ఒంటరితనాన్ని—కాలం మరో రూపంలో తీసుకొచ్చిమన పక్కనే ఉన్న ఖాళీ కుర్చీలో కూర్చోబెడుతుంది.

ఖాళీ కుర్చీ --ఆనంద్ యడవల్లి

No comments:

Post a Comment