Sunday, April 19, 2020

ఇచ్చుటలో వున్న హాయి

🌷ఇచ్చుటలో వున్న హాయి🌷

ఒకసాధువు, బాల్యంలో వున్న తన ముగ్గురు శిష్యులతో కలిసి, ప్రక్క గ్రామంలో ఆధ్యాత్మిక ప్రవచనం చెప్పడానికి వెళుతూ, పొలాలగుండా ప్రయాణిస్తున్నారు. దారిప్రక్కగా, ఒక రైతు తన పాదరక్షలు అక్కడ వదిలి, పొలంలో పనిచేసుకుంటూ వారికీ కనిపించాడు.

వెంటనే, సాధువు వెంట వున్న బాలురు, బాల్యచేష్ట గా, ' స్వామీ ! మనం ఆ రైతు చెప్పులజత తీసి, పక్కన పొదలలో పెట్టి, దాని కోసం అతను ఖంగారుగా వెతుకుతుంటే, ఆ వేడుక చూద్దామా ! కొద్దిసేపైన తరువాత, మనమే ఆ చెప్పుల్ని అతనికి చూపిద్దాం, మనకు అతడు కృతజ్ఞతలు చెబుతాడు. ' అంటూ తమ గురువుగారి అంగీకారం కోసం అడిగారు.

అది విన్న వెంటనే, సాధువు చెవులు మూసుకుని, మనసులో, ' వీరికి యీ విపరీత బుద్ధి కలగడానికి కారణమేమై వుంటుంది ? దీన్ని వీరి మనసులలో నుండి మొగ్గలోనే త్రుంచివేయాలి ' అని భావించి, ' బాలకులారా ! మీరు అనుకున్న ఆట నాకూ బాగా నచ్చింది. అయితే, చిన్న మార్పు చేద్దాం. మీరు అనుకున్నట్లు, ఆ పాదరక్షలు పొదలలో దాచే బదులు, మన వద్దవున్న ధనాన్ని, రహస్యంగా ఆ పాదరక్షలలో దూర్చి వుంచుదాం. '

' చూద్దాం, ఆ రైతు యేమి చేస్తాడో, సరేనా ! నాకైతే, యీ ఆట భలేగా అనిపిస్తున్నది. ' అని, వారిని తన ప్రయత్నానికి ఇష్టపూర్వకంగా సుముఖులను గావించి, వారి వద్ద వున్న మొత్తానికి, తన వద్ద వున్నది కూడా కలిపి, ఆ రైతు రెండు పాదరక్షలలో వుంచమని బాలురకు చెప్పాడు.

బాలురు కూడా ఉత్సాహంగా, గురువుగారు చెప్పిన పని చేసి, పక్కనవున్నపొదలలో రైతు రాక కోసం చూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటికి రైతు పొలంలో నుంచి బయటకు వచ్చి, తన కుడి పాదరక్షలో యదాలాపంగా, కాలు దూర్చుతుంటే, వెళ్లడం లేదు. ఏమైందో అని చూడగా, దానిలో కొంత ధనం కనిపించింది. రైతు ఆశ్చర్యపోయి, దానిని బయటకు తీసి, ఈ ధనాన్ని, యెవరైనా పోగొట్టుకున్నారేమో, అని ఆ చుట్టుప్రక్కల, ఆత్రుతగాచూసాడు, వారికి అప్పజెబుదామని.

అయితే, అక్కడ యెవరూ కనపడక పోవడంతో, తన రెండవ పాదరక్షలో కాలుపెట్టగా, అందులో కూడా ధనం కనబడింది. దానిని కూడా తీసుకుని చేతులో పట్టుకుని, కళ్ళవెంట, ఆనందబాష్పాలు కారుస్తూ, ఆకాశం వైపు చూసి, ' ఓ భగవాన్ ! నీవెంత దయామయుడవు. నా భార్య కి మందులు కొనడానికి, ఆకలితో వున్న నాపిల్లలకి, ఈపూట తిండి పెట్టడానికి ధనం పంపించావా ? నీకు శతకోటి వందనాలు. ' అని మాటి మాటికీ ఆకాశం వంక చూస్తూ, ఆ ధనాన్ని తడుముకుని చూసుకుంటూ, అక్కడనుండి వెళ్ళిపోయాడు.

అప్పుడు, ఆ సాధువు, ' బాలకులారా ! ఇప్పుడు మనం ఆడుకున్న ఆట బాగుందా ? మీరు చెప్పినట్లు, పాదరక్షలు పొదలలో దాచిపెట్టే ఆట బాగుండేదా ? చెప్పండి. ' అని వారి తలలను నిమురుతూ ప్రేమగా అన్నాడు.

వారు ముగ్గురూ, ముక్తకంఠంతో, ' స్వామీ ! ఆ రైతు కళ్ళలో చూసిన ఆనందమే మాకు బాగుంది. చెప్పులు కనబడకపోతే, పడే బాధకంటే, ధనం దొరికిన సంతోషమే గొప్పది కదా ! ఆ రైతు కళ్ళలో ఆనందం చూసి, మాకు కూడా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఏవస్తువైనా, ఒకరికి యివ్వడంలో వుండే ఆనందం, ఇంత చిన్న వయసులోనే మాకు మీరు నేర్పినందుకు, మీకు మా పాదాభివందనం. ' అని ముగ్గురు శిష్యులూ, సాధువు కాళ్లకు నమస్కరించారు. వారి మసులలో బలమైన మంచి విత్తనం నాట కలిగినందుకు గురువుగారు కూడా యెంతో తృప్తి చెందారు.

భగవంతుడు యిదంతా గమనించాడా అన్నట్లు, వారు వెళ్లిన వూరిలో, గురువుగారికి, శిష్యులకు, ఘనమైన స్వాగతం లభించి, ప్రవచనానంతరం, సాదరసత్కారాలతో, యిబ్బడిముబ్బడి ధనంతో, ఆ గ్రామప్రజలు గురుశిష్యులను, సత్కరించి వీడ్కోలు పలికారు.
మిత్రులారా. ఈనాడు లాక్ డౌన్ సందర్భంగా వేలాది మంది ఆహారం లేక అలమటిస్తున్నారు. మన శక్తి మేరకు సాయం చేద్దాం. ఇప్పటికే సహాయపడుతున్న అందరికీ హృదయపూర్వక థన్యవాదాలు చెబుదాం. 👏👏

No comments:

Post a Comment