Friday, April 17, 2020

సంస్కారం

సంస్కారం
అది మొదటి ప్రపంచ యుద్ధ సమయం. సైన్యంలో యిద్దరు ప్రాణస్నేహితులు. తూటా తగిలి వారిలో ఒకరు నేలకొరిగితే, ఆ స్థితిలో స్నేహితుడ్ని చూసిన మరో సైనికునికి గుండెను పిండేసినంత బాధ. అప్పుడతను ఓ కందకంలో దాక్కుని ఉంటాడు. ఎటు చూసినా తుపాకీగుండ్ల మోత. ఆ పరిస్థితిలో తన లెఫ్టినెంట్‌ని కలిసి, తన మిత్రుడిని తీసుకురావడానికి అనుమతి తీసుకొని వెళ్తాడు సైనికుడు. ''వెళ్లిరా, కాకపోతే ప్రయోజనం ఉండకపోవచ్చు..'' అంటాడు లెఫ్టినెంట్‌. ఎలాగోలా తోటి సైనికుడ్ని చేరుకొని, భుజం మీద మోసుకొని తాను ఉండే కందకం దగ్గరికి తీసుకొస్తాడు. అప్పటికే మరణించిన స్నేహితుడ్ని చూసి, ''నేను ముందే చెప్పాను.. ఏమీ ప్రయోజనం ఉండదనీ.. నీకూ బలమైన గాయాలే తగిలాయి..'' అని చెబుతాడు లెఫ్టినెంట్‌. ''కానీ నాకు చాలా తృప్తిగా ఉంది. నేను వెళ్లేటప్పటికి నా దోస్త్‌ బతికే ఉన్నాడండీ.. వాడు నన్ను చూడగానే, ''నువ్వొస్తావని తెలుసురా..!'' అన్న ''ఆ ఒక్క మాట చాలు.. కోటి స్నేహాల పెట్టు..'' అన్న ఆ స్నేహితుని హృదయ స్పందనే సంస్కారం.
సంస్కారం అంటే ఏమిటీ..? చదువుకుంటే వస్తుందా సంస్కారం..? విజ్ఞానం లేకపోయినా మనుషుల్లో ఆ సంస్కారం ఉంటుందా..? పుట్టుకతోనే ఉంటుందా? సంస్కారానికి కొలబద్ద ఏమైనా ఉందా? సంస్కారం అనేది మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మనచుట్టూ ఉండే పరిసరాల ప్రభావంతో ఉంటుంది. మన స్నేహితులూ సహచరుల నుంచీ అబ్బుతుంది. మనం నమ్మిన ఆశయాలను బట్టీ, మన అభ్యాసాన్నిబట్టీ ఉంటుంది. విజ్ఞానం నుండీ వస్తుంది. సాధించిన విజయాలూ సాధించవలసిన లక్ష్యాల నుంచీ వస్తుంది. మన తోటివారిని మనుషులుగా పరిగణించడంలో సంస్కారం ఉంటుంది. పరిగణించడమే కాదు. గౌరవించడం. మనతో సరిసమానంగా చూడటం. ''ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును. ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును'' అని గురజాడ చెబుతారు.
గుణగణాలన్నవి తయారుగా ఉండవు. అంచెలంచెలుగా వీటిని మనిషి నిర్మించుకోవాల్సి ఉంటుంది. అందుకని సంస్కరించటం మనతోనే మొదలు పెట్టాలి. ఒక్కోసారి మనకు తెలియకుండానే ఎవరినయినా బాధ పెట్టి ఉండవచ్చు. ఆ విషయం మనకు తెలిసిన వెంటనే మనంతట మనమే 'గతంలో నిన్ను బాధ పెట్టిన విషయాన్ని మరిచిపో మిత్రమా..! తెలియక అలా జరిగింది. నీ మనసు నొప్పించా.. మన్నించు..!' అని చేయి కలిపితే, అప్పుడు నీలోని సంస్కారం ఇనుమడిస్తుంది. మైత్రీబంధం కొత్త చివుళ్లు తొడుగుతుంది. ఆచరించి చెప్పే సంస్కారానికి ఉన్న ప్రభావం ఒట్టి మాటలకుండదు కదా..! చేసిందే చెప్పీ, చెప్పిందే చేసిన వారు మహాత్ములు. మనసున ఒకటీ, చెప్పింది మరొకటీ, చేసేది వేరొకటీ.. కానీ మనుషులుగా పుట్టీ, ఎదిగిన కొద్దీ ఒదిగీ ఉన్నతులుగా జీవించాలి. మనం సాధించిన విజయం ఏ ఒక్కరి కృషి వల్లనో కాదని తెలుసుకోవాలి. మనం ప్రయాణించాల్సిన గమ్యం యింకా యింకా సుదూరంలో ఉందని గుర్తించాలి.
మనం చూస్తుంటాం. పెద్దవాళ్లను కలవడానికి వెళ్లినప్పుడు, మనల్ని నిలబెట్టి మాట్లాడుతుంటారు. అది వారి కుర్చీ సంస్కారం. ఓ పెద్దాయన్ని 'సార్‌..!' అని సంబోధించగానే, అలా పిలవొద్దని చెప్పీ, మనుషుల్లో పెద్దోళ్లూ, చిన్నోళ్లూ అని విడిగా ఉండరు. అందరూ సమానులే.. అని హితబోధ చేసారు. అదీ ఆయన నమ్రతా సంస్కారం. పరిచయస్తులు తారస పడినపుడు, మనం పలకరించినా గుర్తు రానట్టు, ఎరిగినా ఎరగనట్టు మరీ చెప్పించుకుని, అపుడపుడూ తప్పించుకుని మొత్తానికి నిన్ను నువ్వే ప్రత్యేకంగా ప్రతిష్టించుకునే నిపుణతకు నిజంగా ప్రణామం చెప్పాలి. ఏదో నాలుగు రాతలతో కరపత్రంగా మిగలడం తప్ప, నిజంగా హృదయంతో కరచాలనం చేయడం ఏనాటికయినా అనుభవంలోకి వస్తుందా..? కానీ, నిజానికి మన సుమ భావాలను ఆత్మీయంగా సుతిమెత్తగా పంచుకోగలిగితే ఆ క్షణాలు 'నిన్న లేని అందమేదో... నిదుర లేచినంత..' ఓ మృదువైన మధురస్మృతి మదిలో తళుకులీనుతూనే ఉంటుంది. కాలమంతే.. కదిలిపోతుంది. కొన్ని క్షణాలు మాత్రం అలా నిలిచిపోతాయెప్పటికీ..
''ఆకాశమా...! నీకెంత అదృష్టమో కదా..! నన్ను చూడు.. ఎంతకాలం నేనిలా కిందనే పడి ఉండాలీ..!?'' అని నేలతల్లి నిట్టూర్చిందట. అప్పుడు ఆకాశం ''ఎవరుండే చోట వారుండటమే.. మేలు. వృధా ప్రయాసలెందుకు...?!'' అని ఓదార్చిందట.. అందుకే ఆకాశం నిండుజాబిల్లి వెలుగులతో మెరిసిపోతూ ఉంటుంది. నేల కూడా బంగారమే.. కానీ ఆ మట్టిలో కూడా విష వాయువులు ఉంటాయి. అటువంటి వాయువులు ఎదిగే మొక్కకు చీడలాంటివి. అందుకని ఎప్పటికప్పుడు ఆ మట్టిని పెళ్లగించి, సంస్కరించాలి. పుష్కలంగా నీరు పెట్టాలి. ఆ వృక్షం సుగంధాన్ని వెదజల్లే ఆస్కారం ఉంటుంది. మనుషులకయినా అంతే. ప్రతి ఒక్కరి జీవితానికి సంస్కారం ఉన్నతమైనది. ప్రాణపదమైంది. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకునే ఈ సంస్కారం ప్రతి మనిషికీ హుందాతనాన్ని యిస్తుంది. సమాజాలను ఉదాత్తస్థాయిలో ఉన్నత శిఖరాలపై నిలుపుతుంది. దేశదేశాల్నీ సమున్నత స్థాయిలో నిలబెడుతుంది. ప్రతి ఒక్కరూ సంస్కారాన్ని కంటిపాపలా కాపాడుకోవాలి. వేరెవరూ తస్కరించలేని ఈ సంస్కారం అచ్చంగా మనది. మన సొంతం. సంస్కారవంతమైన జీవితం ఆదర్శనీయం.

సంస్కారమనేది వ్యక్తి పుట్టుక, పెరిగిన వాతావరణం మీద ఎక్కువగా ఆధార పడిఉంటుంది. కాని వ్యక్తి పెరుగుతున్నపుడు జ్ఞానాన్ని ఆర్జిస్తున్నపుడు తనకు తాను తెలుసుకొన్న విషయాల వల్ల తనను సంస్కరించుకుంటున్నపుడు కూడా వ్యక్తి సంస్కారంలో మార్పులు వస్తాయ. వ్యక్తి తనను తాను పరిశీలించుకుని తన చుట్టూ వున్న సమాజంలో నుండి పరిణత నొంది, సంఘ శ్రేయస్సును ఆశించినప్పుడు ఆ సంఘ ప్రయోజనమునకు పాటుపడినప్పుడు సంస్కారం మెరుగుపడుతుంది. ఇలా క్రమబద్ధీకరించుకుని చేసే పనుల వల్ల మనిషిలోను పరిసరల ప్రాంతాల్లో ను శాంతి ఏర్పడుతుంది. ఏదైనా ఒక అంశమును గురించి తీవ్రమైన ఆందోళన చెందినప్పుడు మనిషి అశాంత చిత్తుడు అవుతాడు. చేసేది చేయంచేది అంతా భగవంతుడే అన్న స్థిర నిర్ణయం తీసుకొంటే శాంతస్థితి దానంతట అది వస్తుంది. దానికి సంస్కారం తోడయ సమాజం యావత్తు శాంతిప్రధానంగా సాగుతుంది.

No comments:

Post a Comment