Wednesday, May 12, 2021

ఇది ప్రతిఒక్కరూ చదవాల్సిన ఎంతో విలువైన సమాచారం.

 ఇది ప్రతిఒక్కరూ చదవాల్సిన ఎంతో విలువైన సమాచారం. 


అతడు నా మిత్రుడు. కరోనా బారిన పడి హోం క్వారంటైన్ లో కోలుకుంటూ ఉండిన్నాడు.

కానీ అనుకోకుండా ఒకరోజు ఆక్సిజన్ శాతం పడిపోవడం కనబడింది. ప్రయత్నిస్తే ఒక ఆసుపత్రిలో ఒక బెడ్ దొరికింది. ఇక్కడినుండి పదిరోజులు సాగిన అతడి లైఫ్ జర్నీ చాలా విచిత్రమైనది. ఎందుకంటే కోల్పోవడం అంటే ఏమిటో అందరికీ తెలుస్తుంది. కానీ కోల్పోకుండా ఉండేందుకు అతడు చేసిన స్వీయ యుద్ధమే ఈ కథ. ఇంతకీ ఏం కోల్పోవడం అనుకుంటున్నారా.. అదేనండీ..ప్రాణం!.


స్టెప్డౌన్ లో ఆక్సిజన్ మీద ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. కానీ "నాకు ఏమీ కాదులే!" అనే ఒక నమ్మకం ఆవగింజంత ఎక్కడో అతడిలో మిణుకుమిణుకుమంటోంది. కానీ చుట్టూ ఉన్న ఐసీయూ అతడిని స్థిమితంగా ఉండనీయడం లేదు.


ఎందరో పేషంట్లు. రొప్పుతూ బాధపడుతూ..మౌనయోగుల్లాగా..ఆక్సిజన్ మాస్కులతో భగవంతుడిని మౌనంగా ప్రార్థిస్తూ..నమ్మకం - అపనమ్మకం, జీవితం -మరణం మధ్య నలుగుతున్న ఒక జీవిత శకలం కంటిముందు. కనులు మూస్తే లోలోపల మాట్లాడుతున్న ఒక అంతర్లోకం కనులు తెరిస్తే భయంకరంగా నాట్యం చేస్తున్న బహిర్లోకం.


ఒకరోజు అప్పుడే కాస్త నమ్మకాన్ని ధైర్యాన్ని కూడబలుక్కుని ఆయాస పడుతూనే అక్కడి బాత్రూం లో మొహం కడగడమో స్నానంచేయడమో అర్థంకానిది ఒకటి చేసి బయటపడ్డాడు. తనలాగే రోజూ మరో ఆక్సిజన్ బెడ్ మీద కష్టపడుతూ చూపుల పలకరింపులతో పరిచయమైన ఒక పెద్దాయన చూసి hai అని సైగచేశాడు. మరింత నమ్మకం కుదిరింది. కానీ బెడ్ మీద పడుకున్న కాసేపట్లోనే ఆ పెద్దాయన కండీషన్ సీరియస్ అయింది. చూస్తూ చూస్తూ ఉండగానే మెల్లిగా మెల్లిమెల్లిగా ఆ పెద్దాయన ప్రాణాలు వదిలేశాడు. అదొక భయంకరమైన పరిస్థితి. 


ఈయనకు దుఃఖం పొంగుకొచ్చింది. ఎంతకూ ఆగని దుఃఖం. ఎందుకో తెలియదు. తనతో పాటు మరో బెడ్ మీద కొంతకాలం నుండి తాను చూస్తున్న ఓ సాటి మనిషి తన కంటి ముందే పోవడం. ఆ దుఃఖానికి తోడుగా భయం మొదలైంది. విపరీతమైన భయం. అప్పుడు చూసుకుంటే ఆక్సిజన్ శాతం పడిపోవడం మొదలైంది. చెమటలు పట్టాయి.బట్టలు తడిసి ముద్దయ్యాయి. ఆయాసం ఎక్కువైంది. ఎంత ప్రయత్నించినా శ్వాస అందడంలేదు. సిస్టర్లు పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళ మాటలు ఏమీ వినబడట్లేదు తనకు. అప్పుడప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ వస్తే ఎలా ఉంటుందో అలా అపుడపుడూ వాళ్ళ మాటలు వినబడ్తున్నాయి. "సార్..మీరు కంగారు పడుతున్నారు.. భయ పడుతున్నారు..భయపడకండి..ఆ పెద్దాయన కండీషన్ మీ కండీషన్ ఒకటి కాదు.. ఒకటి కాదు..మీది వేరే..మీది వేరే.."అని వాళ్ళు ధైర్యం చెబుతూనే ఉన్నారు. లాభం లేదు. బోర్లా పడుకోబెట్టారు. ఐనా ప్రయోజనం లేదు. ఐసీయూ షిఫ్ట్ చేద్దాం అని వెంటనే స్ట్రెచర్ మీద షిఫ్ట్ చేసేశారు. 


ఆ సమయంలో భయం. నేను కూడా పోతానేమోనని అతడు భయపడ్డాడు. కానీ ఒక్కసారి ఇంట్లో ముద్దు ముద్దు పిల్లల ముఖాలు గుర్తుకు వచ్చాయి. లోపలి ప్రాణం ఏదో లేచొచ్చినట్టయింది. లోపల ఎవరో బలంగా అరిచి చెబుతున్నట్టు ఉంది. "నేను బతకాలి..నేను బతకాలి..నేను బతికి తీరాలి..నా పిల్లలకోసం బతకి తీరాలి" ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నానని అనుకున్నాడు. కానీ సిస్టర్లు బయటకు కూడా బలంగా మీకు మీరు చెప్పుకున్నారని తర్వాత చెప్పారట. అతడు స్టెబిలైజ్ కావడానికి అరగంట పైనే పట్టింది.


అతడికి ఏదో అర్థమైంది. ఈ చావు నాలోపలే ఉంది. నా ఆలోచనలో ఉంది అని.అతడు గమనించడం మొదలు పెట్టాడు. ఎపుడెపుడు టెన్షన్ గా ఫీలౌతాడో..ఎపుడెపుడు భయం ఆవహిస్తుందో అపుడు ఆక్సిజన్ శాతం తగ్గడం మొదలౌతుందని. భార్యా పిల్లలను తల్లిదండ్రులనూ గుర్తు తెచ్చుకుంటూ నేను బతకాలి అనుకున్నప్పుడల్లా ఆక్సిజన్ శాతం పెరగడం మొదలైందని. ఇక తన మైండ్ గేమ్ తానే ఆడటం మొదలెట్టాడు. భయానికి చంపే శక్తి ఉందని..ధైర్యానికి బతికించే శక్తి ఉందని అర్థం చేసుకున్నాడు. ఈ గేమ్ తనతోటే ఆడుకుని చూసుకున్నాడు. మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ఆక్సిజన్ శాతం మీద ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకునే గేమ్ అది. 


అతడికి అర్థమైంది. మందులు ఆక్సిజనూ ఇవన్ని ఎన్ని ఉన్నా ధైర్యం లేకపోతే బతకడం కష్టమని. ధైర్యం అన్నింటికన్నా పెద్ద మందు అని. ఇక సెల్ఫ్ మోటివేషన్ మొదలైంది. మైండ్ గేమ్ యొక్క అనుపానులు తెలిశాయి. జీవితంలో మన సొంతవాళ్ళ విలువ తెలిసింది. నవ్వే పిల్లల్లో, పలకరించే భార్యలో వాళ్ళ ముద్దు ముఖాల్లో ఉండే మాధుర్యం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆక్సిజన్ శాతం పెరగడం కనబడింది. ఐసీయూలో అనవసర శారీరక శ్రమ తగ్గించుకుంటూ ఆక్సిజన్ ను కన్సర్వ్ చేసుకోవడమూ తెలిసింది. ఈ గేమ్ లోని ఆనందాన్ని, లోలోపల ధైర్యాన్ని మెల్లిమెల్లిగా ప్రోది చేసుకోవడం మొదలైంది. ఆయన నాతో అన్న మాటలు "ధైర్యం అనేది బూస్ట్ అయ్యే వరకూ నిరంతరం ప్రయత్నించాలి. ఒకసారి బూస్ట్ అయ్యాక జీవించడంలో అది ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు సార్.!! అది మాటల్లో చెప్పలేం. అనుభవించాలి అంతే!!" 


కరోనాని ఎదుర్కోవడంలో ధైర్యం పాత్ర అన్నింటికన్నా పెద్దది. రెమ్డెస్వీర్లూ ప్లాస్మా థెరపీలూ అన్నీ మరిచిపోండి. ధైర్యంగా ఉండండి. 


డా౹౹ విరించి విరివింటి 

సేకరణ మానస సరోవరం.

No comments:

Post a Comment