Sunday, September 18, 2022

🌷ఊరక ఉండడం🌷

 🌷ఊరక ఉండడం🌷

ఒకసారి గురువుగారిని అడిగాను....
భగవాన్ చెప్పిన "సుమ్మా ఇరు" (ఊరక ఉండడం) అంటే ఏమి? అని.

నీ గురించిగాని,
నీ ప్రపంచం గురించిగాని,
నీ దైవం గురించిగాని 
చెప్పకుండా ఏదైనా ఒక విషయం ఉంటే చెప్పు..అన్నారు.

ఏం చెప్పను?......ఏంచెప్పినా ఆ మూడింట్లోకే వస్తుంది...

మౌనం దాల్చాను.

గురువుగారు నవ్వి.....ఇదే సుమ్మా ఇరు అంటే అన్నారు.

* * *

రమణాశ్రమం పాతహాలులో భగవాన్ యెదుట ధ్యానంలో ఉన్న కొందరిని చూసి, "వారంతా ఏం చేస్తున్నారు? అని అడిగాడు ఓ పాశ్చాత్యుడు.
"ఊరక ఉన్నారు" అన్నాడు అతని గైడు.
భగవాన్ అది విని వెంటనే ఇలా సవరించారు-
"వారు ఊరక ఉండలేదు, ఊరక ఉండడానికి సాధన చేస్తున్నారు" అన్నారు.

* * *

కాబట్టి ఊరకున్నట్టు కనపించడం వేఱు,
ఊరకుండడం వేఱు.
ఊరకుండడానికి ఈ ఊరకుండడం ప్రయత్నం అంతే.

సోఫా మీద ఉన్న భగవాను కూడా ఊరకున్నారు.
కానీ ఆ ఊరకుండడం, ఈ ఊరకుండడం ఒకటి కాదు.
ఒక్కలా కనిపిస్తారు అంతే.

ఊరకుండడం వలన ఊరకుండే స్థితిని సాధించాలనే ప్రయత్నం సాధకునిది.

ఊరక ఉండడం అనే స్థితి వలన కలిగిన
ఊరక ఉండడం అనే స్వభావం రమణునిది.
* * *
సాధకుడు ఊరక ఉండడంలో -
తలంపులు లేకుండా చేయడం అనే ఘర్షణ ఉంటుంది.
లేదా తలంపును దాని మూలానికి చేర్చాలనే ప్రయత్నం ఉంటుంది.

సిద్ధుడు ఊరక ఉండడం అనేది -
అలలు లేని సముద్రం వంటిది.
మబ్బులు లేని ఆకాశం లాంటిది.
అక్షరాలు లేని కాగితం లాంటిది.

* * *

సాధన అనేది సిద్ధికి మార్గం కాదు....
రమణులు సిద్ధికై ఏ సాధనా చేయలేదు.
రమణులే కాదు ఏ మహనీయుడూ సాధన వలన 
సిద్ధి పొందలేదు.

"సిద్ధి వలననే మార్గం ఏర్పడిందేగాని
మార్గం వలన సిద్ధి కలుగదు."
అంటారు గురువుగారు.

* * *

మరి రమణులు తన యెదుటే ధ్యానసాధన చేస్తున్నవారిని యెందుకు ఖండించలేదు?

ఖండించడం వారి ప్రవృత్తి కాదు....

సాధన వలన ప్రయోజనం ఏమంటే,
సాధనతో పనిలేదనే విషయాన్ని స్వయంగా తెలుసుకుంటారు.
అంతవరకు వద్దన్నా సరే సాధన చేస్తారు....చేసుకోనీ.....
అనే నిర్లిప్తభావన కారణం కావొచ్చు...

* * *

ఊరక ఉండే ఆ అరుణాలఋషి యెదుట
ఊరక ఉండడానికి సాధకులు చేసే ప్రయత్నంలో
అంతర్లీనంగా, తమకే తెలియనంతగా ఓ జెలసీ ఉంటుంది.

ఆ "జెలసీ"నే భక్తి అని , సాధన అని భ్రమపడతాం.....అంటారు గురువుగారు.

మహానుభావుడు సూరీడులా వెలిగిపోతుంటే
కళ్లు తెరచి ఆ దివ్యతేజోమూర్తిని కనులారా కాంచక, మేమేంత ధ్యానపరులమో చూడు అన్నట్టు ఎందుకీ అర్థం లేని సాధనలు? లేవండి...లేవండి...అంటూ ధ్యానం చేసేవాళ్లనందరినీ తట్టి లేపేసేవారట కావ్యకంఠ గణపతిముని.

ఎన్ని దీపాలు వెలిగిస్తే సూర్యుడికి సమానమవుతుంది?
ఎన్ని బావులు కలిపితే సముద్రుడికి సమానమవుతుంది?

భగవానుకు ఊరక ఉండడం అనేది అప్రయత్నంగా దొరికింది.

సాధకులకు ఊరక ఉండడం అనేది ప్రయత్నంగా ఉంటోంది.

భగవాన్ తరువాత భగవాన్ రాలేదు...రారు.

గురువుగారు అంటుంటారు-
"జ్ఞాని పుడతాడు. తయారుకాడు" అని.

మనం తయారుకావాలని చూస్తున్నాం.....
అది వీలుకాదు.

ఇది నిరాశావాదంగా కనిపించవచ్చు.

"ప్రయత్నంతో పొందలేం" అనే విషయాన్ని 
నిస్సందేహంగా తెలుసుకొంటే అదే ఆశావాదం.

అంత్యనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు అన్నారు పెద్దలు.

ప్రయత్నం కంటే ప్రయత్న విరమణే దగ్గరిమార్గం
ఊరక ఉండడానికి.

* * *

"స్వర్గరాజ్యం ఇలాంటి వారిదే" అని పసిపిల్లలను చూపుతూ అన్నారు క్రీస్తు కొండ మీద ప్రసంగంలో. 

పసి పిల్లలు గతాన్ని జ్ఞప్తిలో ఉంచుకోరు.
భవిష్యత్తును ఊహించరు.
వారు సదా వర్తమానంలో ఉంటారు.

* * *

అలా నవశిశువు వలె
"ప్రస్తుతక్షణం"లో ఉండగలిగితే
అదే "ఊరక ఉండడం" అవుతుంది.

వర్తమానం - జ్ఞానప్రసూనాంబిక.
 వర్తమానంలో ప్రతి ఒక్కడు - జ్ఞానశిశువే.


No comments:

Post a Comment