Tuesday, September 27, 2022

ఇది ప్రసిద్ధమైన కృష్ణ శతకంలోని పద్యం.

 Xx6. X2. 1-5.  270922-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


”నీవే తల్లివి దండ్రివి
నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ
నీవే గురుడవు దైవము
నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా!”
                    ➖➖➖✍️


ఇది ప్రసిద్ధమైన కృష్ణ శతకంలోని పద్యం. 

ఇందులో నీవే (భగవంతుడే-కృష్ణుడే) అన్నీ అని చెప్పడమే కాదు, ‘అన్ని మానవ సంబంధాలుగా కూడా నిన్నే భావించవచ్చు!’ అన్న భావనా ఉంది.

అంతేకాదు, ఎవరికి నచ్చిన సంబంధంతో వాళ్లు అలా పిలుస్తూ                 ఆ బంధం భగవానునితో దృఢపరుచుకోవడం మంచిదని, అప్పుడే చివరికి పరమగతి చేరగలమని కవి హృదయం. 

పద్యం చిన్నదే కానీ, అందులోని అంతరార్థం నిరుపమానమైనది.

మానవుడు జన్మించింది మొదలు ఎన్నో బంధుత్వాలు చకచకా అల్లుకుంటాయి. అది సహజమే! అందులో కనిపించనివి జాతి, కులం, మతం మొదలైనవి. 

ఇవొక రకంగా బంధాలే!                          కనిపించే బంధుత్వాలు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, భార్యాపిల్లలు, అత్తమామలు ఇంకా ఎన్నో వావి వరుసలు. 

ఇవిగాక పరిచయస్థులు, మిత్రులు, గురువులు, శిష్యులు, యజమానులు, సేవకులు, సహోద్యోగులు తదితరులు. అజాగ్రత్తగా ఉంటే ఇవీ బంధాలే!

మానవుడు ఈ చుట్టరికాలతో రమిస్తూ ఎంతోకొంత ప్రయోజనం పొందుతూ జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నంత మాత్రాన ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయని భ్రమ పడవలసిన పనిలేదు. 

ఎందుకంటే సాన్నిహిత్యం అధికమయ్యే కొద్దీ వ్యర్థమైన భ్రమ కూడా అధికమవుతుంది.
భ్రమ ఎక్కువయ్యే కొద్దీ దుఃఖానికి ఆస్కారం ఎక్కువ అవుతుంది. 
ఎలాగంటే ఒక మానవుని జీవిత కాలంలో ఎంతోమంది బంధువుల, మిత్రుల తదితరుల మరణాలను ఇష్టమున్నా లేకున్నా చూడవలసి వస్తుంది. తప్పనిసరిగా బాధపడవలసీ వస్తుంది. 

కన్నుమూసిన వారిలో బంధుత్వాలు బలపడిన వారూ ఉండవచ్చు. ఆ మానవుని జీవితకాలం కొనసాగుతూ ఉండగానే మధ్యలోనే బంధుత్వాలు తెగదెంపులు చేసుకొని దూరమైపోయిన వారూ ఉండవచ్చు. ఇవన్నీ ‘ఆప్త వియోగం’ కిందకు వస్తాయి. అంటే ‘దగ్గరివారిని కోల్పోవడం’ అన్నమాట.ఈ బంధాలన్నీ దుఃఖ సన్నివేశాలై అతని మనసులో స్థిరపడి కుంగి, కృశింపజేయడానికి కారణాలవుతాయి. బంధం బిగించుకోవడం ఎంత కష్టమో తొలగించుకోవలసి వచ్చినప్పుడు గాని తెలిసిరాదు. అప్పటికే కాలాతీతం కావడం వల్ల ఆప్త వియోగ విషాదం అనుభవించకతప్పదు. ‘ఈ బంధం ఆదిలోనే బిగించుకోకుండా ఉండవలసింద’ని అప్పుడనిపిస్తుంది.

మరి ఈ శోకాన్ని తప్పించుకునే మార్గం లేదా! 

లేకేం.. పైన పేర్కొన్న బంధుత్వాలన్నీ భగవత్‌ పరం చేయడమే! దానిని కృష్ణ శతకం మొదట్లోనే తెలియజేశారు. ‘నీవే తల్లివి దండ్రివి..’ అని భగవంతుడినే తల్లిగా, తండ్రిగా, గురువుగా, సఖునిగా ఎందుకు భావించాలి? అంటే మనిషికి ఇదొక్క జన్మమే కాదు..
ఎన్నో జన్మలుంటాయి. జన్మజన్మలో తల్లిదండ్రులు, భార్యాపిల్లలు మొదలైన వారంతా మారిపోతూ ఉంటారు. కానీ, ప్రతి జన్మలోనూ తోడునీడగా ఉండేది భగవంతుడొక్కడే! అదీ యథార్థం. దాన్ని గుర్తెరిగినవాడి తీరు వేరుగా ఉంటుంది. ఎందుకంటే భగవానుడు మారిపోయేవాడు, దూరమయ్యేవాడు, చేతగానివాడు కాదు కదా! అందువల్ల మనిషికి జీవించి ఉన్నంతవరకూ పై చుట్టరికాలన్నీ ఇష్టం కాబట్టి వీటన్నిటిని దైవం వైపు మరలించడం ఎంతో శ్రేయస్కరమన్నారు సంప్రదాయజ్ఞులు. అలా భగవానుడి వైపు మరలించగలిగిన ధన్యాత్ముడికి ఆప్త వియోగ దుఃఖాల తాకిడి మిగతావారికి ఉన్నట్టు ఉండదు. ఉన్నా ఏదో పేరుకు మాత్రమే! ఎందుకంటే అలాంటి ధన్యాత్ముడే ఆప్తుల మరణాలు కావు, ఆప్తుల యందు మనకున్న మమకారాలే దుఃఖానికి కారణమన్న యథార్థాన్ని గమనించగలడు.
దీన్ని మరో కోణంలో పరికిస్తే.. లోకంలో తల్లిదండ్రులు లేనివారెందరో! ఉన్నా పోషించలేని, పట్టించుకోలేని వారెందరో! మిత్రులు లేని వారుంటారు. ఉన్నా మంచివారన్న నమ్మకం లేదు. గురువులు దొరకని వారుంటారు. దొరికినా ఫలాపేక్ష లేకుండా విద్యాదానం చేస్తారనీ లేదు. భగవంతుడికి ఇవన్నీ వర్తించవు. ఆయన ప్రేమ స్వరూపుడు. కరుణామయుడు. కాబట్టి ఈ చిన్నపద్యాన్ని మాటిమాటికీ మననం చేసుకుందాం! పరమగతి అయిన పరమాత్ముడిని చేరుకుందాం.✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment