Thursday, September 22, 2022

ఋషభపుత్రులు

 🌷ఋషభపుత్రులు:-🌷

 నవనారాయణులు         నవనాధులు :-    

1. హరి                           మత్స్యేంద్రనాధుడు,
2.హరి                             గోరఖ్నాధ్ (గోరక్ష),
3. అంతరిక్షుడు                జాలంధరనాధుడు,
4. ప్రబుద్ధుడు           కానీఫా,
5. పిప్పలాయనుడు       చర్పటనాధుడు,
6. ఆవిరోత్రుడు              నాగేశనాధుడు,
7. ద్రుమిళుడు               భర్తరీనాధుడు,
8. చమసుడు               రేవణనాధుడు,
9. కరజనుడు               గహనీనాధుడు.

నవనాధుల కథలు ఎన్నో అద్భుతాలతో నిండి ఉన్నవి, మత్స్యేంద్రనాథుడు దేశ సంచారం చేస్తుండగా ఒక గృహిణి సంతానం కోసం ప్రార్థించింది. అతదు భస్మం మంత్రించి యిచ్చాడు. ఆమె ఆ భస్మాన్ని ధరించకముందే ఆమె భర్త వచ్చి ఈ గోసాయిలు మోసగాళ్ళని నమ్మవద్దని చెప్పి ఆ భస్మాన్ని పారేయమని ఆజ్ఞాపించాడు. భర్త మాట కాదనలేక ఆమె చెత్త పారవేసే దిబ్బు మీదకు విసిరేసింది.

కొంతకాలం తర్వాత మళ్ళీ మత్స్యేంద్రనాధుడు వచ్చి నా వరం వల్ల పుట్టిన కుమారుడేడి?” అని అడిగితే ఆమె జరిగిన సంగతి చెప్పింది. అతడా పెంటకుప్ప దగ్గరకు వెళ్ళి “బిడ్డా ! లేచిరా !" అన్నాడు. అప్పటికప్పుడు సద్యోయౌవనంతో ఒక యువకుడు ఆ దిబ్బలో నుండి లేచి వచ్చాడు. ఆవుపేడ కుప్పలో నుండి ఉద్భవించాడు. గనుక గోరక్షనాధుడని పేరు పెట్టాడు గురువుగారు. ఆ పదమే గోరఖ్ గా మారింది. గోరఖ్ ఎప్పుడూ గురువుగారిని అంటిపెట్టుకొని సేవ చేస్తుండేవాడు. ఒకసారి మత్స్యేంద్రుడు శిష్యునితో నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను. నీవు ఆశ్రమాన్ని
జాగ్రత్తగా చూస్తుండు అని ఆజ్ఞాపించాడు. కొన్ని నెలలు గడిచినవి. గురువుగారు వస్తానన్న సమయానికి రాలేదు.

గోరఖ్ విచారణ చేస్తే బ్రహ్మపుత్రానదీ తీరప్రాంతం లోని ఒక రాజ్యంలో రాజకుమారిని పెండ్లి చేసుకొని కామక్రీడలలో మునిగితేలుతున్నాడని తెలిసింది. 'అయ్యో! గురువుగారు పతనమైనాడే ఆయనను కాపాడుకోవాలి' అని బయలుదేరి ఆ రాజ్యానికి వెళ్ళి వారికి అన్నీ గుర్తు చేశాడు. కానీ మత్స్యేంద్రుడు వినలేదు. అప్పుడు తన మంత్రశక్తితో ఇచ్ఛాశక్తితో గురువుగారిని సమ్మోహితుని చేసి ఆకర్షించి తన వెంట ఆశ్రమానికి తీసుకువచ్చాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ప్రధానాసనం మీద మత్స్యేంద్రుడు కూర్చుని చిరునవ్వు నవ్వుతున్నాడు. తన వెనకాల ఆ ఆకారమే గోరఖ్ నాధ్ దిగ్ర్భాంతితో చూచి కాసేపటికి మాయాశక్తి సంపన్నుడు మహనీయుడు అయిన గురువుగారి ప్రభావం తెలుసుకో లేకపోయినానని సిగ్గుపడి కాళ్ళ మీద పడ్డాడు. మత్స్యేంద్రుడు మందహాసంతో శిష్యుని అనుగ్రహించాడు. ఈ మహాసిద్ధుని కథలు గ్రంథాలు, వివిధ భాషలలో వచ్చినవి.

క్రీ.శ. 4వ శతాబ్దంలో నేపాల్ లో భయంకరమైన క్షామం వచ్చింది. పెద్దల సలహా మీద మహారాజు - నరేంద్రదాస్ అస్సాం వెళ్ళి అక్కడ ఉన్న మత్స్యేంద్రనాధుని ఆహ్వానించాడు. ఆ మహాయోగరాజును పంపించి తాను హిమాలయాలలో మంచు కొండల మధ్య ఏ ప్రాణి సంచరించలేని మార్గంలో ప్రయాణం చేసి నేపాల్ చేశాడు. ఆయన అడుగు పెట్టగానే వానలు కురిసి పంటలు పండినవి. కృతజ్ఞతతో, భక్తితో రాజు ఆ మహనీయుని పూజించి ఖట్మాండులో మత్స్యేంద్రనాధాలయం నిర్మించాడు. అయితే ఇది చిత్రమైన ఆలయం స్థిరప్రతిష్ఠ లేదు, మూలవిరాట్టును నగరంలోని నాలుగురోడ్ల కూడలిలో రథం మీద తెచ్చి ఒకటి రెండు నెలలుంచి పూజిస్తారు.

అలా విగ్రహం కొన్ని నెలలు గుడిలో, కొన్ని నెలలు శృంగాటకాలలో (నాలుగు బాటల కూడలి) ఉంటుంది.
మత్స్యేంద్రనాధుని వల్ల నాథ సంప్రదాయం హిమాలయాలలో దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపించింది. పశుపతినాథుడు, భోజారా నాధుడు, భైరవనాధుడు మొదలైన దేవతనామాలు ఈ యోగీంద్రుని ప్రభావం వల్లనే అంటారు.

ప్రతియుగంలో కాలానికి తగిన ఆకారంతో నిర్మాణకాయుడై సిద్ధశక్తులతో ఈ సిద్ధేశ్వరుడు సంచరిస్తుంటాడు. ఉజ్జయినిలో ఈయన పేరుతో ఒక సమాధి ఉంది. అక్కడ ధ్యానం చేస్తే చాలామందికి ఆలఖ్ నిరంజన్ అని వినిపిస్తుంది. సిద్ధశరీరంతో విహరించే ఈ యోగీశ్వరుని ఆశ్రమం ఇప్పటికి సిద్ధాశ్రమంలో ఒక విభాగంలో ఉన్నదని యోగుల దర్శనానుభూతి.

No comments:

Post a Comment