*ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి కానీ ఎవరూ వచ్చి ఉద్ధరించరు..* స్వామిజీలు, సాధువులు మార్గం చూపిస్తారు. కానీ, ఎవరూ మిమ్మల్ని ఉద్ధరించరు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారని ఆశపడవద్దు. మీకు మీరే మిత్రుడు. మీకు మీరే శత్రువు. మీరు చెడిపోవడానికి మీరే కారణం కాని వేరే ఎవరో కాదు. అన్న పరమ సత్యాన్ని బోధించాడు కృష్ణ పరమాత్మ.
ఈ లోకంలో ప్రతి వాడు కూడా తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటాడు. దాని కొరకు మంచి వారితో స్నేహం చేస్తాడు. ప్రతి వాడు కూడా తనను తాను ఉద్ధరించుకోడానికి ప్రయత్నించాలి. గురువు బోధిస్తాడు, మంచి మార్గం చూపుతాడు. ఆ మార్గంలో పోవాల్సింది మానవుడే.
"కృషితో నాస్తి దుర్భిక్షమ్" అని అన్నారు. నీ పని నీవు సక్రమంగా చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు. ఏమీ చదవకుండా, స్వామీ నన్ను పాస్ చెయ్యి అని రోజూ గుడికి, ఆలయానికి వెళ్లి మొక్కినా ఏమీ ప్రయోజనం లేదు. అందుకే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. మనకు ఉన్న దుఃఖాలు పోవాలన్నా, మోక్షం పొందాలన్నా, జనన మరణచక్రం నుండి తప్పుకోవాలన్నా ముందు మన కృషి, ప్రయత్నము ఉండాలి.
"నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా... ఎలా జరగాలంటే అలా జరుగుతుంది..
మనం ఏ చేసినా లాభం లేదు, అంతా దేవుడి దయ ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది... శివుడి ఆజ్ఞలేనిదే చీమ అయినా కుట్టదు".
అని ఇటువంటి శుష్కవేదాంతం వల్లిస్తూ సోమరితనంగా ఉండటం మూర్ఖత్వం.
ఏమీ చేయకపోవడం వలన ఏమీ సాధ్యం కాదు. దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యం. మన కర్తవ్యం మనం నెరవేరిస్తే, భగవంతుడు మనకు తన వంతు సాయం అందిస్తాడు.
ఈ సముద్రం దాటడం నావల్ల కాదని హనుమంతుడు చేతులు ముడుచుకొని కూర్చుంటే సీతాన్వేషణ సాధ్యం అయ్యేది కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. యోగాన్ని అభ్యసించాలంటే సాధన, ఇంద్రియ నిగ్రహం, తృప్తి, నిష్కామకర్మ మొదలగు వాటి వలననే అది సాధ్యం అవుతుంది. పూర్వకాలంలో ఋషులు ఎన్నోకష్టాలకు ఓర్చుకొని తపస్సులు చేసారు. సాధన చేసారు. ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహం సాధించారు. తుదకు సిద్ధి పొందారు. ఇంద్రియనిగ్రహం, మనోనిగ్రహం లేని విశ్వామిత్రుడు చాలా కాలం వరకు బ్రహ్మర్షి కాలేకపోయాడు.
*ఎవరికి ఆకలి అయితే వారే తినాలి, ఎవరికి రోగం వస్తే వారే మందు వేసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే ఏం చేయాలి. మనలను మనం సంస్కరించుకోవాలి. మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలను ఒకదానితో ఒకటి సమన్వయపరచుకోవాలి. దీనినే త్రికరణ శుద్ధి అంటారు.* మనసులో అనుకున్నది మాట్లాడటం, మాట్లాడింది ఆచరించడం. ఒకటి అనుకొని, మరొకటి మాట్లాడుతూ, మరొకటి చేస్తుంటే దానిని ఉద్దరించుకోవడం అనరు. దిగజారడం అంటారు.
🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏
No comments:
Post a Comment