🌺🌺శ్రీహరి మెచ్చే సేవ🌺🌺
⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️
🌿భగవంతుడు మెచ్చుకొనే దివ్యగుణాలలో 'కరుణ' ఒకటి. ఆయన దయా స్వరూపుడు. అందుకే ఆ లక్షణం కలవారు ఆయనకు ప్రీతి పాత్రులౌతారు.
🌿తన చుట్టూ ఉన్న ప్రాణికోటి ఆనందంగా ఉంటేనే తాను ఆనందించడం, ఇతరులకు ఏ కొద్దిపాటి కష్టం కలిగినా సహించలేకపోవడం... ఉత్తమ సంస్కారానికి నిదర్శనం.
🌿నిత్యం దైవాన్ని ప్రార్థిస్తూ- *'సర్వే సన్తు నిరామయాః'* - అందరూ ఏ వ్యాధులు, ఆపదలూ లేకుండా ఉండాలని కోరుకుంటూ - 'లోకాస్సమస్తా స్సుఖినో భవన్తు' అని సంభావించడం మన సంప్రదాయం.
🌿ఇతరులు వేదనలో ఉండగా, తాను ఉపేక్ష వహించి తన సుఖాన్ని మాత్రమే చూసుకుంటే అతడు 'మహాపాపి' అని మన ప్రాచీన గ్రంథాలు బోధిస్తున్నాయి. అన్న దానానికి ఆకలే పాత్రత. దరిద్రుడు, అసహాయుడు సేవలను అందుకోడానికి అర్హుడు. 'దేయం దీనజనాయచ '' అన్నారు ఆది శంకరులు. దీనజనులకు ధనాన్ని వ్వడం, సత్పురుషులతో సహవాసం చేయడం, శ్రీహరి ని ధ్యానించడం, సంథాలను అధ్యయనం చేయడం -జన్మసార్ధకతకు మార్గాలుగా శంకరులు ప్రబోధించారు.
*(గేయం గీతా నామసహస్రం, ధ్యేయం శ్రీవతి రూపమజస్రం, నేయం సజ్జన సంగేచిత్తం, దేయందీన జనాయచ విత్తం - భజగోవిందం)*
🌿ఆధారంలేని తీగకు పందిరి వేయడం, చలివేంద్రా లను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చడం, ఆకలిగొన్న వారికి అన్నాన్ని అందించడం, నీడను కల్పించడం, వృక్షాలను పెంచడం, నూతులను తటాకాలను బావులను తవ్వించి నీటి సదుపాయాన్ని ఏర్పరచడం, జంతువులకు పక్షులకు ఆహారం సమకూర్చడం - వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను పుణ్యకార్యాలుగా, దైవం మెచ్చే యజ్ఞాలుగా జీవిత విధానంలో ప్రవేశపెట్టిన యజ్ఞ సంస్కృతి మనది.
🌿బాటసారుల విశ్రాంతికి ఇంటిముందు అరుగులను, విశ్రాంతి స్థానాలను ఏర్పరచే అతిథేయ సత్కారాలకు ఈ దేశం నెలవు.
🌿రంతిదేవుడనే చక్రవర్తి తన సంపదను ప్రజోపయోగానికై వినియోగించి. అదే మాధవార్చనగా భావించాడని భాగవత కథ.
🌿ఏకాకిగా అరణ్యంలో ఉన్న దశలో ఆకలిగొని అన్నాన్ని ఆరగించబోతుండగా, ఒక పేదబడుగు వ్యక్తి ఆకలితో రాగా తన అన్నంలో కొంత అతడికి కడుపునిండా అందించి - మళ్ళీ తాను తినబోతుంటే ఒక కుక్క రావడం చూసి మిగిలిన దానిని దానికి అందించాడు. వారు కడుపు నింపుకోవడాన్ని చూడడంతోనే తన కడుపు నింపుకున్న ధన్యజీవి. ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకునే అతనిని ఉత్తమ భాగవతుడుగా భగవంతుడు అనుగ్రహించాడని మహర్షి మనకు ఉదాహరణను చూపించాడు.
🌿ఒక పావురాయిని కాపాడడానికి తన దేహాన్నే సమర్పించిన శిబిచక్రవర్తిని పరమాదర్శంగా బోధించిన ధర్మం మనది. జంతుజాలాలను, పక్షులను ఆత్మార్పణతో కాపాడిన మహాత్ములను ఆదర్శంగా చూపించారు మన పురాణ మహర్షులు. రాక్షస వినాశనం కోసం, దైవీశక్తుల రక్షణ కోసం తపశ్శక్తితో నిండిన తన దేహపుటెముకలను వజ్రాయుధంగా ఇంద్రునికి అర్పించిన దధీచి కథ కూడా త్యాగశీలతకు చిహ్నం.
🌿"సృష్టిలో నీకందిన ధనం కేవలం నీ భోగానికి కాదు. పదిమందికీ పంచే భాగ్యం నీకు అందజేయడానికి భగవంతుడిచ్చిన అవకాశం" అని ప్రబోధించిన వేద సంస్కృతి, ప్రధాన ధర్మాలలో 'దానా'నికి ముఖ్య స్థానాన్ని చ్చింది. అయితే దానానికి పాత్రత అవసరం. 'సేవ' పేరుతో ఇతరుల్ని సోమరుల్ని చేయరాదు. కేవలం అసహాయులను, దీనులను ఆదుకొనడమే సేవ. తన కాళ్ళమీద తాను నిలబడేలా చేయగలగడం నిజమైన సేవ.
-🌿 కష్టకాలాలలో, ప్రకృతి వైపరీత్యాల్లో, రోగపీడలలో బాధితులైన వారికి సేవాహస్తం అందిస్తే
శ్రీహరి సంతోషిస్తాడు.🙏🙏🙏
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment